| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
“నినజుని మితి దప్పె; నినవంశ్యుదేవి వనజాక్షిఁబొడగన్న వారముగాము. ఆజ్ఞాధురంధరుండైన సుగ్రీవుఁ “డాజ్ఞ దప్పిరి వీర.” లంచును మనలఁ బొడగన్న యప్పుడ భూపతి మెచ్చ నడిమికి రెండుగా నఱకించు నుఱక. కావున మనమింకఁగపిరాజుఁగానఁ బోవుట తగవును బుద్ధియుఁగాదు వెలువడి మనమిప్డు వెస వచ్చినట్టి బిలములోపలఁజొచ్చి పేర్మి నుండుదము. అది యష్టదిక్పాలకాభేద్యమార్గ: మది పక్వఫలభరితారామమరయఁ బొందుగా నచటఁగాపురమున్న మనల నెందు నెవ్వరికైన నెఱుఁగఁజొప్పడదు.” అనఁగొందఱగచరు లాపని కీయ కొని. రంత మారుతి కోపించి పలికెఁ: “బెద్దబుద్ధివి నీవు! పినతండ్రి వనుప గద్దరివై రాము కార్యమై వచ్చి కపులతోఁగూడి యా గంభీరబిలము జపలతఁజొచ్చి యచ్చటనుండినపుడె భానుజుతో మళ్లఁబడుచొప్పు175గాదె? తానును నీలుండు దారుండు నలుఁడు దీని కెవ్విధి సమ్మతింపము; దక్కు వానరుల్ దమబంధువర్గంబు వాసి నినుఁగొల్చి యుండంగ నేరరు సుమ్ము. విను: మదియునుగాక, వృత్రారి తొల్లి యర్మిలిఁదన వజ్రహతి నా బిలంబు నిర్మించె; నటువంటి నిశితవజ్రాస్త్ర కోటి లక్ష్మణునకుఁగొలఁది కగ్గలము. మాటమాత్రమున నీ మర్కటాధముల నిన్ను నీ బలమును నీఱుగాఁజేయ కున్నె; యీ దుర్బుద్ధులొక్కట విడిచి “యవనిజఁబొడగానమైతి;”మటంచు రవిజునికడ కందఱము పోయి మ్రొక్కి విన్నవింతము; జగద్విఖ్యాతి నతఁడు నిన్నును మమ్ము మన్నించు 176మోమోట నా మీఁద మీ తల్లి కనురక్తుఁడగుట నీ మీఁద నలుగఁడు; నీవె పుత్త్రుఁడవు కావునఁగడు నిన్నుఁగట్టుఁబట్టంబు.” నా విని యా వాలినందనుఁడనియెఁ: “బితృసమానుని వాలిఁబృథ్విపైఁగూల్చి యతని భార్యవరించి యా మీఁదఁదనకు నుపకారియగు రామునుద్యోగమెల్లఁ జపలుఁడై మఱచి లక్ష్మణుఁడాగ్రహింప మఱికాదె చనుదెంచె మా పినతండ్రి యెఱుఁగవే యాతనిహీనవర్తనము? నట్టికామాంధుని నట్టికృతఘ్ను నెట్టు నమ్మఁగవచ్చు? నిది యది యేల? శ్రీరాముకార్యంబు సేయక పోయి యా రవిసూనుచే నట సచ్చుకంటె నీ యెడఁజచ్చుట యిదిలెస్స; యింక ప్రాయోపవేశ 177నపరులు గం.”డనుచు వారును దానును వరదర్భశయను లై రాక వృథయౌట కాత్మఁజింతించి తెవులును ముదిమియుఁదీవ్రవేదనయు 178నవతయు లేని ప్రాణంబులు గాన లేచియు మఱి పవ్వళించియు దిశలు సూచియుఁదమ తమ చుట్టాల179సుతులఁ దలఁచియు:“బాపురే! దైవమా! యిట్లు చలపట్టి మము వృథా చంప నిచ్చోట సమకట్టితే?”యంచు సకలవానరులు గుమురులుగుమురులై కూడి యొండొరులు: “నలినాప్తకులుఁడు కానలకు రానేల? 180కులభామ నసురచేఁగోల్పడ నేల? యొరసి దైత్యుఁడు జటాయువుఁజంపనేల? ధరణీశుఁడరుణనందనుఁగననేల? ధరణిజవార్త యాతఁడు సెప్పనేల? తరణివంశ్యుడు పంపదరికి రానేల? సుగ్రీవుకడకు రాసుతుఁడు రానేల? సుగ్రీవుఁడాతనిసొమ్ము గానేల? వలనొప్ప వాలి భూవరుఁడేయనేల? బలిమితోడుతఁగపిబలము రానేల? యినతనూజుఁడు 181మమ్ము నిటు పంపనేల? పనివడి మనకు నిప్పాటు రానేల? యొక్కొటఁబ్రాణంబు లుఱక పోనేల? యక్కటా! భువిఁగైక యడిగినవరము మనువంశయుతముగా మనవంశమణఁచె” నని యని శోకించి యలయుచున్నంత |