ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శ్రీరాముఁడు శత్రుఘ్నునకుఁ బట్టంబుఁ గట్టుట
యభిషేకవస్తువు లన్నియుఁ గూర్పు
డభయుఁ డీశత్రుఘ్ను నభిషేకమునకు
వెస వసిష్ఠాదుల వేదపారగుల
నసమానమహిముల నలరు ఋత్విజుల
సచివులు మొదలుగా జనువారినెల్ల
నుచితక్రమంబున నొగి బిల్వుఁడనిన
వలయువారలనెల్ల వరుస రప్పించి
విలసితమతి జేరి విన్న వించుటయు
నారాము నాతని నావసిష్ఠాదు
లారంగ శత్రుఘ్ను నభిషిక్తుఁ జేసి
యలర బట్టము గట్టి రంత నాయనుజు
నలఘుతేజముజూచి యతని రా దిగిచి
యూరుపీఠంబున నునిచి యావిభుఁడు
గారవం బలరంగ గరుణతోఁ బలికె
నఖిలలోకంబు లేకార్ణవంబైన
నిఖిలదైత్యాదుల నిర్జించుకొఱకు
పరమగు నీదివ్యబాణరాజంబు
నరుదుగా నిర్మించె యంబుజోదరుఁడు
విధి లోకసృష్టి గావింపక మొదట
మధుకైటభులు దీన మర్దింపఁబడిరి
పదపఁడి నాకు నీపటుసాయకంబు
విదితంబుగాఁ గల్గి విలసిల్లుచుండు
భూతసంహారంబుఁ బొరిఁ జేయకుడుగ
నిత్తెఱంగుననైన నీబాణమనుచు
నిది ప్రయోగింపక యేను రావణుని
యెదిరి నిర్జించితి నితరబాణముల
నటుగాని యాదివ్యమైన బాణంబు
చటులోగ్రశక్తి కసాధ్యుండు లేడు
వాని నీశరమున వధియింపుమనుచు
మానితంబైన యామార్గణంబిచ్చి
శూలిచేఁ బడసిన శూలంబు వాని
కేలనుండిన నీకు గెలువంగ రాదు
నిచ్చలు బూజించి నియతి నాశూల
మచ్చుగా గేహంబునందుఁ బెట్టుచును
నన్నిదిక్కులయందు నాహారవాంఛ
పన్ను గాఁ బ్రాణులఁ బట్టి మ్రింగుచును
జరియించు శత్రుండు చనుదెంచెనేని
కరముగ్రతేజుఁడై గడతేర్చి పుచ్చు
వీతశూలుఁడైన వేళ నీవెఱిఁగి
ప్రీతి కయ్యమునకు బిలిచి నిర్జింపు
మురుశూలహస్తుఁడై యున్న పై జనకు
వెర వేమరక యున్న విజయంబు గలుగు
లలితరేఖలు గల్గు లలి చిత్రగతుల
బొలుచు నుత్తమహయంబులు నాల్గువేలు
ప్రచురప్రభాభాసి బహురత్న హేమ
రుచిరంబులైన తేరులు రెండు వేలు
దానధారామత్తతరుణాళి మధుర
గానంబులకు మెచ్చు కరులొక్క వెయ్యు
వరవీరభటజనవ్రజ మొక లక్ష
నెరి సువర్ణంబులు నిరుఁగోట్ల నిచ్చి
యంగళ్లు బెట్టు బేహారులు నటులు
మంగళపాఠకుల్‌ మంచి గాయకులు
మఱియును దగువారు మహిమతోఁ గొలువ
నురు సువర్ణము లోలి యొకకోటి గొనుచు
శత్రుఘ్నుఁ డొగి నమస్కారంబు సేయ
తత్రత్యులందఱుఁ దన్ను నుతింప
రామచంద్రుఁడు ప్రీతి రంజిల్ల ననుజు
తో మృదుచిత్తంబుతోడ నిట్లనియె
పరిపాటి సేనాధిపతుల మన్నింపు
పరుషభాషల వారి పల్కకుమెపుడు
యరసి భృత్యులచేత నయ్యెడు పనులు
..........
వనితలచే బంధువర్గంబుచేత
ధనములచే గావు తగువారి బ్రోవు
కడక నీవీగ్రీష్మ కాలంబునందు
కడువేగ జాహ్నవి గడని యొక్కెడను
నీసేన విడియించి నీవొక్కరుఁడవు
భాసురశరధనుఃపాణివై కదియు
మెవ్వరేనీరాక యెఱిగించిరేని
క్రొవ్వున వెస బట్టికొని మ్రింగునతఁడు
కాన వంచన మీఁది కార్యము న్మత్తు
లైన దురాత్ముల యందందు బనుప
నలరి శాలాధ్యక్షులై యున్నవారి
గలయంగఁ గనుఁగొని కడుప్రీతిఁ బలికె
నేడు వాసరముల కెల్లసైన్యముల
గూడిప్రయాణంబు కొలది కేతెండు
మీరని పలికి నామితి చన్ననాడు
గారవంబునఁ బుణ్యకర్మముల్‌ దీర్చ
ముగురమ్మలకు మ్రొక్క ముదమార వారు
తగిన దీవనలిచ్చి తమ వీడుకొల్ప
చనుదెంచి యారాము చరణాబ్జములకు
వినతుఁడై కౌగిట విభుఁడు మన్నింప
నాఖండలోజ్జ్వలుండైన యారాజ
శేఖరునకుఁ బ్రదక్షిణము గావించి
భరతలక్ష్మణులకుఁ బ్రణమిల్లి వారి
పరిపాటి వీట్కొని పైనమై కదలి
చనుచోట మూఁడు వాసరములు నడుమ
జనఁగ నాలవనాఁడు జాహ్నవి దాటి
యారయ వాల్మీకి యాశ్రమవనము
చేరువ నొకచోట సేనల నిల్పి
చని యమ్మునీంద్రుని చరణాబ్జములకు
వినుతుఁడై తన రాక విధమెఱిఁగించి
మునినాథ యీరాత్రి ముదమార విందు
చని నెల్లి పడమరఁ జన్న యా మార్గ
మున జనియెదనన్న మునిపుంగవుండు
మనమున సంతోషమగ్నుఁడై పలికె
దశరథాత్మజ మీరు ధర్మాత్ములగుట
కుశలంబు మీకని కుశలంబు లడిగి
మీ యాశ్రమంబిదె మీకు మీయింటి
కీయెడ జనుదెంచుటిదియ నాపూజ
యచ్చోట మీకుండ నిరవయ్యెనచట
నచ్చోట నీసేన నట విడియింపు
మీయర్ఘ్యపాద్యంబు లింద మీకనుచు
నెయ్యంబుతోడ నానృపతనూజునకు
నిచ్చె నావాల్మీకి యిచ్చిన పూజ
లచ్చుగాఁ గైకొని యధికమోదమున
ఫలమూలభక్షణపరితుష్టుఁడగుచు
నలరి యాశత్రుఘ్నుఁ డనియె గేల్మొగిచి
యనఘ యుపాధులీ యాశ్రమోపాంత
మునుఁ బెక్కులున్న వీమున్నెవ్వ రిచట
జన్నముల్‌ జేసి రాజననాథులెవ్వ
రన్న ప్రాచేతసుండవి చెప్పదొణఁగె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )