ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శత్రుఘ్నుఁడు తమ యయోధ్యకుఁ జనుదెంచుచు మార్గమధ్యమున వాల్మీకిచే రామాయణంబు వినుట
మంగళధ్వనులొప్ప మార్గరావముల
సంగతశ్రుతిగూడి సరివీణెలొప్ప
వీనులకింపుగా వినుపింప నపుడు
భూనాథసూనుండు బొడము కన్నీరు
తలయూపు మూర్ఛయు దాల్మిచే నణచి
కలిగియు వినుచుండగా నొయ్య దెలసి
పరిజను లాశ్చర్యభయవిషాదముల
బొరలుచు నారాజపుత్రుతో ననిరి
యిదియేమి చిత్రమో యిక్కథామూల
మదియ మునీంద్రుని నడుగు మీవనిన
నీమహామునియం దనేకంబు లరదు
లేమేమియో వాని నెఱుగ నేమిటికి
నని వీడు బట్టున కరిగి యచ్చోట
వినుతవీణానాదవిలసితంబైన
గానంబు వినుచుండగా రాత్రి వేగ
భానుఁడు ప్రథమాద్రిపై నొప్పె నంత
నిత్యకృత్యంబులు నియతితో దీర్చి
యత్యంతశుద్ధాత్ముఁ డగుచు నేతెంచి
ముకుళితహస్తుఁడై మునినాథ యేను
సకలేశుఁడగు రామచంద్రునిఁ జూడ
పనివినియెదనన్న పరిరంభణాదు
లొనరంగ వీట్కొల్పె నుర్వీశతనయు
నతఁడును మధ్యాహ్న మగుచున్న వేళ
నతిముదంబున నయోధ్యాపురంబునకు
నేతెంచె నక్కడ నినకులోత్తముఁడు
బ్రాతిగా కొలువిచ్చి పనుపంగ వచ్చి
సామజ ఘోటక స్యందన సుభట
సామగ్రి సామంతజను లెదుర్కొనఁగ
భూసురాశీర్వాద పుణ్యనాదములు
భాసిల్ల నందంద పటహాదు లువియ
నెమ్మి బౌరులు సేయు నీరాజనాదు
లిమ్ముల గైకొంచు నిందుమండలము
ప్రహసించు ధవళాతపత్రంబు మెరయ
బహుగద్యపద్యాది పఠనముల్‌ వినుచు
ఘనమైన సందడిగల రాజవీథి
జనుదెంచి నగరి మోసాలను తేరుగ్గి
వినయంబుతో డిగ్గి వేడ్క చేదోయి
యనయంబు ఘటియించి యారామచంద్రు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )