ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
సీత నడవిలో విడిచి లక్ష్మణుఁడు రామునియొద్దకు వచ్చుట
వాకిళ్లు గడచి యవాఙ్ముఖుండగుచుఁ
గాకుత్థ్సకులు రాముఁ గదియ నేతెంచి
జానకిలేమి నాసకలసంపదలు
లేని కైవడి సొంపు లేనియట్లున్న
మందిరంబున శోకమగ్నుఁడై యశ్రు
లందందఁ దొరఁగంగ నధికదైన్యమున
సీతగుణంబులు సీతగౌరవము
సీత పుట్టినయట్టి శిష్టగౌరవము
సీతయున్‌ దనతోడఁ జెప్పిన తెఱఁగు
సీతకుఁ బాటిలు చెనఁటి యీసడియు
సీత నుపేక్షించి చేసిన తెంపు
చేతోగతంబులై చేడ్పాటుఁ బెనుప
నలఁతఁ బొందుచునున్న యారాము నంఘ్రి
జలజంబుకు మ్రొక్కి జననాథసుతుఁడు
ధరణీశు నంఘ్రులు దన మస్తకంబు
వరుస నొండొరు నశ్రువారిచేఁ దడియ
వడిసెడు కేల నావశుధేశుఁ డప్పు
డడలు వారించుచు ననుజన్ము నెత్త
నొక్కింతతడవున కొనరు గద్గదిక
చిక్కుకంఠాంతరసీమలో నఱఁగ
దేవ భాగీరథీదేవి దాఁటించి
దేవరయాజ్ఞఁ దత్తీరదేశమునఁ
గల్మషేతర సీతఁ గళ్యాణచరిత
వాల్మీకి యాశ్రమవనసమీపమున
మీవాక్యమెఱిఁగించి మిథ్యాపవాద
మేవిధంబునఁ బాయ దీవెంటఁ దక్క
నటుగాన నీవింక నడలకుమనుచు
నట డించి వచ్చితినని పల్కెఁ బలికి
సుఖము దుఃఖమ్మును శుభమును గీడు
నఖిలలోకులకుఁ గర్మానురూపమున
నధిప వర్తించు నయ్యైకాలగతుల
నిధులును జెడిపోవు నిత్యముల్‌ గావు
అనఘ యెంచఁగ సర్గమందుట చాల
మనుట విచారింప మరణంబు కొఱకు
నిను నీవు గెలుచుట నిఖిలంబు గెలుపు
మనుజేంద్ర శోకంబు మదిలోన నుడుగు
పురుషపుంగవులైన పుణ్యాత్ములెందుఁ
బరికింప మూఢులై పడరు బంధముల
నీవేమి సామాన్యనృపతివే దేవ
నావుడు ధృతిఁ బూని నరనాథుఁడనియె
జననాథతనయ నీసత్యవాక్యములు
విని సంతసిల్లితి విలసిల్లె మనము
తెఱఁగేది నాలుగు దివసంబులేని
మఱచినారము మహిమండలస్థితులు
ప్రజల విన్నపములు పరిపాటి వినుచుఁ
బ్రజలఁ బాలించుట పరమధర్మంబు
ఎలమి మంత్రులఁ బురోహితుల విన్నపము
గలవారిఁ బిలిపింతు గాక కొల్వునకు
దుష్టనిగ్రహమును దోషంబు నణఁచి
శిష్టరక్షణమును జేయక యెవఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )