ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధము
“జెచ్చెర నీవు గిష్కింధకుఁబోయి
యచ్చట వాలితో నని చేయుచుండు.
మవలీల నొకకోల నా వాలిఁజంపి
ప్రవిమలకపిరాజ్యపదము నీ కిత్తు.
వెఱవక సుగ్రీవ! వేగపొ.”మ్మనిన
నఱలేనికడఁకతో నప్పు డుప్పొంగి
నలుఁడు నీలుఁడు నంజనాతనూభవుఁడు
బలియుఁడు తారుండు బలసి తో నడవ
నాజికి సన్నద్ధుఁడై బల్మి మెఱసి
రాజిల్లి వెనుక రా రామలక్ష్మణులు
(వచ్చి కిష్కింధ కివ్వలనున్న వనము
సొచ్చి గూఢముగ నచ్చోఁదన్నుఁబనుప)
వడిఁబోయి కిష్కింధవాకిట నిలిచి
యడరి సుగ్రీవుఁడుదగ్రుఁడై యార్చి
తడయక తనతోడఁదగిలి పోరాడ
వడి నేఁగుదెమ్మని వాలిఁబిల్చుటయుఁ
గరిబృంహితంబు లాకర్ణించి పెలుచఁ
గరివైరి కోపించుకరణిఁగోపించి
శితికంఠచరణరాజీవాలి వాల
కృతబంధరావణగ్రీవాలి యైన
వాలి సుగ్రీవుని వడి వచ్చి తాఁక
వాలిసుగ్రీవు లవక్రవిక్రములు
సమరూప సమకోప సమజవాటోప
సమసుప్రతాపులై జానుజంఘోరు
జత్రు వక్షోనాభి జఘనదేశములు
చిత్రవైఖరి నొంచి చించి చెండాడి
చెలరేఁగి పూర్వపశ్చిమసముద్రములు
బలువిడిఁబోరాడు భంగిఁబోరాడ
నా యెడ ధృతి రాముఁడమ్ము సంధించి
యేయ నుద్యోగించి యిరువురఁజూచి
వదనముల్‌, రదనముల్‌ ,వాలముల్‌ ,బాహు
లుదరంబు, లధరంబు, లూరులు, బరులు
కక్షముల్‌, వక్షముల్‌, కాళ్లును, వ్రేళ్లు,
వీక్షలు, శిక్షలు, వేషభాషలును,
జెక్కులు, ముక్కులు, శిరము, లంసములు
ప్రక్కలు, పిక్కలు, పాదయుగ్మములు,
కర్ణముల్‌, వర్ణముల్‌, గళము లంగములు
నిర్ణయింపఁగ నొక్కనెఱియైనఁజూచి
యే తెఱంగునఁజూడ నిరువురియందు
నీతఁడు సుగ్రీవుఁ, డీతఁడు వాలి,
యని యేర్పఱించుట కలవి గాకున్నఁ
దనలోన వెఱఁగంది దశరథాత్మజుఁడు
“48ఎడపక యేసిన నీ యమ్ముచేతఁ
దొడిఁబడ నెవ్వఁడు ద్రుంగునో!”యనుచు
నమ్ము వేయకయుండె; నంత, సుగ్రీవుఁ
డిమ్మెయిఁగడు డస్సి యేపెల్లఁబొలిసి
వలఁతియై పోరాడి వాలికి నోడి
బలమేది యాతని బలుముష్టిహతుల
గుల్లలతిత్తియై కుట్టూర్పు లెసగఁ
“జెల్లఁబో నేనేల శ్రీరాము నమ్మి
వచ్చితిఁ? బదివేలు వచ్చెఁ; జాల్చాలు
వచ్చినత్రోవఁబోవఁగవలె.”ననుచు
మెలకువ చెడితోఁక మెడమీఁద వైచి
సొలసి నల్గడలఁజూచుచుఁబాఱిపోయి
తన ఋశ్యమూకంబు తడయక యెక్కి
తనమది శోకించుతఱి రాముఁడరుగ
నలఘువిక్రమధాముఁడగు రాముతోడఁ
దలవాంచికొని యర్కతనయుఁడిట్లనియె:
“వసుధేశ! నిను నమ్మి వాలితోఁదొడరి
యసమానబలరూఢి నడరి పోరాడ
నన్నుపేక్షించితి; ననుఁగావవైతి;
మిన్నకచూచి49తి; మేకొనవైతి.
జగతిపై సూర్యవంశంబునఁబుట్టి
తగునయ్య! యిట్టియధర్మంబు సేయ?
దేవ! నీ50సత్యంబు తేజంబు నమ్మి
యే వాలిఁదొడరితి; నింతియె కాని
యతఁడేడ? నేనేడ? యాహవంబేడ?
బ్రతికివచ్చుట యేడ? భావించి చూడ
నేమిభాగ్యముననో యెప్పటియట్ల
రామ! యీ పర్వతాగ్రము చేరఁగలిగెఁ!
బగతునిచే భంగపాటు, నీ రీతి
నగుఁబాటు, నొదవె నిన్‌ నమ్మినకతన.
దగవును గృపయును ధైర్యంబు శక్తి
51మిగుల నీ యెడఁజూచి మెచ్చి నమ్మితిని
అనవుడు:“సుగ్రీవ! యాత్మలో నింత
యనుమానపడ నేల? యకట! నావలనఁ
దప్పులేశము లేదు; దాయకు నిన్ను
నొప్పగింతునె? విను, మొకమాట దెలియ:
విశ్వమోహనరూపవిఖ్యాతులైన
యశ్వినీతనయులయట్ల యేపట్ల
వరరూప రేఖలు వాలికి నీకు
బెరసి సమంబైన భేదింపరాక
యే నేయ వెఱచితి; నిది యమోఘంబు
గాన నీ విది కీడుగాఁజూడవలదు.
కరమొప్పనింక నీ గజపుష్పమాల
ధరియించి పోయి యుద్ధము సేయుచుండు.
బెదరకు వాలిఁజంపెద; నిశ్చయింపు;
కదలుము కిష్కింధకడకు నీవనుచు
గాదిలితమ్ముచే గజపుష్పమాల
యాదటఁదెప్పించి యతనికంఠమునఁ
జొక్కంబుగాఁ జేర్ప సుగ్రీవుఁడొప్పెఁ
జుక్కలు పెనఁగొన్న శుభ్రాంశుఁడనగ
సరిబలాకలతోడి సంధ్యాభ్ర మనఁగ
శరదంబుదముతోడి స్వర్ణాద్రి యనఁగ.
నంతఁగాకుత్స్థుండు ననుజుండుఁదాను
సంతసంబున యుద్ధసన్నద్ధులగుచు[వా.రా. సర్గ 13-15]
నలనీల తారాంజనాతనూభవులు
గెలఁకులఁగొల్వ సుగ్రీవుఁదోడ్కొనుచు
నదులు పూఁబొదలు పున్నాగనారంగ
కదళికాసహకార కాంతారములును
భాసురకైరవ పద్మ కహ్లార
వాసితబహుసరోవర విశేషములుఁ
గాసర కేసరికరివరాహములు
నాసక్తిఁగనుఁగొంచు నటపోయిపోయి
దీప్తవైశ్వానర తేజులై యొప్పు
సప్తజనాహ్వయసంయమీశ్వరుల
యాశ్రమంబీక్షించి యామహత్త్వంబు
సుశ్రావ్యముగ వించు సుగ్రీవుచేత
బలశాలియగు వాలి పాలింప సిరుల
విలసిల్లు కిష్కింధ వీక్షించి విభుఁడు:
“తొల్లిటిచందాన దుర మొనరింప
బల్లిదుండగువాలిఁబరిమార్తు.”ననుచుఁ
గృతమతి నంత సుగ్రీవు మన్నించి యతనిఁ
“బొ”మ్మని 52పంచి యా సమీపమున
ననుజుఁడు సౌమిత్రి యట చేరియుండ
మనుజేశుఁడొక మ్రానిమాటున నుండె.
నహిమాంశునందనుండంతఁగిష్కింధ
గుహలెల్ల భేదిల్ల 53ఘోషించి యార్చి
తనతోడ యుద్ధంబు దగఁజేయ నింద్ర
తనయుఁబిల్చుటయు నెంతయు బిట్టు గినిసి:
“మానక వీఁడొక్కమగవాఁడువోలెఁ
బూనినభుజశక్తిఁబొంగుచున్నాఁడు.
వీని సైరించుట వెరవుగా; దింక
వీనిఁజంపెద.” నంచు వెస నిశ్చయించి
యతి సత్త్వభుజశాలియగు వాలి వెడలఁ
బతిఁజూచి వెస నడ్డపడి తార వలికె:

  1. ↑ఎడఁబడనే
  2. ↑తేమియుఁజేయవైతి
  3. ↑సఖ్యంబు
  4. ↑యగుమూర్తివని నిన్ను నాత్మ
  5. ↑పుచ్చి, పొంచి
  6. ↑ఁగోపించి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )