కావ్యములు విఘ్నేశ్వరదండకము దొంతరాజు రామకవి

విఘ్నేశ్వరదండకము

శ్రీపార్వతీపుత్ర! లోకత్రయస్తోత్ర! సత్పుణ్యచారిత్ర! భద్రేభవక్త్రా! మహాకాయ! కాత్యాయనీనాథసంజాత స్వామీ! శివా సిద్ధివిఘ్నేశ! నీ పాదపద్మంబులున్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జురూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమం బక్షతల్ జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచిచేమంతులున్ దెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులన్ మంచిదూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి సాష్టాంగముం జేసి విఘ్నేశ్వరా! నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పున్గులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయున్ జున్ను బాలాజ్యమున్ నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముం బంచనీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్థనల్చేయుటల్ కాంచనంబొల్లకే యిన్ము దా గోరు చందంబు గాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవచూడామణీ! లోకరక్షామణీ! బంధుచింతామణీ! స్వామి! నిన్నెంచ నేనెంత? నీ దాసదాసానుదాసుండ, శ్రీ దొంతరాజాన్వవాయుండ రామాభిధానుండ, నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మసింహాసనారూఢతన్ నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా జేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ గణేశా! నమస్తే నమస్తే నమస్తే నమః!!

AndhraBharati AMdhra bhArati - bhOginI daMDakamu - bammera pOtana - telugu andhra tenugu ( telugu andhra )