కావ్యములు మధుకలశము రాయప్రోలు సుబ్బారావు

ఈ కావ్యము ఫారసీక భాషలో తొలుత రచింపబడెను. రచించిన మహాకవి పేరు ఉమర్‌ అని ప్రసిద్ధిలోనికి వచ్చెను. 11 వ శతాబ్దము ఉత్తరార్ధములో జననము. 1123లో అస్తమయము. కులవృత్తి గుడారములు తయారుచేయడము. అయినా ఉమరు ఉజ్జ్వల బుద్ధి, చదివి శాస్త్రములోను, గణితశాస్త్రమందును స్నాతకుడాయెను. ప్రామాణిక మయిన వర్ణగణితమును వ్రాసెను. జ్యోతిశ్శాస్త్ర సంబంధమయిన గ్రహచార నిర్ణయములు, గుణించి ప్రకటించెను. తత్త్వాన్వేషణ సాగించెను. అంతరములలో అప్పుడప్పుడు రచించిన పద్యములు ఖయ్యాము అనుపేర ప్రచారమునకు వచ్చెను.

వీనిని ఇంగ్లీషులో ఫిట్‌జిరాల్డు అను ఆంగ్లకవి అనువదించెను. ఆ అనువాదమూలముగా ఉమరు కావ్యప్రతీతియు, అందలి మూలసార చర్చయు బహుముఖముల ప్రసరించి, ఖ్యాతికి వచ్చినవి. దానికి అనువాదమిది.

ఖయ్యామును గుఱించి పూర్వాపరవాదములను తఱచి ఒక ఆంగ్లసారస్వతవేత్త ఇలాతేల్చి వ్రాసెను.

Its grim philosophy scarcely matters. The cynicism may be persistent; the mood may be a desperate sort of thing at the bottom of all thinking men's minds. But the tune is so gay that even its pessimism seems blithe. The quick but melodious turns of the poem tease us out of the thought. We may argue about the meaning, but we are indisputably compelled and even convinced by its music.

ఇందులో ఇమిడియున్న అబోధవేదాంతమును అలావుండనీ! ప్రసక్తమయ్యే నిర్వేదము పట్టువదలకపోనీ! ఇంకా - తత్త్వజిజ్ఞాసువుల కందఱికీ చిత్తవృత్తి అడుగున కదలుచుండే అవేక్షణ కూడా నిలవనీ!

అయినా - ఖయ్యాము పద్యాలలో పల్లవించే అనాసక్తరాగములో అనిర్వేదముకూడా చవులు తేరుతున్నది. రచనలో అనాలసంగా ప్రసరించే మధురభంగిమలు అందలి మీమాంసా భారమును బలవంతంగా ఆవలకు లాగివేస్తున్నవి.

ఇందున్న అర్థమేమిటని మనము వివాదపడవచ్చును; కాని కావ్యములోనున్న మాధుర్యము మనను నచ్చించకమానదు.


Dr. C.R. Reddy, Vice Chancellor, Andhra University,
Waltair, 16-8-1940.

I have been reading the Jubilee Edition of your works which you were so good as to present me at Hyderabad. They are a marvel of our literature, so fresh, powerful and impressive. Your contributions to Telugu will live - live long and charming, a perennial source of joy and inspiration. Keep up.

Waltair, 6-9-1940.

I forgot in my last letter to add a special word of praise on your translation of Omar Khayyam into Telugu. It reads well and reproduces the Fitgeraldian spirit in no small measure. Considering how difficult it is to translate a piece as cauched in symbols and allegorical language, you have done exceedingly well.


మధుకలశము
Awake! for Morning in the Bowl of Night
Has flung the Stone that puts the Stars to Flight:
And Lo! the Hunter of the East has caught
The Sultan’s Turret in a Noose of Light.
లెమ్ము! నిశాకమండలుతలిన్‌ పడగా విసరెన్‌ ప్రభాత మం
దమ్ములదిఙ్మణి\న్‌ చకితతారక లావల బాఱ, కాంతిసూ
త్రమ్ములయుచ్చు లొడ్డెను సుతారపు తూరుపువేటకాడు ర
మ్యమ్మగు పాదుషాకనకహర్మ్యశిఖాకలశాలిచుట్టునన్‌. 1
Dreaming when Dawn’s Left Hand was in the Sky,
I heard a Voice within the Tavern cry,
"Awake, my Little Ones, and fill the Cup
Before Life’s Liquor in its Cup be dry."
చదల నుషఃకుమారి చెయిచాయలు తోపగ కల్వరించుచు\న్‌
మెదలక యాలకించితి సమీపసురాభవనమ్మునం దిటుల్‌,
'నిదురలు మాని మేలుకొని నింపుడు పాత్రను చిన్నలార! త
త్సదమల జీవనార్ద్ర మధుధారలు ఎండకమున్నె బుంగలన్‌.' 2
And, as the Cock crew, those who stood before
The Tavern shouted - "Open them the Door!
You know how little while we have to stay,
And once departed, may return no more."
ఆమధుశాలముందట ప్రియాన నిలంబడి కోడి కూయగా
నీమెయి చప్పటుల్‌ చఱచి 'రెందుల కూరక ఆలసింత్రు రా
రేమి కవాటముల్‌ తెఱవ రేమి? ముహూర్తము మించిపోయిన\న్‌
రా మిక నెన్నియేండ్లకును, ప్రజ్వలితాసవ మెండు నింతలోన్‌.' 3
Now the New Year reviving old Desires,
The thoughtful Soul to Solitude retires,
Where the ‘White Hand of Moses’ on the Bough
Puts out, and Jesus from the Ground suspires.
ముదిసినముచ్చటల్‌ మఱల మోసలువోయ ఉగాదికోర్కి కా
స్పదమగు ఆత్మయున్‌ విజనవాటికకై విరమించు, అచ్చటన్‌
సదమలశాఖిశాఖల కనంబడు మోసెసుశ్వేతహస్త, మిం
పొదవగ భూమినుండి పయి కుబ్బెడి జీససు దైవికాంశయున్‌. 4
Iram indeed is gone with all its Rose,
And Jamshyd’s Sev’n-ring’d Cup where no one knows:
But still the Vine her ancient Ruby yields,
And still a Garden by the water blows.
పాదులతో గులాబిసుమబంధము లెండె ఇరానుతోట, జ
మ్షీదునృపాలకుండును శమించె త్రికాలఘటీసమేతుడై
పైదలి! నేటికిన్‌ మధువు పాఱెడు ద్రాక్షలు ప్రాతగిల్లినన్‌
స్వాదుపయఃప్రవాహముల పజ్జల పూచెడు తోట లిప్పుడున్‌. 5
And David’s Lips are lock’t; but in divine
High-piping Pehlevi, with "Wine! Wine! Wine!
Red Wine!" - the Nightingale cries to the Rose
That yellow Cheek of hers t’incarnadine.
తమసంగీతము లాపి మౌనమున గంధర్వుల్‌ కడంబోయి రే
కముగా నెప్పుడో! కాని బుల్బులి సుధాకంఠంబుతో గూయు తీ
యము లూరన్‌ 'మధువో! ప్రవాళమధువో!' యంచున్‌ గులాబీకపో
లములన్‌ పాండిమ విచ్చి క్రమ్మర జపాలావణ్య ముప్పొంగగన్‌. 6
Come, fill the Cup, and in the Fire of Spring
The Winter Garment of Repentance fling;
The Bird of Time has but a little way
To fly - and Lo! the Bird is on the Wing.
మఱుగు వసంతవహ్నినడుమంబడ నీయనుతాప శీతచీ
వరమును పాఱవేసి మధుపాత్రను నింపగ రమ్ము నెచ్చెలీ!
పఱచు వయశ్శకుంతరసవత్పథమో కడుకొమ్చె మున్న, దా
తురముగ విచ్చెడిన్‌ మెలపుతో తన కుచ్చులరెక్క లల్లదే. 7
And look - a thousand Blossoms with the Day
Woke - and a thousand scatter’d into Clay;
And this first Summer Month that brings the Rose
Shall take Jamshyd and Kaikobad away.
వేలకువేలు పూ జతలు వేకువతో వికసించు చూడుమీ
రాలెడు నేలపాలగుచు రాగిణి! ఇంకొక వేయిపూలు, రో
జాలను తెచ్చు నీశుభవసంతుడె యెత్తుకపోగలాడు ది
క్పాలసమానులౌ 'కయికొబాదును జంషిదు' రాజరత్నమున్‌. 8
But come with old Khayyam, and leave the Lot
Of Kaikobad and Kaikhosru fogot:
Let Rustum lay about him as he will,
Or Hatim Tai cry Supper - heed them not.
చెలి! మన కేమి కావలయు శీఘ్రము రమ్మిటు లీవు ముక్తదుః
ఖులయిన 'కైకొబాదు కయిఖుస్రుల' గాథలు కట్టిపెట్టి; మాం
సలరణరక్తి రుస్తుము భుజాలనె జొత్తిలుగాక, చల్దికై
కలగి 'హతీముతాయి' పడుగాక వెతల్‌, వినబోకు మింతయున్‌. 9
With me along some Strip of Herbage strown
That just divides the desert from the sown,
Where name of Slave and Sultan Scarce is known,
And pity Sultan Mahmud on his Throne.
అడవికి తోటకున్‌ నడుమ హద్దగు నీపొదరింటిపొంత నె
న్నడును నృపుండు సేవకు డనం జను భేదము సుంతయేని యే
ర్పడ, దపరంజిగద్దెపయి రాచరికంబులు సల్పుచున్‌ సుడిం
బడు సులతానుపట్ల అతివా, అనుకంప వెలార్త మిచ్చమై. 10
Here with a Loaf of Bread beneath the Bough,
A Flask of Wine, a Book of Verse - and Thou
Beside me singing in the Wilderness -
And Wilderness is paradise enow.
ఈసుమశాఖసందిట సఖీ రుచు లూరెడు వెన్నరొట్టెయున్‌
అసవపూర్ణ పాత్రికయు అందపుపాటల పుస్తకమ్ములు\న్‌
మోసలనుండి, నీ వడవిపొత్తుల నాడుచు పాడుకొంచు నా
తో సుఖముందువేని కలదో యిది స్వర్గము గాక యెక్కడో. 11
"How sweet is mortal Sovranty!" - think some;
Others - "How blest the Paradise to come!"
Ah, take the Cash in hand and waive the Rest;
Oh, the brave Music of a distant Drum.
మరిగిన యైహికేచ్ఛలభ్రమన్‌ పెనగొందుఱు కొంద, ఱెన్నడో
యొరగెడి స్వర్గభోగముల కోపిక నీడ్చెద రింక గొంద, ఱీ
తిరుగుడు లేటికో? అసలు తీసుక శేషము నంటబోకు, ఆ
తురపడి పర్వులెత్తెదవు దూరపుపాటల కెంతచిత్రమో! 12
Look to the Rose that blows about us - "Lo,
Laughing," she says "into the World I blow;
At once the silken Tassel of my Purse
Tear, and its Treasure on the Garden throw."
మన మొగసాల విచ్చు సుకుమారి గులాబిని చూడు మిట్లు ప
ల్కును సఖి! 'నవ్వుచున్‌ వసుధకుం జని త్రెంచెద నందు నాదు చ
క్కని వరహాలసంచుల మొగాల బిగించిన పట్టుత్రాళ్ళు, ప
చ్చని పువుతోటలోన వెదజల్లుదు నా యరణంపుభాగ్యముల్‌.' 13
The Worldly Hope men set their Hearts upon
Turns Ashes - or it prospers; and anon,
Like Snow upon the Desert’s dusty Face
Lighting a little Hour or two - is gone.
జను లతికాంక్షతో వలచు జంగమభోగము లొక్కవేళ పం
డిన తెగపండవచ్చు, అవనిన్‌ బడి యెండిన నెండవచ్చు, మో
హనశిశిర ప్రభాత సమయంబుల శుష్కవనీముఖస్థలిన్‌
మినుకుమెఱుంగు లీనవె నిమేషము రాలు తుషారబిందువుల్‌. 14
And those who husbanded the Golden Grain,
And those who flung it to the Winds like Rain,
Alike to no such aureate Earth are turn’d
As, buried once, Men want dug up again.
సన్నపసిండిసస్యమును సంతనచేసిన భాగ్యవంతు, లా
కన్నెకడానివిత్తనము గాలికి జల్లెడు భోగమూర్తులున్‌
మ న్నయిపోదు; రింతె తుది మాఱరు బంగరుధూళి గాగ, ఆ
సన్నులుగారుసూ ప్రజలూ సైతము వారల త్రవ్వి యెత్తగన్‌. 15
Think, in this battered Caravanserai
Whose Doorways are alternate Night and Day,
How Sultan after Sultan with his Pomp
Abode his Hour or two, and went his way.
రేలుపగల్‌ కవాటముల రెక్కలు గాగల ఈయెడారి స
త్రాలకు వచ్చుచుంద్రు సులతాను లొకం డెడలన్‌ మఱొక్క డాం
దోళిక లెక్కి; ప్రాభవముతో వసియింతురు రెండుమూడునా,
ళ్ళోలగ మాపి యంత నెటకో విరమింతురు, కంటె, నెచ్చెలీ! 16
They say the Lion and the Lizard keep
The Courts where Jamshyd gloried and drank deep;
And Bahram, that great Hunter - the wild Ass
Stamps o’er his Head, and he lies fast asleep.
'జముషిదు' శీధు వానుచు యశస్సఖినేలిన నేలలందు సిం
హములు సివంగులున్‌ సలుపు న్యాయసభాక్రమ మండ్రు నేడు, 'బై
రము' మృగయామదాంధుని శిరం బెట వ్రాలెనొ అయ్యెడన్‌ యథే
చ్ఛముగను త్రొక్కు గార్దభము; దాన చలింపడు నిద్ర నాతడున్‌. 17
I sometimes think that never blows so red
The Rose as where some buried Caesar bled;
That every Hyacinth the Garden wears
Dropt in its Lap from some once lovely Head.
కడు నరుణమ్ముగా నెచట కన్నెగులాబి హసించు నచ్చటన్‌
పడదగు మున్ను 'సీజరు' నృపాలుని రక్త మటంచు నెంతు, ఎ
క్కడ వికసించు దాసనలు గంపలు గంపలుగా వనాల న
క్కడ నొక అప్సరస్సఖి నిగారపువీడెము రాలియుండెడిన్‌. 18
And this delightful Herb whose tender Green
Fledges the river’s Lip on which we lean -
Ah, lean upon it lightly! for who knows
From what once Lovely Lip it springs unseen!
కలకలనవ్వు తేటసొనకౌగిట నూగుచు బాలపల్లవాం
గుళి బ్రతిమాలు ఈహరితకుంజలతన్‌ కదిలింప కంతగా;
కలికి! నఖక్షతిన్‌ మధువు గ్రక్కని యేచెలి కన్నెమోవి ఈ
చెలియలి తీవెకున్‌ మనసుచెల్లని ముచ్చట లప్పగించెనో. 1 9
Ah, my Beloved, fill the cup that clears
To-day of past Regrets and future Fears -
To-morrow? - Why, To-morrow I may be
Myself with Yesterday’s Sev’n Thousand Years.
గతదివసప్రపీడనయు గాఢభవిష్యదపోహభీతియున్‌
హత మొనరించు ఈ మధువు నందపుగిన్నియ నిండ నింపు; మీ
వితమున రేపురేపని తపిమ్చెద వుగ్మలి! యెన్ని 'రేపు' లీ
క్షితిపయి 'నిన్న' లందు కలిసెన్‌ గతకాలమయాబ్దరాశిలోన్‌. 20
Lo! some we loved, the loveliest and the best
That Time and Fate of all their Vintage prest,
Have drunk their Cup a Round or two before,
And one by one crept silently to Rest.
నయమతు లాప్తు లార్ద్రసుమనస్కులు నౌ మనమిత్రు లెంద రీ
ప్రియమగు తోటలో తమయదృష్టవశమ్మగు ద్రాక్షపండ్లు పిం
డి యొకటి రెండుగిన్నియలు నిండుగ త్రావి, విరామలాలసా
శ్రయు లయిరో సఖీ! ఒకరు జాఱగ నొక్కరు తోడుతోడుగన్‌. 21
And we, that now make merry in the Room
They left, and summer dresses in new Bloom
Ourselves must we beneath the Couch of Earth
Descend, ourselves to make a Couch - for whom?
కులికెడు క్రొత్తశోభనపుకోకలు తాలిచి గ్రీష్మదూతి; న
వ్వులతిరునాళ్ళలోన తనివోముగదే మన మిందు, ముందు రా
గిలిన ప్రియుల్‌ గతించిరి సఖీ! మన మేగమె యింక భూమిక్రిం
దల పవళించి ఎవ్వరికొ తల్పములౌదుముగామె యావలన్‌. 22
Ah, make the most of what we yet may spend,
Before we too into the Dust descend;
Dust into Dust, and under Dust, to lie,
Sans Wine, sans Song, sans Singer and - sans End!
మనమును మంటిక్రిందపడి మాయకపూర్వమె లబ్ధమైనదా
ని ననుభవింపజెల్లు తరుణీ! అటుపిమ్మట ధూళి ధూళితో
నెనసి యణంగిపోవు, మధు వెండును, పిమ్మట గానమాగు, గా
యనులును నిద్రవోదురు, లయశ్రుతులున్‌ చెవి కంద వాపయిన్‌. 23
Alike for those who for To-day prepare,
And those that after a To-morrow stare,
A Muezzin from the Tower of Darkness cries
"Fools! your Reward is neither Here nor There!"
వేడుక నేటిభుక్తికి లభించినదెల్ల వ్రయించు పుణ్యులున్‌,
పీడితు లయ్యు రే పనుభవింపగ దాచు నికృష్టులున్‌ వినం
బాడెడు చిత్రగుప్తుడు తమాలనికుంజమునుండి, 'ఏల యీ
యేడుపు మూర్ఖులార! ఫలియింపదు మీకృషి యిందునందునన్‌.' 24
Why, all the Saints and Sages who discuss’d
Of the Two Worlds so learnedly, are thrust
Like foolish Prophets forth; their Words to Scorn
Are scatter’d, and their Mouths are stopt with Dust.
ఇహపరలోకతర్కముల నెంతొ చలంపడి వేత్తలున్‌ గురూ
ద్వహులును పెక్కు రేగిరి, పదంపడి వారి భవిష్యదర్థసం
గ్రహమును త్రుప్పుపట్టె, సుడిగాలికి బోయె తదీయబోధనా
మహిమయు, దుమ్ముగొట్టికొని మాసెను వారిసమాధులున్‌ చెలీ! 25
Oh, come with old Khayyam, and leave the Wise
To talk; one thing is certain, that Life flies;
One thing is certain, and the Rest is Lies;
The Flower that once has blown for ever dies.
ఆవేదాంతుల శుష్కతర్కముల వ్యాఖ్యానింపగానిమ్ము, నీ
వీవృద్ధున్‌ సుఖవెట్ట రమ్ము సకియా! యేకాంతపున్‌ సేవ; ఏ
పూవుల్‌ విచ్చు శుభప్రభాతముల నాపూలన్నియున్‌ రాలు సం
ధ్యావేళన్‌, నిజ మిద్ది, తక్కినది మిథ్యావాద మింకేటికిన్‌. 26
Myself when young did eagerly frequent
Doctor and Saint, and heard great Argument
About it and about; but evermore
Came out by the same Door as in I went.
నేనును బాల్యమం దమితనిష్ఠమెయిన్‌ గురుపాదసన్నిధిన్‌
మానుగ నాలకించితి ప్రమాణములైన పరేంగితార్థముల్‌
కాని; నిజాన కెప్పుడును కన్నుల విప్పక బైట వచ్చితిన్‌
పూనిక వీడి లోపలికి పోయిన వాకిటనే సఖీమణీ! 27
With them the Seed of Wisdom did I sow,
And with my own hand laboured it to grow;
And this was all the Harvest that I reap’d -
" I came like Water, and like Wind I go."
వారలతోడ నేనును అవంధ్యములై తగు జ్ఞానబీజముల్‌
కారున చల్లి సొంతముగ కష్టముచేసితి, పండినట్టి అం
బార మిదేసుమీ సకియ! వచ్చితి అచ్చపునీరమట్లు, ఆ
కారములేని గాలివలె కన్పడ కేగుదు గుర్తు లాఱగన్‌. 28
Into this Universe, and why not knowing,
Nor whence, like Water willy-nilly flowing;
And out of it, as Wind along the Waste,
I know not whither willy-nilly blowing.
ఏమిపనో యెఱుంగక మహిం బడితిన్‌, ప్రవహించుచుంటి నే
భూముల నింకనో జలముపోల్కి ననిష్టమొ! యిష్టమో సఖీ!
ఈమధువాటికన్‌ విడిచి యేదెసకో సుడివోదు చౌటి ఱా
సీమల వీచుగాడుపులచే, మది నచ్చిన నచ్చకుండినన్‌. 2 9
What, without asking, hither hurried whence?
And, without asking, whither hurried hence!
Another and another Cup to drown
The Memory of this Impertinence!
ఇచటికి నన్ను త్రోయునపు డించుక కోరడు నాయభీష్ట, మిం
కెచటికొ యిందునుండి యెడయించెడునప్పుడు చెప్పబోడు; ఏ
ల చపలతర్క మిట్లు వగలంబడ; ఏమిటి కీప్రగల్భముల్‌,
రుచిగల శీధుపాత్రను మెఱుంగులవాతెఱ చేర్పుమీ సఖీ! 30
Up from Earth’s Centre through the Seventh Gate
I rose, and on the Throne of Saturn sate,
And many Knots unravell’d by the Road;
But not the Knot of Human Death and Fate.
ఇల నడిబొడ్డునుండి వడి 'నేడవవాకిట' బైటవచ్చితిన్‌
చెలగి 'శనైశ్చరుం' డధివసించెడుగద్దియ నెక్కితిన్‌, పథాం
చలమున పెక్కుముళ్ళు బిగి సళ్లగ విప్పితి; నైనగాని చి
క్కెడల దొకింత మృత్యువను ఈముడి మెల్కె లవెన్ని తీసినన్‌. 31
There was a Door to which I found no Key;
There was a Veil past which I could not see;
Some little Talk awhile of Me and Thee
There seem’d - and then no more of Thee and Me.
ఒకతలు పుండె! దానిగడె లూడ్చెడుబీగము కానరాదు, వే
ఱొకతెర యుండె! ఆవెనుక నున్నది చూడగలేకపోతి, ఇం
చుక వినినట్టులయ్యె నత సుంత 'నినున్‌ నను' గూర్చి ముచ్చటల్‌
సకి! యటుమీదటన్‌ మనప్రశంస రవంతయు పల్క రెవ్వరున్‌. 32
Then to the rolling Heav’n itself I cried,
Asking, "What Lamp had Destiny to guide
Her little Children stumbling in the Dark?"
And - "A blind understanding!" Heaven replied.
అంత తెగించి గోడివడు ఆకసముం గని 'చిమ్మచీకటిన్‌
సుంతయు దారి గన్పడక సోలుప్రజాలికి బాటసూప ఏ
కాంతులకాగడా కలదు కాలపుహస్తమునం' దటంచు 'వి
భ్రాంతుడ! అంధతుల్యమగు భక్తియె సు' మ్మని మాఱువాకొనెన్‌. 33
Then to this earthen Bowl did I adjourn
My Lip, the Secret Well of Life to learn;
And Lip to Lip it murmur’d - "While you live
Drink! for once dead you never shall return!"
ప్రణయిని! నే ననంతరము భౌతికభాండము డాసి గుప్తజీ
వనతటినీతటం బెఱుగువాంఛను వావిడి వేడికొంటి; నే
మనియనొ వింటివా 'బ్రతికినన్నిదినంబులు త్రావవోయి తీ
యనిమధువున్‌ గతించియును ఆవల వచ్చుట మిథ్య సుమ్మిలన్‌.' 34
I think the Vessel, that with fugitive
Articulation answer’d, once did live,
And merry-make; and the cold Lip 1 kiss’d
How many Kisses might it take - and give!
కలగి యెలుంగు తొట్రుపడగా బదులాడిన ఆ ఘట మ్మొక
ప్పుడు సుఖముండి వేడుకల బొంపిరివోవగ నోపునంచు నే
తలచెద నెచ్చెలీ! కళలు తగ్గిన తద్వదనమ్ముగూడ సొం
పొలయగ ఇచ్చి పుచ్చుకొనెనో మును పెన్ని మిటారిముద్దులన్‌. 35
For in the Market-place, one Dusk of day,
I watch’d the Potter thumping his wet Clay;
And with its all obliterated Tongue
It murmur’d - "Gently, Brother, gently, pray!"
ఒక దివసప్రదోషమున ఓపికతో కనిపట్టినాడ శ
క్తి కొలది నార్ద్రమృణ్మధనకృత్యము సల్పెడు కుంభకారునిన్‌;
సకియరొ! సన్నగిల్లిన విషాదరుతిన్‌ బ్రతిమాలె నాఘటం
బకట! 'కృపాపరుండవయి అన్నరొ! మెత్తగనొత్తు' మంచొగిన్‌. 36
Ah, fill the Cup :- what boots it to repeat
How time is slipping underneath our Feet:
Unborn To-morrow and dead Yesterday,
Why fret about them if To-day be sweet!
వృథ కథ చెప్పనేల కృశియించుచునున్నది ఆయువంచు, నీ
మధుకలశమ్ము నింపుము సుమంగలి! పుట్టని 'రేపు' కోసమై
శిథిలతగన్న 'నిన్న' కయి చింతలవంతల మున్గనేటికో!
మధురములేని 'నేడు' లనుమానము మాని సుఖింపు మర్థియై. 37
One Moment in Annihilation’s Waste,
One Moment, of the Well of Life to taste-
The Stars are setting and the Caravan
Starts for the Dawn of Nothing - Oh, Make haste!
ఒకనిముసాన జీవకళ లుచ్చిన పాడుశ్మశానవాటి, నిం
కొకనిముసాన జీవితపయోదధి పజ్జన నిల్తు మద్దిరా!
సకి! కనుమూసె తారకలు, సాగిరి యాత్రికులెల్ల, శూన్యరూ
పకమగు దిఙ్ముఖోదయముపై తమ లక్ష్యముపెట్టి వేగమే. 38
How long, how long, in infinite Pursuit
Of This and That endeavour and dispute?
Better be merry with the fruitful Grape
Than sadden after none, or bitter, Fruit.
ప్రమదరొ! 'నేతి నేతి' యని పారము కానగరాని ఈవివా
దముల నలంగు దెందనుక? ధారలుధారలుగా స్రవించు తి
య్యముగల ద్రాక్షతో పరవశాదరయోగము మేలుకాదొ, శూ
న్యమొ అటుగాక చేదొ అగు అందనిపండులకంటె నెప్పుడున్‌. 3 9
You know, my Friends, how long since in my House
For a new Marriage I did make Carouse:
Divorced old barren Reason from my Bed,
And took the Duaghter of the Vine to Spouse.
సహృదయులార! యెన్ని దివసంబులనుండియొ సల్పుచుంటి నా
గృహమున క్రొత్తపెండ్లి సవరించు ప్రయత్నము, లెట్టకేల కీ
విహసితవీథినుండి వెలిపెట్టి పురాతన సూత్రపాలికన్‌,
సహజ మధుప్రియన్‌ ప్రణయశయ్యకు రమ్మని ఆమతించితిన్‌. 40
For "Is" and "Is-Not" though with Rule and Line,
And "Up-And-Down" without, I could define,
I yet in all I only cared to know,
Was never deep in anything but - Wine.
సూత్రపదప్రమాణములు చూపగజాలుదు అస్తి నాస్తి వా
ద ప్రసరంబు త్రిప్పగ; పదంపడి లౌకిక పారలౌకిక
క్షేత్ర విచారనిర్ణయము సేయగ నోపుదు; కాని యీ సురా
పాత్రమునందు దక్క కనుపట్టవు లోతు లికెందు సృష్టిలోన్‌. 41
And lately, by the Tavern Door agape,
Came stealing through the Dusk an Angel Shape
Bearing a Vessel on his Shoulder; and
He bid me taste of it; and ‘twas-the Grape!
కడ కొక సందెచీకటిని, కాంచనభాండము నంసభాగమం
దిడి మెలమెల్ల కాలిడియె నేకత మీ మధుశాల వాకిటన్‌
పడతి యొకర్తె; ఆ కనకభాండరసాయన మెంతొ ప్రేమ యే
ర్పడ రుచిచూడుమం చొసగె, త్రావితి నే మధువయ్యె నద్దియున్‌. 42
The Grape that can with Logic absolute
The Two-and-Seventy jarring Sects confute;
The subtle Alchemist than in a Trice
Life’s leaden Metal into Gold transmute.
పొరుపుల నొండొరుల్‌ పడక పోరెడి డెబ్బది రెండు శాఖలన్‌,
మఱలిచె నేకదిగ్గతికి మా ఱనకుండ నిమేషమాత్రలో;
మెఱుగుపసిండిగా పరిణమింపగజేసెను లోకలోహ మ
బ్బురముగ నెచ్చెలీ! తలపవో మధుమంత్ర మహారహస్యముల్‌. 43
The mighty Mahmud, the victorious Lord,
That all the misbelieving and black Horde
Of Fears and Sorrows that infest the Soul
Scatters and Slays with his enchanted Sword.
ఆ బలవన్మహమ్మదు జయప్రభుశేఖరు మంత్రశస్త్ర ధా
రాబహుళప్రభల్‌ హృదయరాజ్యము ముట్టడివెట్టు నాస్తిక
క్లీబవిచారకాండము ఖిలీభవమంద వెలుంగు చూడు; గా
రాబుచెలీ! ప్రపంచమును ప్రామిన చీకటు లింక విచ్చెడిన్‌. 44
But leave the Wise to wrangle, and with me
The Quarrel of the Universe let be:
And, in some corner of the Hubbub coucht,
Make Game of that which makes as much of Thee.
ఉరివడనిమ్ము పండితుల నుగ్రవివాదల! నిల్వనిమ్ము నా
శిరసుననే విచిత్రమగు సృష్టివిచారము నెల్ల నో సఖీ!
పరిమళశయ్యపై ప్రణయభాగవతమ్ముల నాడుకొంచు నీ
మురిపెము సాగునన్నిదినముల్‌ సుఖియింపుము మోజు తీఱగన్‌. 45
For in and out, above, about, below,
‘Tis nothing but a Magic Shadow-show,
Play’d in a Box whose Candle is the Sun,
Round which we Phantom Figures come and go.
బయలను లోన ప్రక్కలను పైనను క్రిందనుగూడ, చూడ నం
తయు నొకయింద్రజాల మగునాటక; మాడుదు రొక్కవేదిపై
ప్రియముల కాగడాయగు రవి\న్‌ వలగొంచును; నీడలట్టు లెం
తయు నటు వచ్చిపోదుము సుతారపు బొమ్మలవంతునన్‌ సఖీ! 46
And if the Wine you drink, the Lip you press,
End in the Nothing all things end in - Yes -
Then fancy while Thou art, Thou art but what
Thou Shalt be - Nothing - Thou shalt not be less.
ప్రాణి జగాన కెల్ల పరమావధియౌ ఒక శూన్యమందె ఈ
శోణమరందమున్‌ తదభిచుంబనరక్తియు చిందు మోవియున్‌
లీనము లౌనయేని? గమనింపుము; కాగల కారణార్థమో
మానదు, వర్తమానపరిమాణము నాగదుగాదె నెచ్చెలీ! 47
While the Rose blows along the River Brink,
With old Khayyam the Ruby Vintage drink:
And when the Angel with his darker Draught
Draws up to Thee - take that, and do not Shrink.
సొనకుదరిన్‌ గులాబి సొగసున్‌ మిగులన్‌ వికసించుచుండ, ఎ
ఱ్ఱని మధుధార లానుచు కరంగుము ఖాయ్యముతోడ నీవు; న
ల్లని కలశంబుతో మరణలాసిక నిన్‌ దరియంగవచ్చెనే
ని నిలిచి జంకకుండ తరుణీ! కయికొ మ్మదియున్‌ ప్రియమ్ముగన్‌. 48
‘Tis all a Chequer-board of Nights and Days
Where Destiny with Men for Pieces plays:
Hither and thither moves, and mates, and slays,
And one by one back in the Closet lays.
ఒకచదరంగపాళి యిది యుగ్మలి! రంగులగళ్ళు రేల్బవల్‌;
సకలజగజ్జనంబులను సారెలుగా గొని కాలు డాడు; పా
చికలును కొంతసే పనుగుచెల్మి నటించి, ఒకింతలోన మా
రకులయి ఈవలావల పరస్పరమున్‌ తెగి పేటికం బడున్‌. 4 9
The Ball no Question makes of Ayes and Noes,
But Right or Left as strikes the player goes;
And He that toss’d thee down into the Field,
He knows about it all - He knows - He knows!
బదులిడ, దౌను కాదనుచు ప్రశ్నలువేయదు, ఆటకా డెటుల్‌
చదిమెడు నట్ల యేగు నపసవ్యమొ సవ్యమొ కందుకంబు; ఈ
చదరమునం దెవండు నిను జాగిల త్రోసెనొ యాత డొక్కడే
తదఖిలచాలనం బెఱుగు తన్వి; యెఱుంగును సర్వమాతడే. 50
The Moving Finger writes: and, having writ,
Moves on; nor all thy Piety nor Wit
Shall lure it back to cancel half a Line,
Nor all thy Tears wash out a Word of it.
పరిపరి వ్రాయుహస్త మది వ్రాసిన నావల బోవు, నీ చమ
త్కరణముగాని ధర్మరతిగాని మరల్పగలేదు దానిలో
నఱసగమేనియుం దుడుప! ఆ లిఖితంబున నొక్కముక్కయున్‌
చెఱగదు నీదు బాష్పములు చెర్వయి వాగయి వెల్లివోయినన్‌. 51
And that inverted Bowl we call The Sky,
Whereunder crawling coop’t we live and die,
Lift not thy hands to It for help - for It
Rolls impotently on as Thou or I.
ఆకసమంచు పేర్వడినయట్టి వితానముక్రింద కొన్నినా
ళ్లేకముగా సుఖించి శమియించెద మింతిరొ; చేతు లెత్తి య
ఱ్ఱాకట దానిసాయమునకై విలపింపకు, మస్వతంత్రమై
ప్రాకెడు నద్దియున్‌ నియతవర్తన నీవును నేనునుంబలెన్‌. 52
With Earth’s first Clay They did the Last Man’s knead,
And then of the Last Harvest Sow’d the Seed:
Yea, the first Morning of Creation wrote
What the Last Dawn of Reckoning shall read.
ఆది మృదండమున్‌ మెదిపి అంత్యమనుష్యశరీరపిండ ము
త్పాదనచేసి; రావల వెదల్‌ పడెబో కడసారిపంటకున్‌;
పైదలి! సృష్టిలో తొలిప్రభాతమె తద్గణితావసానకా
లోదయలబ్ధ శేషముల నూది లిఖించె యథాక్రమంబుగన్‌. 53
I Tell Thee this - when, starting from the Goal,
Over the shoulders of the flaming Foal
Of Heav’n Parwin and Mushtara they flung,
In my predestin’d Plot of Dust and Soul.
వినుము ప్రియంకరీ! మొదల బిందునిపాతముహూర్తమందె, ఈ
తనుతరదేహసహితమ్మగు మామకభాగ్యచక్ర క
ల్పనమును సంఘటించి, రల 'పచ్చగుఱాలదొరన్‌' ఛదించి పై
కొనెడు గురుగ్రహస్తబకకూటము, నేమిటి కీవివాదముల్‌. 54
The Vine had struck a Fibre; which about
If clings my Being - let the Sufi flout;
Of my Base Metal may be filed a Key,
That shall unlock the Door he howls without.
ఈ మధువల్లి నాటుకొనియెన్‌ సిగవిప్పుచు, దానికౌగిటన్‌
బ్రామెడు నామనోభ్రమరి; స్వామి శపించిననేమి? ఆత డే
ధామముముందు తారసిలు దానికవాటము తీయు బీగమున్‌
మామకదేహలోహమును మార్చి ఘటించిన చాలు నెచ్చెలీ! 55
And this I know; whether the one True Light,
Kindle to Love, or Wrath consume me quite,
One glimpse of It within the Tavern caught
Better than in the Temple lost outright.
ఎఱుగుదు నింతమాత్రము చెలీ! విను; చిత్కళ నన్ను ప్రేమగో
పురమున కెత్తినన్‌ - సెగలువోవు దురాగ్రహభుక్తి కిచ్చినన్‌ -
పరమమె; పానశాల గనబడ్డ కలాంశయొకండె కోవెలన్‌
సురిగి మసిన్‌ ముసుంగువడు జ్యోతులకంటె మహత్తరం బగున్‌. 56
O Thou, who didst Pitfall and with Gin
Beset the Road I was to wander in,
Thou wilt not with Predestination round
Enmesh me, and impute my Fall to Sin?
నడిచెడి నాదుత్రోవకెలనన్‌ పలుగుంటలు మాయదారులున్‌
సుడివడునట్టు లేర్పఱచి, సూక్ష్మపురాకృతసూత్రబంధముల్‌
పొడవుగ నన్నిదిక్కులను పూనిచి; ఆవల దారి తప్పి బి
ట్టడరిన 'నీదు పాప' మని యాడక యుందువుగాక దుర్విధీ! 57
O Thou, who Man of baser Earth didst make,
And who with Eden didst devise the Snake;
For all the Sin wherewith the Face of Man
Is blacken’d, Man’s Forgiveness give - and take
చేసితి వల్పమృత్పటలిచే మెఱుగారు మనుష్యకాయ, మా
పై సృజియించి తీ ప్రమదవాటికలో పెనుబాము నీవహో!
ఈసుమనుష్యపుణ్యముఖ మే బహుపాపభరమ్మునన్‌ కళల్‌
మాసెనో దానికెల్లను క్షమార్పణమే పరిహార మయ్యెడున్‌. 58
Listen again. One Evening at the Close
Of Ramazan, ere the better moon arose
In that old potter’s Shop I stood alone
With the clay Population round in Rows.
ఒకరమజాను తుట్టతుది నొత్తగుసందెల చందమామ లే
వక మునుమున్ను నేను నిలువంబడియుంటిని కుంభకారవా
టికకడ నేకతంబున; ఘటీఘటకష్టకుటుంబముల్‌ నియా
మకమయినట్టులుండె నెడమన్‌ కుడి పంక్తులుతీర్చి వింటివే. 5 9
And, strange to tell, among that Earthen Lot
Some could articulate, while others not:
And Suddenly one more impatient cried -
"Who is the Potter, pray, and who the Pot?"
చెలియరొ! చెప్పగా మిగులచిత్రము ఆఘటసంఘమందు మూ
గలు పలుమాటకారులును కానగవచ్చిరి నాకు; అంత తొ
ట్రిలి పెనుతత్తరంబున ఘటీమణియోర్తుక కేకపెట్టె 'నీ
యిల ఘటకుం డెవండొ? ఘటమెద్దియొ? తెల్పెదె' యంచునర్థిమై. 60
Then said another - "Surely not in vain
My Substance from the common Earth was ta’en
That He who subtly wrought me into Shape
Should stamp me back to common Earth again."
అంత మఱొక్క డిట్లనియె 'నక్కట! ఈకరపాతజాతసం
క్రాంతికి నాడు మృత్పటలకల్పన మూరక చేసియుండ; డీ
వింతసురూప మిచ్చినప్రవీణుడె నన్‌ మరలన్‌ తదాదివ
స్త్వంతరమందు చేర్చగ నుపాయముసైత మమర్చియుండెడిన్‌.' 61
Another said - "Why, ne’er a peevish Boy,
Would break the Bowl from which he drank in joy;
Shall He that made the Vessel in pure Love
And Fancy, In an after Rage destroy!"
అనవుడు పల్కె నింకొకతె 'యద్దిర! యెంతటి మచ్చరీడునున్‌
తన చవిదీర త్రావిన సుధాసుఖపాత్రిక చిట్లగొట్టునే?
పనివడ చేసె నీఘట మెవం డతిశుద్ధపుప్రేమ, నాత డా
కొను క్రుధ నావలన్‌ పగులగొట్టెడునం టది యెంతచిత్రమో!' 62
None answer’d this; but after Silence spake
A Vessel of a more ungainly Make:
"They sneer at me for leaning all awry;
What! did the Hand then of the Potter shake?"
మునుకొని పల్క రెవ్వ; రొకమూరుత మాగి, వికారరూప మం
దినఘట మొక్క డిట్లనియె దీనత 'అందఱు నా కురూప వం
చనదశ కీసడింతురు విచారముమాని, విధాతహస్త మే
మినెపమునన్‌ వణంకి విషమిమ్చెను నన్‌ సవరించుపట్టునన్‌.' 63
Said one - "Folks of a surly Tapster tell,
And daub his Visage with the Smoke of Hell;
They talk of some strict Testing of us - Pish!
He’s a Good Fellow, and ‘twill all be well."
కలడంతఃకరణంబులేని ప్రభు వొక్కం డందు; రేతద్దృగం
చలవీథిన్‌ వచియింత్రు దుర్నరకహింసాధూమధామంబుగా,
చెలి! ఈజీవితమున్‌ పైఇక్షయని వంచిం త్రంతె; ప్రేమార్ద్రు డా
తడు సౌఖ్యంబున బుట్టి సౌఖ్యమున నంతంబౌను సర్వం బిలన్‌. 64
Then said another with a long-drawn Sigh,
"My Clay with long oblivion is gone dry:
But, fill me with old familiar Juice,
Methinks I might recover by-and-by"
పిమ్మట నూర్పు పుచ్చి యొకవృద్ధఘటం బనె నిట్లు 'అస్మదం
గమ్ముల గంధ మెండె చిరకాలపువిస్మృతిచేత, నింపుమీ
క్రమ్మర నాపురాణరసకల్పముతో నను; మెల్లమెల్లగా
సొమ్ములువాసి ప్రాణములు జోడయి శోభిలనోపు త్రోవరీ!' 65
So while the Vessels one by one were speaking,
One spied the little Crescent all were seeking:
And then they jogg’d each other, "Brother! Brother!
Hark to the Porter’s Shoulder-knot a-creaking!"
అటు లాయాఘటముల్‌ పరస్పరవివాదాసక్తిమై నుండ ఒ
క్కటి చూచెన్‌ నెలబాలు డంతయు సమాకర్ణించుచున్నట్లు; అం
తట నన్యోన్యము రాచుకొం చఱచె తంద్రన్‌, తమ్ముడా! వాహకుం
డిటు లేతెంచెడు కాయకాచినబుజా లేడాటలాడించుచున్‌. 66
Ah, with the Grape my fading Life provide,
And wash my Body whence the Life has died,
And in a Winding-sheet of Vine-leaf wrapt,
So bury me by some sweet Garden-side.
వాడిన నాదుజీవమును పండినద్రాక్షరసంబు చల్లి కా
పాడుము, ప్రాణిలేని తనుబంధములన్‌ కడిగింపు; మావలన్‌
కాడలుసాగి దొప్పగిలు కమ్మనియాకుల జుట్టి యట్టులే
నీడలతోటపజ్జ శయనింపగచేయుము నన్ను నెచ్చెలీ! 67
That ev’n my buried Ashes such a Snare
Of Perfume shall fling up into the Air,
As not a True Believer passing by
But shall be overtaken unaware.
పంటవలంతిగర్భమున పాతిన నాతనుధూళిగూడ ది
ఙ్మంటపముల్‌ సుడింబడ సుగంధరజం బెగబోయజూతు, వా
వెంటన బోవు విశ్వసనవేత్తలలోపల నొక్కడేని వా
ల్గంటి! తదీయవాసనబలానకు ముగ్ధుడు కాకపోడుసూ, 68
Indeed, the Idols I have loved so long
Have done my Credit in Men’s Eye much wrong:
Have drowned my Honour in a shallow Cup,
And sold my Reputation for a Song.
ఇందనుకన్‌ వరించి భజియించిన జీవితసూత్ర లక్ష్యముల్‌
క్రిందువడంగ జేసెను సఖీ; నను లోకులదృష్టి; ముంచితిన్‌
సుందరకీర్తిపాత్రమును శూన్యసరస్సున, అమ్మినాడ స్వ
చ్ఛందకళావిభూతియును ఛాందసమౌ నొకగీతికే తుదిన్‌. 6 9
Indeed, indeed, Repentance oft before
I swore - but was I sober when I swore?
And then and then came Spring, and Rose-in-hand
My thread-bare Penitence apieces tore,
సకియా! పల్మరు బాసతింటి మును పశ్చాత్తాపతప్తుండనై
యకటా! మేల్కొనియుంటినో యపుడు? సత్యంబింతె; తోడ్తో మధూ
త్సుకు డేతెంచెగులాబి చేతగొని, నాసూత్రానుతాపాశయ
ప్రకరంబుల్‌ తునిగెన్‌ శతంబయి సహస్రంబై సమూలమ్ముగన్‌. 70
AND much as Wine has play’d the infidel,
And robb’d me of my Robe of Honour - well,
I often wonder what the Vintners buy
One half so precious as the Goods they sell.
బహుమతియైన నాబిరుదుపచ్చడ మాఱడి పుచ్చెనన్ను, ప్ర
త్యహము లభించుగా కభినయంబున పాపపుపాత్ర యీమధు
ప్రహసనమందు నాకు వరవర్ణిని! అమ్మెడుదానికంటె నే
మహితపదార్థ మీ క్రయికమండలి విల్చెదరో వచించెదే. 71
ALAS, that Spring should vanish with the Rose!
That Youth’s sweet-scented Manuscript should close!
The Nightingale that in the Branches sang,
Ah, whence, and whither flown again, who knows?
కటకట! ఈ గులాబికళికల్‌ వసివాడ వసంతమేగు; ము
చ్చటయగు నీవయఃసురభిసంహితయున్‌ ముగియున్‌ శుభాంగి; పి
మ్మత నెపు? డెట్టు లెచ్చటికి? మళ్ళునొ చెప్పెదవే రసాలని
ష్కుటముల పాడు నీకలికికోకిల; దాని నెవం డెఱుంగునో? 72
AH, Love! could thou and I with Fate conspire
To grasp this sorry Scheme of Things entire,
Would not we shatter it to bits - and then
Re-mould it nearer to the Heart’s Desire!
వెలదీ! నీవును నేనునున్‌ గలసి అన్వేషింపగా నేర్తుమే
ఇల నాద్యంతవిమర్శదూరమగు నీసృష్ట్యంతరవ్యూహమున్‌;
తలమైనన్‌ తెగగొట్టి తున్కలుగ సంధానింపమే! దీనిసొం
పెలయన్‌ గ్రమ్మఱ నస్మదీయహృదయాభీష్టానుసరంబుగన్‌. 73
AH, Moon of my Delight who know’st no wane,
The Moon of Heav’n is rising once again:
How oft hereafter rising shall she look
Through this same Garden after me - in vain!
మనకై చూచుచునున్నవా డదియె రమ్యస్వర్గచంద్రుండు, కా
మిని! ఈ తైజసికాంతరాళ తరళోర్మి ద్వారమార్గమ్మునన్‌,
తనరారాకల నింక ముందు నను గానన్‌లేక యీ పుష్పపుం
జనికుంజమ్ముల నాత డెంతటి నిరాశాఖేదమున్‌ పొందునో. 74
AND when Thyself with shining Foot shalt pass
Among the Guests Star-scattered on the Grass,
And in thy joyous Errand reach the Spot
Where I made one-turn down empty Glass!
పఱచినచుక్కల ట్లతిథివర్గము పచ్చికపై సుఖింపగా,
మెఱుగుపసిండికా ల్గదిపి నీవును పోయెడువేల, వేడుకల్‌
విరిసిన శూన్యపాత్ర దొరలించితి నేనెట; నా ప్రదేశమున్‌
దరిసెద వాత్మస్వాంత్వనవిధాయకయాత్ర ముగించుచున్‌ సఖీ! 75
TAMAM SHUD
సమాప్తము.
AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - madhukalasamu - rAyaprOlu subbArAvu - Madhukalashamu - Rayaprolu Subba Rao( telugu kAvyamulu andhra kAvyamulu)