| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
పరువడి నాకందు ప్రాచేతసుండు సంజ్ఞ విచారించి సదయుఁడై పలికె ధరణీశ యీసీత ధర్మనిష్ణాత పరమపతివ్రత పావనమూర్తి జనలోకనిందకు శంకించి నీవు తను విసర్జించిన తగవు చింతించి వచ్చి మాయాశ్రమవనభూమిలోన నిచ్చలు నత్యంత నియతితో నుండి కుశలవులను గాంచె గొడుకుల వగల దశరథాత్మజ వారు తనయులు నీకు నీ సభ నిత్యంబు నీ చరిత్రంబు భాసురస్థితినొప్పు పఠియింపుచున్న వీరు నీకొమరులు వినుము సత్యంబు యారయ నాపల్కు లంతియ కాదు యనఘాత్మ మహితాత్ముఁడగు ప్రచేతసుని తనయుండ గలలోనఁ దప్పాడి యెఱుఁగ నెడపక పెక్కువేలేడులుఁ దపము కడునిష్ఠతో నేను గావించినాఁడ చిత్తంబు పలుకును సేతయు సీత కెత్తెఱంగున జూడ నేకరూపంబు యేదోషమును లేదు యీసాధ్వియందు మేదీనీసుత పెద్ద మేరువు పెద్ద పూని యీసభలోనఁ బొంకితినేని యేను చేసిన తపంబెల్ల నిష్ఫలము తరుణికి పురుషుఁడు దైవంబు గాన పరికించి శపథంబు పరికింపుమనిన సభయెల్లఁ గలగ నాసంయమీశ్వరుఁడు రభసంబుతోఁ బల్క రఘురాముఁ డపుడు ముకుళితహస్తుఁడై మునినాథ సీత యకలంకచరిత మీయఖిలవాక్యములు సన్నుతచరితయై సకలదేవతల సన్నిధి నిలిచి యీసాధ్వి తొల్లియును పూని విశ్వాసంబుఁ బుట్టించె గాన నేను గైకొంటి నేయెగ్గును లేదు సడికోడి పావనచరితంబు గనియు విడువంగవలసె నీవిగతకల్మషను నిన్ని మాటలు నేల నిదియె నా కొఱత మన్నింపుడని పల్కి మనుజేశుఁడనియె కుశలవుల్ వీరునా కొడుకులు సీత విశదాత్మ యిదియెల్ల విశదంబ యౌను జానకి సభలోన సఁడి బాపికొన్న మానుగా గైకొందు మరియొండు లేదు నావుడు నమ్మహీనాథుని తెంపు భావించి యప్పుడు బ్రహ్మాదిసురలు జనకరాజాత్మజ శపథంబు చూడ చనుదెంచియుండిరి చదలెల్ల నిండ పరిమళమిళితమై పలచని గాలి పొరిఁ బొరి సభలోనఁ బొలుపార నపుడు |