| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
గర ముగ్రముగ వెల్గు కరహస్రముల దురవలోకుండగు తోయజప్రియుని గని ప్రహస్తుని జూచి కడిదితేజమునఁ గనలు నీభానుని కడకేగి నీవు నిమ్ముల నారాక యెఱిఁగించి యనికి రమ్మని పిలువుము రానోడెనేని నొడితిననుమాట యుగ్రాంశుచేత నాడించి రమ్మన నాతఁడు నరిగె దండపింగళులను దౌవారికులకు దండివీరుండైన దశకంఠు మాట వినిపింప దండుడు వెస నేగి మ్రొక్కి చనుదెంచినాఁడు దశాననుఁ డనికి నాహవక్రీడకు ననువుగాదేమి యూహించి చూచి నీవోడితిననము వినుమిందులో నొక్కవిధములేకున్న జనఁడా దశాస్యుండు జయకాముఁడగుట ననవుడు విని యర్కుఁడతనితో ననియె ఘనుఁడైన యాదశకంఠునితోడ ననిఁ జేసి గెలువరాదనిఁ జేయఁజాల నని యేను వల్కితినని పల్కు మనిన నాదిత్యవిక్రమశాలివైన నీతోడ సమరంబుఁ జేయంగఁజాలఁ డర్కుండు నామాట రవిమాట నక్తంచరేంద్ర నామాట వినుమన్న నామాట కలరి యింద్రారి జయఘోష మెసఁగించి మించి చంద్రలోకమునకుఁ జనుచు మేరువున నారాత్రి వసియించి యందొక్కపురుషుఁ డారంగ జలకేళి నలసి కన్మోడ్వఁ గదియఁ గాంచనకుంభకఠినంబులైన ముదుకని చన్నుల మొనలొత్త దిగిచి బలువిడి నచ్చరల్ పరిరంభణముల మెలపుచు జనముల మేల్కొల్పఁ దెలిసి దివ్యభూషణములు దివ్యాంబరములు దివ్యానులేపముల్ దివ్యమాల్యములు నమరంగఁ దన్నో లి నమరకామినులు ప్రమదంబుతోఁ గొల్వఁ బసిఁడితేరెక్కి కడుఁ బేర్మి నెగయఁగాఁ గని భూధరేంద్ర వడి నేగు నీతేరివాఁడెవ్వఁ డితఁడు దేవారినైన నాదెసఁ గనుఁగొనక పోవుచునున్నాఁడు భూరితేజమున తన భయం బెఱుఁగఁ డీదర్పాంధుఁ డనినఁ గనకాద్రి యాదశకంఠుతో ననియెఁ జతురాస్యుఁ డితనిచే సంతుష్టుఁడయ్యె నితఁ డేగుచున్నాఁడు నిట మోక్షమునకుఁ నలవున వత్స నీవఖిలలోకములు గెలిచితి తపమున గెలిచినాఁ డితఁడు శూరాగ్రణివి నీవు చూడంగ నిట్టి వారిపైఁ గోపంబు వలదన్న నుడిగి మఱియు నొక్కఁడు హేమమణిగణద్యుతుల నెఱసిన రథమెక్కి నెమ్మితోఁ జనఁగఁ గనుఁగొని గిరిరాజ కడునింపుగాఁగ ననిమిషుల్ వొగడఁగ నచ్చరలాడఁ జనుచున్న యాసముజ్జ్వలతేజుఁడెవ్వఁ డనిన నాశైలేంద్రుఁ డనియె నాతనికి నీతఁడు వైరుల కెదురుగా నడిచి యాతతాయుధఘోరహతుల సైరించి వితతవిక్రమలీల వేడుక సలిపి పతికి వంచనలేక ప్రాణంబులిచ్చి సురుచిరగతి నిట్లు సురలోకమునకు నరుగుచునున్న వాఁ డటుగాకయుండఁ బొలుపార వేడుక పుట్టినచోట నెలమిమై విహరింప నేగుచున్నాఁడు వినుమని యెఱిఁగింప వెండియునొక్కఁ డనుపమాకృతితోడ నంతరిక్షమ్ము నడుమఁ దేజమ్మున నాదిత్యుఁ బోలె నుడురాజబింబంబు నోజ మోమలరఁ గమనీయభూషణగంధమాల్యములు విమలాంబరంబులు వింతలై మెఱయ వలఁతులై నుతగీతవాద్యనృత్యముల నలరఁ జేయుచు నిర్జరాంగనల్ గొలువ సమ్మదలీలఁ గాంచనవిమానమున నిమ్ములఁ జనఁ జూచి యతఁడెవ్వఁడనిన మానుగా నిశ్చలమతియై సువర్ణ దానంబుఁ జేసిన ధర్మాత్ముఁడనుచుఁ దెలియంగఁ బలికిన దివిజారి వలికె నెలమి నీగతినేగు నీవీరులందుఁ జెలఁగి నన్నాజిలోఁ జెనయు వీరుండు గలఁడేని యెఱిఁగింపఁగలవె నీవనిన నమరలోకంబున కరుగుచున్నారు సమర మొల్లరు వీరు చరితార్థులగుట రావణ నీతోడ రణముగావించు చేవయుఁ గల వీరుఁ జెప్పెద వినుము ధీరుఁడై యొగి నేడుదీవులు నేలు శూరుఁడౌ యువనాశ్వసుతుఁడు మాంధాత యను రాజు గలఁడొక్కఁ డతనికి నీకు నని గల్గునని చెప్ప నచలేంద్రుఁ జూచి |