కావ్యములు తెలుఁగు ఋతువులు
(ఋతుసంహారము)
విశ్వనాథ సత్యనారాయణ

వసంతర్తువు
పరిచయానుద్రిక్త పరిరంభ సమయానఁ ప్రియురాలి యెద చెమరించినంత
శీతోదకస్నానజాతసౌఖ్యము పైని ముకుపుటానఁ జెమర్పు పుట్టినంత
పేరంటమునకేఁగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత
వంగిన వేపకొమ్మం గావిచిగురీన పజ్జ యీనెకుఁ బూఁత పట్టినంత
ఒకదినాన హఠాత్తుగా జికిలి కూహుకుహువు ప్రొద్దెక్కి దూరపుఁ గోననుండి
సాఁగి వినవచ్చినంత వసంత మరుగుదెంచెనను మధురోహ స్ఫురించె లోన
కించిదుషఃపూర్వ కించిదతఃపర ప్రాలేయబిందు సంపాత వశత
మధ్యాహ్నవేళాక్రమప్రాప్త తీక్ష్ణతా కలితాతపోగ్ర సంక్రాంతి వశత
సాయంసమాగత స్వచ్ఛచంద్రాతప కుల్యా ప్రసారణాకూత వశత
మధురనిశార్ధభాగ ధునీవిధా ప్రియాహేలా మనోజ్ఞసాహిత్య వశత
శిశిరహేమంత శుచిశరత్సేవ్యమానుఁడై మహారాజవైభవోద్దామమూర్తి
కూడి ఋతురాట్సభా నలకూబరుండు మాధవుఁడు వచ్చె సుమసుకుమారమూర్తి
సొంపు మైఁదేల నాజూకుపసందు లేఁజివురు జున్నులు తెచ్చి చిదిమి యొసఁగ
గొంతు జీరలు వారఁ గ్రొమ్మావి లేయివుళ్ళావులు తేరు పాయసములీయ
రతికోర్కె సుంకుతేరఁగ నిమాందీను క్రొమ్మెత్త యివుళ్ళు లామెతలు పెట్ట
రత్యంతవేళాత్త శ్రమ పో జహంగీరు తలిరాకురసములు త్రావఁజేయ
క్రొత్తఁగా జతకట్టిన కోకిలమ్మ పెంటికై నూత్నయౌవనోద్వేగ వేగి
యగుచు ముక్కునఁ జిదుమని యామ్రకిసలయమ్ము లేదు వసంతవనాంత వీథి
విరియఁగాచిన పండ్లబరువుచే వంగి రకోలమ్ము వొలిచెఁ జూలాలువోలె
సాకిల జిగిగొంతు కోలెత్తి ప్రలపించె నవవీథి భార్యాప్రవాసివోలె
పరులకై పువుఁబువుఁ దిరిగి తేనియబొట్టులుగఁ గూర్చె భృంగమ్ము లోభివోలె
తొలఁచి కొబ్బరిమొవ్వు గొలనిక్కి యుడుత హలారుచిన్‌ మరఁగెఁ గలాలివోలె
బ్రదికి చెడినవాని చిదుకు గుండియవోలె నేల యెండఁ బగిలి నెఱియలు పడె
ఒకటఁ జూపి మఱియు నొకటఁగొట్టు సురియకాఁడు వోలె నుఱియు గాలి వీచె
కురుల కుదుళ్ళలోఁగూడఁ జెమ్మట పోయు నిచట గందపుఁబూత కెడము లేదు
కొమ్మ రొమ్మాన్చినఁగూడ నుమ్మ కలంచు నిచట భావములొత్త నింపు లేదు
వలిపముల్‌ సన్నభూషలుగూడ నెరియించు నిటఁ జల్లగాలి పో నిరువు లేదు
ప్రాణమ్ములందు లోపలఁగూడ నుడికించు నిట సీధువులు పట్టు నెఱుక లేదు
కామినీకాముకులును భోగములు చొఱని కొన్ని యసుఖంబులకుఁ దాళుకొనఁగలేక
యావటిల్లిరి యంగజాతాంబుజాప్త దారుణాంతర్బహిర్వహ్నితప్తులగుచు
రాల్పూత నారికేళమున నిల్పఁగ దిస్సకటిఁ దిర్గి గొడ్డలిగాట్లు పెట్టి
కావిడ్డ నెఱజాతి మావిపండులు చెదల్‌ ముట్టకుండఁగఁ బూటపూట త్రిప్పి
వెల్లకచ్చికబూది జల్లించి గండు చీమలు పాయ మల్లెపాదులను జల్లి
అవియు బత్తాయి రెండవకాపు చెడకుండ నారార నీర్వెట్టి యాకు చుట్టి
యేఁపెరిగి చెట్టుచెట్టునఁ గాఁపు దించి పండిపగిలిన పనసలు భద్రపఱచి
యేమఱక వేయివిధములఁ బ్రాముకొనియెఁ దేఁటి తేనియవలెఁ దెన్గు తోఁటమాలి
పానీయమంచుఁ జల్వలటంచు వినియోగపఱచుకొందురు జనుల్‌ వట్టివేళ్ళు
తాపశాంతులని శీతలములంచును ద్రావసక్తులౌదురు జనుల్‌ చల్లనీళ్ళు
చలువలటంచు వాసనలంచు మైపూత గ్రమ్ముకొందురు జనుల్‌ గందవొళ్ళు
దాహమటంచు శైత్యమ్ము లటంచు నానెదరు జనమ్మెడనీరములను
స్వేదబాధా నివారణాపాదులంచు జనములు ధరించుకొందురు సన్నచీర
లర్థమెఱుఁగని జనము తాపాపనోదకృత ప్రయత్నమ్ము తప్తశరీర మయ్యె
అరఁటినారకు మల్లెలచ్చటచ్చటఁ బదిగ్రుచ్చిన దండ యొక్కొకఁడు మెడను
ఉబ్బిన యుదరమ్ము లురములు చేతులు గీరు గంధాలు దక్షిణకరములఁ
బ్రిదులు తాటాకుల వీవనల్‌ వామహస్తంబులఁ దాంబూల దక్షిణలును
సంగత్తెలామరి చవుఁ బొగలెగయుఁ బానకపు ద్రేనుపులు మందగమనములు
రొంటి దోపిన బొబ్బిలి వెండికట్ల పొడుముకాయలతో వృద్ధ భూసురాళి
సాఁగుదెంచెను క్రొత్త వైశాఖపూజఁ దృప్తులై గేస్తుని ల్వితర్దికలు కదలిరి
ప్రొద్దు గ్రుంకెడువేళ ముగ్ధభావప్రచాలిత ప్రియాహస్త గుంఫితము లగుచు
రేయి వడ్డనవేళఁ బ్రియురాలి చొళ్ళెమ్ము పైని ముద్దులు గుల్కు బంతి యగుచు
పరనిశామధుర సంభ్రాంతి గాఢగృహీత ప్రేయసీ ధమ్మిల్ల మృదువులగుచు
మఱునాఁటి ప్రొద్దున మండువాలో నిర్దళితములై యిల్గుబాళింత లగుచు
పగలు రెండుజాములవేళఁ బంచపాత్ర వారిపైఁ దేలియాడు పూఁబడవలగుచు
నిఋతి దిగ్వాయుపతి వసంతఋతు శోభలీను చూలాండ్రు మల్లెపూ లెసక మెసఁగె
దీప్తి మాధుర్యావధి శిరస్సుధాంశు భాసన్మనోహర విలాసమ్ము లగుచు
క్లిష్టబంధ విచిత్ర కేళీప్రశస్తి రహఃకళాపూర్ణోదయమ్ము లగుచు
కృష్ణ పదాగ్రభక్తి సుగృహీతాముక్తమాల్యదాచ్ఛప్రౌఢమధువు లగుచు
అనితరలభ్య వర్ణాత్తశయ్యా హేతువై పాండురంగమహత్తు లగుచుఁ
దీయఁదనములు మెఱుగులుఁ దెచ్చుకొన్న ప్రియలు ప్రియులు కూడి మనుచరిత్ర లగుచుఁ
దెలుగు రసికలోకముల కందిచ్చె నసువులత్తుకొని మల్లెపూల్‌ క్రొత్త క్రొత్తరుచులు.

గ్రీష్మర్తువు
కోకిల మధువొల్కఁ గూసి యేనుగుఁదేనె సేకరించెడు భృంగమే కడింది
రెండుజాముల యెండమండి మేమగుఁ జల్లపాటున గొంతార్చు వడయె గడుసు
అల తొలిజాతిపండుల నేమి యగు సముద్ధతి నంటుమామిళ్ళె ధర పలికెడు
చలువ చేనూలువస్త్రము లెంత కగు వట్టియనద చీరలకె యత్యాదరంబు
గ్రీష్మ మరుదెంచి తన ప్రతాపోష్మ మురలి కలిమి యధికార మప్పుతేఁ గలుగువారిఁ
గ్రొత్తరుచులకు మఱగించుకొంచు నేలుబడిని సాఁగించెఁ బెఱజగ ముడుకఁ బెట్టి
దప్పిక కలవారి, రొప్పించి, యెండమావులదాఁక నీడ్చి, తావులను నెఱపు
చూపుమేఱన నీళ్ళు చూపి, చేర్పకయ యెండిన నాల్క పిడచకట్టించి విఱుచు
సాయమయ్యె నటంచు శైత్యోపచారమ్ము లెడలించి వడకొట్టి యిడియఁబెట్టు
అమృతాంశుఁ డరుదెంచె నని మింట నెఱపి యా వెన్నెల పొరల నావిరులు వెట్టు
అధమపరివంచనా ప్రథమావతారమూర్తి గ్రీష్ముండు చనుదెంచె మొదట జనుల
నిస్సహాయులఁ జేసి మండించి, మండి పిదపఁ బడమటిగాలితోఁ బిచ్చలించి
గొంతు క్రిందటి యుండ గుడగుడలాడఁగా నఱ వాఁదెఱచి తృషయైన కాకి
ప్రక్కఁజన్‌ చీమలబారు చూడక, నిక్కి నిలువక తలవాల్చి సొలయుఁ దొండ
పందిట లేచుచుఁ బండుకొంచును నాల్క చాచి రొప్పుచుఁ జొంగ జార్చు కుక్క
కొఱకక పులు, ప్రక్క గుదురక తపియించి యమ్మే యనుచు బిట్టు నడలు దూడ
నలిగిపోయిన పురికొసవలె, వడఁ గడగండ్లఁబడి, స్రుక్కి చను నల్లికండ్ల పాము
అల్ప ప్రాణులపైఁ బరమాధికారిశేఖరుఁడు గ్రీష్ముని ప్రతాపచిహ్నలయ్యె
వడికి లంబాడి యొత్తడపుసంచుల పురికొసలాగఁ బాతిన కొయ్యగములు
తలకొట్టి గింజలు దులిపి మాలెఁత లేఁగనెండి ముండ్లగు బ్రహ్మదండిమోళ్ళు
జనము భీతినిఁ గన్నులను మూయఁ బ్రత్తిగాలికి లేచు నెండు జిల్లేడుకాయ
లెనసి, ముండ్లయి కాళ్ళులను గ్రుచ్చుకొని నిక్కు చిఱుసూదులగు నెండుగరికతలలు
ఎగసి మొగ మాచికొట్టెడు నెండ చాల కురలి యురలి సుళ్ళుగ రేగి తరుము దుమ్ము
లిట్టె పసిమియన్నది యూడ్చిపెట్టు గ్రీష్ము నాతప ప్రతాపవహ్నికి నానవాళ్ళు
దణ్ణెమ్ముపైని వస్త్రముకొంగు జారి క్రిందను నంటుకొన్నది దాలిసెగకు
దొడ్డిలోఁ బ్రొయ్యార్పి, తొలఁగ, నెక్కడొ రవ్వ మిగిలి, పెన్గాలికి రగిలి యెగిరె
దూలమ్మునకుఁ ద్రాట వ్రేలనైన పఱపుగట్టు నులక దివ్వె ముట్టుకొనియె
చిదుకుల మంటబోసిన దృష్టి తీసి, మిల్మిలఁ బ్రేలి చూరెక్కె మిరపతొడిమ
పురము, పేట, పల్లె పరశురామప్రీతి కాదిహేతువులుగ నాడుకొనిరి
నిందలేకయుండ బొందె పోదన్నట్లు యమునివోని గ్రీష్ము నరయ లేక
ఆకాశమును భూమి, యగ్నిపత్రము వ్రాసికొన్నట్లు సుడిగాలి మన్ను రేగె
గ్రీష్మానిలుఁడు వేయిఱెక్కలతో సాఁగినట్టులు శుష్కపత్రాళు లెగిరె
ఎండధాటికి నోడి యిల నోరు తెఱచినట్టులుగ బీటిచ్చి నెఱ్ఱెలుగఁ బగిలె
అప్పులతో నాడి యారిన వెలుఁగు నా నెండి కాల్వలు చెర్వు లెత్తుపడియె
ఆర్ద్రమతి సుతిమెత్తని ప్రాణమట్లు నవశిరీషపత్రావళుల్‌ నలిగిపోయె
గ్రీష్మవిధురాతపమ్ములు ఱెక్క నిలుపఁ జాలని ద్విజాళివలెఁ బల్లటీలు కొట్టె
ఉదయ సూర్యునితోన యొడలెల్లఁ జితచితలై యెండ కొఱకొఱ లాడఁ దొడఁగె
ఇదియేమి నడుమింటి యెండయో వేనిప్పు చేతులఁ దాఁకిన రీతినుండె
ఇనుఁడస్తమించినాఁడని పేరు, నెదురెండ గొట్టిన వడ గూబ గుంయి మనియె
సొక్కు జాబిలి వలిగ్రుక్క త్రిప్పుకొనువేళకు రేయి జాముల ప్రాకులాడె
ఆపసోపాలు పడి నిద్రయనుచు ఱెప్ప రాచునంతలో దీర్ఘ దీర్ఘ మగు పగలు
గదుముకొన్న రేయి చివళ్ళు పొదిపి పొదిపి అట్టె ధారణి సర్వమ్ము పట్టుకొనియె
చిబుకము చివర వేసిన సెగగడ్డకు బాల గుండ్రమొగమ్ము కోలవారె
వడయెండలకుఁ గ్రాగి వడలిపోయిన బాల కడుఁ జూపులకుఁ గాని పొడుగు సాఁగె
బాల కృశోదరవ్యక్త రోమాళిరేఖాకాంతి నల్లనై పైకిఁదోఁచె
కనురెప్ప చలువ కద్దిన పచ్చకప్పురంపు సిరమ్ము కోసచూపుల వెలార్చె
కడును బాధగాఁ గార్శ్యంబుగాఁ వెలిఁగియు తాను వేసఁగి యందాలగాను సాఁగె
అందమగుచోట నందమ్మె యగును సర్వ మన్న కవికులగురుమాట ననువదించి.
పొనపొన, పది యుబ్బచినుకులు పడి, ఱేపు, కారాలు మిరియాలు నూరిపోసె
వడగాలి సాఁగినవట్టు సాఁగి బిగించె నడికిరే, మఱి చల్లపడెడు వేళ
మబ్బింత మసలదు, మసలెనా మబ్బుచాటెండ, లక్షణగ నత్తెసరుపెట్టు
ఎండమావులు నాల్క యెండి చచ్చెడు ప్రాణి నయనాల నీరాజనమ్ము పట్టె
నరు నఘానుభూతికి యాతనాశరీరమన్న యటులు తాపమ్ముల ననుభవింప
నైదు ప్రాణాలు చాలనియట్లు గాఁగ వచ్చి వడగాలి యాఱవప్రాణ మయ్యె.
సాఁగివచ్చిన నదీచ్ఛలమున యజ్ఞోపవీతముల్‌ తాల్చిన వేదమూర్తి
మృగశిర క్రొత్తకార్తెకు మొగిల్‌సోకు దుప్పటి కప్పుకొన్నట్టి భావవిదుఁడు
క్షేత్రేందిరకును నాగేటికఱ్ఱు పెకల్చు పదను తెచ్చినయట్టి పాకయాజి
మాకంద నవఫలామందతుందిల రసాత్తానందభావుఁడౌ నమృతభోగి
ఠీవి వెలయించి జాలి గుండియను బైకిఁ గానరానీని దొరవోలెఁ గదలివచ్చెఁ
గడు నధృష్యుండుఁ గడు నభిగమ్యుఁడౌచుఁ గేవలము పైకిఁ గఠినుండు గ్రీష్మరాజు.

వర్షర్తువు
అంతఃప్రగర్జన్మహాంభోధరమ్ములు నశనిపాతోగ్రఘోరాంబుదములు
మత్తసామజవదుద్వృత్తజీమూతముల్‌ నీలనమ్రస్నిగ్ధనీరదములు
శంపాప్రగాఢభాస్వత్పయోధరములు ప్రౌఢధారావమద్వారిదములు
వాయుహతప్రధావద్వారిధరములు వృష్టిమన్నికటకృపీటదములు
ప్రాతరవరుద్ధ బాలసూర్యాతపములు సాయమవరుద్ధసూర్యతేజఃక్షతములు
ఆదిశుచికౢప్త తాపాపనోదనములు ముసరుకొని వచ్చి మానేల ముట్టడించె.
కదలి గముల కట్టు గజము లెలుఁగుబంట్లు కారెనుబోతుల కరణిఁ గదలు
మొఱసి కుప్యద్వ్యాఘ్రములు మహాజలపాతములును శతఘ్నులవోలె మొఱయు
మెఱసి సరస్వతిపురువు లచ్చర లోషధులు శమీగతవహ్నికలుగ మొఱయు
క్రమ్మి కామాంధకారమ్ము లాపత్తులు చీఁకట్లు శత్రులజోఁక క్రమ్ము
కురిసి గడ్డు తుపానురాతిరి విఘార్ణమైన జలధితరంగమ్ము లట్లు కురియు
నీ మహా మేఘపటలి ప్రియామృదుల పయోధరమ్ములు పతి గుండె లుచ్చిపోవ
పులితోఁకవలె వియత్తలవనిం దోఁచె మనోజ్ఞమై యింద్రధనుస్సు ముక్క
పుడమిపడంతి కాన్పునకుఁ దాంబూలమ్ము కొఱకుఁ గాచుక వచ్చెఁ గుక్క గొడుగు
మొనసి పందిరిగుంజ మొదటఁ బట్టినది చిక్కగఁ గన్నె లెదఁ బొంగఁ గాకిబొడ్డు
పొట్ల చిక్కుడు బీరమొక్క లాకుచివళ్ళ బారెడె నింద్రగోపవ్రజంబు
నంతకంతకుఁ జేతికి నందునట్లు బావిలో నీరు బిల్లునఁ బైకి వచ్చె
నీ నవాంభోద ఋతువు మాటేమొ బాల హృదయములకు నానంద మందిచ్చునట్లు
పసుపు కుంకుమల శోభ వెలార్చెఁ గ్రొంబూలఁ బ్రాతపూవుల గంగరావిచెట్టు
తగఁ బూలు విరిచిన తొగరుచీర పసందునుం బోలెఁ బూచిన నువ్వు చేను
లేఁబసపాకు లాలీఢవార్షకబిందు లిలకుఁ బచ్చని బలాకలుగఁ దోఁచె
పొలుపెక్కు వరి కాజపువ్వులో గిలగిల సోలు సౌదామినివోలె నవ్వె
గొఱ్ఱు రాని పోరంబోక కొడుపులందు క్రొత్తతంగెడు మొక్కల కోట కట్టు
కొన్న వల్మీకములఁ ద్రాఁచుకొదమ లొదిగె నీ నవాంభోదమాలా విజృంభణమున
నీటిపడెం బయనించ నేరని యొడ్డిగిలఁ బడెఁ జిన్ని కాగితపుఁ బడవ
తాళ్ళతోఁపులఁ జూలుతేళ్ళ కడుపుడిప్ప తెఱచి పిల్ల లనుమతింపఁబడియె
శ్వసృగాలములకును వానవల్లప్పలో నెండవానలఁ బెండ్లి యేరుపడియె
చూడిగేదెకుఁ బెయ్యెదూడయే పుట్టునో దున్నపిల్లయొ చెప్పెఁ దుంగకాడ
నావికులు, ప్రకృత్యర్థనిరాయకులు, సుకేళినిధులు, జోస్యులు, తెల్గుబాలకులు ప్ర
కాశమందిరి వానలోకాలనుండి వచ్చి నడయాడుచున్న దేవతలవోలె
ప్రొయినిప్పు సెగఁ దడిపొడిగ నారిన చాలిచాలని యంగవస్త్రంబు గట్టి
తడి యారమిని నల్లవడి నగ్నికుండవిభూతికమై మొగమ్మున ధరించి
వాన యెద్దడిఁ బ్రత్యవాయభీతి సమగ్రచేతఃపదముగ రక్షించుకొనియు
అడుగున విస్ఫులింగాకృతి నున్న మూఁడగ్నులఁ జేయి యడ్డమిడి యూది
జ్వాల సేయితఱికిఁ జచ్చిచేయంగల విన్నపంబులయ్యు విహితకర్మ
సొడ్డువోవనీఁడు సోమాసిపైఁడి కీ ఋతువనంగ నికషదృషద మట్లు
వెన్నఁ గొట్టినవారి వెస ఱాలఁ గొట్టుమన్నట్లు మేఘుఁడు హేళి కడ్డువచ్చె
మున్ను వచ్చు చెవులకన్నఁ గొమ్ముల వాడి యనరికిని వగలు నధిక మయ్యె
మొఱిగిన కుక్క తాఁ గఱవదన్నట్లు గర్జించిన మొగిలు వర్షించకుండె
దివము మంచిదటంచుఁ బవలె దొంగిలినట్లు కాలిబాటలఁగూడ గడ్డి మొలిచె
తడిసి మఱికాని గుడిసె కట్టఁడును త్రాగి గాని మొగ్గఁ డన్నట్లు మున్‌కాంత పుట్టి
నింటి తడి యెల్లయును లాగి యిప్పు డినుడు ముగుద తమ్మి కన్పడుటకే మొగమువాచె
మొగలు వైఖరి శిల్పపుంబొమ్మలట్లెగదువ్వుకొన్నవి తాటితోఁపు తలలు
మ్రుగ్గులు పెట్టెఁ బాఱుదల నీటికిని గోల్తలచన్న చిఱుపోటు తరఁగల గమి
మోరలు వంచి చిమ్మునఁ దోఁక లెగనెత్తి యూడనిబాడె లేఁదూడ కదుపు
మహిషదితిప్రసూ మర్దన ప్రస్థాన కుపితదుర్గయు నా మొగుల్‌ చెలంగె
బాటఁ జను పాంథుడును ద్రోఁపువడియుఁ దూలె నల్పజంతువుల్‌ భయపడి యఱచి పఱచె
ఒక్క పడఁబోసికొను వానదిక్కునుండి కదలి పాతాళవాయు వొక్కండు వచ్చి
కోపచండము కొరడా పెట్టి మొగమున కడ్డమ్ముగా వ్రేసినట్లు మెఱసె
మాధుర్య దేవత మరణవేదన మూల్గుగతి నేఁచి బావురు కప్ప లఱచె
అంభోదభారాసహనములై మిన్నులు నుఱుములు పిడుగులై యుర్విఁగూలె
ప్రళయప్రథమ పరివర్తనమ్మన ధాత్రి వారివత్పంకవిపాక మేఁచె
ఉదయమున సూర్యబింబము నొఱవు బదులు తా వెలలెఁ బండి ముగ్గిన తాడిపండు
అభ్రము బలాకలకు రత్యదభ్రమై ధరిత్రి ధనిలోకసౌఖ్య చారిత్ర మయ్యె
మృతజీవులకుఁ బ్రజాకృతతర్పణము దయాదృతిని ముక్కాల మందిచ్చువారు
తేజోమయస్వాకృతిం బొల్చి ప్రాదేశమాత్రదేహములతో మలఁగువారు
ఒక జోలి కొక్కసొంటికిఁ బోని నిర్మత్సరులు పితృకర్మల రూపువారు
అలఘుదైవతలోకములవారిలో క్ష్మాతలమ్మువారికి సమీపమ్మువారు
శ్రీనిధాన పదచ్యుతి లేనివారు మధువులోపలి స్వాదుత మఱఁగువారు
పరమవైదికులు పితృదేవతల కాపు వచ్చి రిలకు మహాలయ పక్షములకు.

శరదృతువు
ఱెక్కలు చాఁచి తీరికగాఁగ గాలిలోఁ దేలిపోయెడు నంచవోలె వచ్చి
సితవస్త్రకృగరున్మతిని నృత్తసమభంగ తురికీల నర్తకిసరణి వచ్చి
ఇరుదెసల్‌ కాంతిచే నొరయ సూర్యున కెదురౌ సితాంబుజలక్ష్మి యట్లు వచ్చి
నిమ్నోన్నతములు లేని కులాంగనాచ్ఛ కూలంకషప్రేమ కల్పముగ వచ్చి
చందురునివోలె వననీరజాతబంధు కిరణసంస్పర్శ చేత వెల్గించుకొంచుఁ
దన తనూసృష్టి సర్వ మందముగఁ వచ్చెఁ దల్లి కృష్ణాతటిని శరత్కాలమూర్తి
చిందిపోయెడు పయశ్శ్రీశోభ విరియగాఁ బచ్చాకు బంగరువన్నె తిరిగి
వైడూర్యశకలముల్‌ పట్టి కుప్పలు చేయు గతి నున్న యందాలకంకె వదలి
వలయీకృతములు శోభాతరంగావళుల్‌ గగనవీధికకు మెట్లుగ నమర్చి
ఇట ముదాకృతి దేవు నెగచి పయోధరప్రౌఢ వారీగజపతినిఁ జేసి
అనయపథజన నేత్రకుట్టన నిమిత్తమైన పౌష్కల్య మేఁచి యూహలకు నూహ
సొగసు సంపాదనము చేయుచున్న దిదిగొ శరదమలమూర్తి కేదార సస్యలక్ష్మి
మిన్నను పాములచిన్నదాని గళాన నత్తగుల్లల పేరనంగ మొరసి
అతివాయువేగధూతాప్సరోంగనల చీరల చెంగు లనఁగ గూళ్ళులుగ నెగిరి
గగనవార్నిధితరంగములు నేలను దీరములఁ గట్టు నురుసు తెట్టెలుగఁ దోఁచి
సంకల్పగోఖురాంచలయై వెడఁద ధరణికి డిగ్గిన సరణి [వేగ?]వచ్చి
కూడి ఱెక్కలు తపతపఁ గొట్టుకొంచు గాలు మోపెడు తఱి నారికేళ విటపి
గములఁ గొల్లేటినుండి కొండలు సహస్రములుగ విడిసె మాలాబద్ధములుగ వచ్చి
పలుచని బురదలోపల మానిసినిఁ జూచి నెగచి యూఁకున దూఁకె నీటిపాము
వెలిపడ్డ బొరియ ముంగల నిక్కి తెల్లఁబోయెను గొంగ కెఱగాని యెండ్రకాయ
ఒడ్డున బురదలో గొట్టు గిట్టలు దిగిపడె జంఘదఘ్నమై పంటకాల్వ
జనము చల్లుటకుఁ దీసినపాయ పాపట చక్కఁ దీరిచి దిద్దె సస్యలక్ష్మి
పలుచగా వేడియెక్కుఁ బవళ్ళతోడఁ బైరగాలి పొరల్‌ తడియారఁజొచ్చె
పగటి కుషను నా నొప్పె నవార్షుకములు కాఱులకుఁ దొల్తగా శరత్కాల లక్ష్మి
అనిలాహతిఁ దబకలాడె నొడ్డులు మోచి క్రొత్తనీరము పెట్టుకొన్న చెఱువు
కాల గ్రుచ్చుకొనె డొంకలు గొడ్లగిట్టలు దిగిన గుర్తులతోడ బిగిసి యెండి
క్రొత్తనూర్చిన వడ్లకు సరికి సరి రేగుబండ్లమ్మవచ్చె లంబాడి పడుచు
వినిపించె వీధిలోనన గంగిరెడ్ల దాసరి సీత పెండిలి సలుపు కేక
బువ్వ చిక్కము కొడవలిఁ బూని బయలుదేరె వరికోఁతకొఱకుఁ బాలేరుచాన
ఒక విచిత్రమ్మ యగు శోభ నొలుకఁబోసె వడి శరద్వేళ మాగాని పల్లెటూరు
ప్రొద్దుటింతలఁ వాయువులు తావికై మెల్ల కొతిమేర చేలపైఁ గొసరులాడె
చిఱుచేఁదు వలఁచె గోసిన జొన్న చేనిలో దొడిమదగ్గర పచ్చి దోసపండు
పండి కోయని మిరపలు పెండ్లికూఁతుండ్ర వలె సకుంకుమశోభఁ గులుకులాడె
వడిసెల ఱా తప్పు నొడుపు నేర్పెను దల్లి చిన్నిపిట్టకు మొక్కజొన్నచేలఁ
జెలఁగె దలగిల్లిన పొగాకు సెనగతంపటలును బంతిపూల్‌ మిరపతోటలకు మధ్య
శరదృతు సమస్తమును బ్రదర్శనము చేసెఁ గూడి మెట్టపొలాల వికుంఠలక్ష్మి
చిఱుధూళి పొర కావి చెన్నుగా నిండ్ల కేతెంచె గోవులు తలాడించుకొంచు
తొలిచూలు చేమంతి తుదఁ బిందెవలె మొగ్గదొడిగి పచ్చఁదనమ్ము తొంగిచూచె
వాలు ప్రొద్దు షికార్లు వచ్చిన గాలులు చిఱుచలితోఁ బరాచికములాడె
చెదరిపోవు మొగిళ్ళ నదలించి పరవఁ దోలించె దర్జాల బాలేందురేఖ
పవలు చివరి సగము పరఁగ రాతిరి తొలి సగము పరిణమించు సొగసు లొలికి
జిలుఁగు జిలుఁగు వెన్నెలలు చూడ ననిపించె సర్వ మగు శరత్తు చంద్రిక దని
బురద త్రొక్కఁడు కాపు బుడుతఁడు మహిషంబుపై స్వారి పోవును బాలయముఁడు
చింకిజుత్తునకుఁ గైసేయు నంట్రింతలు పసి మాలకన్నియ పట్టమహిషి
చీడ నూఁగగు మిన్పకాడ కాయలను మూఁజూడదు దూడ నాజూకుకాన
అంతంత మూన్నెల లరకకట్టని గిత్త యాండ్రించు నందిదాయాదిగాఁడు
అట్టెవాన వెనుక పట్టినయంతలో నంతనంత నెమ్ము నారినంత
కాచికాచి యెండ కాసినయంతలో నివురుటెండఁ బుంత లెండినంత
పొలపొల విరిసిపోవుచు నల్పు విఱుగుచు మొల్లమ్ము చెడిన మొగిళ్ళవలన
పసిపస రేదు మువ్వపు సన్నజాజి మొగ్గల తొలివిప్పు నా వెలఁదు లగుచు
ఎడపడ్డ వానల జడులచేఁ జెమ్మలారిన లేఁత పొరగాలిపనల వలన
మరు సెలకట్టె మాదిరి దూసి చను కమ్మ గేదఁగితావులై స్వాదు లగుచు
చివర తెలిదారముల నూఁగు జిలుఁగు లొలయు పొట్లపూ వలెఁ బెరటిలోఁ బొలుపు లగుచు
నలరు నేడాకులనఁటి మొవ్వాకు జిగికి నెలవులు శరత్తు తలిరు వెన్నెలలు వచ్చె
తలపైని మినువాక లెలిమంచుపెఱ క్రాఁగి యొడల నోడిక లగుచున్న యటులు
నిచ్చలు తల్లిఁ దానే కూడి యున్కి సుగమ్ము చెమ్మట మేనఁ గ్రమ్మినట్లు
మౌళిభూష శశాంకు మన్నించుటకుఁ జంద్రకాంతమ్ముగా రూపుఁ గన్నయట్లు
తన లెంకలకు నెండ తలఁకు మాన్పంగ గ్రొమ్మంచుగడ్డగఁ దానె మలఁగినట్లు
శ్రీఁ బ్రకాశించె నిత్యాభిషేకవారి వ్యంగ్యభూతదయావాచ్యమైన మూర్తి
నందమూరున నన్నపూర్ణాంబికా సనాథుఁడై యేలుకొను విశ్వనాథ శివుఁడు.

హేమంతర్తువు
ఆగామి శిశిరభయంబుచే జమిలి దుప్పటి కప్పుకొనెనేమొ ప్రకృతికాంత
వేఁకి విసంబువిత్తై కుబుసం బూడ్చినది యేమొ మిన్నను నల్ల త్రాఁచు
గురుదారగమనాఘ కుటిలతలోఁ బుచ్చి నుసి రాలునేమొ చందురుని బిళ్ళ
ఉత్తరాయణ చారణోగ్రహరిఖురధూతిఁజెడి రాలిపడునో తెలిమొగిళ్ళు
జిగిలిగాఁ గ్రమ్ము వెలుఁగుల జీరులాడు పొడిపొడిగ రాలుఁ దుప్పర పడిగఁ గురియు
దెలుఁగునేల నాల్గుచెఱంగు లలముకొన్న దాత్తహేమంతవేళాది యైన హిమము
తట్టలోఁ గూర్చుండఁబెట్టిన వధువునా గుమ్మడిపూవులోఁ గులికె నొకటి
ఖండితాపాంగసక్త నవాంబుకణమునా ఘాసాగ్రమున యందుఁ గదలె నొకటి
తులసి మ్రుగ్గున నిడ్డ తొలునాడు దివ్వెనా సాలీని పటముపై సాఁగె నొకటి
ఘూర్జరీముఖలబ్ధి కొసముత్తియంబునా నాఁదూడ నొసటిపై నాడె నొకటి
మధువునాఁ బూవుఁబూవున మసలె నొకటి జగ్గునా నాకు నాకున జాఱె నొకటి
మంచుబిందులు నవసుకుమారమూర్తిమంతములు ప్రాతరంత హేమంతవేళ
తానమాడె హిమానఁ దరుపాళి యాకురాల్చుటను ప్రాఁజీర యూడ్చుటకు మున్ను
ఊఁగి ప్రాశించె బొడ్డూడని దూడ ప్రాకుడుపైనిఁ గూడిన గుమ్ముమంచు
కళ్యాణవిధి పంటకళ్ళమ్ము తీర్చికొన్నది జిల్గు పచ్చి ముత్యాల మ్రుగ్గు
జోగెఁ బూరిల్లు ప్రాఁజూరు పుల్లను జారఁదగినంత లేని బొట్టగు హిమమ్ము
నిలచి చెవులూచి [. . . .] తల విదిర్చెఁ బొలములోఁ గట్టివేసిన ముసలియెద్దు
కొంత ముదిరిన ఋతు వొనగూడి ప్రాతరంత హేమంత కాంత ప్రశాంతవేళ
తములపాకుల తీవ నమరించు మాఱాకు పువుకొసల్‌ బావిలీ ల్సవదరించె
పొదిగొన్నచో వెన్నువదలిన చెఱకు పూనిగ్గు రత్నపు జిగినీ లమర్చె
కోరళ్ళపైఁ దీవ గుమ్మడిపూవులు పొనురాగిడీల చెల్వు లమరించె
చిన్నారి పొన్నారి చేమంతిపూవులు తిరుగుడుపూవుల తీరు చేసె
అంటుకమ్మలు సొరపూవు లందగించె చెంపలసరాలు గడ్డిపూ ల్చెలువు తెచ్చె
మంచుఁగొం డాడుపడుచు లేతెంచి యాసకొలఁది కైసేసికొన్న భూషల వితాన
పసపు తోటలకునై వదలిన కాల్వలో నెఱుకులు మావు లుంచిరి బిరాన
దిగువ కాలువ చెమ్మ యిగిరి బెరడుకట్టి మఱు ప్రొద్దు ప్రొద్దుట బురదవడియె
వడి రెండుజాముల మిడివేళ వరిమోళ్ళు త్రోపంది మంచుబిందువులు చిలికె
వెలివడి బురదలో గిలగిలలాడు మత్స్యములచే బక తపశ్చర్య సడలె
మాడ్చి పగట నెండలు రేల మంచు తడిపి వెచ్చి పచ్చిగ వేగెఁబో విశ్వమెల్ల
భూత మాగామి యగు ఋతువ్యూహ మెల్ల తన కడుపులోన దాచివచ్చినదొ ఋతువు
గొబ్బిళ్ళ దేవత కొప్పులోఁ జెరివిన మగని మక్కువపైఁడి మొగలికచ్చు
పాదులు పెట్టిన పాటిదిబ్బ కడుపు ప్రత్యక్షమైన గారాలకూచి
మదనేష్టికృతికిఁ దుమ్మెద సౌమపీథికై యవనికి డిగివచ్చినట్టి రంభ
దానార్థవినియోగతా పుణ్యజన్మమో గల్భమ్ము నోముల గౌరుదేవి
మొదలి శ్రీజాతి కొప్పున ముడుచుకొన్న ప్రసవ సంతానములలోని ప్రథమభూష
మదురు గుమ్మడిపూవు హేమంతలక్ష్మి పసుపు రాచిన మొగమునాఁ బరిఢవిల్లె
వేఁబోక మ్రుగ్గులు వెట్టెడుఁ గన్నె ముత్తైదువ మంచుఁగొండాడు బిడ్డ
దూరానఁ బశువుల తోలుక చను రైతు ప్రాలేయ గిరిరాజు పాలికాఁపు
క్రొత్తగాఁ బంటపెక్కున వేయుఁ బురికొప్పు హిమభూమిధరరాజ హేమచూడ
తడిపాటిగోడఁ గ్రుమ్మెడుఁ గాడిఁగల పనిగిత్త యిల్లడ మున్న గిరిశునంది
ప్రపతదాసారగురుతుషారచ్ఛలమున సపరివారమ్ముగా హిమశైలరాజు
వలసవచ్చెనో దక్షిణాపథ మనంగ నెగిడెఁ బ్రాభాతికము లాంధ్రనీనృతమున
యత్ర ధూమము వహ్ని తత్ర యన్నట్లు నీహారధూమ మనుమితాంగజాగ్ని
స్థానివదాదేశ శాస్త్ర పద్ధతి, దుషారమ్ముల వర్ష కార్యములు కలిమి
అల నన్వయంబుచే వ్యతిరేకమునఁ జేసి యుభయ సంధ్యాసిద్ధి యూహకలిమి
శుక్తిముక్తాఖ్య రజ్జుభుజంగమభ్రాంతి దూరస్థ సర్వవస్తువులయందు
దృష్టికిని నంతరితము బాధించు విధిగఁ బరము పర మ్మబాధమ్మాతపముల వలన
సూర్యమండలాంతర పురుషుని మయుండు వఱలు ఋతురాజు శాస్త్రప్రవర్తకుండు
పాతరలం దుంచఁబడిన విఘ్నేశ్వరు కోసమో యెలుకలు గుద్దలించె
ఒక కన్ను గ్రుడ్డియయ్యును కాక మెండఁ బోసిన ధాన్యలక్ష్మి ముక్కున విదిర్చె
కందియు జనుమును గాయ లెండిన లోనిగింజలు గలగల గిలకరించె
పచ్చి పసుపుదుంప బాలెంతరాలునాఁ బసిమితో నందమ్ము పాదరించె
మింట మంచున కిలమీఁద మెట్టపంట పసిమి కొదుగక తప్పక వచ్చెఁగాక
గండుటెండలు పట్టపగ్గాలు కలవె మహిత హేమంత మెల్ల గ్రీష్మముగఁ జేయ
సీలమండలలోఁతు సికతాప్రవాహమ్మునం దీఁదు చిరుచేప చందమామ
మొగి నుదక్యాస్నానమునకయి నూరిన యోలగందపుటుండ బాలతరణి
చిఱుతజంపతి ప్రదక్షిణముచేఁ జెఱుగు హౌసరి నాకబలి మ్రుగ్గు జరఠసంధ్య
చెలువ వేన్నీళ్ళాడి చెమరించు నుదుటిపైఁ దీర్చు బాసటబొట్టు దీపకళిక
ఔషధము వండు పుటముపై నావి వెడలు మూఁతచిల్లుల మూఁకుడు ముంగినింగి
లేరుకొని దమ్ముకొని జీరువారి కురిసి యుభయసంధ్యలు కాచు హిమోల్బణమున.

శిశిరర్తువు
శిశిరమ్ము వచ్చె పారశవధారాకృంతనమువోని చిన్నాధరములదాఁక
ఆజ్యధారా లేపనాభిరామ నవాధరములతో మృదుశిశిరమ్ము వచ్చె
నేతెంచె శిశిరమ్ము సాతంక పాణి పాదాంగుళీ కర్ణనాసాంతములకు
హేమంచలోర్ణాయులోమోత్తరీయాత్త ధృతులుగా శిశిర మేతెంచె మృదువు
శిశిర మేఁగుదెంచెఁ జెఱఁగుల నాల్గింటఁ దెలుఁగునాఁట సుమవతీ లతా స
తీ సుమ ఝంగతి ధురీణకాంతా ప్రకాశమాన కైశికములదాఁక (???తీసుమ గతి ఝంఝ ధూరీణకాంతా ప్ర)
పసి పెండ్లికూఁతురు పతిమేజువాణిలోఁ జాదు గందపుఁబూత జలదరించె
కుడితి తొట్టియపైని దవుడు నాలుక లాగి ముట్టె ముంచదు చూలు మొదటి మొదవు
వ్యాజమ్ము కనిపెట్టె పరిరంభరుచికినై మూఁడు నిద్దురలులో ముద్దరాలు
ప్రక్కకై యిడిన దుప్పటికూడ నిదురలోఁ గొని కప్పుకొనియెఁబో కుఱ్ఱవాఁడు
ముడుచుకొని మునిగాళ్లలో ముట్టెఁ జొనిపి చిన్నియాఁదూడ రేయి మ్రాగన్ను వెట్టె
చలికి బెదరిన దనుటలో సౌఖ్యమందు నంతొ యింతొ భాగస్వామి యయ్యె జగము
పచ్చియూరక మున్న పసిదూడ కొసకాలి గిట్టలు మెలపుతో గిల్లుకొనఁగ
ప్రత్తివిత్తులు ప్రాతవడ్లు చేటనుబోసి మిసిమి బాలెంతావు మేఁపుకొనగ
మావి యెప్పుడు వేయునో, వేసి తినకుండఁగా వేయికనులతోఁ గాచుకొనగ
తన దూడను హరింతు రని బుస్స కొట్టుచుఁ గ్రుమ్మడు నావునకుం దొలంగ
పాడియా వీనఁగా నొక్క పంటకాఁపు కాఁపు పెండ్లామును సుఖజాగరము చేసి
రుత్తరీయము పయ్యెత యొడ్డుకొనుచు నడు శిశిరకాలమున నొక్కనాట రాత్రి
చలిఁ బేరుకొనిన కొబ్బరినూనె కుదుపలే సీమంతములయందుఁ జెక్కుకొనుచు
కంగులలోఁ జల్లగా నున్న మడతలే కఠిన స్తనశ్రోణిఁ గబ్బుకొనుచు
చలిరాజు ముద్దు చెల్లెలు గంధపూఁతయే కంఠదేశములందుఁ క్రమ్ముకొనుచు
తతలోహమయత శీతలభూషణమ్ములే సంధిబంధములందుఁ జాదుకొనుచు
తమధరించిన వస్తువుల్‌ తమ యొడళ్ళవేడిమిని గొంతకొంతకా వెచ్చగిలఁగ
స్మరమహాసత్రయాగాగ్ని సమిధలైన భీత హరిణాక్షుఁ [గని?] జని బెదరిపోయె
పల్లకీ బొంగుతోఁ బాటు వంగెను గమ్మవారి పెండ్లికుమార్తె వదనసీమ
ప్రత్తికాయ విధానఁ బగిలిన పెదవితోఁ గొమరారె ప్రత్తేరు కూలిపడుచు
చెదరిన ఱెల్లుపూ చెలువొప్పె జనుములో మునిఁగి మేసెడు గిత్త మూపురంబు
ఆకూడ్చి చిగిరించు మోఁకగాఁబరికిణీల్‌ వదలి చీరలు కట్టెఁ బ్రథమయువతి
చీమ యిల్లాలు కరి వేపచెట్టు మొదట గ్రుడ్లిడి చిబారుపండ్లని కులుకిపోయె
కొన్ని ప్రాణుల ధర్మముల్‌కూడఁ జలికి గూడి యన్యధర్మము లానుకొన్న వనఁగ
పాడెబఱ్ఱియ చనుల్‌ పగిలి తాఁకఁగఁ బాలు తీయుచో నడ్డమ్ము తిరిగి తన్నె
ముంజేత నార్మడి పోయఁగాఁ దొలిదుక్కి కనువఱె దుక్కిటె ద్దఱ్ఱు పగిలి
లేరు వెట్టియును బాలేరు పెండ్లిండ్లఁ జిక్కిరి గింజలేదు పాతరను దీయ
ములఁగ చెట్టునకుఁ గంబళిపుర్వు బలిసి యిల్ప్రాకి కూరాకులు నాకిపోయె
చిలుపజల్లు పడి పొగాకు చెడియెఁ బశువు మేఁతకయ్యెను బెసరయు మినుమును జెడి
రైతు లొక్కొక్క డొక్కొక్క రాపు నొందె జెప్ప నొకరీతిగాని శైశిరమువలన
చల్లపోసికొనంగఁ జలివేసె జిహ్వకు మంచి నీళ్ళులు ద్రావ మణఁగె నాల్క
కంచాలఁ జేతులు కడిగిరి పిల్లలు కడుగక కాళ్ళులు తుడుచుకొనిరి
చల్లారకయ మున్న చప్పరించిరి పాల బెల్ల ముంచిన వేడివేడి జున్ను
తలుపింత యోరవాకిలి తీయనీయరు నుహు హంచు గొంతుకూర్చుండి తింద్రు
తిని యలుక కుండఁ బసపు చిందెదరు నీళ్ళు చిలికెదరు తడిచేత రాచెదరు పైని
జిఱుచలికిఁగూడ పెనుబీతు చెందె జనము తడి పరిహరించుటకె మేలు పడియె బ్రతుకు
అద్దమ్ములోఁ జూచినట్లు నేపాళపుఁ గాయలో దమ చలికంఠ మరసి
ఎప్పటి యత్తయో యిప్పుడే పగయట్టు లరకాళ్ళు చలికాచు చటమటించి
సగము నిద్దుర లేపి జనని యన్నము పెట్టుటెఱుఁగ కాఁకలి యని యేడ్చి యేడ్చి
దుమ్ముకొట్టుక తల దువ్వించుకొనకుండ నూరేగుటను దిస్సయొడలు పగిలి
పట్టుకొని తల్లి సంజల జుట్టు దువ్వి యొడల నూనియ రాచి మైఁ గడిగినంత
నావులించుచుఁ జేతుల యందె తూలి చిన్నిబిడ్డలు నిదురింత్రు శిశిరవేళ
ఉరము గందముతోడ నుదికిన పాగతో వేంచేసె నీటుగాఁ బెండ్లిపెద్ద
గుమ్ము తప్పెటలతోఁ గొమ్ముబూరాలతో నెలగోలు మేళమ్ము లేఁగుదెంచె
గొడుగు నీడలతోడఁ గుచ్చుచెప్పులతోడ నడచివచ్చిరి పెండ్లికొడుకు మడఁతిఁ
ముంత కొప్పులతోడ వింతగందములతో వెడలిరి నవ్వుల పేరటాండ్రు
పిన్న పాలెగాని పెండ్లి యూరేగింపు సాఁగుదెంచె రెండు జాములపుడు
అరుగుపైని నిడిన యాకువక్కలు గొంచు వీధియెల్ల నొడ్డు విరిగిపోయె
వృషభరాజ విషాణ కషణాంకితాకాశమున వంకజాబిల్లి యనవసరము
భూభృత్సుతాతనూశోభాపరీవాహగతిఁ బిండుమిన్నేఱు గరుజులేదు
భృంగిరిటేశ కల్పిత విభూతి విలేపమున వెండిమలవెల్గు పనికిరాదు
చక్షుశ్రవశ్శిరశ్ఛవిమన్మణిచ్ఛవి చ్ఛటఁ దుమ్మిపూల ప్రసక్తి లేదు
చలి పరిహరించుట ప్రపత్తిఁ గలుగఁజేయఁ గలుగఁజేసెడు స్వామి లోకముల వాంఛఁ
జలి యుషోవేళ నిర్భయస్నాతలకును జలి బెదరి గుండియలు జారి చదికిలఁబడె.
AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - telu.rgu R^ituvulu (R^itusaMhAramu) - vishvanAtha satyanArAyaNa - Telugu Rituvulu Kavisamrat Viswanatha Satyanarayana - Gnanapitha Telugu Awardee ( telugu andhra telugu literature )