| కావ్యములు | పానశాల (ఉమర్ ఖయ్యాం) |
'కవికోకిల' దువ్వూరి రామిరెడ్డి |
| ఖయ్యాము ప్రశంస |
|
ఓయీ! ఉమ్రఖయామ, నీవు చని యెన్నో యేండ్లుపూండ్లాయె; లే ప్రాయంపుం జెలి సాఖియు\న్ ధరణిగర్భంబందు నిద్రించె; గు ర్తే యౌపట్టక నీ నిషాపురము జీర్ణించెం గదా! నీదు గో రీయైన\న్ సడలు\న్; రుబాయతొకటే స్మృత్యంకమై నిల్చెడు\న్. |
|
పంచాంగంబును సంస్కరించు గణితప్రావీణ్యమున్న\న్ సలా మంచు\న్ సంజరు షాహి ప్రీతిమెయి నీ కర్ధాసనం బిచ్చి మ న్నించంగల్గియు, గ్రీకుశాస్త్రముల పాండిత్యంబు నార్జించియుం గాంచంగల్గుదె నేఁటికీర్తి కవివే గాకుండిన\న్ ఖయ్యమా? |
|
ఎందఱులేరు జోస్యులు? మఱెందరు నీవలె హేతువాదులై మ్రందిరి? వారి పుట్టువుల మాటయె లోక మెఱుంగఁబోదు; నీ నందనవాటిక\న్ గఱికనట్టులఁ బూఁబొదరిండ్లనీడ మా కందఱకు\న్ రసార్ద్రకవితాసవమిచ్చితి వాసదీఱఁగ\న్. |
|
నీతత్త్వంబులు మాకుఁ బూజ్యములు కానీ, కాకపోనీ, మఱే మీ, తత్త్వాలకు నేమిగాని, మధురస్మేరాస్యయౌ సాఖి దృ క్పాతం బైహిక జీవితార్తి పరితప్తస్వాంతులౌ వారికిం జేతఃప్రీతినొసంగు; మాకదియె యాశీర్వాద మిప్పట్టున\న్. |
|
బ్రతుకు టెడారిలో నిసుకబాటలఁ ద్రిమ్మరి నీరువట్టి దుః స్థితి మరణింపనున్న యొక జీవి కదృష్టపువాఁగువోలె సం తతముఁ ద్వదీయ దివ్య కవితారస నిర్ఝరిణీ ప్రపాత మ ద్భుతముగ చిత్తతాపమును బోనడచు\న్ శిశిరాంబుసేచన\న్. |
|
తెలుఁగుందోఁటలఁ బచ్చబీళ్ళ ననురక్తిం బానశాలాప్రతి ష్ఠలు గావించి త్వదీయకావ్యరసభాండంబుల్ గులాబీలు బు ల్బులిపిట్టల్ మధుపానపాత్రికలు సొంపుల్ గుల్కు సాఖీయు భూ తలనాకం బొనరింప నిల్పి రసికాంధ్రప్రీతి గావించితి\న్. |
|
పారసికన్న శ్రావ్యమయి పల్లవకోమలమై సుధారసం బూరెడు మా తెనుంగునుడి నొప్పిదమౌనటు నీదు భావముల్ ఏరిచి చేర్చికూరిచితి నింపగుకావ్యము నోఖయామ, నీ పేరిఁక యావదాంధ్రపృథివీస్థలి శాశ్వతమై తనర్చుత\న్! |
|
అలరెడు నాణిముత్యముల యాశ్రయగౌరవ మొందిసూత్రముల్ గులుకుమిటారి జవ్వనపు గుబ్బల నాట్యములాడుఁ గాదె యే కలిమియు లేకయుండియును, ఖయ్యమ, నీ మృదుముగ్ధభావమం జులత సమాశ్రయించు కృతి సొంపిలదే రసికార్చనీయమై. |
|
తెలతెలవాఱ, సంజకడఁ, దెమ్మెర కమ్మగవిచ్చు పూల తా వులఁ బువుఱేకుల\న్ విసరిపోయుత నీదు సమాధిపైని; బు ల్బులులు గులాబిపూఁబొదలలోఁ జిరకాలము నీదు కీర్తి నిం పొలయ నుతించుఁగాక! సెలవోయి ఖయామ, సలాము, వచ్చెద\న్. |
|
యౌవనారంభమున మధురానురాగ బద్ధహృదయయై పదునొండువత్సరముల పాటు నాకష్టసుఖములఁ బంచికొన్న సతికి స్మరణీయ కిడితి నీ కృతినివాళి. |
| పానశాల | |
|
లెమ్మోయీ మదిరాతపస్వి, దిశలాలేఖ్యంబుగా మాఱెఁ; బా త్రమ్ము\న్ నింపుము గోస్తనీరసమున\న్ రాగోదయశ్రీలు పైఁ గ్రమ్మ\న్ జీవితభాజనంబు పరిపూర్ణంబౌటకు\న్ మున్నె; కా లమ్మౌనన్న రవంబు వింటి మధుశాల\న్ మొన్న లేఁబ్రొద్దున\న్. | 1 |
|
అరుణుఁడు యామినీవిభవమంతయు గెల్చి జయాంకమట్లు క ర్బుర రమణీయ కేతనముఁ బూర్వదిశం బయికెత్తె లెమ్ము; ని ద్దురవిడి తమ్మిపూవులటు తొంగలిఱెప్పల నెత్తిచూడు; నీ వెఱుఁగవొతొయ్యలీ చిరము నియ్యిలఁగన్నులుమూయు కట్టడ\న్. | 2 |
|
పారదమట్లు జీవితము పట్టిన నిల్వదు; శీఘ్రగామి; ద్రా క్షారస మిమ్ము, తాపమునఁ గందెను చిత్తము; జాగరూక సం చారము నిద్రదౌలతు వశంబయి రూపఱు; యౌవనంపుటం గారము నీటఁ జల్లవడు; గన్నుల నెత్తుము, లెమ్ము నెచ్చెలీ. | 3 |
|
పొలములపూలగాలి వలపుల్ కలఁబోయుచువీచె; గాజు గి న్నెలఁ జిఱుచేదుపానకమునింపుము; నశ్వరమైన ఈస్థితిం, దెలియుమ యీక్షణం బెరవుదెచ్చిన సొమ్మని; జాఱఁబుచ్చినం గలికి, మఱెప్పుడిట్టితఱి క్రమ్మఱరాదు; నిజమ్ము; నమ్ముమా! | 4 |
|
కనుగొమ్మా నినుబోలె రాగవతియై కాంతిల్లెఁ పూర్వాశ, మో మున నీలాలక రేఖలొత్తుచు, నిశాభుక్తావశేషాసవం బును సీసాలకు నింపి యొక్కసరకంబు\న్ ముంచియందిమ్ము; ద క్కని యారేపటి మాటలేటి కనుభోగ్యంబైన నేఁడుండఁగ\న్. | 5 |
|
తరుణార్కుండు సువర్ణవాగురులచేతం బాదుషాహా దివం భర హర్మ్యోపరి గర్భగోళ శిఖరవ్రాతంబు బంధించె; వా సర కైఖుస్రువు రక్తిమాసవము నాశాపాత్రఁ బూరించె; ని త్తఱి ఘోషించె మునాదియెల్లరకుఁ బ్రాతఃపానగూఢార్థముల్. | 6 |
|
విరియు గులాబిపూలు తన ప్రేయసులౌట మొగంబు లన్యులె వ్వరుఁ గనరంచుఁ జిన్కు వలిపంపు ముసుంగుల దాచె మేఘుఁ; డా విరిగొను కెంపుపానకము వేగమ గిన్నెలనింపు; జీవితాం బరమున నొక్కతార గనుమూసెను లెమ్మనికూయుఁ బల్గులు\న్. | 7 |
|
చేవల్ చచ్చిన కోరికల్ మరల నుజ్జీవింప నవ్యాబ్దశో భావాల్లభ్యము వచ్చె; భోగులకు సేవ్యంబయ్యెఁ గుల్యాజల స్రావంబుల్ వను; లొత్తెఁ గొమ్మలను మూసాశ్వేతహస్తప్రభల్; ఈ విశ్వంభర క్రీస్తుమార్పులఁ బునర్జృంభించె నాఁ గాంతిలు\న్. | 8 |
|
చెలియ, గులాబిమోముపయిఁ జిందె నుగాదిహిమాంబుశీకరం బులు; ప్రమదాంఘ్రి చిహ్నములు పొల్చె హృదంతర శాద్వలంబునం; దలఁచెదవేల నిన్నటివెతల్; మఱి నేఁడు ముదంబుగూర్ప, ర మ్మెలమిని బచ్చబైల సెలయేటితటాలఁ బచారు సేయగ\న్. | 9 |
|
ఎఱుఁగవె కాలవల్లి మనయిద్దఱి మృత్యువు లల్లుఁగొయ్యగాఁ బెరుగు; గుడారమౌను మనవేడ్కకు నీభువనంబు; జంటగాఁ గరముల వారుణీభరిత కాంచనపాత్రిక లందికొన్న న ద్దిర! మనచేతఁ జిక్కువడదే చిరకాలపుసత్య మంగనా! | 10 |
|
చెలులను బంధుల\న్ మధుర శీధువు నామనితోఁట వీడి యూ హలు నెగఁబ్రాకఁజాలని రహస్యపుఁ జోటికిఁ బోదువీవు; నేఁ బలికెదఁ దెల్పరాని యొకభావము; సంధ్యలఁ దూలి రాలు పూ వులు కృశియించుఁగాని విరఁబూయవుక్రమ్మఱ; నమ్ముమో సఖీ! | 11 |
|
కాల మహర్నిశంబనెడు కత్తెరతో భవ దాయురంబర శ్రీల హరించు; మోముపయిఁజిల్కును దుమ్ముదుమార; మేలొకో జాలిపడంగ? నీక్షణము సంతసమందుము; నీవువోదు; వీ రేలుఁ బవళ్లు మున్నటు చరించు నిరంతర మండలాకృతి\న్. | 12 |
|
ఆమని లేఁతమబ్బులు ప్రియంబుగ రాగవతీకపోలముల్ తేమగిలంగఁ దుంపురిలు తియ్యనివేళల లేచిరమ్ము చా నా, మధురాసవంబుఁ దమినానఁగ; నేఁడు విహారభూమి శో భామయమైన యీగఱిక పచ్చగిలుంగద రేపు నీపయి\న్! | 13 |
|
అల బహరాముగోరి మధువానిన సుందర భోగమందిరం బుల మృగరాజు నేఁడు భయమున్విడి క్రుమ్మరు; జంబుకంబు పి ల్లలఁగను; వన్యరాసభముల\న్ మృగయారతిఁ బట్టినట్టి భూ తలపతి గోరి పట్టువడెఁ దానొకగోరి, నెఱుంగుదే చెలీ! | 14 |
|
అయయో! యెందఱి మానవోత్తముల కంఠాంకూరముల్ ద్రుంచె ని ర్దయమౌకాలము; యౌవనంబు, తనుసౌందర్యంబు లావణ్య, మ వ్యయమై నిల్చునె? యెన్ని యెన్ని కసుగాయల్ రాలె నీనేల; నా రయలేదో విరఁబూయకే యురలి వ్యర్థంబైన లేమొగ్గల\న్. | 15 |
|
నీవూ నేనును తారతమ్య మిహమందేగాని భూగర్భ ర త్నావాసంబున లేదు; దుర్జనుఁడు పుణ్యాత్ముండు భిక్షార్థియు\న్ శ్రీవాల్లభ్య ధురంధరుండు నొకటే శ్రేణి\న్ సుఖాసీనులై యావిందు\న్ భుజియింతు; రంతఁ గనలేమా మృత్తిక\న్ భేదముల్. | 16 |
|
కాలిడినంత గ్రుచ్చుకొనుకంటకముల్ ప్రియురాలిమోమున\న్ వ్రేలిన ముద్దుముంగురులొ! బిత్తరికన్బొమ లౌనొయేమొ! రా జాలయ భగ్నగోళశిఖరావళిఁ గన్నుల గట్టు నిష్టకా మాలలు పూర్వభూభుజుల మస్తములౌనొ! వజీరు వ్రేళులో! | 17 |
|
జలజల మంజులార్భటుల జాల్కొను నీ సెలయేటికోవల\న్ మొలచిన లేతపచ్చికల మోటుగఁ గాలిడఁబోకు, దేవదూ తల రుచిరాధర ప్రకృతిఁ దాల్చెనొ! సుందర మందగామినీ లలిత శరీరమృత్కణములం జిగిరించెనొ యేమొ కోమలీ! | 18 |
|
పొలమున నేత్రపర్వముగఁ బూచిన రాగవతీ సుమంబు శో భల విలసిల్లెఁ బూర్వనరపాలుర రక్తకణాలనుండి; యే చెలియ నిగారపుం దళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చపై వెలసెనో నీలకాంత కనువిందొనరించును బూలరెమ్మల\న్. | 19 |
|
గతము గతంబె, యెన్నటికి కన్నులఁగట్టదు; సంశయాంధ సం వృతము భవిష్యదర్థము; వివేకవతీ, యొక వర్తమానమే సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్ము విషాదపాత్ర కీ మతమునఁ దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రిక\న్. | 20 |
|
పాఱెడువాఁగు నీరమటు, పైఁబయి వీఁచు నెడారిగాలి నా జాఱె మఱొక్కరోజు వరుస\న్ మనయిద్దఱి జీవితంబుల\న్; ఊరుపు మేననుండువఱ కుమ్మలికంగొన, రూపహీనమై యారయరాని 'రేపు' నకు, నంతమునొందిన 'నిన్న' కు\న్ సఖీ. | 21 |
|
పరిశుష్కంబగు జీవనంబు రస సంపన్నంబు గావించు ని ర్జర పానీయము వారుణీరసముఁ బాత్రన్నింపి యందిమ్మ యా తురదీఱం జవిగొందు; జీవితము వాతూలంబులో దివ్వె! చె చ్చెఱఁ గానిమ్ము; గతించుఁబ్రాయమదిగో శీఘ్రంబుగం బ్రేయసీ. | 22 |
|
సమశీతోష్ణత హాయినించె; సుఖసంస్పర్శంబుగ\న్ గంధవా హము వీతెంచె; గులాబితోఁటపయి సాయంకాలచిత్రాబ్జముల్ ప్రమదాశ్రుల్ చిలికించె; బుల్బులియు 'నీరక్తాస్యముల్ ద్రాక్షసా రమునం గెంపిలఁ జేయుఁ' డంచుఁ జవులూరంబల్కె రోజాలకు\న్. | 23 |
|
నలుదిక్కుల్ కమనీయచంద్రికల సుస్నాతంబులై దోఁచెఁ; జి త్తలతాంతంబును బూచె; ద్రాక్షరసపాత్రం జేతికందిమ్మ యో లలనా, వింటిని కాలసూక్తి; ఫలమెల్లంగాల్చు నిర్ఘాతచం చలయౌ మృత్యువు ధాన్యశాలకిపుడే సంధించె నంగారము\న్. | 24 |
|
ఈమధుమాసశర్వరుల నిందుశిలా రమణీయవేదిఁ గాం తామణిఁ గూడి రాగవతినా వహియింపుము పానపాత్ర నా రామమునందు; నీ వెఱుఁగరాక లయింతు; వనాదికాల హిం సా మలినప్రవృత్తి మధుసారమునం గడుగంగఁ జెల్లదే? | 25 |
|
జిలిబిలి కమ్మగప్పురపుఁ జిన్నెల వెన్నెలగుత్తి తావులం జిలుకుచుఁ జైత్రయామవతి చీరచెఱంగునఁ బూఁతపూచె; నె చ్చెలి, యిటువంటికాలమిఁకఁ జిక్కదు; భోగ్యము మద్య; మెన్ని ల క్షల సమ లీనిశాప్రియుఁడు కాంతిలునో మన గోరిమిట్టల\న్. | 26 |
|
జీవితసార్థవాహము విచిత్రగతిం బయనించు, నందులో నీ వొకఱెప్పపాటయిన నెయ్యురతో సుఖముందువేని మో దావహ మంతకన్నఁ గలదా? మధుపాత్రిక నందియిమ్ము సా ఖీ, వివరించెదేల తిలకింపని రేపును? రేయి జాఱెడి\న్. | 27 |
|
యామినినొక్కపాత్ర మధువానెద; రెంటను భాగ్యవంతుఁడ\న్ నామతము\న్ వివేకమును నాలుగిట\న్ విడియాకులిత్తు; నా పై మది యుండిలేదను తపస్వి యవస్థ మునింగితేలి ద్రా క్షామణి ముద్దుకూఁతురిని శయ్యకుఁ దార్చెద లేఁతవెన్నెల\న్. | 28 |
|
మనమునఁ దెల్వియున్నపుడు మాటువడుంబ్రమదంబు; మే నెఱుం గనియటు కైపుసేయఁ దుదిఁ గాంచువివేకము; వీనిరెంటి మ ధ్యను చెలువౌ నవస్థయె సుఖాస్పదజీవిత; మట్టి జీవితం బునకు గులామునై వెడలఁబుత్తు దినాలు ఖులాసగా సఖీ. | 29 |
|
ప్రతిదినముం దలంచెదను రాత్రులయం దనుతాపమొంద; సం తత మధుపాన భోగపరత\న్ మఱునాఁటికి మార్చికొందు; నీ వితముగ కొన్నినాళ్ళు కడవెళ్ళ వసంతమువచ్చె నిప్పు డా తత సుమనోభరంబుఁ దలఁదాలిచి; నే వగపిల్లు టెట్లొకో! | 30 |
|
తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూఱేకుల\న్ జాఱె\న్ సన్నని మంచుతుంపురులు; వాసంతోదయశ్రీకిఁ గం తారత్నం బనువైన నెచ్చెలిగ నుద్యానంబునం దోఁచె మి త్రా, రారమ్ము సుఖింపు, మీయదను వ్యర్థంబైన రాదెన్నడు\న్. | 31 |
|
విరులును పచ్చపూరి కనువిందొనరించి ముదంబుఁ గూర్చు ని త్తఱిఁ, బరికింపు మందమును; తప్పక యింకొక నాలుగైదు వా సరముల మంటిలోఁగలయు, సాఖి, సుమంబులఁ గోసికొమ్ము; బం గరు సరకంబున\న్ మదిరఁ గమ్మగ నానుము నిర్విచారత\న్. | 32 |
|
విరహ రహస్యవేదనలు వీడుఁ దమంతన రేపోమాపొ; ని\న్ మఱవ దదృష్ట రేఖ; మధుమాసము; కాలముగూడివచ్చె; సుం దరి హృదయానుసారిణి వనంబున నీకయి వేచియుండ నీ తరుణమున\న్ సుఖింపక వృథా పరచింతనలేల మర్త్యుఁడా? | 33 |
|
మన ప్రియజీవితంబు కుసుమంబుల పోలికఁ జంచలంబుగా వునఁ బువులట్లు కాలమును బుత్తము నవ్వుల నాటపాటల\న్; గొనగొనఁబాఱు కాలువలకోవలఁ దియ్యని పానమాని జీ వన భరణప్రయాస మొకప్రక్కకు రువ్వుదమోసి ప్రేయసీ. | 34 |
|
కమ్మని పిల్ల తెమ్మెరల కౌగిళులం బులకించి వాసనల్ చిమ్ము గులాబి; బుల్బులి హసించుసుమంబుల రామణీయకం బిమ్ముగఁ గ్రోలి మైమఱచు; నేలవిలంబము? పాత్రనింప రా రమ్ము లతాంగి, యిద్దఱము రాలకపూర్వమె పూలపోలిక\న్. | 35 |
|
ముదిరిన కెంపువన్నె మధుపూరము దప్ప మఱేమిగాని యీ యదనున నంటబోఁకుడని హాయిగ బుల్బులిపాడుఁ; బూఁబొదల్ మృదుల సుమాధరంబులను మెల్లగ విచ్చి వచించు 'రండి, మా సదనములందు విందులయి సంతసమొందుడు మూడునా'ళ్ళన\న్. | 36 |
|
వలపుఁ బొలంతి, యీప్రకృతి వన్యపథంబులఁ బూలపండువుం జలుప నుపక్రమించె; విరసంబగు శుష్క విరక్తిమార్గముల్ పలుకకు; మూఁడునాళ్ళ మురిపంబుగదా మనజీవితంబు; పా యలువడి పాఱు నిర్ఝరమునంటిన పూఁబొదరిండ్లఁ జూచితే! | 37 |
|
అసవపూర్ణమౌ కలశ, మామిషఖండము, వెన్నరొట్టె, ది వ్యాసమరూప యౌవనగుణాలయ వీణియ మీటుచు\న్ దినా యాసముఁ దీర్ప నిర్జనవనాంతర సీమల నబ్బెనేని వ హ్వా! సులతాను భోగవిభవంబులఁ గోరెడిమూఢుఁడుండునే! | 38 |
|
పచ్చబయళ్ళు, నేటిదరిపట్టులు, నొక్కక్షణంబు శ్రాంతియు\న్ అచ్చరవంటి నెచ్చెలి, రసాంకితకావ్యముఁ గెంపుపానకం బిచ్చగ నామని\న్ దొరకెనేని మసీదులు గుళ్ళ దాస్యము\న్ మెచ్చక ముక్తులై సుఖముమీఱఁ జరింతురు జాగరూకులు\న్. | 39 |
|
తలఁప\న్ లౌకిక కార్యకల్పనల గంతవ్యంబు శూన్యత్వ; మీ వు లయంబొందినట్లెయౌదు; వసువుల్ వోనాటకు\న్ మున్నె మం జుల వల్లీనిలయంబులం జెలుల మోజుల్ దీర్చి ఖయ్యాయ, త ల్లలనామండల భుక్తశేష రసము\న్ ధన్యుండవై గ్రోలుమా. | 40 |
|
వాదులుమాని నాసరస వారుణినానుము, దానితో మహ మ్మూదు సమస్తరాజ్యరమ పోలదు! వేణువినోదగీతి దా వీదు గళస్వనంబటుల విశ్వ రసోదయ హేతువయ్యె శా తోదరి, నేఁటి సమ్మదము నోడకు రేపను జూదపాటలో\న్. | 41 |
|
కను మెపుడో యకాండముగ. గాలము నీపయి దొమ్మిపోటు సే యనిపుడే గులాబి జిగులారెడు ద్రాక్షరసమ్బు నానుమా; తనువు నశించి దుమ్మగుట తథ్యము; నీవు పసిండిముద్దవా జను లొకసారి పూడ్చి మఱుసారి నినుం బెకలించి యెత్తఁగ\న్ | 42 |
|
చెలియరొ, నిన్ను నన్ను విరచించిన యప్పుడు సృష్టికర్త ముం దల లిఖియించెనేమొ సురఁద్రావి సుఖింపఁగనాకు, హృత్తటం బులు దెగిపాఱు ప్రేమరసపూరము గిన్నెలనింప నీకు; నా శలు ఫలియింప మద్యకలశంబును నీవుఁ జిరంబు వెల్గుత\న్! | 43 |
|
కౌసరు నిర్ఝరంబు సురకాంతలు నాకమునందు నుందురం చాసపడంగ నేల చెలియా? తొలిసంజల నీవు వోయు ద్రా క్షాసవ మా నదీజలమునంతటి కన్నను దీపుగాదె! నీ దాసులు పాదుషాలను వదంతియె చాలదె రూపుదెల్పఁగ\న్. | 44 |
|
చానా, నీసరసాస్యబింబమునకు\న్ జమ్షీడుపాత్రంబు దీ టౌనే? నీపదమార్గమందు మృతి పూర్ణాయుష్యలాభంబుకం టే నేటౌగద! కోటిబాలరవులే నీపాదరాగంబున\న్ స్నానంబాడ, మదీయజీవితము భాస్వద్ధామ మౌటబ్రమే! | 45 |
|
వనిత, యనుంగు ముంగురులపైఁ జెయివైచితి నంచు నూరకే కనలెదవేమొ; నాయెడఁద కట్టువడె\న్ నెలవంక యుచ్చులం; జెనఁటి తమాషకై యురులఁ జేయిడ; నా హృదయంబునేనొ కో రినయటు బుజ్జగింప బెదరించెదవేల తుటారి చూపుల\న్. | 46 |
|
అమృతరసాయనోష్ఠి, స్ఫటికాసవపాత్రము నాకుమాఱు నీ సుమరదనచ్ఛదంబున నసూయ రగుల్కొన ముద్దువెట్టెఁ; బం తముమెయి దాని నెత్తురును ద్రావకయుండిన నను ఉమ్రఖ య్యమ యని పిల్వఁబోకు, తగవౌనె పరాంగన మోవిముట్టఁగ\న్. | 47 |
|
చెలియ, మనోహరప్రణయ శీతలత\న్ సుఖియించు నామనం బలమటతోఁ దపించు నకటా! భవదీయ వియోగకీలల\న్; దెలియదొ, సాఖియార్తులకు తియ్యని మందని; ప్రాణముల్ త్వదం ఘ్రుల విడిపింతు; రమ్ము, బ్రదుకు\న్ నిలబట్టెద నిట్టియాసల\న్. | 48 |
|
వలపులదివ్వె, నీమృదుల పాద లతాంతము ముద్దుగొందు; న న్యల మధురాధరంబులయినం దులఁదూగవు దానితోడ; రా త్రుల సహవాసకామినయి రోసియు ని\న్ గనలేక భగ్నవాం ఛలఁ జివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనత\న్. | 49 |
|
చెలియరొ, నీవియోగమునఁ జిత్తము చీకి కృశించె; నీవు నే వలనికిఁ బోయిన\న్ విడువఁ బయ్యెదకొంగు; నిరంతరంబు ని న్వలచినవార లెందఱొ వనారిలి కూలిరి నీవు పోవ; నే డెలమి దొలంక వచ్చితిని; ఎందఱు నీబలిపీఠిఁ జత్తురో! | 50 |
|
లలనా, కోమలమైన నీతనువు నేల\న్ లీనమైపోయి య వ్వల నానావిధ భాండభాండికల రూపంబెత్తుఁ; దత్త్వజ్ఞులీ చల వృత్తంబును నమ్మఁబోరు; నిరయ స్వర్గానుసంధాన క శ్మల చిత్తంబుఁ బురాతనాసవమున\న్ స్నానంబు గావింపుమా. | 51 |
|
అంతములేని యీభువనమంత పురాతనపాంథశాల; వి శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్; ధరా క్రాంతులు పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ గొంత సుఖించి పోయిరెటకో పెఱవారికిఁ జోటొసంగుచు\న్. | 52 |
|
అంబరం బొక చిత్రగీతంబు; రవియు దీపపు\న్ శెమ్మె, లోకంబు తెరపటంబు; నీడబొమ్మలు మనుజులు; నిఖిలమునకుఁ గాలచక్రంబు నిర్ణేత; గతి యనాది. | 53 |
|
ఆదిమధ్యాంత రహితమై యలరుచుండు కాలయవనిక భేదింపఁ గలమె మనము? ఇటకు నెందుండివచ్చె నింకెటకుఁ బోవు ప్రాణి యను ప్రశ్న కెవ్వాఁడు బదులు సెప్పు? | 54 |
|
కానలేము కాలపు మర్మమేను నీవు; ఆ జిలుగు వ్రాఁత చదువ సాధ్యంబె మనకు తెరవెనుక నేను నీవను పొరపు గలదు; ఆ విభేదము తెరయెత్త నంతరించు. | 55 |
|
అణుజునై యెగిరితి రహస్యాంబరమునఁ; బిన్న పెద్దల శుశ్రూషవేత్త నైతిఁ; గాని, లోగుట్టూఁదెలుపు నొక్కనిని గనను; మఱలివచ్చితిఁ బోయిన మార్గమందె. | 56 |
|
సతముఁ దత్త్వవిచారంబు సలిపిసలిపి మూలసూత్రంబు నెవరైన ముట్టినారె? నేఁడు నిన్నట్లు; రేపును నేఁటియట్లు; అందనిఫలంబు చేచాఁప నందుటెట్లు? | 57 |
|
అఖిల శాస్త్ర పురాణ తత్త్వాబ్ధు లీఁది పరమ విజ్ఞానదీపమౌ పండితుండు కాళరాత్రిని మార్గంబు గానలేక యల్ల మామూలుకథఁ జెప్పి యంతరించు! | 58 |
|
జీవితంబెల్ల బహుశాస్త్ర సేవలందుఁ గడపితి, రహస్యములు చాల గ్రాహ్యమయ్యె; నిప్పుడు వివేకనేత్రంబు విప్పిచూడఁ దెలిసికొంటి నాకేమియుఁ తెలియదంచు. | 59 |
|
మనకు ముందేఁగినట్టి యా మాన్యులెల్లఁ బ్రబల గర్వాంధ నిద్రాబద్ధులైరి; నెలఁత, మధువాని నావల్ల నిజము వినుము; వారు చెప్పిన చదువెల్ల వట్టి కల్ల! | 60 |
|
నే నొక తత్త్వవేత్తనని నిందయొనర్చిరి కానివారు; నా మానసవృత్తి వార లణుమాత్ర మెఱింగిన నట్టులందురే? కాని, మఱేమి దేవుఁడెఱుఁగండె మనంబు; వ్యధాకులాయమౌ ఈనిలయంబుఁ జేరితి; గ్రహింప నసాధ్యము జన్మమర్మముల్. | 61 |
|
పూవుఁ జెక్కిళు లందంబు దావి రంగు నిక్కునీటును గలదు వర్ణింపనేల; బోధపడదేమొ యైహిక భోగశాల సృష్టికర్త యిట్లేల చిత్రించె నన్ను? | 62 |
|
ఏమి ప్రయోజనంబు గన నిష్టములేనిదె నన్నుఁ దెచ్చె; నిం కేమి యశంబు గౌరవము హెచ్చును న\న్ సమయింప; దైవలీ లామహిమోన్నతి\న్ మదిఁదలంప నసాధ్యము; రాకపోకలే లా? మన జీవితంబునకు లాభము కేవలజీవితంబెకా! | 63 |
|
లలనరో, మున్ను నస్థితిజలంబున 'నే'నను విత్తునాటి, య వ్వలఁ బరివేదనాగ్నిశిఖఁ బ్రాణము వోసెను; గాలిపోల్కిని య్యిలసకలంబుఁ గ్రుమ్మరుదు; నెచ్చటిమృత్తికతోడఁ జేసెఁ గ్రం తల కిరవైన యీతనువుఁ? దాఁకినఁ దప్పిన మన్ను దుమ్మగు\న్. | 64 |
|
ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్న రాకయుందును; వచ్చినఁ బోకయుందు; వీలుపడునేని యీపాడునేలయందు ఉనికిపుట్టువు చావులేకున్న మేలు. | 65 |
|
అయయో! మూలధనంబు హస్తగళితంబౌచుండె నానాఁటికి\న్; వ్యయమైపోయిరి మానవుల్ మరణశయ్యాసుప్తులై; తన్మృతా లయ వృత్తాంత మెఱుంగ గోరి వయసెల్ల\న్ వేచుటేకాని యా రయ లేనైతి దివంబునుం డిటకు యాత్రల్ సేయు దేశాటుల\న్. | 66 |
|
తనచేచేత నొనర్చినట్టి యొకపాత్ర\న్ భగ్నముంజేయ నే మనుజుండైనఁ దలంప; డంగములు నిర్మాణంబు గావించి మో హన రూపంబులు, మోవిఁదేనె యెదలో నత్యంతరాగంబుఁ గూ ర్చినదేవుండు మఱేల యిట్లు నిజసృష్టింగూల్చు నున్మత్తుఁడై? | 67 |
|
ధారుణినుండి యుచ్చశనిదాఁక కలట్టి కడింది చిక్కులం బూరితిగా సడల్చితిని; మోసపుటక్కుల బందెగాను; దు ర్వార నిరోధముల్ గడచివచ్చితి; నయ్యును, సాయశక్తులం బోరి వదల్పకే విసిగిపోయితి మృత్యురహస్యబంధము\న్. | 68 |
|
మానవులైనవా రెపుడొ మ్రందుట నిశ్చిత మౌట బాగదా దైనను బల్ఖయైన సమమౌను; సితాసిత పక్షమధ్య యా త్రా నియతిం జిరంబుగ సుధాకరుఁడు\న్ మన మట్టిమీఁద ము గ్ధానన సంచరించు; మధువానుము; మానుము తక్కుచింతల\న్. | 69 |
|
సమయపుఁ బాత్ర లోఁతుఁగన శక్యముగాదు; జగంబు దుర్జన త్వముపయినూనియుండు మగువా, వగపేటికొ మద్యముండఁగ\న్ గుములకు వెల్లఁబోకు విషకుండిక మృత్యువుదెచ్చియీయఁ; గా లముబడి నీవునేను సకలప్రజ యారుచిఁ జూడఁగా వలె\న్. | 70 |
|
మరణభయంబు నాకు నణుమాత్రము లేదు; మదీయ జీవ సం భరణభయంబె మిక్కుటము; ప్రాణము దైవము నొద్ద వడ్డి బే హరమున కప్పుకొంటి; ఋణమంతయు నిమ్మని తల్పు దట్టిన\న్ సరసర హేమనిష్కముల సంచులు ముందఱ విప్పిపోసెద\న్. | 71 |
|
కాలము రోషసంకులవికారముఁ జూపకపూర్వమే సుహృ త్పాళులఁ గూడిమాడి జరుపందగు వెన్నెల పానగోష్ఠి; చం డాలయముండు ద్వారముకడ\న్ నిలుచుండినయప్డు ఱెప్పపా టాలము సేయునే? గుటికెఁడైన జలంబును ద్రావనిచ్చునే? | 72 |
|
పరమొ గిరమ్మొ దానితలపై నొక దోసెఁడు మన్నుచల్లి సుం దరి మెఱుగుంగపోలములు దాఁచిన ముద్దులు దొంగిలించి సం బరముగ శీధువానుము; నమాజులు పూజలుఁ జేయనేల? యె వ్వరయిన వచ్చినారె మృతివాటిక కేఁగిన పూర్వయాత్రికుల్? | 73 |
|
మాటికి మాటికిం దెలివిమాలి తలంతువు స్వర్గమంచు; న చ్చోట నిలింపకామినులుఁ, జొక్కపుటాసవము\న్, గులాబిపూఁ దోఁటలు నుండునన్న భ్రమతో మన కేటికొ యవ్వి యియ్యెడ\న్ నీటలఁ; జేతివెన్న విడి నేతికిఁబోదురు మూఢమానవుల్. | 74 |
|
కొందఱు దేవకన్యకల కూటమి పండుగ యంద్రుగాని, నే నందు మధూళి పానమె ప్రియంబని; తీరనియప్పుబేర మిం కెందుకు, ముందుచేతగ్రహియింపుమురొక్కముఁ, దూర్యరావమా నందముఁ గొల్పు దవ్వుల వినంబడియుం; దడవేల మిత్రమా? | 75 |
|
ఎవఁడో భగ్నమనోరథుం డిహమునే హేయంబుగావించి భా వ వినోదంబుగ నందనంబు, దివి, రంభాభోగ మూహించుకొ న్న విధానంబగుపట్టు; బైళుల ఝరీనాదంబు, ప్రత్యూషవై భవముల్ సంధ్యల రక్తికన్నఁ గలదే స్వర్గంబు యోచింపఁగ\న్? | 76 |
|
అలవడ దస్తినాస్తుల యథార్థత, నాకము సత్యమన్న పె ద్దలనుడి యొప్పుకొన్నను, బదంపడి నమ్మకమేమి యందఱా స్థలమున కేఁగువారలని? చచ్చిన నెవ్వరికెవ్వరో! వృథా పలుకు లిఁకేల భూతలము స్వర్గమొనర్పుమ సాఖి, పాత్రిక\న్. | 77 |
|
చకచకలాడు ద్రాక్షఫలసారము వేణురవంబు, గానము\న్ నికటమున\న్ నిలింపరమణీమణిఁ బోలిన యెమ్మెలాఁడి! నా కిఁక మఱియేమిలోటు? సగమెత్తియు వ్రాలెడికన్నుదమ్ముల\న్ సకియ, జయింపనే సమయసంకటముల్ త్రుటిలోన వారెవా! | 78 |
|
నాదు యశోవగుంఠనమునం గనుపట్టెను జిల్లుచీలికల్; పైదలి, యైనఁగాని మధుపానము మానను బ్రాన ముండఁగ\న్; ఆ దరిబేసు లాసవము నమ్మి మఱేమి యమూల్యవస్తు సం పాదన సేయువారొ విసుమానము నొందుదు వారి చేఁతకు\న్. | 79 |
|
నిరతముఁ బానమత్తులము, నీతులు గీతులుఁ దెల్పఁబూన కో విరసుఁడ, పానపాత్ర నులివెచ్చని ద్రాక్షరసంబుదప్ప మా సరసపు గోష్ఠి వేఱొక విచారములేదు, ప్రియాంగనా మనో హర మధురాధరామృతము నానుటొ, యాసవ మానుటోగదా! | 80 |
|
వారుణి నానుచుండఁ బ్రతిపక్షులు పల్కిరి: 'వద్దు ఛీ! మతా చారవిరోధి పానకలశం' బని; యయ్యది సత్యమేని వ హ్వారె! మతాపకృద్రుధిరపానముఁ జేసెద; ధర్మశత్రుసం హారము శాస్త్రసమ్మతము నౌనని చెప్పరె పండితోత్తముల్! | 81 |
|
త్రావము జాహిదీలమని దంబము గొట్టెదవేల? యంతక న్నా విపరీతకృత్యము లొనర్తువు నిత్యము; మాయవేషముల్ భావములోని కల్మషముఁ బాపునె? మానవసంఘ రక్తముం ద్రావెదవీవు; ద్రాక్షఫలరక్తము మాకు రుచించు నెప్పుడు\న్. | 82 |
|
చిరిగిన బొంతలం దొడిగి సిద్ధుల మంచవివేకలోకము\న్ మొఱఁగి చరించు దుర్జనుల మోసముకంటెను మేలుగాదె యో గురువర, కామినీ ప్రణయ గోష్ఠుల నాసవసేవ; త్రావిన\న్ నిరయము దప్పదన్న, మఱి నీ సురలోకము పాడుగాదొకో? | 83 |
|
గురువ, సలాము, దైవమునకు\న్ మము వీడుము; మీకు మౌనమే పరమహితంబు; అజ్ఞతను బల్కక యుండినఁ జాలు; మేము గ్రు మ్మరునది సత్పథంబు గనుమా, నయనార్తుఁడవౌట దారి వ క్కరముగఁదోఁచుఁ; గన్నులకు కాటుకవెట్టుము, చూపుమేలగు\న్. | 84 |
|
తెఱవ కడాని ఱొమ్మొఱగుదిండున మే నరమోపి పూవుఁజ ప్పరములఁ గూరుచుండి మధుపాన వినోద విపంచికా రవ స్ఫురిత ముదాత్ములైననె రుచుల్ వచియింపఁగవచ్చుఁగాని, నే ర్చిరె యలరెంటికిం జెడిన రేవళు లందు మజా నెఱుంగఁగ\న్. | 85 |
|
కనుఁగొను శబ్దరూపరస గంధముల\న్ సుఖమైనస్పర్శ మో హనమగు నీప్రపంచము ననంతముగా సృజియించి ధాత చే సెనె శిలతోడ మానవుని చిత్తము? సద్ధృదయంబు లేనిచో జనులఁ బరస్పరప్రణయ సఖ్యము మందున కైనఁ జిక్కునె? | 86 |
|
కలపయు మట్టి ఱాల నిడి కట్టిన దేవళమందు నీకు నే ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవయేని కామిని\న్ వలవుము; ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై యలరుఁగదా మనుష్యహృదయంబు ప్రతిప్రణయానురక్తుల\న్. | 87 |
|
దేవ, నీవులేని గుడిఁ బ్రార్థించుకంటెఁ బానశాలను సత్యంబు పలుక మేలు; సృష్టి కాద్యంతములు నీవె; స్రష్టవీవె; పాలముంచ నీటను ముంచఁ బ్రభువు నీవె. | 88 |
|
కొందఱు ధర్మము\న్ మతముఁగూర్చి నిరంతము చింతసేయ నిం కెందఱొ సత్యసంశయము లేర్పఱుపం దలదిమ్ము గాంచ, నా సందున మాటువీడి "యిఁకఁ జాలును లెండు వెడంగులార, మీ కందును నిందు లేదు పథ" మంచు మునాది వచించువారికి\న్. | 89 |
|
మునుపు మసీదువాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై చినిఁగెను; నేఁడును\న్ మరలఁ జెప్పులకోసము వచ్చినాఁడ; నె మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగరాను; నీవు చ చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజు సైతము\న్. | 90 |
|
సలలితగోస్తనీ ఫలరసంబునుగ్రోలెడువారు, దేవళం బుల నిశియెల్లఁ బ్రార్థనలఁ బుచ్చెడువారు; జలప్రవాహవీ చులఁబడి మున్గినారు; పొడిచోటి కొకండును జేరఁ; డొక్కఁడే యలరుఁ బ్రబుద్ధుఁడై; మిగతయందఱు మత్తులు పెద్దనిద్దుర\న్. | 91 |
|
మితిసెడ, సృష్టివేళ్ఁ దనుమృత్తిక నెవ్వఁడు మేళవించె; జీ విత సిచయంబునం బడుగుపేకల నున్నియుఁ బట్టుగల్పె; దు ష్కృతులను బుణ్యకార్యములఁ జేయ లిఖించెను నొష్ట, వాఁడె మ త్కృతులకు మూలకారణము, కీడును మేలును వాని సేఁతలే. | 92 |
|
పాపముఁ జేసితంచుఁ దలఁపం బనియేమి ఖయామ? దుఃఖ సం తాపము నిష్ఫలంబగు; వృథా వగపిల్లుట మాను; మెవ్వరుం బాపము సేయకున్నఁ దన మన్నన యెందుకు? కల్మషాత్ముల\న్ 'రేపు' క్షమించుఁ; బాపము హరించును దైవము; సంతసింపుమా. | 93 |
|
ఎవ్వఁడు తప్పుసేయఁ; డిల నెట్టుల జీవిక సాగుఁ జేయఁడే\న్; అవ్వలఁబాపి వీఁడనుచు నక్రమశిక్ష విధింతువయ్య! యీ రవ్వయు రచ్చయేల యపరాధుల మిద్దఱ మౌట; నీకు నా కెవ్విధమైన భేదము రహించునొ కాస్త వచింపు మీశ్వరా? | 94 |
|
మును నే నస్థితి నిద్రనుండ నిలకుం బోఁదోలి దుఃఖంబులం, దను సౌఖ్యంబుల నందఁజేసి మరలం దర్జించు వౌరౌర! పా పిని శిక్షింతు వటంచు; నీచతురత\న్ వేనోళ్ళఁ గీర్తింతు రీ వినయార్తుల్; మఱి శిక్షకర్హుఁడవు నీవేకావె లోకేశ్వరా? | 95 |
|
కరుణావార్ధివి నీవు, నే నిఁకను దుష్కర్మంబు వర్జించి ని ర్భరవైరాగ్యముఁ బూన నీవు కృపఁజూపంబాత్రులెవ్వారు? నీ బిరుదు\న్ నిల్పుట కే నొనర్చితిని నిర్భీతి\న్ సమస్తాఘముల్; సరకం బంటకయున్న వీలగునె పశ్చాత్తాపముం బొందఁగ\న్. | 96 |
|
నీవు కృపాంబురాశివివఁట! నిక్కమయేని ఇరాముతోఁటకుం బోవఁగనీక పాపిజనము\న్ మరలించుటయేల? భక్తులం గావఁగ వత్తువేని కృపగాదది, బేహర; మింద నున్న మీ యాపుల కన్నఁ, బాల్వలయునా పసిపాప కటన్న సామెతౌ! | 97 |
|
అంబరు ముంగురుల్ నొసలి యంచుల వ్రేలఁగఁ జూచినంత మో హం బెసకొల్పు కోమల లతాంగినిఁ గల్పనచేసి నీకు న్యా యంబె మఱెవ్వరు\న్ మొగమునారయరాదని యాజ్ఞవెట్టఁ; బూ పంబును చేతికిచ్చి తినవద్దని చెప్పుట యేల దైవమా? | 98 |
|
మనుజుని వారుణిం బ్రణయమాధురి సుందరిఁ జేసి భూమినం దనమున కంపినాఁడవు; మనంబగుఁ బ్రేరక మెల్లకర్మకు\న్; వెనుక నదేల మాతలను వేసెద వీ యపదూఱు? నీవె శా సన మపరాధియు\న్ మఱి విచారణకర్తయు; చిత్రమీశ్వరా? | 99 |
|
అలరె విమర్శనంబు! కననయ్యె వివేకము; సర్వశాస్త్రముల్ దెలిసిన పండితోత్తములనే నిఱుపేదలఁ జేసినాఁడ; వం జలిని ప్రసాదమై పిడుగు జాఱును భక్తుల; కింతయేల? దు ష్టులకు సుఖంబు సంపదలు చొప్పడు, నింపగునీకుఁ బాపముల్. | 100 |
|
నెలఁతా, దేవునికట్లు నాకును జగన్నిర్మాణమర్మక్రియల్ గలవే\న్, దుర్విషమప్రచారి యగు లోకంబు\న్ యథేచ్ఛామతిం జెలువంబౌనటు సంస్కరించి నవసృష్టింగూర్తు సన్మార్గవ ర్తులు ప్రాజ్ఞుల్ భువి సర్వసంపదల సంతోషంబుగ\న్ వర్ధిల\న్. | 101 |
|
ఈ విషవృక్షలోకమును నింకొకరీతిఁ బునః సృజింపుమం చే వినతి\న్ వచింతు; నది యిష్టమయేని రచించు చెచ్చెర\న్; దేవ, మదీయ నామమును దెప్పునఁ బట్టికఁ గొట్టివేతువో, నావయసు\న్ శతాధిక మన\న్ సవరింతువొ చూడఁగావలె\న్. | 102 |
|
కోరిక లన్నియు గుడుపుగూరవు, సౌఖ్యము దుఃఖమెప్పు డం గూరురసంబుఁ జేఁదటులు గూడియెయుండు, గులాబి కంటకాం కూరము లంటియుంట మనకుం బరివర్జ్యమె? ఱంపకోఁతలం జీరికలౌట దువ్వెనయుఁ జేకొను జవ్వని తావిముంగురుల్. | 103 |
|
ధనము నలక్ష్యభావమునఁ దత్త్వవిదుండు నుపేక్షచేసినం తినగతిలేని పేదలకు, దివ్యవనంబగు నిజ్జగంబు బం ధనమగు; పైఁడిసంచుల మదంబున విప్పి గులాబి నవ్వఁ గం బనవును నీలకాంత వని బాఱలుచాఁపుచు నుత్తచేతుల\న్. | 104 |
|
కనుల హిమాంబుబాష్పములుగాఱవచించె గులాబి, ముద్దు మో మును నగుసోయగంబుఁ దలపోయక, నన్ను సుగంధకారి కాఁ చునకట యన్న, బుల్బులియు, సుందరి, సామెతవింటె; నేఁడువిం దును నొకయేఁడుకుందు; విధిదుష్టమవార్యమటంచుఁ బల్కెడి\న్. | 105 |
|
కాలశరాసనోత్పతితకాండము తీక్ష్ణము; తచ్ఛిలీముఖ జ్వాలల మాడకే మనుము; వాడనిపుంటను చౌడుఁ జల్లు దు ష్కాలము నీకు నోటఁ బులకండము బాదముఁ బెట్టవచ్చిన\న్ నాలుకఁ జాఁపఁబోకు మొకనాఁడయిన\న్, విషదిగ్ధ మద్దియు\న్. | 106 |
|
విధి నిబద్ధములైవచ్చు వెడలిపోవు నఖిల సుఖదుఃఖములు నీ కయాచితముగ; జడియ బోకు రుస్తుముజాలు శత్రుఁడైన, తాయి సఖుఁడైన విందులఁ దలఁపఁబోకు. | 107 |
|
రెండుదినముల కొకతూరి యెండురొట్టె బోసిముంతెఁడు చలినీళ్ళు పుట్టునేని ఏల నినుఁబోలువానికిఁ గేలుమోడ్ప? నొకనికి గులామవై యెందుకూడిగింప? | 108 |
|
విషము నమృతంపు మసిబుడ్ల విధి కలంబు ముంచి లోకుల నుదుట లిఖించు మొదటఁ; గరఁగ దఱుఁబేద కన్నీటి కాల్వనదియుఁ, బరమభక్తుని యనుతాప వహ్నిఁ జెడదు. | 109 |
|
కాన నెదిప్రాప్తమైనను గారవించు, వలయు వలదని యేర్పఱుపంగ లేవు; అంబరంబును నీకు సహాయపడదు, తానె తలక్రిందుగా వ్రేలుఁ; దడవు నిలదు. | 110 |
|
ఇల చదరంగ; మందు జనులెల్లరు పావు, లహస్సులు\న్ నిశల్ తెలుపును నల్పుగళ్ళు; కదలించును రాజును బంటుఁ దక్కు పా వుల విధియాటకాఁడు; పలుపోకలఁ ద్రిప్పును గళ్ళుమార్చు, న వ్వల నొకటొక్కటిం జదిపివైచు నగాధ సమాధిపేటిక\న్. | 111 |
|
జ్ఞానపటాలయమ్ము నొడికమ్ముగఁ గుట్టు ఖ్యామ నేఁడు దుః ఖానలదగ్ధుఁడయ్యె, యముఁడ\న్ బెనుకత్తెర జీవితంపు బి ఱ్ఱూను గుడారుమోకుఁ దెగనొత్తెఁ; బ్రపంచపుసంతలోన దు గ్గానికి నమ్మె నిన్నుఁ బలుగాకిదలాలి విధాయి, యయ్యయో! | 112 |
|
మనమున కెక్కినట్టి యభిమానులు మిత్రులుఁ జెల్లినారు; యౌ వన మధుమాసముం గుసుమభారము రాలిచిపోయె; జీవితం బను సరకంబునందు నడుగంటె మధూళియు; నేదినంబు వ చ్చెనొ మఱియెప్పుడేఁగెనొ దిసింపదు హర్షవిహంగమిప్పుడు\న్. | 113 |
|
పూవులకారు రాకలకుఁ బోయెడిసీతులకు\న్ రసోజ్జ్వల జ్జీవిత కావ్య పత్రములఁ జెచ్చెఱఁద్రిప్పితి; శోకసర్పద ష్టావిలమౌ హృదంతరము నాసవమ\న్ ప్రతియోగమొక్కటే కావ సమర్థ; మింక ముదికాయము లేఁతగిలంగఁ ద్రావెద\న్. | 114 |
|
విమల మనంబుతోడ మధువిక్రయశాలకుఁ బోతి నిన్నరే యి; మధురవాణి, సాఖి, హృదయేశ్వరి పాత్రిక నింపితెచ్చి త్రా వు మనిన వద్దటంచు సరిపుచ్చితిఁ; గ్రమ్మఱ "నాదుప్రేమపై రమణుఁడ, యానవెట్టితిని, ర" మ్మనఁ దెమ్మని యానతి\న్ బలే! | 115 |
|
ఆసవ కుండికం బెదవులానఁగఁ బట్టినయప్డు దీర్ఘ ని శ్వాసముతో వచించెఁ దనసంగతి; "నాకును నీకుఁ బోలె రో జా సుమనోరథంబు వికసన్నవహాసము లుండె; జీవముం బాసిన మానవుల్ మగిడివత్తురె? వీడకు నాదు సఖ్యము\న్." | 116 |
|
ఆకూజాయును నన్నుఁబోలె ప్రణయవ్యామోహముంజెంది కాం తాకమ్రాలక శృంఖలావలయ బద్ధంబయ్యెఁ గాఁబోలు ము\న్; నాకుందోఁచుఁ దదీయకంధరను లగ్నంబైన చేకొండె యో షాకంఠ ప్రమదోపగూహనమున\న్ సంసక్తమంచు\న్ సఖీ. | 117 |
|
నిన్నటిరోజు కుమ్మరిని నేఁగనుఁగొంటి బజారువీథిలో మన్నొక ముద్దఁజేసి మడమం జెడఁద్రొక్కుచునుండ, వానితోఁ దిన్నగ మందలించె నది దీనత "మెల్లఁగ నల్లఁ ద్రొక్కుమో యన్న, యెఱుంగవే నను? నొకప్పుడు నీవలె నందగాఁడనే!" | 118 |
|
మానగదోయి, యెందనుక మానవమృత్తికఁ దెచ్చి ముంతలు\న్ బానలుఁజేసెదీవు మఱవందగ దందఱు నట్లెయౌట; య జ్ఞానముచే నిజంబెఱుఁగఁ జాలవు; నేనుగ్రహించితి\న్; ఫరీ దూను శిరంబుఁ గాంచుమ యదో! దరిబేసి కరంబు దగ్గఱ\న్. | 119 |
|
పొలుపుగ మాటనేర్చినవి మూగవి కుండలురెండువేలు లో పల నొకమూలనుండి యిటువల్కె ననుంగని "కుంభకారులు\న్ విలిచినవారు, మమ్ముఁ బురవీథులనమ్మిన వారలేరి? యే తలమున కేఁగినారలు? వదంతి యెదేనియు విన్నఁ దెల్పుమా." | 120 |
|
ఎందుకుఁ జూచిన\న్ గనక యేఁగెదు? చక్కని గిండిగానొ, న న్నందఱు వ్రేలుచూపి పరిహాసము చేయుదు; రైపు నాది గా దిందుఁ, గులాలశిల్పి నను నిట్లొనరించె; రచించు నప్పుడుం దందరలాడె నేమొ చెయి త్రావుడుమత్తున, నొక్కె సొట్టగ\న్. | 121 |
|
ఓరీకుమ్మరి, పిల్పువచ్చు; వినుమా యొక్కింత నాకోర్కె; నా గోరీమృత్తికఁ బానపాత్ర లిటికల్ కూజాలు జాడీలు సొం పారం దీరిచి యమ్మవోయి మదిరాపణ్యంబుల\న్; గోస్తనీ సారస్పర్శఁ బునఃప్రబోధితుడనై సత్యంబుఁ జాటించెద\న్. | 122 |
|
కడుగుఁడు నాశవంబుఁ దడిగా మధుధారల; ద్రాక్షపుల్లలుం బుడకలు పెట్టెయల్లి ననుబూడిచి పెట్టుఁడు; శీధుబిందుల\న్ వడిసెడి నాదుమృత్తికల వాసన గుర్తగుమీకు; 'రేపు' న\న్ బడయుదు రాసవాలయము వాకిటనో, చెలి కాలిధూళినో! | 123 |
|
ఉత్తమోత్తమ గురుల శిష్యుండ నైతి, గురువునెత్తిని సచ్ఛిష్య కోటులకును; మరణశయ్య నంత్యార్థము మందలింతు; ధూళి జనియించితిని; గాలిఁ దేలిపోదు! | 124 |
|
ఖయ్యమా నీ గుడారము గగనసీమ కవల నాటియు, మౌనభ్యాసమయ్యు, ఊఁదివేయు సమయసాఖి యున్కిపాత్ర కమ్మ నీర్బుగ్గలటు వేయి ఖయ్యములను. | 125 |
| వివరణము | ||
| 3 | దౌలతు - | ప్రాభవము |
| 4 | సరకము - | పానపాత్ర |
| 6 | కైఖుస్రువు - | కయానీ వంశీయుఁడైన ఒక సుప్రసిద్ధ పాదుషా |
| 8 | మూసాస్వేతహస్త ప్రభల్ - | మూసాప్రవక్త (Moses) చేతులకు తెల్లకుష్టువు పొడలుండెననియు, అవి చాల రమ్యముగనుండినవనియు చెప్పుదురు. కొమ్మలలో మూసా చేతులవలె పూలు పూచెనని భావము. |
| మునాది - | రేపుమాపులు మసీదునందు గొంతెత్తి దైవప్రార్థన చేయునతఁడు | |
| 13 | రాగవతి - | ఇదియొక పూలమొక్క; దీనిని ఇంగ్లీషులో Tulip అని అందురు |
| 11 | బహరాముగోరి - | పూర్వ పారశీకరాజు; గోర్ అనఁగా అడవిగాడిద. అతఁడు అడవిగాడిదలను వేఁటాడుచుండినందువలన ఆపేరు వచ్చినది. గోర్ను పట్టినయతఁడు గోర్ లో పట్టుపడెను అని చమత్కారము. ఇచ్చట గోర్ అను పదము శ్లేషింపఁబడినది. గోర్ అనఁగా సమాధి యనియు అర్థము గలదు. |
| 15 | వజీరు - | మంత్రి |
| 19 | నీలకాంత - | ఇదియొక పూలమొక్క. పారసీలో 'బన్ షా' యనియు ఇంగ్లీషులో Violet అనియు పేర్కొందురు. |
| 20 | బుల్బులి - | వసంత ఋతువున పాడుచుండు ఒక చిన్నపిట్ట. ఆకారమునందు కాకపోయినను కూతయందు కవులచే వర్ణింపఁ బడుటయందు అది మన కోయిలకు సరిపోలును. |
| నీరక్తాస్యముల్ - | నెత్తురులేక పాలిపోయిన మొగములు | |
| 26 | సమలు - | సంవత్సరములు |
| 27 | సాఖి - | పాత్రవాహిక |
| 28 | ద్రాక్షామణి ముద్దుకూఁతురు - | ద్రాక్షాసవము |
| 41 | మహమ్మూదు - | మహమ్మదు గజ్నవి. ఈతని రాజ్యకాలమున పారసీకదేశము సకల భోగభాగ్యముల నోలలాడు చుండినది. ఇతడు వాఙ్మయ పోషకుడు. సోమనాథ దేవాలయమును ఈతడే విధ్వంస మొనర్చెను. |
| దావీదు - | ఈతఁడు యాకూబు పుత్రుడు. సుప్రసిద్ధుఁడైన గాయకుఁడు. బైబిలులోని (Psalms) కీర్తనలు రచించెను. | |
| 44 | కౌసరు - | స్వర్గమున ప్రవహించు తేనె వాఁక |
| 45 | జంషీడు పాత్రము - | ఈ పాత్రములో చూచిన భూత భవిష్య ద్వర్తమానములు దెలియవచ్చును. ఇది జంషీడను పూర్వపారసీక ప్రభువువద్దనుండెనని ప్రతీతి. |
| 46 | నెలవంకయుచ్చులు - | సాఖి నొసలు నెలవంక. ముంగురులు అది పన్నిన ఉచ్చులు. ఆ ఉచ్చులలో (ఖయ్యాము) హృదయము పట్టుబడియున్నది. అక్కరలేనిదే ఎవడు గాని తమాషాకు ఉచ్చులలో చేయి పెట్టడు. నా హృదయము వానిలో చిక్కుపడి ఉన్నదిగావున దానిని ఓదార్చుటకు నేను చేయి వేసితిని. నీవు బెదరించుట యెందుకు అని చమత్కారము. |
| 53 | చిత్రదీపము - | మాజిక్ ల్యాంట్ర\న్ |
| 56 | అణుజు - | డేగ |
| 68 | ఉచ్చశని - | ఇచ్చట ఉచ్చశనియనఁగా తులాశని కాడు. గ్రహ కక్ష్యావృత్తములలో శనికక్ష్యావృత్తము చాల యెత్తున నుండును. ఒక రాశిని చంద్రుఁడు షుమారు రెండున్నర దినములలో దాఁటుచుండగా, ఆ రాశినే శని దాఁటుటకు రెండున్నర సంవత్సరములు పట్టును. ఇందువల్లనే శని కక్ష్యావృత్తముయొక్క వైశాల్యము మనకు బోధపడును. |
| 69 | బాగదాదు-బల్ఖ - | ఇవి పారసీకములోని పట్టణములు. బాగదాదు ఉమయ్యద్ వంశీయ కలీాలకు ముఖ్యపట్టణము. బల్ఖయందు ఖయ్యాము తన బాల్యము గడపెను. |
| 82 | జాహిది - | భక్తుఁడు |
| 97 | ఇరాముతోఁట - | పారసీకుల నందనవనము |
| 103 | అంగూరురసము - | ద్రాక్షాసవము |
| 107 | రుస్తుముజాలు - | జాలు కుమారుఁడైన రుస్తుము - ఈతఁడు భీమునివంటి బల్కశాలి |
| తాయి - | హాతీంతాయి - ఇతడు గొప్పదాత; అతిథి సత్కారమునందు పేరువడసినవాఁడు | |
| 111 | పావులు - | ఆటకాయలు |
| 112 | పటాలయము - | డేరా |
| 119 | ఫరీదూ\న్ - | పారసీక ప్రభువు |
| దరిబేసి - | దరిద్రుఁడు. ఒక తెగ ఫకీరు. | |
| 122 | ఇటికలు - | సారాయి బుంగలపయి ఇటికరాళ్ళు మూతపెట్టు ఆచారము పారసీకదేశమున సామాన్యమై యుండినది. |
ఆంధ్రీకరణము
పూర్వము ప్రియావియోగ దుఃఖసమ్మూర్ఛితమైన నాచిత్తమును కాళిదాసుని మేఘసందేశము, ఖయ్యాము రుబాయతు సంజీవి ఔషధములవలె పునరుజ్జీవింపచేసినవి. నామిత్రుడు పిశుపాటి వేణుగోపాలు (ఇప్పుడు స్వర్గస్థుడు) హైదరాబాదునుండి ఖయ్యాము రుబాయతును నాకు పంపెను. ఆకాలమున వివిక్తమైన సౌధోపరిస్థలము, రుబాయతు నాకు ఏడుగడగ నుండినవి. 1927 సెప్టెంబరు నెలలో నొకనాటి రాత్రి ఒంటి గంట గడచినను నిద్రపట్టకయుండెను. ఏ పుస్తకము చదువ బోయినను మనస్సు దానిపై లగ్నమగుటలేదు. హృదయము కలకపాఱి నిరయ సదృశమయి హేయములును ఘోరములునగు భావములకు ఆలవాలమై యుండెను. నాహృదయముతో సరిపోలుటకో అనునట్లు ఆకాశముగూడ మేఘాచ్ఛన్నమై యుండెను. పైమేడమీది బయలులో కూర్చుండి దీపము పెట్టుకొని రుబాయతు చదువుచుంటిని. రుబాయతును ఆంధ్రీకరించిన బాగుండునను ఉద్దేశము కలిగినది. ఒకటి రెండు రుబాయిలు తర్జుమాచేసితిని. అంతలో వాన చినుకులు పడనారంభించెను. పడుకగదిలోనికి పోయి తలుపువేసికొని నిదుర పోవ ప్రయత్నించితిని. ప్రయత్నించినకొలది నిదుర దూరమగుచుండెను. ఏమిచేయునదిలేక ప్రొద్దుపొడుచువఱకు రుబాయతు తర్జుమా చేయుచుంటిని. తరువాత రెండు దినములలో నేను గుర్తుపెట్టిన రుబాయీలన్నియు ఆంధ్రీకరించితిని. పానశాల భారతిలో ప్రకటింపబడిన యనంతరము మఱికొన్ని రుబాయీల నాంధ్రీకరించి ఇటీవలనే భారతిలో ప్రకటించితిని.
నావద్దనున్న రుబాయతులో 692 రుబాయీలు కలవు. వానినన్నిటిని తర్జుమా చేయుట అనావశ్యకము. ఏలయన ఒకేభావము వివిధములుగా పది లేక ఇరువది రుబాయీలలో ప్రకటింపబడి యుండును. అవియన్నియు ఖయ్యాము వ్రాసినవికావు. ఖయ్యామును అనుకరించి వ్రాసినవారి పద్యములుకూడ అందుచేరియున్నవి. అందువలన నేనొక పద్ధతి నవలంబించితిని. ఒకేవిధమయిన రుబాయీలను కొన్నిటి నేర్పఱచి, వానిలో మనోహరములైన ఒకటి రెంటిని మాత్రము గ్రహించితిని. మఱికొన్ని రుబాయీలలో ఒకపాదముమాత్రము క్రొత్తభావమును వెల్లడించును. తక్కిన మూడుపాదములు చర్విత చర్వణముగనుండును. అట్టియెడ రెండుమూడు రుబాయీలు కలిపి ఒకపద్యముగ వ్రాసితిని. అట్లు వ్రాసినవి షుమారు అయిదారు పద్యములు మాత్రమే యుండును.
నాఆంధ్రీకరణము మూలమునకు టీకవలెనుండదు. తిక్కన, శ్రీనాథుడు మున్నగు అనువక్తల స్వాతంత్ర్యమును నేనును వహించితిని. అటనుటవలన నాతర్జుమా మూలముకంటె భిన్నముగనుండునని చెప్పుటకాదు. పారసీకజాతీయములలో ప్రకటింపబడిన భావము తెలుగులో అట్లె స్ఫురించుటకు ఆవశ్యకములైన మార్పులను రసపోషణమునకు వలయు కూర్పులను కావించితిని. సహృదయులు నాసేతను ఆదరింతురు గాక.
తెలుగుం దోటల పచ్చబీళ్ళ ననురక్తిం బానశాలాప్రతి
ష్ఠలు గావించి ఖయాము కావ్యరసభాండంబుల్, గులాబీలు బు
ల్బులిపిట్టల్ మధుపానపాత్రికలు సొంపుల్ గుల్కు సాఖీయు, భూ
తల నాకం బొనరింప నిల్పి రసికాంధ్రప్రీతి గావించితి\న్.
దువ్వూరి రామిరెడ్డి.
పెమ్మారెడ్డి పాళెము,
10-8-1934.