ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
రాముఁడు తమ్మునితో లోకనిందం దెల్పుట
ఏమి కారణమున నిట్లున్నవాఁడొ
భూమీశుఁడని వారు బుద్ధి నూహింపఁ
గనుఁగొని తాలిమి గన్నుల నాని
యనుజులఁ గూర్చుండుఁడని నియోగించి
ప్రాణముల్‌ వైదేహి పరికింప నాకుఁ
బ్రాణాభిమానముల్‌ పరికింప మీరు
గాన శోకమునకుఁ గారణంబైన
యీనిందఁ జెప్పెద నిది మీరు వినుఁడు
సౌమిత్రి నీవును సకలసంయములు
నామహాదేవుఁడు నజుఁడు దిక్పతులు
నాదిత్యచంద్రులు యక్షగంధర్వు
లాదిగాఁగల దివ్యు లందఱు జూఁడ
వనజాకరముఁ జొచ్చు వడువున వచ్చి
యనలంబు సొచ్చిన యగ్నిదేవుండు
తన మూర్తి గైకొని తన్వంగిఁ గొనుచుఁ
జనుదెంచి యతిశుద్ధచరిత యీసాధ్విఁ
జేకొనుమని పల్కెఁ జెలఁగి దేవతలు
నాకసంబుననుండి యది సత్యమనిరి
మఱికదా సీత నే మన్నించుటెల్ల
నెఱుఁగని లోకుల నేమనవచ్చు
దండకాటవిఁ జొచ్చి దశకంధరుండు
మెండునం గొనిపోయె మేదినీసుతను
జెఱనున్న సతిఁ దెచ్చి చేపట్టె రాముఁ
డెఱుఁగ నేర్చునె కామి యెగ్గైన తెఱఁగు
నని లోకులాడుదు రపకీర్తిఁ బొందు
మనుజుఁడేటికిఁ గోరు మది విచారింప
నెందాఁక నపకీర్తి యిలలోనఁ గలుగు
నందాఁక బొందుదు రధమలోకముల
సడికోర్చి మనుకంటెఁ జచ్చుట మేలు
విడుతుఁ బ్రాణములైన విడుతు మిమ్మైన
జానకి విడువంగఁ జాలుట యెంత
కాన గంగాతీరకాననంబునకుఁ
దన కోర్కి చెల్లంగ ధరణీతనూజ
సనుగాక కొనిపోయి సౌమిత్రి నీవు
నక్కడ వాల్మీకి యాశ్రమభూమి
చక్కి నొక్కెడ డించి చయ్యన రమ్ము
ఈ తెఱంగునకు నీ వేమియుత్తరము
నాతోడఁ జెప్పిన నా యాన నీకు
నని నియోగించుచు ననుజులతోడఁ
దన గృహంబునకు నాధరణీశుఁ డరిగె
నారాత్రి గడచిన నంత సౌమిత్రి
తేరు సుమంత్రుచేఁ దేరంగఁ బనిచి
వైదేహి నగరికి నంత నేతెంచి
యాదేవి యడుగుల కతిభక్తి మ్రొక్కి
జనకనందన నీకు జగతీవిభుండు
మునివనంబును జూప ముదముతోఁ బనుప
వచ్చితి నదె తేరు వచ్చె నీవింక
విచ్చేయు మనవుడు వేడ్కతో నలరె
వినుతభూషణములు విమలాంబరములు
మునిపత్నులకుఁ గొంచు ముదముతో వచ్చి
మిథిలేంద్రతనయ సౌమిత్రియుఁ దాను
రథమెక్కి రందొక్క రత్నపీఠమున
జనకజ గూర్చుండి సౌమిత్రి నాకు
మనసు గలంగెడు మాటిమాటికిని
ఒడలు వడంకెడు నొప్పని చోటు
లడరంగఁ బలుమాఱు నదరంగఁ దొణఁగెఁ
బుడమి శూన్యాకృతిఁ బొడసూపినట్లు
కడుఁ గీడు శకునముల్‌ గనుచున్నదాన
నీదుర్నిమిత్తంబు లిచ్చుదోషములు
మేదినీవిభునకు మీకు నత్తలకు
మేదినీజనులకు మిత్రవర్గముల
కేదియుఁ గాకుండ నిమ్మంచు సురల
వినయంబుతో సీత వినుతించె నంత
వనములు నగములు వడి దాఁటిపోయి
గోమతీతటమునఁ గోరి నాఁడుండి
యామఱునాఁడు మధ్యాహ్నకాలమున
భాగీరథీతీరభాగంబుఁ జేరి
యాగంగఁ గని సీత యలరుట చూచి
యెలుఁగెత్తి సౌమిత్రి యేడ్చినఁ గలగి
వెలవెలనై కడువెఱఁగంది పలికె
ముదముఁ బొందక నీవు మూఢుని భంగి
నిదియేల శోకించె దిదిపుణ్యభూమి
మీయన్నఁ బాసియో మిగులఁ గోపించి
మీయన్న గినిసెనో మిన్నక నిన్ను
నా ప్రాణనాథుని నరనాథుఁ బాసి
యీప్రాణములతోడ నేనుండఁగలనె
యిమ్ముల నీవింక నీ దుఃఖముడుగు
క్రమ్మఱఁ బోదము కాకుత్థ్సుఁ జూడ
నను గంగ దాఁటించు నాకు నమ్మునులఁ
గనుఁగొను వేడుకగలదు నావుడును
నరద మక్కడ డిగ్గి యా తేరుతోడ
దరి సుమంతుని నున్చి తాను సీతయును
నావపై నది దాఁటి నవకుశోల్లసిత
పావనతటభూమి బద్మాక్షిఁ జూచి
కన్నీరు దొరఁగ గద్గదకంఠుఁడగుచు
విన్ననై వదనారవిందంబు వాంచి
యీక్రూరనిశ్చయంబేమని నేను
వాక్రుచ్చి పలుకుదు వైదేహి యెదుర
రాజాస్య కెఱిఁగింపరాదుపో నాకు
రాజన్యవిభుఁడైన రఘురాము నాజ్ఞ
తప్పంగవచ్చునె తలఁప నిత్తెఱఁగు
చెప్పకపోరాదు చెప్పరాదనుచు
విన్ననై కన్నీరు వెడల శోకించు
చున్న లక్ష్మణుఁ జూచి యుల్లంబు గలఁగి
యిది యేల శోకించె దేమాటవింటి
పదిలుఁడై యున్నాఁడె పార్థివేశ్వరుఁడు
నామది గలఁగెడు నరనాథపుత్త్ర
యేమది చెప్పవే హృదయేశు మాట
యనవుడుఁ దెగువతో హస్తముల్‌ మొగిచి
జనకజ సేమంబు జననాయకునకు
మఱియొక్క కొఱగాని మాట నీకేను
వెఱచెద నెఱిఁగింప విను దాని తెఱఁగు
పగవానిచేఁ బట్టువడియున్న మగువ
మగుడంగఁ గొనవచ్చి మన్నించినాఁడు
అని లోకులాడెడి యపవాదమునకు
మనమునఁ గడునొచ్చి మానవేశ్వరుఁడు
నీ శుభాచారంబు నిర్మలంబైన
నీ శీలమును మున్ను నిక్కంబు గనియు
నీకాన నిను డించి యేగుదెమ్మనుచు
నాకు నానతి యిచ్చినాఁడంచుఁ బలుకఁ
దల్లడం బొదవంగఁ దాలిమి దూలి
..........
నిడవిమై తోఁచిన నిట్టూర్పు వుచ్చి
..........
నిరవైన పతిమీఁది నెయ్యంబు దలఁచుఁ
వెఱఁగంది చింతించు వెఱపాటునొందుఁ
దన్నెప్పుడును మున్ను ధరణీశ్వరుండు
మన్నించె మున్ననన్‌ మది విచారించు
నట్టి యాగారవంబంతయుఁ దూలి
యిట్టయ్యె నాభాగ్యమేమందు నింక
భూమివారాడిన భూలోకనాథుఁ
డామాటలకుఁ జేయునది యొండులేక
యీ తెంపుఁ జేసెఁబో యిది తెఱంగనుచు
నాతోడ నెఱిఁగించి ననుఁ బాయఁదగదె
భానువంశాధీశుఁ బాయంగలేక
మానసంబున నేను మఱగెదఁ గాక
మోమాటయును సిగ్గు మొగిఁ జిక్కు పఱప
నీమాట లెబ్భంగి నెఱిఁగించు నాకు
నేమని వాక్రుచ్చు నేను శోకింప
దీమసంబున నెట్లు దెగి నన్ను విడుచు
నిటుగానఁ దొలిమేన నేను సజ్జనులఁ
బటుపాపబుద్ధి మైపఱచినదానఁ
బ్రజలంట నాకర్మఫలము గాకెపుడు
ప్రజలేమి సేతురు పతియేమి సేయు
నేను నోఁచిన నోములిట్లయై యుండఁ
గా నెవ్వరికి దీనిఁ గడవంగవచ్చుఁ
గారుణ్యనిధియైన కాకుత్స్థుఁడేమి
నేరఁడు సడినొంద నేరఁడు గాక
యని యని శోకింప నచ్చోట మెలఁగు
మునికుమారులు సూచి మునినాథు కడకుఁ
జనుదెంచి వినతులై సంయమిప్రవర
వినుఁ డొక్కయరుదేము విన్న వించెదము
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )