ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
సుగ్రీవ సఖ్యము
ఆలోన సుగ్రీవుఁడా ఋశ్యమూక
శైలసానువులందుఁ జరియించుచుండి
యా పంపచేరువయందున్న రామ
భూపాలు లక్ష్మణుఁబొడఁగాంచి వెఱచి[వా.రా. సర్గ 2]
యచలంబుపైకి గుండనక13చెట్టనక
కిచకిచధ్వనులతోఁగిచకొట్టుకొనుచు
నెగఁబ్రాఁకి యొక్కచో నేకాంతముండి
యగచరులకు వారి నట చూపి14చూపి;
“విలు15పూని యిద్దఱు వివిధశస్త్రాస్త్ర
కలితులై యదె పంపకడ నున్నవారు;
వినుఁ,డిందుఁ,బ్రచ్ఛన్నవేషులై వాలి
పనుపున మనలఁజంపఁగ వచ్చినారొ?
కాదేని మునులకు ఖడ్గతూణీర
కోదండశరములగొడవ యేమిటికి?
వినుత16సాహసులైన వీరివేషములు
గనుఁగొన నా బుద్ధి గలఁగుచున్నదియు.
నెక్కడికైనను నేఁగుట కార్య;
మిక్కడ నుండుట యిది బుద్ధి గాదు.”
అని మంత్రివరులతో నాడువాక్యములు
విని హనుమంతుండు విమలుఁడై పలికె:.
“బూని వీరలఁజూడఁబుణ్యమానసులు
గాని కా17నేరరు కపటమానసులు;
ఆ రవిచంద్రులోయన నొప్పు వీరు
18కారణపురుషులు కడు విచారింప;
నే రూపమున వచ్చి యిందున్నవారొ?
వీరి చొప్పెఱుఁగక వెఱవ నేమిటికి?
ననిన సుగ్రీవుండు హనుమంతుఁజూచి:
“విను వాలిపనుపున వీరలిచ్చటికిఁ
జనుదెంచి రను శంక జనియించె నాకుఁ.
గినిసి యే వేళ నే కీడెంచునొక్కొ?
తన పగతుని నమ్మఁదగ. దటుగాన
చని నీవు వీరలఁజతురతఁగదిసి
వీ రేలవచ్చిరో వీరి లోఁతెఱిఁగి
వీరితో భాషించి వేవేగ వచ్చి
పవనజ! నాలోని భయమెల్ల మాన్పు;
మవిరతగతి నేఁగు.”మని వీడుకొలిపి
యలమెడు భీతిమై నందుండ వెఱచి
మలయాద్రి కటువోయె మంత్రులుఁదాను.
19వటు వేషధారియై వాయునందనుఁడు
నట పంపకడకుఁ దా నర్థితోఁబోయి[వా.రా. సర్గ 3, 4]
కరమర్థి రామలక్ష్మణులకు మ్రొక్కి
కరములు ముకుళించి కడుభక్తిఁబలికె:
“నవని నింద్రోపేంద్రు, లర్థినాశ్వినులు,
రవిచంద్రులన రూపరమ్యతతోడ
నెగుబుజంబులతోడ నిందుబింబంబు
నగు మొగంబులతోడ నలినపత్రములఁ
దెగడుకన్నులతోడ దివిజులు మెచ్చి
పొగడు విక్రమకళాభుజశక్తితోడ
నరుదైన రాజచిహ్నములతో మీరు
శరచాపహస్తులై చనుదెంచినారు.
భూరితపోవేషములు మీకు నేల?
మీ రెవ్వ?రిచటి కేమిటికి వచ్చితిరి?”
అని సుధామధురవాక్యంబుల నధిక
వినయవిధేయుఁడై విన్నవించుటయు
నతని వాచాశుద్ధి కతనిబుద్ధికిని
నతనిచమత్కృతి కతని యాకృతికి
నతనిమనఃప్రీతి కతని నీతికిని
మతి సంతసిల్లి రామక్షితీశ్వరుఁడు
తమ్మునిఁజూచి:“యీతనియట్లు వలుకఁ
దమ్మిచూలికిని నాతనివధూమణికిఁ
దగుఁగాక యొరులకుఁదరమె? వ్యాకరణ
నిగమశాస్త్రంబులన్నియు నేర్వఁబోలు
నితనిసల్లాపంబు నితనిరూపంబు
నతులలక్షణలక్షితాను 20భావంబు.
నిటువంటిదూత నా కిపుడబ్బెనేని
ఘటియింపకున్నె మత్కార్యంబులెల్లఁ?
గావున మత్కార్యగతు లీతనికినిఁ
గోవిదాత్మక! పూసగ్రుచ్చినయట్లు
చెప్పుమేర్పడ.” నన్న శ్రీరాముతమ్ముఁ
డప్పుడు ప్రియమంది హనుమంతుఁజూచి:
‘యేమన్నదమ్ముల మిక్ష్వాకు కులుల;
మీ మహాత్ముఁడు రాముఁ; డేను లక్ష్మణుఁడ
దశరథరాజనందనుల మిద్దఱము.
దశరథుపనుపునఁ21దపసివేషముల
దండకావనమునఁదగిలి వర్తించు
చుండ రాముని దేవి నుర్వీతనూజ
మముడాఁగురించి దుర్మదుఁడు రావణుఁడు
క్రమమేదికొనిపోయెఁగపటమార్గమున.
వానిపోయినజాడ వదలక వెదకఁ
గానలనడుమ నొక్కట వచ్చివచ్చి
శబరి సుగ్రీవునిచరితంబు సెప్ప
22సబలుఁడాతఁడు మాకు23సఖుఁడుగాఁగోరి
వచ్చితి మిచటి,కెవ్వఁడవు నీ? వింక
నచ్చుగా నెఱిఁగింపు మనఘ! నీ తెఱఁగు
అని పల్క:“హనుమంతుఁడనుపేరివాఁడ;
నినతనూజునిమంత్రి; నే వాయుసుతుఁడ;
నాంజనేయుఁడ; భిక్షుకాకృతి నిప్పు
డంజక మీ చందమరయ వచ్చితిని.
వినుఁడు: సుగ్రీవుఁడు విశ్రుతకీర్తి
వనచరులకు రాజు వరబలాధికుఁడు
భానుసూనుఁడు బృహద్భానుతేజుండు
మానభూషణుఁడసమానవిక్రముఁడు
అన్నయౌవాలిచే నపహృతరాజ్య
ఖిన్నుడై యిప్పుడిగ్గిరి నున్నవాఁడు.
24ఆర్తుఁడు 25మీ సఖుఁడై యుండజేయ
26నేర్తు.”నావుడు రామనృపుచిత్త మెఱిఁగి
మఱియును సౌమిత్రి మారుతిఁజూచి
తెఱఁగొప్ప నతనితో ధీరుఁడై పలికె:
“విను రాఘవుఁడు లోకవిఖ్యాతసత్త్వుఁ
డనుపమదివ్యాస్త్రుఁడసమసాహసుఁడు
కరుణాపయోధి యకారణసుకృతి
శరణాగతత్రాణసద్ధర్మపరుఁడు
జగదేకనాథుం 27డశరణశరణ్యుఁ
డగణితగుణగణ్యుఁడధికాధికుండు
అతిలోకవిక్రముఁడతిసత్యవాది
హితుఁడనై బంటనై యేను వర్తింతుఁ;
గావున రాఘవక్ష్మాపాలమణికి
లే వసాధ్యంబులు లెక్కింప నెందుఁ
గుటిలరాక్షసుఁడున్నగుఱుతు మున్నెఱిగి
యిట సీత సాధింప నేమ చాలుదుము.
అలవుమై 28నేకాకులై పోవఁదగదు.
తలపోయ నిది రాజధర్మంబు గాదు.
కాన సుగ్రీవునిఁ గైకొనఁదలఁపు
మానవాధీశ్వరుమది29లోనఁగలదు.
ఇటమీఁద నీ కార్య మే వెంటనైన
ఘటియింపు.”మనవుడుఁగరువలిసుతుఁడు
నెఱయ సంతసమంది నిజమూర్తిఁజూపి
మఱి తన్ను రామలక్ష్మణులు మన్నింపఁ
దనుఁగృతకృత్యుగాఁదపననందనుని
వనచరరాజుగా వరుస నెన్నుచును
నరిగి రాఘవులవృత్తాంతమంతయును
దొరకొని సుగ్రీవుతో నొప్పఁజెప్పి
రమణీయమూర్తుల రామలక్ష్మణుల
కమనీయగుణములు కడఁగి వర్ణించి:
“జగతిపై నతిశోకసాగరమగ్నుఁ
డగు నీకు రఘురాముఁడనుతెప్ప గలిగె.
బ్రదికితి సుగ్రీవ; పగయెల్లఁదీరెఁ;
దుదముట్టఁగలిగె సంతోషంబు నీకు.
నా దశరథపుత్రుఁడా సుచారిత్రుఁ
డా దయాపరమూర్తి యా సత్యవాది
ఆ పుణ్యనిధి రాముఁడట నీకుఁగర్త!
నీ పుణ్యమేమన నేర్తు సుగ్రీవ!
నిరుపేదవానికి నిధి యబ్బినట్లు
కరమర్థి నీ కిట గల్గె రాఘవుఁడు.
ఆ మహాత్ముఁడు దండ్రియానతి దండ
కామధ్యమున నుండఁగా దశాననుఁడు
తనదేవి మ్రుచ్చిలితనమున నెత్తి
కొనిపోవ వాని మార్కొని త్రుంచివైవఁ
జింతించి నీతోడఁజెలిమి వాటింప
నెంతయుఁదలపోసి యే తెంచె నిటకు.”
ననిన సుగ్రీవుండు హర్షంబు నొంది
యనిలనందనుఁజూచి యర్థితోఁబలికెఁ:
“బవనజ! నాలోనిభయమెల్ల నడఁగెఁ;
దవిలి నా చేసినతపమెల్లఁబండె.
నలవడ నాకు నీయట్టి యంజనము
గలుగుటఁగంటి రాఘవనిధానంబుఁ;
గలఁగక నీవంటి కర్ణధారుండు
గలుగుట శోకాబ్ధిఁగడతేఱఁగంటిఁ.
గడఁకతో ఋశ్యమూకమునకు వారిఁ
దొడితెచ్చి నాదైన దుఃఖంబు మాన్పు.
పొ.”మ్మనవుడు వాయుపుత్త్రుండు వోయి
నెమ్మితో రఘురామనృపతికి మ్రొక్కి:
“దేవ! సుగ్రీవుండు దేవర30బంటు
దేవ! నిన్‌ దర్శింపఁదివుఱుచున్నాఁడు.
విచ్చేయుఁ.”డని విన్నవించిన రాముఁ
డిచ్చలో హర్షించి యేపు దీపించి
హనుమంతుఁగొనియాడి యతిశుభలగ్న
మున హనుమం31తుండు ముందట నడవఁ
దనతమ్ముఁడునుఁదానుఁదగ ఋశ్యమూక
మున కేఁగియానందమునఁబొందెవిభుఁడు
హనుమంతుఁడంత నేకాంతంబునందు
మనుజేశ్వరులడించి మలయాద్రి కరిగి[వా.రా. సర్గ 5, 6]
శ్రీరామదర్శనోద్గ్రీవు సుగ్రీవుఁ
జేరి:“నీ కోరికల్‌ చేకూరె నింక;
రా దేవ! వచ్చిరి రామలక్ష్మణులు
నాదట ఋశ్యమూకాద్రికి.”ననుడు
నినతనూజుఁడు ప్రీతి నిచ్చలో నుబ్బి
మనుజవేషము దాల్చి మకుటకేయూర
ఘనతరశృంగారకలితుఁడై యపుడు
తన మంత్రులును దానుఁదడయ కేతెంచి
32డక్కక భక్తితో డాసి రామునకుఁ
జక్కఁజాగిలి మ్రొక్కి సంప్రీతి33 వెలయ
ముకుళితహస్తుఁడై ముందటనున్న
యకలంకు సుగ్రీవు నధిపతి సూచి
యాలింగనము సేసి యతని కిట్లనియె.
నాలోన దరహాస మమృతమై తొరుగ:
“నీ వాయుసుతునిచే నినసుత! యేను
నీ విక్రమంబును నీ గుణావళులు
విని ప్రీతి నొందితి; వెఱవకు మింక.
నెనసి నీ పగవాని నేనె చంపెదను.
నా కాప్తబంధుండు నమ్మినసఖుఁడు
నీకంటె నొకఁడు గణిం 34చినఁగలఁడె?”
యని యూఱడించిన నర్కనందనుఁడు
“ననిచినబంటుగా నన్నుఁగైకొంటి;
దేవ! నీ కారుణ్యదృష్టి నన్‌ సోఁకె.
నేవెంట ధన్యుఁడ నే నింక నెందు.
నలినాప్తకులనాథ! నా యట్టిబంటు
గలిగె నీ; కటుగాన కడిమి నెందు.
“దివిరి రావణుని వధించితిఁ; గడఁగి
యవనిజఁగైకొంటి.” నని నిశ్చయింపు.”
మని రామసుగ్రీవు లన్యోన్యభాష
లనలు సన్నిధిఁబల్కి యకలంకులైరి.
అపుడర్క సుతునకు నా రాఘవునకు
విపులభూరుహశాఖ విఱిచి వాయుజుఁడు
ఆసనంబుగ వైవ నందుఁగూర్చుండి
యాసక్తిఁబరిణామ మరయుచునుండ

  1. ↑చ
  2. ↑వీరు, పలికె
  3. ↑కాండ్రురి
  4. ↑తాప
  5. ↑ఁబోలరు
  6. ↑కారుణ్యచిత్తు (రణపురుషు)ల కరణినున్నారు
  7. ↑భిక్షురూపం తతో భేజే అని వా.రా
  8. ↑రూపంబు
  9. ↑దపసులైవచ్చి
  10. ↑ప్రబలు
  11. ↑బంటు
  12. ↑ఆతడు, ఆతని
  13. ↑మీకు బంటై యుండఁ
  14. ↑నేతున్‌
  15. ↑డు
  16. ↑నేకాంగులై
  17. ↑ఁజాల
  18. ↑సఖుఁడు
  19. ↑తునిమూపులమీఁద
  20. ↑డక్కిన
  21. ↑నొంది
  22. ↑పఁగఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )