ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
అవతారిక
శ్రీనాథచరణరాజీవసేవకుఁడు
భానుకోటిప్రభాభాసమానుండు
మనుచరిత్రుఁడు శత్రుమత్తమాతంగ
ఘనఘటాపాటనకంఠీరవుండు
కోన వంశార్ణవకువలయప్రియుఁడు
నా నొప్పు కోన గన్నక్షితీంద్రునకు
ననుకూలయై యున్న యన్నమాంబికకుఁ
దనయుండు సాహిత్యతత్త్వకోవిదుఁడు
దానప్రసిద్ధుండు ధర్మశీలుండు
భూనుతాచారుండు బుద్ధభూవిభుఁడు
అఖిలపురాణేతిహాససమ్మతము
నిఖిలలక్షణగుణాన్వితము నగుచుఁ
దెలుఁగున నొప్పఁగా ద్విపదరూపమున
నలిఁ బూర్వరామాయణము మున్నుఁ జెప్పి
సకలేశుఁడగు రామచంద్రు వర్తనము
సకలంబు రచియించి సకలపుణ్యముల
సకలలోకులుఁ దన్ను సన్నుతిసేయ
నకలంకమహిమల నందెదఁ గాక
యని నిశ్చయము చేసి యంతరంగమునఁ
దన యిష్టదేవతాధ్యానంబు సేయ
గరుడాధిరూఢుఁడై కరపంకజముల
నరుదుగా శంఖశార్ఙ్గాదులు మెఱయ
నురమున శ్రీదేవి కుద్దియై పరఁగి
చిరలీలఁ గౌస్తుభశ్రీ చెన్నుమిగుల
భువనకారకునకుఁ బుట్టినిల్లైన
నవవికసితనాభినలినంబు మెఱయ
సరి దివారాత్రులు సంగడిఁ బొలయఁ
గరమొప్పు రవిశశుల్‌ కన్నులై వెలుఁగ
ననిమిషుల్‌ గొలువఁగ నచ్చరలాడ
సనకాదియోగీంద్రసన్నుతుల్‌ చెలఁగఁ
బీతాంబరం బొప్పఁ బృథులనీలాద్రి
భాతి మే నమరంగఁ బంకజోదరుఁడు
భానుకోటిప్రభాభాసితుండగుచు
మానసంబునఁ దోఁచి మహితవాక్యముల
నీవు నాకెంతయు నెరయ భక్తుఁడవు
నీవు పుణ్యుండవు నీవు మాన్యుఁడవు
గావున నీభక్తిఁ గైకొంటి మేము
నీవింక మముఁ గూడి నెమ్మి నేతెమ్ము
నీ వాంఛితార్థంబు నిర్వహింపంగ
నీ వరనందనుల్‌ నిపుణమానసులు
వారి నియోగింపు వారు నీ కోర్కి
గారవంబునఁ జేయఁగలవారు మీఁద
నని పల్కి విచ్చేసె నాదేవునాజ్ఞ
మనమున ధరియించి మముఁ బిల్వఁ బంచి
యాతతప్రీతితో నాతెఱంగెల్ల
మాతోడ వినిపించి మముఁ గటాక్షించి
మీరు పుణ్యాత్ములు మిహిరప్రతాపు
లారూఢభుజశక్తు లధికవైభవులు
చండభుజాదండసకలారిదండ
ఖండనోదగ్రు లఖండవిక్రములు
కవిరాజభోజులు కమనీయతేజు
లవిరళసూనృతు లతికృపాన్వితులు
హరిపదాంబుజభక్తు లార్యానురక్తు
లురుతరప్రావీణు లుదధిగాంభీర్యు
లున్నతాయుష్మంతు లుత్తమోత్తములు
సన్నుతాచారులు సౌభాగ్యయుతులు
బహుపురాణజ్ఞులు బహుకళాన్వితులు
బహుకార్యకోవిదుల్‌ బహుదానపరులు
నా కులదీపకుల్‌ నా గుణాన్వితులు
నా కీర్తివర్ధనుల్‌ నా కూర్మిసుతులుఁ
గాన నా పూనిన కథ యెల్లజనులు
మానుగాఁ గొనియాడ మధురవాక్యముల
నెమ్మిఁ జెప్పుఁడు మీరు నిపుణులై యనుచు
మమ్ముఁ బంచిన మేము మా తండ్రిప్రతిన
చిరకీర్తు లెసగఁగఁ జెల్లింపఁ గనుట
పరమధర్మంబని భక్తితోఁ గోరి
శ్రీదేవి దేవియై చిత్తంబులోన
నేదేవదేవుని నెలమి భావించు
నేదేవుముఖమున నింద్రుండు శిఖియు
భూదేవతలు మున్ను పుట్టి రింపెసఁగఁ
బొలుపార నేదేవు భుజములఁ బొడమి
రలఘుతేజోమూర్తులైన పార్థివులు
ధీరులై వైశ్యు లేదేవుని తొడల
నారంగ జనియించి రంచితద్యుతులు
సురుచిరచిత్తులై శూద్రు లేదేవు
చరణాంబుజంబుల జనియించి రెలమి
నేచి మూఁడడుగుల నేదేవుఁ డఖిల
భూచక్రమును గొనిపోయిన యపుడు
పదతలంబున నేడు పాతాళములను
బదపంకజంబులపై రసాతలము
నిరవార జంఘల నెల్లపెన్నిధులు
సరిదపాంపతులును జానుదేశముల
ననిమిషాచల మందరాద్రు లంఘ్రులను
దనరు విశ్వేదేవతలు కటిస్థలిని
మూలప్రజాపతి ముష్కంబునందు
లీలమై మదనుండు లింగంబునందుఁ
దగు నాభిక్రిందను దనుసంధులందు
మొగి మరుత్తులు కుక్షి మూఁడులోకములు
నందముఖంబులు నందదేవతలు
సంధుల నదులు నిష్టాపూర్తములును
వసువులు వీపున వామహస్తమున
నసమానగతి రుద్రు లంసభాగమునఁ
బ్రక్క నంభోధులు బాహుదండముల
దిక్కులు నమృతదీధితి మానసమున
నక్కున నజుఁడును నంబుజోదరుఁడు
ముక్కంటియును దేవముఖ్యుఁ డింద్రుండు
గళమున నదితియు గళరేఖలందు
విలసితద్యుతులతో విద్యలన్నియును
నరుదార సప్తర్షు లాననాబ్జమున
మెఱయు వేదంబులు ముఖగహ్వరమున
నవమౌక్తికంబులు నవ్యదంతముల
వివిధసంస్కారముల్‌ వివిధసూక్తులును
నమరు ఫాలంబున నఖిలశాస్త్రములుఁ
గమలయు ధర్మార్థ కామమోక్షములుఁ
బరఁగ నోష్ఠముల నంబరము నశ్వినులుఁ
గరమొప్ప నూర్పుల గంధవహుండుఁ
జెన్నొంద భారతి జిహ్వాగ్రవీథిఁ
గన్నుల రవిసుధాకరమండలములు
కలితకాంతులు కృత్తికలు మున్ను గాఁగ
నలువార ఱెప్పల నక్షత్రములును
నారంగ శిరమున నమరలోకంబుఁ
దోరంపుశిఖయందు ధ్రువమండలంబుఁ
బెక్కురూపులు దాల్చి పెంపారుచుండు
నొక్కరూపగుచుండు నొక్కరూపమున
సకలభూతములందుఁ జరియించుచుండు
సకలభూతోద్భవస్థానమై యుండు
దేవవంద్యుఁడు రమాధీశుండు సకల
దేవతలకుఁ దానె దిక్కైనవాఁడు
ధర్మవ్యవస్థలు దానములెల్ల
ధర్మైకసాక్షియై తగఁ జూచువాఁడు
నవిజేయుఁడై యుండు నఖిలదానవులఁ
బవరంబులోపలఁ బరిమార్చుచుండుఁ
గల్పాదిగతులెల్లఁ గనురెప్పపెట్టు
నల్పకాలములోన నడఁగించుచుండు
వేధయై నిర్మించు విష్ణుఁడై మనుచుఁ
గ్రోధించి కడతేర్చు రుద్రుఁడై యుండి
యణుమాత్రుఁడై యుండు నధికమై యుండు
నణిమాది గుణముల కందరాకుండు
వెలినుండు లోనుండు వెలితిగానుండుఁ
గలఁడన్న చోట నక్కజముగా నుండు
నెఱిఁగించు నాతఁడు నెఱిఁగెడు నతఁడు
నెఱుకకు విషయంబు నెఱుకయుఁ గూడి
నెఱఁగిన యటమీఁద నేకరూపమునఁ
దెఱపిలేకున్న యాదీప్తియై యుండు
సకలదానవ్రతజపతపః క్రతువు
లకలంకగతిఁ జేయు నంచితాత్ములకు
ఫలరూపమై యుండు ఫలదుఁడై యుండు
వెలినుండు లోనుండు వెలితి గాకుండు
నిర్మలజ్యోతియై నిగమార్థవీథిఁ
గర్మకలాధీనగతిఁ బొందకుండు
యోగాత్ముఁడై యుండు యోగమై యుండు
యోగీంద్రుఁడై యుండు యోగియై యుండు
ముక్తికాములకెల్ల ముక్తియై యుండు
భక్తులు భావించు భావమై యుండు
మధుమాధవాదిగా మాసనామముల
నధికనిరూఢిఁ గాలాత్ముఁడై యుండుఁ
బురుషోత్తమాచ్యుత పుండరీకాక్ష
హరి విష్ణు నారాయణాది నామముల
దివ్యస్వరూపుఁడై దీపించుచుండు
నవ్యక్తుఁడై యుండు నందరాకుండు
నజ్ఞానతమ మంతరంగగేహమున
విజ్ఞానదీపంబు వెలుఁగునఁ దొలఁగ
ననిశంబుఁ దలపోయు ననఘులందుండు
నని మత్కులస్వామి యగు విష్ణుఁ గొలిచి
కల్మషంబులు దూలఁ గణనాథుఁ గొలిచి
వాల్మీకిఁ గొనియాడి వాణిఁ గీర్తించి
యారంగ మత్స్యకూర్మాది దివ్యావ
తారంబులం దెల్లఁ దలపోసి చూడ
రామావతారంబు రమణీయమగుట
రాము పావనచరిత్రము దివ్యభాష
లోకానురంజన శ్లోకబంధములఁ
జేకొని వాల్మీకి చెప్పిన జాడ
మా తండ్రి బుద్ధక్షమానాథు పేర
నాతతఘను పేర ననఘుని పేర
ఘనుఁడు మీసరగండ కాచభూవరుఁడు
నని జనుల్‌ గొనియాడ నర్థితో మేము
వినుతనూతనపద ద్విపదకావ్యమున
ఘనమైన పాకంబు గాటమౌ శయ్యఁ
బ్రాకటంబుగ నాంధ్రభాషఁ జెప్పంగఁ
గైకొన్న యుత్తరకథ యెట్టిదనిన.
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )