కావ్యములు కృషీవలుఁడు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి

కట్టమంచి రామలింగారెడ్డిగారి ఉపోద్ఘాతముప్రేమాంకము
అన్నా, మన్నెము శేషురెడ్డి, యెటులో - యావిర్భవంబొంది
స్నేహౌన్నత్యంబు పరస్పరంబు రమణీ - యానేక భావంబులం
జెన్నారెన్‌ హృదయానుబంధరచనా - చిహ్నంబుగ\న్‌, మాఱుపా
టెన్నండుం దలచూపదిందనుక దై - వేచ్ఛాప్రభావంబున\న్‌
అట్టినిర్మలమైత్రికి నానవాలు - నవ్యకవితాసుమంబుల దివ్యమాల
నెమ్మిఁ గీలించుచున్నాఁడ నీదుకీర్తి - కామినీ కంఠసీమను గాంతు లొలయ.
ప్రియమిత్రుడు
దువ్వూరి రామిరెడ్డి.


కృషీవలుఁడు
సమయమమూల్య, మొక్క నిమిషంబు వృథాచనఁ గ్రమ్మఱింప నే
రము; మనయాయువా త్రుటిపరంపరయౌట నెఱింగి, నిద్రమాం
ద్యమును దొలంగి మీపనుల నారయుఁడో జనులారయంచు డం
బముగ మెడన్నిగిడ్చి కృకవాకువు గూసెడి నింటికొప్పున\న్‌.
1
వడఁకుచుఁ బాడు మేల్కొలుపుపాటకు రాటము ఝుమ్ముమంచుఁ జే
సెడి మధురారవంబు శ్రుతిచెల్వువహింపఁగ, రాజనూఁది ముం
గడ నిడికొన్న కుంపటిసెగన్‌ సొగియించుచు నమ్మలక్క లొ
క్కెడగుమిగూడి నూల్వడకునిత్తఱిఁదోఁచెను రెడ్డిచుక్కయున్‌.
2
అత్తల యాఁడుబిడ్డల భయం బొకవంకయుఁ గోర్కె వేఱెడం
చిత్తములాఁగఁ క్రొవ్వెదయుఁ జీరయు వే సవరించి తూఁగుమై
మత్తున నున్నవల్లభుని మంచము మెల్లన వీడి దీనయై
బిత్తఱికోడ లిల్వెడలె వేకువఁ బ్రాఁచిపను ల్వొనర్పఁగ\న్‌.
3
రచ్చ చపారమందు నిడి రాతిరిఁ బుచ్చిన బాటసారులుం
జిచ్చు రగిల్చి మంటలకుఁ జేతులు చాపుచుఁ గూరుచుండి వా
రిచ్చకు వచ్చినట్టి కతలెల్ల వచింపుచుఁ దెల్లవాఱఁగా
వచ్చిన మూటముల్లె గొను పైనపుసందడి రేఁగె గొల్లున\న్‌.
4
'అమ్మీ, తూరుపుదెల్లవాఱె, నిఁకలెమ్మా' యంచనన్‌ మూల్గి మం
చమ్ము\న్‌ డిగ్గక, బుజ్జగించినను, 'పో చాల్చాలు, వేన్నీళ్లు లే
కెమ్మై నేఁ బలుదోముకొందుఁ జలిలో, నింతాగడంబా?' యటం
చమ్మం గూఁతురు కోపగించుకొనుఁ గన్యాత్వంపు గారామున\న్‌.
5
ప్రొద్దుపొడుపను కాఁపుపూఁబోడి రాజ
నముల వరియెన్నుగంప గేహమున దింప
సంబరమున నెగురుచు సరసఁజేరు
పిల్లలనఁ బుల్గుతుటుములు వింటికెగసె.
6
అరుణమయూఖముల్‌ తరులతాంతరమార్గము దూరి గేహగో
పురములఁ బ్రాఁకు ప్రొద్దువొడుపుం దరుణంబున నీటికోసమై
సరసుల కేఁగు కాఁపునెఱజాణల నూపుర మంజులార్భటుల్‌
నెఱసెఁ బ్రభాతమన్‌ శిశువునేర్చెడి ముద్దులమాటలో యనన్‌.
7
ఇరువులఁ జూరులందుఁ జరియించి తమోహరణైక దక్ష భా
స్కర కిరణాళి నీమృదులశయ్య సువర్ణమయంబు చేసె ని
ద్దుర నిఁకనైనమాని వెలిదోలుము బీళ్ళకు నాలమంద, ని
త్తఱిఁ దమిదీఱమేయుఁ బులదంటులుఁ గమ్మనిమంచుపచ్చికల్‌.
8
ఓయి హాలిక! యెంత ప్రొద్దాయెఁ జూడు
మింత నిదురేల? పాలకై గొంతురాయ
లేఁగ యాదూడ పలుపును లాఁగికొనుచు
నఱచుచున్నది 'యంభ యంభా' యటంచు.
9
పొదుగు నిండుగఁ బాల్చేపి గుదులు త్రెంపి
దూడకై దొడ్డిగోడ రాపాడి దాఁటెఁ
దఱిపి పెయ్య; యింకేల మాంద్యమునఁ బొరల?
లెమ్మునిద్దుర; పాల్దీయఁ దెమ్ము చెంబు.
10
బిఱ్ఱుకడుపుగ నన్నంబుఁ బెరుఁగుఁ గుడిచి
దొడ్డి వెడలించు చున్నాడు గిడ్డిగములఁ
దమ్ముఁగుఱ్ఱడు; లేదూడ లమ్మలకును
పరుగు లిడనీక కట్టుము పలుపువెట్టి.
11
చెమరు ముత్యాలు చెక్కిళ్ళఁ జెదరిజాఱ
పైట తెరవెన్క జమరి పోరాటమెసఁగ
(ముద్దుచన్నులు పయ్యెద మురిపెమాడ)
గాజునీలాలు మధుర నిక్వణము లొలయ
దధి మధించెడు కాంత గీతములు వినవొ?
12
ఉయ్యెల నిద్రలేచి తనయుం డెదుటన్‌ జనయిత్రి గాంచకే
కుయ్యిడు చున్నవాఁడు కులుకుంగనుదమ్ముల బాష్పబిందు లొ
య్యొయ్యన జిందువాఱ, సతియున్నికటంబున లేదు, లేచి య
బ్బయ్యనునెత్తి మేనుపులకాంకితమౌనటు ముద్దు వెట్టుమా.
13
చలికప్పుగప్పి విచ్చలవిడి లేయెండ - గ్రాగు ముద్దులకూఁతుఁ గౌఁగిలించి
పునికి దోఁగాడుచు బొమ్మలతో నాడు - పసిబిడ్డమోము చుంబనముచేసి
యెగతాలి సరసాల నిల్లాలు పలుకుచు - నవ్వినందుకు మాఱునవ్వు నవ్వి
పనివాండ్రు వచ్చియుండిన దండ్రియేమను - నో యను శంక లోనొరసికొనఁగ
 
చలిది కడుపారఁ గుడిచి యెద్దులను దోలి - కొనుచు మడి కేఁగుచున్నారు, కనుమ! యొరులు
వారు నీతోటివారలు గారె? రెడ్డి - యువకు లెచ్చటఁ గొఱగాక యుందురయ్య?
14
మనపనిఁ జేసికొన్న నవమానమె? ప్రాఁచిపను ల్వొనర్చుచున్‌
వనిత యతిప్రయాసమున పర్వులిడం గనుఁగోవె? కావడిం
గొని సరసీజలంబులను కోపము సేయక తెచ్చియిచ్చి కాం
తను పరితోషపెట్టుము; వృథాచన వెప్పుడు నట్టిసాయముల్‌.
15
సోమరిపోతవై జనకు సూక్తు లలక్ష్యముచేసి కొంటెపో
రాముల ప్రొద్దుపుచ్చకు, నిరర్థకభూములనైన చెమ్మటన్‌
శ్యామల సస్యవంతముగ సల్పెడు కాపులు నోగులైన నిం
కోమెడువార లెవ్వరు జనోత్కరమున్‌ సరసాన్నదాతలై.
16
అరుణకిరణుండు తూర్పున నవతరింప
ప్రాణిలోకంబు మాంద్యమ్ముఁ బాసె; నింక
నింటనుండుట మర్యాదయే కుమార?
చలిదిచిక్కంబు గట్టుము పొలముఁ జేర.
17
అప్పుడప్పుడె విచ్చి యలరు చేమంతుల - కమ్మన్ని నెత్తావి గడలుకొనఁగ,
రత్నకంబళ మట్లు రాణించు బీళులఁ - బలువన్నెపూవులు బలిసి విరియ,
వ్రాలఁబండిన రాజనాల కేదారంబు - పంటలక్ష్మికి నాటపట్టుగాఁగ,
ప్రొద్దునిగ్గులు సోకి పొగమంచు మబ్బులు - బంగారు వలిపంబు పగిది వ్రేల
 
ఈ నిమేషమందు నిల యెల్ల నందమై - స్వర్గశిల్పి యింద్రజాలశక్తి
వ్రాసినట్టి చిత్రపటమన విలసిల్లె; - తొంగిచూడు మిపుడు తూర్పుదిక్కు!
18
వేకువనె లేచి వైకుంఠవాకిళులను
ముంగిట రచించి గుమ్మడిపూలతోడ
గొబ్బిముద్దల నిలిపి కుంకుమను జల్లె
నీ యనుంగుకూఁతురు! గాంచుమోయి సొబగు.
19
గనిమల తుంగకున్‌ గఱికకాడల కల్లిన సాలెగూళ్ళ స
న్నని పటికంపుమంచు పడి నాణెపు ముత్తెసరాల పోలికం
గనుఁగొన రమ్యమయ్యె రవికాంతులఁ దేలుచు, నిట్టి భావమో
హనపు నిసర్గశిల్పముల, హాలిక! త్రొక్కక దాఁటిపొమ్మిఁకన్‌.
20
పొలముల కేగు పల్లెతలు పుత్తడిగాజులు ఘల్లుమంచు రా
పిలి యులివెత్తగం జిటికెవేయుచు నిన్గని యేలపాటలం
జెలువుగ బాడ నుప్పతిలు సిగ్గున నూరకపోక మాఱుపా
టల నెలుగెత్తి పాడుమ, మిటారుల నవ్వుల కాస్పదంబుగన్‌.
21
గ్రామవాసుల కిట్టి నిష్కైతవంపు
ముగ్ధపరితోషములు సుఖభోగ్యములగు;
పట్టణ నివాసకుల శుష్కభావములను
నిట్టి సామాజికానంద మెసఁగఁగలదె?
22
ఓయి రెడ్డియువక, యూరక యిందందుఁ
దిరుగ నేమి ఫలము? తిండిచేటు!
తండ్రి కోఁతమడుల దగ్గఱ పనిసేయు,
నన్నమునకు నింటి కనుపుమయ్య.
23
వ్రాలిన కొప్పులోపలి పూలరేకులు - సడలి యొక్కొక్కటి జాఱుచుండ,
బరువంపు రొమ్ముపై పయ్యెదచినుగుళ్ళు - గాలికి నట్టిట్టు గదలియాడ,
నెలుగెత్తి పాడెడి యేలలు విని బాట - సారు లెక్కసకెము సలుపుచుండ,
తమ్ములపుం బూఁత దవిలిన వాతెఱ - పై పలుచాలు నవ్వకయె నవ్వ.
 
చేతికొడవలి ఝళుపుచు చిన్నెలాడి - కన్నెమాలెత పిడిచుట్టి మున్నమున్న
మునువు తఱిగెడి; నింటికి పోవువేళ - సందెడోదె యీలేవె కర్షకకుమార?
24
ఆఁకటి చిచ్చుబాధ సగమైన యొడళ్ళును నంటు డొక్కలుం
జీఁకటిచూపులున్‌ మొలకు జేనెడుపీలిక గల్గి జీవితం
బే కడగండ్లుగా, పరిగ యేరెడి బీదల వెళ్ళగొట్టి చి
కాకొనరింపఁబోకు; వెలిగాదల యాఁకటిమంట నీకునున్‌.
25
పసిఁడిపూసల పేరుల పగిది దోర
పక్కముగ బండి నేలకు వ్రాలు కంకి
గుత్తుల పిచుకతిండికిఁ దెత్తుననుచు
నింతికిం జెప్పి మఱచితే యింతలోన?
26
పడఁతి యొంటికత్తె; పనిపాటు సేయను
నిడుగు దొడుగులకును నెవరు లేరు;
చంటిబిడ్డ యొకఁడు, సంసారభారంబు
పీల్చి పిప్పిసేయు బీదరాలి.
27
చెలియా, యిత్తఱి నిన్నుఁ గన్గొనిన నాచిత్తంబు తాపార్తమై
కలఁగుం, కష్టకుటుంబకార్యముల నెక్కాలంబు నిర్మగ్నవై
మెలఁగంజూతువు మంచిచీర రవికెల్‌ మేలౌనలంకారముల్‌
దలఁపంబోవు, తలైన దువ్వ; విఁకలేదా మేర నీపాటుకున్‌?
28
మున్నూటరువది దినముల
నెన్నండును గన నశక్య మేపనియును లే
కున్న నిమేషము; కాఁపుం
గన్నియ, నీ కాటవిడుపుకాలము లేదే?
29
నిత్యకృత్యములం దొక్క నిమిషమైన
దొంగిలింపుము కైసేయ తోయజాక్షి,
యఖిలకామినీ సామాన్యమౌ ప్రసాద
న ప్రియత్వము నీ యందు ననలుకొనదొ?
30
స్వాంతమున నీకురామణీయక పిపాస
యంతరించె నటంచు నే ననను కాంత,
కాని, యెడలేని సంసార కష్టములకు
స్త్రీప్రకృతి బలివెట్టుట చెల్లదమ్మ.
31
త్యాగమునకైన నొకహద్దు దగును గాని
శలభ మట్టుల నాత్మనాశనము మేలె?
పొలఁతికి సతీత్వ సౌందర్యములును రెండు
ప్రార్థనీయ వరంబులై పరఁగుఁగాదె!
32
అతివ, నాయూరడింపుల యందె దవిలి
చిన్నకూఁతురి నంపవు జొన్నమడికి
పావురంబులు చిల్కలు పాలకంకి
విఱచికొని యాకసంబున వెడలెఁ జూడు!
33
పడెనట చిల్క లన్నమిష పైట దొలంగిన జూచిచూడకే
యొడిసెల ఱాయిఁబెట్టి పొలమోరలఁ బోయెడి బాటసారిపై
పడ తెగ రువ్వెదేల మగువా, యిటులం బడుచుందనాల తుం
దుడుకుదనంబు నీయెడద తొందరవెట్టెనె? నైజమేగదా!
34
'ఐన నయ్యెగాని, యాఁకలి బలుదొడ్డ,
రెండు కంకు లిమ్ము రెడ్డిపడుచ,
ప్రొద్దువోవు మాదు పొలిమేర జేరను,
బాట నడచి నడచి బడలె మేను.'
35
అని కడువేడు పాంథులకు నచ్చట చేతికినందు కంకులం
దినుఁడని చెప్పి మంచెపయి తియ్యనిరాగముదీయు ప్రాయపుం
గొనబుమిటారి, నీ మనసుకుందు నెఱుంగదుగాని, యింటిలో
ననయము లేమిడిన్‌ సయిచు నమ్మవెతల్‌ దలపోయ వేలొకో?
36
చిన్నప్రాయమందె చీడపుర్వును దెచ్చి
నీదుహృదయకళిక నిలుపఁదగదు;
పచ్చపైరుచేల బాంధవ్యమునఁ జేసి
పెరిగినావు ప్రకృతిబిడ్డ వోలె.
37
పూలకారుగాలి పొలముపై వీతెంచె
వలపు మొలచి యొడలు పులకరింప,
మనసుకోఁతలెల్ల మానిపోఁ గోయిలఁ
గూడి పాడుమొక్క క్రొత్తపాట.
38
పైరుంబచ్చలులేని లోపమును బాపంబోలె గ్రొంబూలసిం
గారంబుం గయిసేసి లేఁజివురులం గాంతిల్లె వల్లీతతుల్‌,
దారింబోయెడు బిచ్చకత్తెయయినం దావుల్‌ గుబాళింపగం
బూరేకుల్‌ చికురంబులం దుఱిమి సొంపుంబెంపు బాటించెడిన్‌.
39
కనుమ, యాబిచ్చకత్తెకు గలసుఖంబు
నందు సగపాలు లేదు నీయాలి కకట!
పవలు నిద్రించెదే కాఁపుపడుచువాఁడ,
పొలతి నిట్టూర్పు నీయెద పొగిలిపోదొ?
40
కాఁపులెల్లరు నాగళ్ళు గట్టి కోడ
యడుగు దున్నెద రిపుడు; నీ వదనెఱుఁగవొ?
యాలసింపక యెడ్ల కయ్యలను దోలు
మోయి, యెండలు ముదిరి పెల్లుక్కవెట్టె.
41
శ్రమలు లేకయె ఫలములు దుముకఁబోవు,
పిండికొలఁదియె రొట్టె; యోపిన విధాన
కష్టపడుము కృషీవలా, కలుగు సుఖము
ఉత్తయాసల కన్న మే లుద్యమంబు.
42
అర్కబింబము మధ్యందినాతపంబు
గాయుచున్నది మేనెల్ల కమలిపోవ;
నురుగు గ్రక్కుచు నూర్చుచు నోరుదెఱచి
యొక్కయడుగైన బెట్టవు దుక్కిటెడ్లు.
43
ఖరకరతాపతప్తమయి కాయము ఘర్మకణాళి నీనుచున్‌
సొరిగెడి సత్వహీనముగ, చూపులు దీనములయ్యు ప్రొద్దునం
బొరసినమోము తేట లెటువోయెనొ! దప్పియు హెచ్చెనోయి, యి
త్తఱి తరుమూలశాయివయి తాపమువాయుమ చల్లనీడలన్‌.
44
కరము కష్టించు నిను గాంచి కనికరమున
నెండవేడిమి తొలగించు నిచ్చతోడ
వారిదం బాతపత్రమై వచ్చెగాని,
మారుతాహతి శిథిలమై మరలె నదియు.
45
తరువుల కోటరంబులకు తారెను పక్షికులంబు, బఱ్ఱెలున్‌
సరసుల జొచ్చెరోజుచు, కనంబడ రెవ్వరు దారులందు, నీ
సరణి నచేతనప్రకృతి చల్లదనంబున కాసచేయ మే
నెరియగ నీవుమాత్ర మిటులేల శ్రమించెద వెఱ్ఱటెండలన్‌?
46
బాటల వేడిదుమ్ములకు పాదములం జిఱుబొబ్బలెత్త క్రీ
యూటగజెమ్మటల్‌ మొగమునుండిదొరంగగ కూటిదుత్తతో
పాటలగంధి వచ్చెడిని, పాపము! వేగమ నీట మున్గి య
చ్చోటనె మజ్జిగన్నము రుచుల్‌ వచియింపుచు నారగింపుమీ!
47
తరుణీ, ధూళుల కాళ్లుగాలెనని సంతాపంబునం గాంతునిం
జిఱుముఱ్ఱాడక, గేహనిర్వహణమున్‌ సేద్యంబు సాగంగ ని
ద్దఱు కష్టింప కుటుంబరక్షణము సాధ్యంబౌను; భిన్నాధ్వసం
చరణాసక్త హయద్వయంబు రథమున్‌ సాంతంబుగా లాగునే?
48
శ్రమ కుచితంబుగా ఫలము సంధిలదోయని చింతవొందకో
రమణీ, నిదాఘతాపము దొఱంగెడు నంతకు మఱ్ఱియూడజొం
పముల యుయాలలూఁగి పదమాత్రన యింటికిఁ బొమ్ము, పాలకై
కుములుచు నేడ్చునేమొ యనుంగు బసిపాపడు నిద్రలేచుచున్‌.
49
దారి జరించుచున్నప్పుడు దగ్గఱనున్న తటాకమందు నిం
పారు సరోజముల్‌ గొని గృహంబునకుం జనుదెమ్మ, బాలకుం
డారమణీయ పుష్పముల నచ్చెరువొందుచు గాంచి యాడుకో
దీఱిక వంటయింటి పని దీర్పుము కాంతుడు వచ్చునంతకున్‌.
50
పూవుందేనియ లారగించి మధుప వ్యూహమ్ము కర్ణప్రియం
బైవర్ధిల్లు మనోజ్ఞగీతముల రాగలాపముం జేయగా
నీవేలా కలఝంకృతిన్‌ స్వరము లెంతే నైక్యముంబొంద కాం
తా, వాకోవొక పల్లెటూరి పదమైనం జిత్తముప్పొంగఁగన్‌.
51
సిరిగల యాడుబిడ్డలు విచిత్రపుఱాలనగల్‌ ధరించి బం
గరుసరిగంచు చీరలను గట్టి చరింపగ గాంచి యాస లో
బొరయకు కృత్రిమంబులగు భూషలుదాల్ప; నమూల్యరత్నమౌ
సరసపు ప్రేమ చిత్తజలజంబు వెలుంగ నలంకరింపుమీ.
52
వెలగల రత్నభూషలను వేలకుదాల్చిన నిన్నుగాంచు చో
గలుగదు ప్రేమ భర్తకు వికస్వరమౌ వదనారవిందమం
దొలికెడు ముద్దులేనగవు లొక్కనిమేషము దోపకున్న; భూ
షలు ప్రణయానుబంధ సదృశమ్ములు గావు కులాంగనాళికిన్‌.
53
అతుల సంసారసాగర మందు కాల
జలము సుకృత దుష్కృత వాతచలిత మగుచు
సుఖవిషాదపు తరగలై సుడియుచుండ
పడవవై గట్టుచేర్తువుపతిని గృహిణి!
54
ఈయెడ నాతపంబు శమియించెను, నీడయు తూర్పుదిక్కుకుం
బోయెడు భర్తతో నలిగి పొందెడయం జను జాయపోలికన్‌
వాయువు సుప్రసన్నమయి పైబయి వీచెడు లేచిరమ్ము, లే
దోయి విలంబనం బనెడి యుక్తి కృషీవలవాఙ్మయంబునన్‌.
55
మనుజసమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ
త్తి నియత, మట్టి ధార్మికవిధిం జిరకాలము గౌరవంబుతో
మనిచిరి నీపితామహు లమాంద్య సుశీలురు సర్వవృత్తిపా
వన కృషిజీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై.
56
అనుదిన మిట్లు కష్టపడ నావిధి వ్రాసె నటంచు నీమదిం
బనవకు కర్షకుండ, యిలపై జనియించినదాది చెమ్మటల్‌
దొనక శ్రమించి పౌరుషముతో బ్రతికించెదు నీకుటుంబమున్‌,
మనమున కైతవాశయము మందునకైనను లేదు నీయెడన్‌.
57
నేలనూతుల కుగ్గాలు నిలుపువారు,
బోడితలకు మోకాళ్ళకు ముడులువెట్టు
వారు, చిటికెల పందిళ్ళు పన్నువారు
నిన్ను బోలరు, తమ్ముడా, యెన్నడైన.
58
పఱుపులు పట్టెమంచములు పట్టుతలాడలు నంబరంబులుం
గరులు తురంగముల్‌ ప్రియయుగాంచనమున్‌ మఱియేమియుండినన్‌
ధర సకలంబు సొంతమయినం దనివోదు మనుష్యతృష్ణ, త
త్పరిచితులైన వారి నెడబాయదె తృప్తి నిసర్గశత్రుతన్‌.
59
అన్నాహాలిక, నీదు జీవితము నెయ్యంబార వర్ణింప మే
కొన్న న్నిర్ఝరసారవేగమున వాక్పూరంబు మాధుర్య సం
పన్నంబై ప్రవహించుగాని యితరుల్‌ భగ్నాశులై యీర్ష్యతో
నన్నుం గర్షకపక్షపాతియని నిందావాక్యము ల్వల్కరే!
60
వనలతయైన నాకవిత పత్రపుటంబుల పూవురెమ్మలన్‌
దినదిన జృంభమాణమయి తేజరిలెన్‌ సహజప్రరోహ వ
ర్ధననియమానుసారముగ; తల్లత యెన్నడు తోటమాలిపా
ణిని గనుగోని వన్యరమణీయత జిల్కు నపూర్వపద్ధతిన్‌.
61
పంజరనిబద్ధకీరంబు బయలు గాంచి
యడ్డుకమ్ముల దాటంగ నాసచేయు
నటు, బహిర్నియమంబుల నతకరించి
మన్మనంబు స్వాతంత్ర్యసీమకు జరించు
62
కాన, యెవ రేమి యనుకొన్న దాననేమి
గలుగు? కాల మనంతము; ఇల విశాల;
భావలోకము క్రమముగా బడయు మార్పు
ఏల హృదయంబు వెలిపుచ్చ నింతయళుకు?
63
సైరికా, నీవు భారతక్ష్మాతలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి!
ధారుణీపతి పాలనదండ మెపుడు
నీ హలంబు కన్నను బ్రార్థనీయమగునె?
64
దైనికావశ్యకమ్ముల దాటిపోవ
వెగుర ఱెక్కలురాని నీయిచ్చలెపుడు;
పైరుపచ్చలె యవధిగా బ్రాకుచుండు
నీవిచారము, నూహయు, నిపుణతయును.
65
ప్రొద్దువొడిచిన దాదిగా ప్రొద్దుగ్రుంకు
వరకు కష్టింతువేగాని యిరుగుపొరుగు
వారి సంపదకై యీసు గూరబోవ
వెంత నిర్మలమోయి, నీహృదయకళిక!
66
పల్లెయెల్లయె సర్వప్రపంచసీమ!
ప్రియ యొకర్తయె రమణీయ విగ్రహంబు!
బంగరుం బంటపొలములే భాగ్యనిధులు!
అనుదిన పరిశ్రమమె మత మగును నీకు.
67
ఉండి తిన్నను లేక పస్తున్నగాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు!
నాకలెత్తగ నీపంచ కరుగు నతిథి
తినక, త్రావక, పోయిన దినములేదు.
68
కృషి సకల పరిశ్రమలకు కీలుచీల;
సత్పరిశ్రమ వాణిజ్యసాధనంబు;
అఖిల వాణిజ్యములు సిరికాటపట్లు;
సిరియె భోగోపలబ్ధికి జీవగఱ్ఱ.
69
కావున కృషీవలా, నీవె కారణమవు
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు;
ఫల మనుభవించువారలు పరులు; నీకు
కట్టకుడువను కఱవె యెక్కాలమందు!
70
ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై
పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా
కలితు ల్భోగములన్‌ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే?
71
అట్టి కృతఘ్నులన్‌ మనమునందు దలంపక సేద్యనాద్యపున్‌
ఘట్టన నస్థిపంజరముగా తనువెండినగాని, వర్షముల్‌
పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు వెప్పుడున్‌!
72
రాజకీయ ప్రపంచ సామ్రాజ్యమందు
శౌర్యఖడ్గంబులకు లేదు శాసనంబు;
సంఘరాజ్యంబు నేలు విస్తారశక్తి
సతము నాచార ఘోర పిశాచరాజు;
73
శౌర్యమునకు నాచార చక్రమునకు
మధ్య, లోకంబు దవిలి సమ్మథితమగును;
కాలగర్భంబునం దెట్టి ఘటనగలదొ
పూర్వ పద్ధతి విప్లవ స్ఫురణగొలుప!
74
కల్యకాంతికి మున్నంధకారరాత్రి,
వర్షపాతంబునకు మున్ను వారిదముల
ఢమఢమాడంబరంబులు నమరు; నిదియు
ప్రకృతి భావంబునకు నూత్నపథము గాదు.
75
కష్టసుఖముల నీచోచ్ఛ గతులు గలవు
చక్రదండంబులకు బోలె; సమయమందు
నిట్టిమార్పు లనంతమై యెసగుచుండు
భావి పరిణామ మెవ్వరు పలుకగలరు?
76
ఓకృషీవల! నీవు కష్టోత్కటంపు
దుర్భరావస్థ యందె తోదోపువడగ
నెవరు శాసించువారు, నీకేమి కొదవ?
ఆత్మవిజ్ఞానమయముగా నలవరింపు.
77
దారిద్ర్యంబను పెల్లుటేటి కెదురై దాటం బ్రయత్నించుచుం
పూరావేగమునం జలించి వెనుత్రోపుల్వోవు కాంక్షోడుపం
బేరా పొందక నెట్టు తెడ్లగు మనస్వేచ్ఛాప్రకారంబు కా
ర్యారంభంబును ధైర్యము న్విడకుమయ్యా, నీవు వేయింటికిన్‌.
78
రార సైరిక, కనుగొమ్ము రమ్యమైన
సస్య కేదార ఖండంబు! సత్కవీశ
భావలోచన మెరవుగా బడయకున్న
గాంచనేర వంతర్లీన కాంతిసరణి.
79
అనిలాలోలవినీలసస్యములు భంగానీకముల్గాగ తె
ల్లని కొంగ ల్పయిదేలు నుర్వులుగ లీలన్‌ ఱెక్కలల్లార్ప, మ
ధ్యను రాజిల్లు కుజంబు లోడలుగ వాతస్ఫూర్తిగంపింప, స
స్య నికాయావని సాగరం బటుల నేత్రానందముంగూర్చెడిన్‌.
80
కుసుమ లతావలీ కలిత కుంజములం, కిసల ప్రకాండముల్‌
పసరులు గ్రక్కు వృక్షముల బాలతృణంబుల చేలగట్లు సొం
పెసగ, సమస్తరత్నముల నేరిచి కూర్చిన ఱాలబిళ్ళలన్‌
వసుధ కమర్చిరో కృషికవర్యు లనన్‌ వరిమళ్ళు శోభిలున్‌.
81
మరకత చూర్ణవర్ణముల మండితమౌ నవశాలిభూమి సుం
దరతను గాంచ వైదిక దినంబులలో భరతక్షమాధురం
ధరయగు సస్యలక్ష్మి దయదప్పక నేటికి నార్యధారుణీ
భరణ కుతూహలస్ఫురణ భాసిలునో యననొప్పు హాలికా.
82
కడమొదలులేని నీదేహకష్టములకు
ప్రతిఫలంబగు సస్యసంపత్తి గాంచి
కవివి గాకున్న వాగ్మిత గలుగకున్న
ప్రణుతి వర్ణింపు మొకసారి భాగ్యగరిమ!
83
ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్‌ రాదు, శు
ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె, తీవ్రంబుగా
సోకెన్‌ సూర్యమయూఖతాప, మిఁక నేజోకన్‌ ఫలించున్‌ వరుల్‌
మాకీకష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్‌?
84
కఱకుగ నెండగాయ నిక గాసముతప్పె ననంగ నేల? భా
స్కర కిరణాళిలో గలదు సస్యసముద్ధరణైకశక్తి; త
త్కిరణము లబ్ధివారి పయికింగొని యావిరిరూపునన్‌, నంభో
తరమున మార్చు నీరద వితానముగాగ పునప్రవృష్టికిన్‌.
85
అల వర్షాగమలక్ష్మి రేఖ యన దివ్యానేక వర్ణంబులం
బొలుపుంబొందు నవాబ్దమాల యదిగో భూభృచ్ఛిరోలంకృతిం
దలపించుం గనుగొమ్మ, వాయునిహతిం దద్దేశముం బాసి కొం
గలబారుల్‌ వెనువెంట నంట శకలాకారంబులన్‌ వచ్చెడిన్‌.
86
బావికి నీటికైయరుగు పల్లెత లంబుధరంబు గాంచి య
ప్పా! వినువీథి హాలికులపాలిటి దైవమె యంబుదాకృతిన్‌
భావిఫలోదయప్రకటభావమునం జనుదెంచె నంచు మో
దావృత చిత్తలై సరసమాడుచు బోయెదరో కృషీవలా.
87
పొలమున కంచెగా మొలచి పువ్వులుపూచెడు కేతకంబు లు
జ్జ్వల కుసుమోపహారముల పత్రపుటంబుల నుంచి మారుతా
చలితకిసాలయోచ్చలన చాతురి బిల్చెడు, చేరబోయి త
త్కళిక పరిగ్రహించి కులకాంతకు కానుకయిమ్ము తమ్ముడా.
88
ప్రావృడంభోదలక్ష్మి యావాసమునకు
పాఱగట్టిన నవరత్న తోరణంబు
నాఁగ కోమల శబల వర్ణములతోడ
నింద్రచాపంబు శోభిల్లె నిదిగో చూడు.
89
వానతూనీగ లాకాశ పథమునందు
సరస ఝంకార రవములు సలుపుచుండె;
చల్లగాలికి నురుగప్ప లెల్ల మడుల
బెకబెక మటంచు గూసెడి వికటరుతుల.
90
తటములకు నాకసమున కంతరము లేక
నీలనీరదమాలలు వ్రేలుచుంట
నేలపై మిన్ను పడనీక నిలుపుచుండు
స్తంభము లనంగ గిరులు దృశ్యంబులయ్యె.
91
తపను డంబుదాచ్ఛాదన తతులలోన
మఱుగువడిపోవ గని నీలగిరుల చల్ల
దనము భువి నాక్రమించిన యనువుగాగ
వాయుమండల మీమిరి పట్టియుండె.
92
తెల్లపట్టు మస్లీనుల తెరలలోన
నాడుకొనుచుండు పసిపాప యరువు దోప
వానముత్యాలు గూర్చిన వలల తెరల
దినరమామణి మృదుకాంతి దిరుగుచుండె.
93
త్రావ నీరైన దొరకని తరుణమందు
నిమిషమాత్రాన దొరువులు నిండిపోయె!
నఖిల లోకాశ్రయుండు కృపామృతుండు
కన్నుదెఱచిన జరుగని కార్య మున్నె?
94
జల్లు పెల్లుడుగంగ పిల్లలు, తల్లులు - నిలువబట్టిన నింట నిలువబోక,
వాననీరుల వాఱు పల్లపు టిసుకల - కయ్యగా గట్టలు గట్టి చిన్న
నాగళులం బన్ని లేగదూడల గట్టి - దున్నుచు విత్తులు మన్ను గలిపి
పచ్చయాకులు చల్లి పైరుపట్టె నటంచు - కలుపు దీయుచు కోతకాల మనుచు
 
వరులు గోయుట నటియించి పనలుగట్టి - కుప్పవేయుటగా మన్నుకుప్ప వెట్టి
కడకు నేల చదునుగాగ గాల దున్ని - యాకలెత్తిన నిండ్లకు నరుగుచుంద్రు.
95
జడివానన్‌ వలిబడ్డ బక్క మొదవుల్‌ సంఘంబులై బీళులన్‌
విడియఱ్ఱాడుచు దొడ్డిజేర నవిగో వేగంబుగ న్వచ్చె; పె
ల్లడుసుల్వోవని మిట్టనేల పసి గొయ్యల్నాటి కట్టించి వెం
బడి వేయింపుముగడ్డిగాదములు చొప్పల్‌ బొందుపుల్దంటులన్‌.
96
తమ్ముడు కుఱ్ఱ, గోచయము దాటులువెట్టుచు క్రేపుదామెనం
గ్రమ్ముచు జిఱ్ఱకొట్టుచు పరస్పరముం దల డీలుకొంచు ము
న్గొమ్ముల జిమ్ముచుం దిరుగ గొట్టిన బట్టిన లొగ్గిరావు, సా
యమ్మొనరింపు మీయదన నాలమరల్పగ పల్పువెట్టగన్‌.
97
తడిసిన పచ్చికట్టియలు తంగెడు తప్పర తాటియాకులం
బడతుక ప్రొయ్యిలో దుఱిగి పై పొగలెత్తగ నూఁదుకాని కూ
డుడుకదు; కాకకుం బొగకు నుప్పతిలెం కడగంట బాష్పముల్‌;
తడయక యెండు రెమ్మలను తట్టెడుత్రుంచుమ చెట్టుచేమలన్‌.
98
మును వేసంగిని కుచ్చివిడ్డ పిడకల్‌ బొప్పర్లు బొళ్ళెంబులన్‌
వెనుకంబెట్టిన తాటిచుండ్లు బరికెల్‌ వెళ్ళించె నిన్నాళ్ళు; నిం
క నవాంబోధర మాలికా పిహిత దిగ్జాలంబులై వర్షపున్‌
దినముల్‌ డగ్గరె; కాంతబాసనము నేతీరొప్ప సాగించెడిన్‌.
99
పొలముల బీళులం దిరిగి ప్రొద్దెడగ్రుంకగ నిల్లుసేరి పా
పల నొడిచుట్టు బెట్టుకొని భార్యను నన్నము దెమ్మటంచు వే
పిలిచెద, వొంటికాపురము, పిల్లల గిల్లల బుజ్జగించుకో
వలసిన యాలిపాటు దలపం కరుణింప వదేల హాలికా.
100
ఉప్పుతో తొమ్మిది యున్న కాపురములు - సేయు గృహిణుల కేచిక్కు లేదు,
ఎవ్విలేకున్నను నిరుగు పొరుగు కులాం - గనలకు చేయొగ్గి గైకొనుటకు
నిష్టపడక, యున్నదే పెట్టి యక్కఱ - వాపుకొనెడు మానవతుల కెందు
లేమిడి సంసార మేమెయి పరువుతో - గడపంగ నిక్కట్లు గలుగుచుండు
నెన్ని కష్టములున్న నిట్లని పలుకక - పొసగినయంతకు బొదువుచేసి
 
మగనికి బిడ్డలకు బెట్టి మిగిలియున్న - యింత దా దిని భిక్షున కిడు పురంధ్రి
శాంతి నీతియు నురుకష్టసహనశక్తి - నెవరెఱుంగుదు రంతటి యింతి దక్క!
101
తల తాకటులువెట్టి ధనికుల దగ్గఱ - పన్నుకై గొన్న రూపాయలప్పు
కూలికి నాలికిం గూటికిం జాలక - నాముగా గొన్న ధాన్యంపుటప్పు
చిల్లర మల్లర చేబదులుగ దెచ్చి - యక్కఱ గడపిన యట్టి యప్పు
పండుగపర్వాల బందుల విందుకై - సామానుగొన్న బజారుటప్పు
 
వాయిదా మించవచ్చిన వడ్డియప్పు - పడతిసొమ్ముల కుదువకు బడ్డయప్పు
వేగ తీఱిచి స్వాతంత్ర్యవీథి యందు - సంచరింపుము నిశ్చింత సంతతంబు.
102
పవలు నడుచుబ్రొద్దు; తోవవిందు రేవేళ;
పవలు రేయి నడచు పాడువడ్డి!
అప్పుచేసి కుడుచు పప్పుకూళుల కన్న
కాసు ఋణములేని గంజి మేలు.
103
సంఘపరివర్తనంబులు జరుగుచున్న
రాజకీయ సంక్షోభంబు రగులుకొన్న,
విప్లవంబుల దేశమ్ము వీగుచున్న,
కృషి త్యజింపకు కర్షకా, కీడు గలుగు.
104
నవ్యపాశ్చాత్య సభ్యత నాగరకత
పల్లెలందు నస్పష్టరూపముల దాల్చి
కాలసమ్మానితములైన గ్రామపద్ధ
తులను విముఖత్వముం గొంత గలుగజేసె.
105
పంచాయతీసభా భవనంబులౌ రచ్చ - కొట్టంబు లొకమూల గూలిపోయె,
వీథిబడుల జెప్పు విజ్ఞానధుర్యులు - నొజ్జలు దాస్యంబు నూతగొనిరి,
గ్రామపరిశ్రమగలుగు నన్యోన్యమౌ - సహకారవృత్తంబు సమసిపోయె,
సత్యజీవనము, విశ్వాసమ్ము, భక్తియు - నైకమత్యము మున్నె యంతరించె
 
బూటకములు, కుయుక్తులు, మోసగతులు - కోర్టువ్యాజ్యాలు, ఫోర్జరీల్‌, కూటమైత్రి,
స్వార్థపరత, మౌఢ్యంబు, గర్వప్రవృత్తి - నేర్పు విద్యాలయంబులు నేటియూళ్ళు!
106
నేటి నాగరకత నీమేలు గోరక
యప్పుచేసి బ్రతుకుమని విధించు;
నాయవృద్ధికన్న నావశ్యకత పదార్థ
సంఖ్య హెచ్చ చిత్తశాంతి యున్నె?
107
జీవనస్పర్ధ సామాన్యచేష్టయైన
కాలమున వ్యక్తివాద మగ్రత వహించు
సత్త్వ విరహితు డన్యభోజ్యత నశించు;
నర్హజీవియె యంతరాయముల దాటు.
108
కాన, జీవనసంగ్రామ కార్యమందు
విజయి వగుటకు శౌర్యంబు విద్య బుద్ధి
సత్యసంధత యాత్మవిశ్వాస మనెడు
నాయుధంబుల విడువకు హాలికవర్య.
109
చాలు విజ్ఞానమతబోధ! సాంధ్యరాగ
కాంతి బండిన కేసరి కారుచేలు
స్వర్ణసైకత ఖనులుగా పరిణమించె
కనుల కాప్యాయనంబుగ గాంచుమోయి.
110
బారులుదీరి యంబరముపై చరియించెడు నీటికోళు లిం
పారగ సాంధ్యలక్ష్మి మెడయందు ధరించిన తారహార రే
ఖారమణీయతం జిలుక కాలువనీటికి నేగు కన్యకల్‌
వారక కొంతసేపు కనువాల్చక చూతురు విస్మయంబునన్‌.
111
గోపద ధూళి ధూసరిత గోపకుమారులు కాపుపిల్లలున్‌
మూపున కఱ్ఱలుం జలిదిబోనపు దుత్తలు, చంకలోన బె
న్మోపెడు దూడపల్పు లిడి మోహన వేణురవంబు సేయుచున్‌
మాపటివేళగా పసులమందలు దోల్కొనివచ్చి రిండ్లకున్‌.
112
స్వారిచేయు నిచ్చ భావంబు కలిగింప
బఱ్ఱె నెక్కి వచ్చు బాలు డొకడు;
వాని క్రిందద్రోయువఱకు బఱ్ఱెను బాది
సంతసించు రితరసఖులు నగుచు.
113
బడి విడిపించంగ బాలురు వీథుల - బరుగెత్తి యుప్పరపట్టెలాడ,
పంటచేలకు పనిపాటుల కేగిన - కర్షకు లిండ్లకు గదలుచుండ,
స్నానంబు లొనరించి సరసుల భూసురుల్‌ - భక్తిభావన సంధ్య వార్చుచుండ,
'సందాకవళమమ్మ సత్తెమేజయ'మని - యన్నార్థులగు భిక్షు లరుగుదేర
 
పక్షు లెల్లను గూళుల బట్టి చనగ - నచ్చతచ్చట తారక లవతరింప
మొలకచీకటి దిక్కులు మలినమయ్యె, - సంజ రాతిరి గర్భాన సమసిపోయె.
114
ఇంతకు రాడు కాంతుడని యింతి విచారముతోడ ద్వారబం
ధాంతరమందు నిల్చి కనులార్పక దారులు చూచుచుండ నీ
వంతగ నాలసింప దగవా? మగవారలయట్ల కాతర
స్వాంతలుగాక, కామిను లనాగతకష్టము లెంతురెప్పుడున్‌.
115
ఆయెను రచ్చలోని వ్యవహారము, లూరక పొల్లుమాటలం
బోయెను నర్ధరాత్ర, మికబొమ్ము గృహమ్మునుజేర, బిడ్డలున్‌
నాయన నాయనంచు కరుణమ్ముగ నేడ్చుచునున్నవారు, ము
న్నాయితపెట్టె స్నానమునకై నులివెచ్చని నీరు భార్యయున్‌.
116
లయవిభాతి.
చలువగల కప్పురము చిలికినటు చల్లనయి లలితకలధౌత మృదువిలసనము పోలెన్‌
మొలకలిడు వెన్నెలల చెలువము దిగంతముల కలముకొని తారకల తళుకులను గప్పం
గలువపొడి గందవొడి దొలక సుడి రేగుచును మెలగు నెలపయ్యరలు నలసత జరింపం
దలపున రసార్ద్రమగు వలపు లిగిరింప, దిన కలకల మడంచి నిశ గొలిపె ప్రమదంబున్‌.
117
స్నానమొనరించి, వెన్నెలచలువ బయల
బిడ్డలు న్నీవు నిల్లాలు ప్రీతి గుడిచి
పొడుపుకతలు, సమస్యలు, పూర్వచరిత
లంత వచియింపు వారలు సంతసింప.
118
శ్రమ, విషాదమ్ము, లాసలు, సర్వకాల
హృదయభేదక చింతలు నిదుర యనెడు
శాంతవారిధి లీనమై సమసిపోవ
విశ్రమింపుము, సైరికా, వేగువఱుకు.
119
AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - kRiShIvaluDu - kavikOkila duvvUri rAmireDDi ( telugu kAvyamulu andhra kAvyamulu)