ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
బ్రహ్మ రావణునితో యుద్ధము మానుమని యముని వేడుట
వెస కాలదండంబు విస్ఫులింగంబు
లెసగంగఁ ద్రిప్పుచు నెల్లరాక్షసులు
భయమంది పఱవ నప్పౌలస్త్యుమీఁద
వైవ నూహిరచుచో వడి బ్రహ్మ గదిసి
యీనిశాచరు మీఁద నిది ప్రయోగింప
కీనాశ! తగదు నీ కిన్క చాలింపు
సురులచేఁ జెడకుండ సురవైరికేను
వరతపంబున మెచ్చి వరమిచ్చినాఁడఁ
గైకసితనయుఁ డీకాలదండమునఁ
జాక తక్కిననైనఁ జచ్చిననైనఁ
తప్పని నామాట తప్పు నబ్బుద్ధి
చెప్పితి నామాట సేయంగవలయు
ననిదుష్టదనుజాదులం దెవ్వఁడైనఁ
దనరు నావాక్యంబుఁ దప్పించునతఁడు
భువనంబులన్నియుఁ బొంకింపఁ దలఁచు
నవిచారమతి యగునటుగాన నీవు
నిరుపమద్యుతినొప్పి నీచేతనున్న
నురుకాలదండంబు నుపసంహరింపు
మనవుడు నొడయుఁడవైన నీమాట
కనుమతించితినంచు నట్ల గావించి
వరశక్తి నీతఁ డవధ్యుండు నాకుఁ
బరికింప నింక నీ బవరమేమిటికి
నని బ్రహ్మ వీడ్కొని యాదండధరుఁడు
తన గృహంబునకేగె దశకంఠుఁ డంత
జముని గెల్చితి నాకు సరి యెవ్వఁ డనుచు
సముచితస్థిత మంత్రిజనులు కీర్తింప
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )