| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
తగఁ గేకయాధీశుఁ దన మేనమామ యగు యుధాజిత్తుని నలరారఁ జూచి కడుఁ బెక్కుదినములు గడచె మీతండ్రి యుడుగక చింతించుచుండు మీవలన నీరాజసంపద లెల్ల మీ యవియె గౌరవోజ్జ్వల మాకుఁ గలవారు మీరె యీభూతినిలయంబు లీమహామణులు నీభూషణంబులు నెల్లఁ గైకొనుము సౌమిత్రి నిన్నంపఁ జనుదెంచువాఁడు భూమీశపుంగవ పోయిరమ్మనిన మనుజేంద్ర మీచేయు మన్ననలెల్లఁ గనకభూషాదులు కట్నముల్ మాకు నని ప్రదక్షిణముగా నతిభక్తివచ్చి వినతుఁడై రఘురాము వీడ్కొని చనియె నంత కాశీపతియగు ప్రవర్ధనుని సంతోషమున రామచంద్రుండు సూచి జననాథ నీతోడ సఖ్యంబుచేసి ఘనమైన తేజంబుఁ గంటి మెంతయును బంధురగతి నీవు భరతుతోఁ గూడి బంధుకృత్యము తగఁ బాటించి తనఘ పెద్దవాఁడవు మాకుఁ బ్రియమార ననుచు గద్దియ దిగి చక్కఁ గౌఁగిటఁ జేర్చి మహిమతో వీడ్కొల్పి మఱియును నూర్వు రహితభయంకరులైన భూపతుల విరిదమ్మిఱేకుల వెదచల్లునట్టి కరణిఁ దానందఱఁ గలయంగఁ జూచి రాజపుంగవులార రాజధర్మముల రాజితగుణముల రణజయోన్నతుల భాసురకర్మలఁ బ్రఖ్యాతులగుచు వాసికెక్కిన వీరవరులు మీరెల్ల మీ లావుతేజంబు మిగులంగ నూఁది పౌలస్త్యసుతుఁడైన పఙ్త్కికంధరుఁడు సకలలోకములకు సమరదుర్జయుఁడు నకలంకధీరుఁడు నమితదోర్బలుఁడు నట్టి గర్వాంధుని నాలంబులోన గిట్టి జయించితి గీర్వాణు లలర మది నేను గారణమాత్రంబు గాఁగ నది మీరు చేసినయట్లుగాఁ గొనుఁడు బవరంబునకుఁ దోడు భరతుండు పిలువ వివిధసేనలతోడ వెస మీరు వచ్చి చిరకాల మభిమతస్థితి నుంటి రింకఁ బరమానురక్తి మీ పట్టనంబులకుఁ బోయివత్తురుగాక భూపాలు రనిన నాయుచితోక్తుల కందఱు నలరి దారుణరణకేళి దశకంఠుఁ దునిమి వీరపుంగవ నీవు విజయంబు గనుట వైదేహిఁ దెచ్చుట వచ్చి పట్టంబు మేదినీపతులెల్ల మెచ్చఁ గైకొనుట సంతోషమున బంధుసహితుఁడ వగుట యంతకంతకుఁ గీర్తి నధికుండవగుట పరికింప నరుఁడిట్టి భాగధేయంబు నిరుపమస్థితిఁ బొంద నీకుఁ జొప్పడియె నెమ్మి సంస్థితమైన నీ ముఖాంబుజముఁ గ్రమ్మఱ నిటు సూడఁ గాంచితి మేము ఇదియె మాసంతోష మిదియె మాకోర్కి మదిలోన మము మీరు మఱకుండనుచు దండప్రణామముల్ దగ నాచరించి నిండిన ప్రేమంబు నెలకొన నృపులు సదయుఁడౌ శ్రీరామచంద్రుని మూర్తి చెదరకుండఁగ మదిఁ జేర్చుచుఁ గదలి పెక్కు లక్షౌహిణుల్ బెదర సైన్యంబు లక్కజంబుగ నేల యల్లాడుచుండ |