కావ్యములు తెలుఁగునాడు దాసు శ్రీరాములు

కవి పరిచయము


పీఠిక

శ్రీనాథుని 'వీధినాటకము' ననుసరించి కొంతవరకు వ్రాయబడినప్పటికి వానికిని నా పుస్తకమునకును అనేక విషయములలో భేదమున్నటులఁ జదువరుల కందరకు విశదము కాఁగలదు. శ్రీనాథుని వీధిలో నాంధ్రస్త్రీ వర్ణనము మాత్ర మతి శృంగారముగా వర్ణింపబడియె. ఈ నా పుస్తకములో శ్రీనాథుని లోనున్న యా యతి శృంగారము గానరానీక తెనుఁగు దేశపువారల ప్రకారములు మాత్రము కొంచెము చమత్కృతితో స్వాభావికముగా వర్ణించితి. ఈయది తెనుగు దేశములలోఁ గల ముఖ్యవర్ణముల వారిని వర్ణింప నుద్యమించిన నా 'తెలుఁగునాడ'ను మహావీధిలో 'బ్రాహ్మణ ప్రశంస' యను ప్రథమభాగము. ఇందు ఆంధ్ర బ్రాహ్మణులలోని పలు తెఱఁగులవారి కులవర్తనములు, ఆచార వ్యవహారములు, వేష భాషలు మున్నగునవి వ్రాయుఁబడియుండె. ఇందొక తెగను గుఱించి వ్రాసిన వర్ణనలు మఱొక తెగవారికి సంబంధించుననియు నియ్యది నిష్పక్షపాత బుద్ధితో వ్రాయబడియుండలేదనియుఁ గొందఱందురేమో. కవిత్వపు పస చెడకుండ సాధ్యమైనంత నిష్పక్షపాత బుద్ధితో నాశక్తి కొలఁది వర్ణించియుంటినే గాని వేరొండు గాదని చెప్పగలను. ఇదియునుంగాక మనదేశములో బ్రాహ్మణ జాతిలోఁగల వివిధ శాఖలవారు అనవసరముగాఁ గల్పించుకొను వివాదలు తగ్గింపవలెనని నా యుద్దేశము. బ్రాహ్మణ శాఖలలో వివాహ సంబంధము లుండుట శ్రేయోదాయకమని నాయభిప్రాయము. ఈ యభిప్రాయమును ఈ పుస్తకమందేగాక యింతకు ముందు నాచే రచింపఁబడిన యితర గ్రంథములలోఁ గూడ వెల్లడిచేసితిని.

ఈ పుస్తకపు తుదిభాగము నే గ్రామాంతరమున నుండు నవసరమున ముద్రింపఁబడిన దగుటచే నచ్చటచ్చట గొన్ని ముద్రాస్ఖాలిత్యములు దోపవచ్చును. అట్టి వానిని రెండవ కూర్పున సరిచేసికొందును.

సంఘ విషయములఁగూర్చి అబాధకములగు చమత్కార కావ్యములు మనదేశభాషలలో లేవు. ఐరోపాఖండమువారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణభూతములైనవి యిట్టి కావ్యములేయని నేను జెప్పనవసరములేదు. కనుక చదువరులారా! యీపుస్తకమున నుండు విశేషములను, వర్ణనలను గురించి మనసున వేరుగాఁ దలంపక నాయుద్దేశము నాలోచించి మన్నించి చదివి తక్కిన భాగములు కూడా త్వరలో వెలువడునటుల నన్ను ప్రోత్సాహపఱచెదరని నమ్ముచున్నాను.

దాసు శ్రీరాములు
ఏలూరు
15-7-1899
PREFACE

Though written somewhat after the fashion of Srinatha's Veethi, this book has deviated from it in many points as the reader will see. My books, unlike Srinatha's, is not confined to a description of the peculiarities of Telugu Women and it is more over free from the morbid taste which is met with in the pages of Srinatha's book. This pamphlet termed the "Brahmana Prasamsa" treats of the Brahmins and forms the opening chapter to my intended work viz. a description of all the principal castes of the Telugu people. It might be said by some that I am not altogether impartial and that the remarks applied to one sect may, with equal truth and force, be applied to another. To this I can only say that I am as impartial as I can be, and that poetic fancy can not be althogether judged by any hard and fast rule. I may also say that among others it is my object in writing this to smooth down the many and unpleasant differences between sect and sect and in fact in this, as well as in some of my previous books, I have ventured to preach my pet exhortation Inter-marriages among sub-sects of Brahmins and their advantages.

In the latter portion of the book which has been printed during my absence in a distant place, one may find wrong punctuation here and there and I beg to say that such will be carefully corrected in the second edition.

In conclusion, I beg to point out that there is a great need in Vernacular Literature of books containing witty and painless observations on social matters; it is such literature that has done so much in moulding the present polished manners of European countries. I therefore beseech my readers, to take the remarks contained herein in the spirit in which they are offered and to encourage me to bring out the other parts of the work.

DASU SRIRAMULU
Ellore
15-7-1899
శ్రీరస్తు
తెలుఁగునాడు
(స్తుత్యాదికము)
ఉ. శ్రీపరమున్‌ మహేశుని భజించి రసంబు ఘటింపఁ గాళహ
స్తీపురమున్‌ బురాణపురి శ్రీగిరి యెల్లలుగాఁ దలిర్చు నా
నాపుర మానితం బయిన నాఁటఁ జెలంగు దెలుంగుఁబల్లెలన్‌
గాపుర ముండువారల ప్రకారము వీథి యొనర్తుఁ గ్రొత్తగన్‌.
ఉ. లోకవితాన మేలు పరలోకవిభు డఖిలంబు గూర్చెనౌ
నా కవితాకునన్‌ ధనమునం బరితృప్తులు గాక నిక్కువా
రా కవితారసంబు కెనయంగల రిద్దమరేయి దొంగకున్‌
రా కవితంబ యయ్యవి నిరాకుల చిత్తులపాలి భాగ్యముల్‌.
చ. తెలుఁగునఁ దేటతెల్లముగఁ దెల్పినమాట వరాలమూటగాఁ
దెలుఁగున మాటలాడు మనదేశపువారు గణింతు రందుకై
తెలుఁగనునాఁటివారల నుతింప నతిశ్రమ మంచు నెంచకే
తెలుఁగున వీథి సేయఁదగదే ధని మెచ్చిన మెచ్చుగల్గునే.
కం. కులవర్తనముల నానా
కలనము లాచారముల ప్రకారము లందం
బులఁ జందంబుల నుడుఁగుల
పలుతెఱఁగులు నిందుఁ జెప్పఁబడుఁ గడువేడ్కన్‌.
చ. ఇది నవవీథి దీనికి ననేకరసంబు లనేకనాయకుల్‌
పదపడి మంచిచెడ్డలును బాగులునోగులు మేళ్ళుఁగీళ్ళునుం
గొదవలుగొప్ప లాంధ్రజనకోటికి నెట్లగు నట్లు సెప్పెదన్‌
మదిఁబరికించి కోపమును మానుఁడు నానుడుఁ గానుఁడూరకన్‌.
ఉ. ఉన్నది యున్నయట్లు మధురోక్తులఁ జెప్పిన కబ్బ మెప్పుడున్‌
బన్నమునొంద దందఱును బాగని మెత్తురు, లేనిపోని దం
ధన్నలు కొన్ని పన్నుక కతల్‌ వెదఁబెట్టిన నేమి, యన్నెమా?
పున్నెమ? పూరుషార్థమ? బుభుక్షువు సేసిన బ్రాహ్మణార్థమా?
సీ. భాషీయపద్ధతి పట్టుదప్పఁగనీక దీర్ఘ సమాసంబు తెరువుపోక
గూఢార్థసమితి దిక్కున దేఱిచూడక స్పష్టార్థములజాడ జాఱనీక
మఱుఁగు పదంబుల మార్గంబు ద్రొక్కక తేటమాటల రాచబాట విడక
దూరాన్వయంబుల దారి మూచూడక సంకరాలంకార సరణి గనక
గీ. ఉన్నయది ఉన్నయట్టులు గన్నయదియుఁ గన్నయట్టులు విన్నది విన్నయటులు
నన్నయది యన్నయట్టులు వన్నె వెట్టి కవితఁ జెప్పిన సంతోష మవు జగాన.
సీ. ఉచ్చరించినమాట యూఁకొన్న మాత్రనే యెట్టిదో తాత్పర్య మెఱుఁగవలయు
నెఱిఁగి డెందానఁ జింతించిన మాత్రనే దృష్టాంత మొకటి స్ఫురించ వలయు
స్ఫురియించి సరిఁజూచి పరికించు మాత్రనే దొసఁ గిందు లేదని తోఁచవలయు
తోఁచి యొక్కింత యాలోచించు మాత్రనె "యౌరా! యథార్థమే" యనఁగవలయు
గీ. స్వస్తుతియుఁ బక్షపాతము సంప్రదాయ భంగమును, మత్సరము, శాస్త్రబాధ, నీతి
లోపమును, నింద, కఠినోక్తి దోఁపరాదు కవి జగచ్ఛ్లాఘనీయమౌ కవిత గూర్ప.
ఉ. ఓరుపులేని వాఁడను మహోద్యమ మిచ్చి సుధీముఖంబునం
దీరుపులేనివాఁడను, విధిచ్యుతి లేని కృతిన్‌ రచింపఁగా
నేరుపులేనివాఁడను, గుణిప్రకరం బెపుడైన నిందు నా
కూరుపుఁ జూచి చీ! యనునొకో? తలపెట్టితి నేమి సేయుదున్‌.
ఉ. లోకములోని యెల్లనరలోకముల న్నిఖిలప్రవృత్తులం
దేకముగా సృజించెను మహేశుఁ డటంచుఁ తలంచి యెవ్వఁడా
లోకము సేయు, వాఁడె యతిలోక మతిక్రముఁ డంచు గీతలం
దా కమలాతరంగవిభుఁ డర్జునుతోడ వచించె వింటిరే?
ఉ. నందునినందనుండు విడనాడె భువి, న్గలి వచ్చె నాఁడె య
న్నందున నాఁటనుండియును నాలుగుదొమ్మిది తొమ్మిదీరువో
నందననామవత్సరమునన్‌ శుభపౌష సితాష్టమిన్‌ ధరా
నందననామవాసరమునన్‌ దొరకొంటిని దీనిఁ జేయఁగన్‌.
కం. పదునెనిమిదివందల తొం
బది రెండగు నాంగిలేయ వత్సరమున ని
ర్వదియెన్మిదవ డిశంబరు
మొదలుగ నివ్వీథిఁ జెప్ప మొదలిడితి వెసన్‌.
తెలుఁగునాడు
బ్రాహ్మణ ప్రశంస
వైదికులు
చ. వచనములందు మార్దవము, వస్త్రముల న్మడి, వంటకంబులన్‌
బచనము సేయు చేతిపరిపాటి, శ్రుతిస్మృతిచోదితక్రియా
నిచయమునందు భక్తి, గృహిణిన్‌ సుఖపెట్టుట, వాసవాటికా
శుచితయు వైదికోత్తముల సొమ్మనవచ్చు నసంశయంబుగన్‌.
సీ. చదివిరా! ఋగ్యజుస్సామముల్‌ భూర్భువస్సువరాది లోకముల్‌ స్తుతులు ముట్టు
మెదపిరా! పెదవి గుంఫిత మృదుస్తుతిపాఠ సల్లాపముల నల్లరాళ్ళు గఱఁగు
తలఁచిరా! క్షేత్రయాత్రలు సేతు కాశికా గంగోత్తరలకు మూఁ డంగలీడు
నిలిచిరా! సత్కర్మనియతి న్మహాధ్వర కాండంబు పౌండరీకంబు దట్టు
గీ. పఱచిరా! పంచపాళి దర్భాసనములు ముక్కుమూఁతల సరిపుత్తు రొక్కజాము
బళిర! యీపాటి పరిపాటి దెలుఁగునాఁటి వైదికునితోటి యేమేటి వచ్చుసాటి.
చ. శమము దమంబు శౌచమును సత్యముశ్రౌతము స్మార్తమున్‌ మృదు
త్వము సరసత్వ మార్యజన వందనతృప్తి విగర్హిత క్రియా
విముఖత యప్రమాదము వివేకము నీశ్వరభక్తి నిశ్చల
త్వము నిరపాయజీవనము వైదికవృత్తిని మించ నున్నదే.
ఉ. నీళ్ళకు నిఱ్ఱితోళ్ళకును నేతికరుళ్ళకు దొడ్డయుత్తరేణ్‌
వేళ్ళకు దర్భముళ్ళకును వేదపునోళ్ళకు సన్నకుట్టు వి
స్తళ్ళకు రావిపేళ్ళ కనిశంబును మళ్ళకు పప్పుఁగూర ప
చ్చళ్ళకు రాగిబిళ్ళకును సంతసమందుదు రాంధ్రవైదికుల్‌.
ఉ. తాతలనాఁటి సాలువులు దాపటివంక బుజాలపైఁ గడుం
బ్రాతఁదనానఁ జిన్గులగు బాటగునం చొకయింత వింతగా
మూఁతమడంచివైచి మొగము ల్తెగఁబూసినబూది జాఱఁగాఁ
జేతుల ఝారు లొప్ప ధనిఁ జేరఁగవత్తురు వైదికోత్తముల్‌.
చ. తెలతెలవాఱఁ గాల్యములు దీరిచి స్నానముఁజేసి బూదిమై
నలఁది కుశాసనంబుల నొయారము మీఱఁగఁ గూరుచుండి ని
శ్చలమతి సంధ్యవార్చి విలసజ్జపమాలిక వ్రేళ్ళఁ ద్రిప్పుచున్‌
మిలమిలఁ గన్నుదోయిని నిమీలనవైతురు వైదికోత్తముల్‌.
చ. విడువకురా! "ఉతోతఇషవేనమ" రా! అదిదుడ్డు రాముణాః
కొడక? యటన్న మాట విని కొంకి "ఉతోత ఇసే; నమంచు శి
ష్యుఁడు" దనవెంట రా వడఁకుచుం గుడిచే నొకయక్షమాలచొ
ప్పడ నొకచేత దండమిడి బాటను వైదికవృద్ధుఁ డేగెడిన్‌.
ఉ. త్రుళ్ళఁగ నీరుకావి మడిదోవతికమ్ములు వ్రేళ్ళబిళ్ళకు
చ్చెళ్ళిడి కట్టి నీళ్ళబుడిచెం బొకచేతనుఁ బట్టి దారిలోఁ
జిళ్ళల కొత్తుకొంచు నొకచేఁ దడికొళ్ళయి బెట్టి పెళ్ళిపం
దిళ్ళకు భోజనాన కరుదెంచును వైదికశేఖరుం డిలన్‌.
సీ. మోకాళ్ళు దాఁటని మొరటు గావంచాల నందియందనిగోఁచి యంటదోపి
పిల్లగాలికిఁ దూఁగి యల్లాడు చిన్న నేరెడుగాయవలె జుట్టు ముడియవైచి
నడునెత్తి పెడచెంప లెడనెడఁ గాన్పింపఁ దల నొక్కయంగవస్త్రంబుఁ జుట్టి
గీరు గంధపు రేఖ దీరైన నొసటిపై పసపక్షతల చుక్క యెసఁగ నునిచి.
గీ. బెదరి చూచుచుఁ బెఱవారి కొదిగికొనుచు జందెపోగులు చిక్కువోఁ జమిరికొనుచు
నోట నొకఋక్కు ముమ్మాఱు నొక్కి యనుచు శ్రోత్రియ క్షితిదేవతాసుతుడు వెడలు.
ఉ. లేవరు లెండు లెం డనిన, లేచినవారయినం దటాలునం
బోవరు, పోవుచున్‌ నిలిచి పోదుముపోదుము త్రోయకుం డటం
చీవరు సందు గేస్తు నలయింతురు పెండిలిలో సదస్య సం
భావననాఁడు చూడవలె బాపన సాములసాము లన్నియున్‌.
చ. అనుదిన మంగపంచకము నందఱికిన్‌ వినిపించు బాపఁడా
దినమును వారఋక్షములు దెల్పు మఱిం గరణంబు యోగమున్‌
వినఁబడఁజెప్పి త్యాజ్య మొక వింతగ నీడిచి చెప్పి పై పయిన్‌
బనిగొని "రావె కేవె" యని పాఱున దేమిటి చెప్పుమన్న దా
వినఁ డవి రాహు కేతువుల వేధ లటంచు నెఱుంగ కజ్ఞుఁడై.
ఉ. సత్తుగ దేవతార్చనపు సంచుల నున్ననివేల్పు రాళ్ళకున్‌
వత్తులు గాల్చి పూవు లిడి వాసనదూపిడి గంటగొట్టి మా
కత్తెసరంచు లౌక్యులగృహంబుల జొచ్చిన వైదికోత్తముల్‌
కుత్తుకనిండఁ బచ్చడియుగోరస మన్నము దిండ్రు నిచ్చలున్‌.
శా. గంగాజోస్యులవారు మీకును నమస్కారంబటంచు న్వెసన్‌
వేంగప్పంతులుగారు పల్కవినుచున్‌ వేదోక్తమాయుష్యమం
చుం గేల్దోయిని జాచి పల్కి నగికొంచున్‌ భోమహారాజ! యే
భంగిన్‌ మా బ్రతుకెల్ల మీదని స్తుతింపజొత్తు రాశ్రోత్రియుల్‌.
మ. నిను నే మెచ్చిన మెచ్చులా? యనృతమా! నీకల్పవృక్షంబునీ
డను నీజందెపు చాటునం బ్రతుకువాఁడన్‌ గొప్పసంస్థాన మెం
దున బోసేసిన మీవె మాయమృతమస్తుల్‌ మాప్రభో! పేదవాఁ
డను గాపాడు మటండ్రు వైదికులబిడ్డల్‌ లౌక్యులం గాంచినన్‌.
సీ. ఉదయించుచున్న సూర్యునివంటి గుండ్రని ముతకకుంకుమబొట్టు మొగమునిండ
కొయ్యకరాటానఁ గొని వ్రేల మెదిపి రాచిన నూనెకాటుక కనులనిండ
అట్టిట్టు గదులాడునట్టి మేల్ముత్యాల ముక్కుపో గొకప్రక్క మూతినిండ
గోటంచుతో బొద్దుకుట్టు గుట్టిన గట్టి పైఠిణీ మోచేతిపట్ల నిండ
గీ. మాలనూలును చీరెల సాలినేఁత మూరగలిగిన దళముగాఁ బుంజ మిడిన
మేలికమ్మె సొగసుచీరె మేనునిండ బ్రియుఁ గదియుఁ దెల్గునాఁటి శ్రోత్రియవధూటి
శా. ఆస్సే; చూస్సివషే; వొషే; చెవుడషే; అష్లాగషే; యేమిషే;
విస్సావఝ్ఝలవారిబుఱ్ఱినష యా విస్సాయ కిస్సారుషే
విస్సం డెంతటివాఁడె యేళ్ళు పదిషే; వెయ్యేళ్ళ కీడేషుమా;
ఓస్సే బుఱ్ఱికి యీడషే; వొయిషు కే ముంచుందిలే మంచివొ
ర్చెస్సే; యందురు శ్రోత్రియోత్తమపదస్త్రీ లాంధ్రదేశంబునన్‌.
సీ. కోడికూయఁగ మేలుకొని తలవాకిలి పై పాచిజిమ్మి కలాపిఁ జల్లి
దడదడగా దంతధావనం బొనరించి యిల్లల్కి మ్రుగ్గిడి యెనుముఁ బిదికి
పొరుగింటి కేగి నిప్పును దెచ్చి రాజేసి మడివలువల నుత్కి పిడిచి మడఁచి
బుజముపై నిడి దండెముల నాఱవైచి కూరలు దర్గికొనియు దండులము లోడ్చి
. పసుపు రాచుక నీళ్ళు పైఁబోసికొని బట్ట తడిది గట్టుకొని తీర్థంబు దెచ్చి
నాలుగుసేర్ల తప్పేల దబ్రాగిన్నె రాచిప్పయొకటి పొయ్‌రాళ్ళఁ బెట్టి
గీ. కళపిళ నెసళ్ళు గ్రాఁగించి కమ్మనైన
వంటకా ల్చేసి విస్తళ్ళ వడ్డనములు
పొసఁగఁ గావించి భయభక్తి పూర్వకముగ
నుపచరించును వైదికయువతి పతిని.
చ. వసుధ నియోగి బాలికను వైదికబాలున కిచ్చి చేయఁగా
బస నది యిట్టునట్టనిన బాగషునిష్షను మంచు నత్తయ
బ్బెసమొనరింప నొక్కతఱి పీషష? పెష్షష? మామగారికిన్‌
మసలక "పెష్షుపెష్షు" మను మాషలెపల్కెనషండ్రుగష్షిగన్‌.
ఉ. పావనమైన వైదికుల భాష గొఱంతలు పట్టి తెల్పుట
బ్బా? వినరాదుగా జెఱకు వంకరబోయిన యంతమాత్రనే
పోవునె తీపి? కొందఱిది పోల్పరు వైదికుపిల్లి వ్రత్తి మ్రేవ్‌
మ్రే వనునండ్రు రేఫమది శ్రీకరమున్‌ శిఖిబీజముం గదా.
నియోగులు
చ. బడిపడిఁబాంథబాడబులు బ్రాహ్మణగేహము గోరుచున్న నీ
నడువడియెల్లఁజూడు కరణాలను బ్రాహ్మణు లందువా; సరే
వడి నడువీధిలో నిలకు వచ్చినదారిన పొమ్ము పొ మ్మటం
చడుగునఁబుట్టుమంట తల కంట నదల్తురు లౌక్యభూసురుల్‌.
సీ. మెలిఁబెట్టి విడిచిన మీసాలపై గొప్ప నిమ్మకాయలు రెండు నిలుపవచ్చు
తేటగాఁదెల్లగా తెగఁగాలు లంకాకు పొగచుట్ట జుంజురుఁ బోల్పవచ్చు
నడువీధి రెడ్డిగా లిడి రచ్చ దీర్చుచో సివిలుజడ్జీ లని చెప్పవచ్చు
అసదుగాఁ బొసఁగించి నొసటఁ బెట్టినబొట్టు లొక్కమా "ఱుప్ఫని యూ" దవచ్చు
గీ. వడివడిగఁ జిన్న నాఁడైన వడుగునాఁడు తడఁబడుచుఁ జెప్పుకొన్నట్టి తప్పుసంధ్య
ముక్క నాలుగు నిముషాల ముగియవచ్చు బళిర! యనవచ్చు లౌకికబ్రాహ్మణులను.
శా. జ్ఞానాధిక్యము, శాంతి, యర్థిజనరక్షాదీక్ష, భూపాలకా
స్థాన ప్రాపిత వైభవంబు, పటుమంత్రప్రజ్ఞయున్‌, సంతతా
క్షీణం బుగ్గునఁబెట్టు తల్లియె నియోగిబ్రాహ్మణశ్రేణికిన్‌
మానంబేనగ, మాట లేకవచముల్‌ మర్యాదలే భాగ్యముల్‌.
ఉ. ముచ్చిలి గుంటజుట్టుముడి మోయఁగ నెత్తిఁగుళాయి యిస్తిరీ
యిచ్చినకోటు మేనధరియించి బుజాన రుమాలువైచి లేఁ
గచ్చను జీరుగోఁచి యిడి కట్టిన మల్మలు చెంగు జాఱఁగా
నిచ్చి చెడావులం దొడిగి యేగు నియోగిసుతుండు నిచ్చలున్‌.
ఉ. ద్వారముఁజేరఁగానె యవధానులుగా రదె వచ్చిరే నమ
స్కారములండి రండి పఱచండి కుశాసన మౌనుగాని గో
చారబలంబు నా కిపుడు చాలునొ? చాలదొ? చెప్పుఁ డీ పరి
ష్కారముగా నటండ్రు సరసంబుగ వైదికుఁగాంచి లౌకికుల్‌.
చ. కరణము మంత్రసాని సరకారు ప్రసూతిక రైతుబిడ్డ ని
బ్బరమగు వ్రాఁతకోతలు జవాబుసవాళ్ళును దంత్రయుక్తి బం
ధురముగ నూరిమీఁద నొక నూరయినంబడుఁగాక యెన్నఁడుం
గరణముమీఁదనొక్కయఱ కాసయినంబడదండ్రు మానవుల్‌.
చ. నిరుపమబుద్ధిశాలి కరణీకముఁ జేసిన యూరికాపు లె
ల్ల రు భువిఁబాలుబొంగినటుల న్మదిఁబొంగుచు 'దొడ్డవోఁడుమా
కరణముబిడ్డయింటఁ గలఁకాలము మేలగు' నంచు గంగఁగొ
ల్తురు సరికానివా రతని దొడ్డిన మేపుదు రాలమందలన్‌.
చ. నడవడిమంచి వ్రాఁతకరణంబతఁడెప్పుడు వ్రాయుచుండఁగన్‌
దడదడమ్రోఁగుఁగూఁతకరణంబతఁడన్నిట సున్న యిందఱిన్‌
దడఁబడఁజేసి మేఁతకరణంబు గుటుక్కున మ్రింగు నెల్ల రా
బడులును బెళ్ళికట్టములు బందరుపజ్జన కొన్ని యూళ్ళలోన్‌.
చ. కరణము నంజనేల దరఖాస్తులకాలమె పంటకళ్ళ మం
చెరఁబడి చేయిసాఁప రయితెట్లనొ చౌలము పావు దెచ్చి య
క్కఱగడతేర్చుమం చడుగఁగా నెకరానికి మాడ మేర కం
దఱునొసగంగ నీనొసటనా? యుదయించెనుప్రొద్దుపొమ్మనున్‌.
ఉ. ఓరీ! చాకలి కాళ్ళు గ్రుద్దు మని యె న్నోసార్లు నేఁ బిల్వలే
దా! రావేమిర? తిమ్మిరెక్కినదొ లేదా బుద్ధి నీచాకి రం
చేరేవో యిఁకజూఁడు నీమదము నాకెవ్వార లడ్డంబురా?
తేరా దస్త్రమటండ్రు గ్రామకరణా ల్తీవ్రప్రభావంతులై.
శా. నమ్మిన నమ్మకున్న నది నావశమా! జను లాడుకొన్న వా
క్యమ్ములు నేను జెప్పెద భయంపడియో పడకో! నియోగిలో
కమ్మనివార్య కార్యఘటకమ్మవుఁగాని పరోపకార శూ
న్యమ్మును స్వప్రయోజన పరాయణమున్‌ దలపోయ నిద్ధరన్‌.
చ. ముదికరణాలు రాముగుడిమోసల రచ్చలుదీర్చి భారతాల్‌
చదువుచు లోకవార్తల బ్రశంసల నండ్రు తెలుంగు భాషమం
చిది మనపిల్లకాయలు వచించెడి యింగిలిపీసు పుస్‌ పుసన్‌
బెదవులు దాఁట దెంతటి యెఫేయు బియే యెమియే వచించినన్‌.
ఉ. ఈతఱి జాతిరాచఱిక మింతటి దుర్గతి దెచ్చెఁగాని మా
తాతహయాములో నుడుగు దాఁటినవారలఁ బట్టితెచ్చి చ
ట్రాతను గట్టి కొట్టి పదిరాత్రు లటుంచిన రాజుతోడ వి
జ్ఞాతము సేయు వాఁడొకఁడుగల్గెనె యందురు వృద్ధలౌకికుల్‌.
ఉ. స్నానముఁజేసి సంధ్య నిముసాననె దీరిచి బొట్టుఁబెట్టి పీ
ఠానను గూరుచుండి యెఱడా లరివాణము జోడు చెంబులుం
దా నమరించి మంచియరఁటాకున నన్నము గూరగాయలున్‌
దాను భుజించు సైసినపదార్థము గొంచు నియోగి నిచ్చలున్‌.
గీ. అడిగినది యిచ్చు త్యాగి సత్యమున సేగి
అన్ని గల్గినభోగి భార్యగలయోగి
చిలుమిడనిరాగి వండ నేర్చిన నియోగి
కంచు దివిటీలతోన జగాన గాన.
చ. గడబిడ చేసియైనఁ దనుఁ గట్టిగ మంత్రము సెప్పఁ డెప్పు డా
గడమునఁగట్టు సేయవలె గ్రామపురోహితు నంచు తప్పకన్‌
గడియలు లెక్కఁబెట్టి సరి కానిది యైనది చూచుకొందురే
బడబడఁ బాటఁ బాడినను బట్టఁగలేరు తెలుంగులౌకికుల్‌.
ఉ. యజ్ఞము సేయఁ గావలయునన్నిటిఁగూర్పుఁడు నాఁ బురోహితుల్‌
ప్రజ్ఞలు గొట్టి యిచ్చినవరాలను గై కొని మీరు వేదసా
రజ్ఞులు యాజమానములు రావలె నందు రనంగ లౌకికుం
డజ్ఞులహో! కొనుండు మన కవ్వియు నాలుగుబండ్లను న్వెసన్‌.
ఉ. కేలఁ గలంబు వట్టిన వకీలుతనం బొనరించుచున్న నే
కాలము దీర్పుఁజెప్పు, నధికారముఁజేసిన గాకితాలు ద
స్త్రాలగుఁ గాళ్ళుకాయలగుఁ దప్పకొడల్‌ కనఁగాచుకొన్న చూ
లాలిని బోలు క్షుత్తు చెడు లౌకికవిప్రులలోన నొక్కటన్‌.
చ. అనుపమ మేరుమందరగుహావళి మూయఁగవచ్చుఁగాని యీ
మనుజులనోరు మూయఁదరమా యనుకొం డ్రది యంతపట్టున
మ్మనలవికో నియోగి తన పచ్చయెకాని సహింపఁ డన్యుప
చ్చ ననుచు దాని కేమి విరజాజులు రాజులుసైత మట్లనే.
మ. కొమరుంబాపట కడ్డమై మొగలిరేకుం దమ్మలంపాకు నం
దముమీఱన్‌ జడచుట్టపై నిడిన సాదాబిళ్ళపైఁ బచ్చఱా
లు మురాళింపఁగ గూబకుట్టులునుఁ దాలూకాలఁ జిల్లాలమ
చ్చెములం దుద్దుల బుష్యరాగములఁ డాల్చీఁకట్లు పోమొత్త నె
య్యమున న్భర్తల బ్రీతిగొల్పుదురు లౌక్యబ్రాహ్మణ ప్రేయసుల్‌.
స్మార్త సాధారణ విషయములు
ఉ. కమ్మనిమాట యొక్కటి సుఖమ్ముగఁ జెప్పెద నాలకింపుఁడీ
యెమ్మెను భోజనంబులకు నేదయినన్‌ శుభకార్యవేళలన్‌
రమ్మని యెంత బిల్చినను రా రొకపట్టున లౌక్యభూసురుల్‌
పొమ్మని యెంత గెంటినను పో రొకపట్టున వైదికోత్తముల్‌.
చ. మసలుచుఁగర్మకాండమును మాయముఁజేసిన రీతి జూచియున్‌
బస లలితప్రవర్తనము బావినిఁ ద్రోచినభాతిఁ జూచియున్‌
వసుధ నియోగిసంధ్యయును వైదికు చేతివిడెంబటంచునున్‌
హసనముఁజేతు రెల్లపుడు హా పెఱవారలు కోడిగాలకున్‌.
చ. పొసఁగు సమస్తము న్గలముపోటున మేటినియోగి కెప్పుడున్‌
గొస కఖిలంబు వైదికునకున్‌ సమకూరును దర్భపోటునన్‌
వసుమతి నేలువారలకు వచ్చు సమస్తము నీటెపోటునన్‌
బస నని కొంద రిట్లు తెలుపం దొరకొందురు కోడిగాలకున్‌.
ఉ. ఈయిసుకోలుబళ్ళకడ నింగిలిపీసులు పీసుపాసుగాఁ
గూయగఁఁజొచ్చి యామయిలగుడ్డలు వంకెదగిల్చిరండు మొ
ఱ్రో యన నాలకింప రిసిరో! కలికాలము గాలె రామ రా
మాయను వృద్ధురాలయిన స్మార్తవితంతువు మాటిమాటికిన్‌.
ఉ. కమ్మని కందిపప్పు నురు గారఁగఁ గాచిన నేతిబొట్టు దూ
రమ్మున దావిగ్రమ్ముకొనిరాఁ బొగుపెత్తిన యాకుఁగూరలుం
గుమ్మడి పొట్ల కాఁకర మునుంగయు వంగయు దొండ బెండ శా
కమ్ములు దప్పళంబులను గల్పి భుజింతురు శాలితండులా
న్నమ్ములు బ్రేవుమంచనుదినం బరటాకులలోన బ్రాహ్మణుల్‌.
శా. అచ్చమ్మా యిది యేమిటే; రెయిలటే ఆసీ యిదేనా; సరే
బుచ్చమ్మాఁ వినలేదటే గడియలోఁ బోవచ్చునే కాశికిన్‌;
అచ్చో దేహము గ్రుద్దుకోదటె అయో ఆసౌఖ్య మేమందునే
యిచ్ఛారాజ్యమటండ్రు ట్రైనుగని యెంతే వింత విప్రాంగనల్‌.
ఉ. అంతయు నొక్కటే సకల మాత్మయె నీ దిది నా దిదంచుఁ గా
సంతయు నెన్న రాదు తన యాలయ, దార, ధనాదులన్నియున్‌
భ్రాంతులటంచుఁ బ్రత్యహము పల్మఱుఁదప్పకచెప్పి శుష్క వే
దాంతులు కొంప దోఁతురు కడాపటఁ జోగినిఁ జేతు రజ్ఞులన్‌.
చ. వలదని నేను చెప్పి గెలువంగలనా? యిఁకఁజాలుఁజాలు నేఁ
దెలియక యొక్కటన్న నలుదిక్కు లనన్‌ బదియండ్రుకానిలే
తెలిపెదఁదెంపునం దెలుఁగుదేశపుస్మార్తుల వియ్యపొత్తులన్‌
తలచిన ధర్మశాస్త్ర పరతంత్రులు గారనవచ్చు వారలన్‌.
చ. చెలఁగి నియోగిశాఖలను జేతురు వియ్యము భేద మెంచ రు
జ్జ్వలమతులైన కొంద ఱిఁక శాఖలు మూడును నాఁడునాఁటికిన్‌
గలయుచు వచ్చుచున్నయవి గాని యదేమొకొ తక్కుభేదముల్‌
దళముగఁ బట్టుకొన్నయవి దైవవశమ్మున నాంధ్రమండలిన్‌.
మ. వెలినాఁడున్‌ దెలగాణెమున్‌ మురికినా డ్విఖ్యాతము న్వేఁగినా
డు లలిం గౌసలనాఁడు నా నయిదునాఁడుల్‌ ఋగ్యజుస్సామవి
ఖ్యల శాఖాత్రయివారు ద్రావిడులు సత్యాషాఢు లార్వేలవా
రలు బల్‌ నందవరీకులున్‌ దమిళవారల్‌ పాకనాఁటీలు స్మా
ర్తులలో విస్తరిపొత్తె వియ్యముల పొత్తుల్లేవు వింతయ్యెడిన్‌.
మాధ్వులు
సీ. "జావు లా" వని తురుష్క వ్యాహృతులు సెప్ప "సాకు భే" కని స్వభాషలు వచింప
పంతులవారి ప్రభావంబు వెలయింప నాచార్యభావంబు నధికరింప
ఓర్పుతో రాజకీయోద్యోగములు సేయ ఘనభక్తి దేవతార్చనలు నెఱప
భోగినీయోగ సంభోగంబు చాటింప దివిరి సాలగ్రామతీర్థ మాడ
గీ. చాల మీగాళ్ళఁ దూల నీమాఁలదొడుగ తప్పకను మేనఁ బంచ ముద్రలు వహింప
లౌక్యవైదికములు చెవుల్‌ పట్టిలాగ మాధ్వు లొప్పుదు రీయాంధ్రమండలమున.
సీ. గట్టి గానొకపట్టు పట్టించెనేని ముప్పత్తుహోళిగ తృణప్రాయ మనును
స్వస్తుతిన్నమ్మ దేవర దొడ్డ దేవర తెలియ ముఖ్యప్రాణ దేవర యను
పరనింద నిమ్మదేవర యేను దేవర రుబ్బుగుండాకార రూఢి గనును
తత్త్వబోధలు సేయుతఱిని జీవపదార్థ బేరె యీశ్వరవస్తు భేద యనును
గీ. ఘనతరాంగారపుండ్ర శృంగారకలిత ముఖమె సుఖ మను మై గంధ లిఖిత ముద్ర
భద్రవితరణ కరణ నిర్నిద్ర యనును మాధ్వుఁ డనిశంబు నీయాంధ్రమండలమున.
ఉ. బేరము లేని బేరి, శరవేగముఁ బెట్టని నారి, దంధణల్‌
బాఱనిభేరి, ధర్మపరిపాలన లేని కచేరి, స్వచ్ఛ మై
పాఱనివారి వంటకము బాగుగఁ జేయఁగ నేరనట్టి వ్యా
పారి, యవాహకం బగు సవారిన పోలుదు రాంధ్రభూస్థలిన్‌.
ఉ. బాగుగనున్న వానికడ బంధువులెల్లరుఁ దారె చేరి యే
లాగుననేని వాని బదిలంబుగఁ దంటనపట్టివైతు రా
త్యాగియు నాయమున్‌ వ్యయము నారయ కూరకనోడుఁ దాను ఫే
ణాగళుపూరిగళ్‌ ప్రతిదినంబును దప్పరు మాధ్వు లోగిటన్‌.
సీ. మాతుగళిల్లె నమ్మ గురురాయర మహా మధ్వరాయ స్తోత్ర మాడు బేకు
మంత్రగళ్‌ హేళినామగళు స్మరిసి హనుమద్దేవరార్చన మాడు బేకు
మహిమఁ దత్త్రైలోక్యమాత శ్రీతులసిక నోడి ప్రదక్షిణ మాడు బేకు
అతిభక్తి శ్రీభాగవతకేళి నందకుమార నమస్కార మాడు బేకు
గీ. మహితపుణ్యనదీతీర్థమాడు బేకు మానితాంగారపుండ్రగళ్‌ మాడు బేకు
బేకు బేకు సదా బేకు బేకు బేకు అనుచు మాధ్వులు భాషింతు రనుదినంబు
ఉ. కన్నడబాస లోఁగిట, నిఁకం దెలుఁ గందఱితోడ, బైటి క
త్యున్నతమైన బెబ్బులి ప్రయోగము, లోపట మేఁకపోతు కొ
ల్వున్నయెడ న్నవాబు పనియూడిననాఁడు పకీరు, భూస్థలిన్‌
గన్న సనత్కుమారుఁడు పగల్‌, నిశిగాముఁడు మాధ్వు డెన్నగన్‌.
మ. విసరుం జేతిరుమాళ్ళతో నడుగులన్‌ విప్పారు నేమాలతోఁ
దసుకాడుం బయిజార్లతోఁ దలల నూదారంగు పాగాలతో
వెసఁ బట్టంచులుజాఱు పై వలువతో బేషక్‌ కలందాన్లతో
బస వార్థక్యముఁ లోన దాఁచగలరా పంతుళ్ళవా రిద్ధరన్‌.
శా. సారోదారులు సాహసోద్ధతసమాచారుల్‌ వినోదార్థవి
స్తారుల్‌ ధీరు లలుత్ప్రతాపశిఖిసంతప్తారు లత్యంతగం
భీరుల్‌ శూరులు దానసౌరులు బదర్‌ ఫేణీ మిఠా లడ్డు కా
హారుల్‌ పంతులువారు పొల్తురు ధరన్‌ వ్యాపారులై పాఱులన్‌.
సీ. కడుఁజెల్వమగు బెండకాయబొట్టు మొగాన దతగంధముద్రాంకితములు మేన
మడచి తీర్చిన జరీ మధిరయోణి బుజాన వెలగల యుంగరా ల్వ్రేళ్ళపైన
అపరంజివిడికడియము మణిబంధాన పగడాలసరము చొప్పడు గళాన
పట్టంచు దట్టంపు బలుఠీకు పుట్టాన మేలుముత్యాలతమ్మెట్ల తోన
గీ. దస్త్ర మపసవ్యమునఁ గలందాను సవ్య భాగమున నుంచి కలము చేపట్టి గోవ
కాగితంబులపొతక మ్రోకాల నునిచి ఫరుదు బరపర వ్రాయు వేపారిఁ గంటె.
ఉ. సమ్మతి నమ్మకర్మ సహజంబగుకర్మ యటండ్రు నిమ్మక
ర్మ మ్మది దుష్టకర్మ యని పల్కుచునుందురు నోటి కేదియ
డ్డమ్ము జనమ్మునం భళభళాభళ మాధ్వులవంటివారు ని
క్కమ్ముగ లేరులేరని పుకారు పకారులు కారు కా రిలన్‌.
శా. ఔనోయీ నరసింగ రాయఁడ హూకుం అంపించినావా, మదార్‌
ఖానున్‌ చిత్తము వానిఁ బంపిన పనుల్‌ కావచ్చు సందేహమా?
సానాబోగముదా? మహాప్రభుఖులాసా కేమి యేముండయో
తానాగన్నెఱసేయు నున్నతపదోద్యన్మాధ్వుఁ డత్యుగ్రుండై.
శా. వీటీమోది విటీనటీకుచతటీ విన్యస్తపాటీరయు
క్శాటీమోదికటీపిటీ పటువచో జంఝాటధీరార్భటీ
ధాటీమోదిఘటీభటీకృతశఢా దత్తార్థవిప్పార్యయః
పేటీమోది వినోది మాధ్వధరణీబృందారకుం డిద్ధరన్‌.
ఉ. మాధ్వగురుండు వచ్చు నొక మాఱు పదేండ్లకు, వచ్చివారిధ
ర్మాధ్వ మదే యటంచు వరహావరహా యొకయగ్నిముద్రకున్‌
సాధ్వసలీల నిచ్చినను సాకన డింకను బేకు బేకు బే
కుధ్వని సేయు, మోక్షమునకుం గరణంబు హిరణ్యమే సుమీ.
చ. విరివిగ నేయి నూనియల వేపుడుకూరలు మెండుమెంతి చ
ల్లొరుగులు నూరుబిండులు ననూనము లప్పడము ల్వడెంబులం
బొరిఁబొరి నొందునుం దిరుగఁబోఁతల నింగువ లెస్స మంచిపాల్‌
పెరుగులు వెన్నమీఁగడలు పెంపుభళాభళిమాధ్వులోఁగిటన్‌.
సీ. ఒఱపైన వలిపెంపు చెఱఁగుగోచీకట్టు తాటిముచ్చికవంటి తాలిపొట్టు
చేతుల నపరంజి చిన్నారిపోచీలు మేలైన మెడఁ బిరి కీలసజ్జు
కడుఠీవి నడుమున గంటల మొలనూలు నెఱిగుల్కుదమ్మెలఁ గరణిపూలు
పదయుగంబున వెండి పాంజేబు లందెలు బటువుగుబ్బలబిగి పైఠిణీయు
గీ. గలిగి బంగారుకీల్బొమ్మ వలెనె హంస గమనమున మెల్లగఁ బడకగదికిఁ జేరి
యలరి పతితోడఁ జెండ్లాట లాడి యిష్ట భోగములఁ దేల్చు వ్యాపారిపూవుఁబోఁడి.
మ. అనువారం బొకనోము స్నానములు మెండాచారము ల్చెప్పఁ జా
లను వస్త్రంబులయందు దేహములజాలం బారిశుద్ధ్యంబు మా
టను మాధుర్యము ధైర్యముం దెలివితేటల్‌ చాల నౌఁగాని యే
పనియున్‌ గట్టిగఁజేయనోరువరు వ్యాపార్యంగనారత్నముల్‌.
సీ. బెళగావ్‌ తలేహేద్దు బేగవు దంతధావన మాడి స్నానవు మాడికొండు
మడిగట్టుకొండు నే మకకూడి దేవతార్చన మాడికొండు బెచ్చగెపదార్థ
ఈశగెభోజన యిట్టికొండుం దాను మధురభోజన బేగ మాడికొండు
తెలెబాచియనొడివి గళుహాకికొండు నిష్ఠగెపురాణపుకేళి సఖగళువరు
గీ. కూడి హువ్వి వనకె హోగి కొయ్దు హువ్వి గళుసరపుమాడయన్‌ రాత్రి కాలపతిగె
భూరిసంతోషదిందతాన్‌ భోగిసురుళు కృతసుకృతపాణి వ్యాపారికీరవాణి
ఉ. కన్నులు ద్రిప్పు సోలు గటకాముఖహస్తముఁ బట్టు జాఱుగా
వెన్నున నున్నపైఁట నొక వింతగ నంతట సర్ది నిండుగాఁ
బన్నుకవెంకుబాయ్‌ తులసిబాయ్‌మొదలైన సఖీజనంబుతో
గన్నడబాస మాధ్వసతి కందువలాడు విధంబు గంటిరే.
మ. తెమలున్‌ బుణ్యవతీవిలాసము లధోదేహంబునం, దూర్ధ్వదే
హమునన్‌ బోడితనంబు, నోటను నృసింహస్తోత్రముల్‌, కన్నులం
బ్రమదావర్తనముల్‌, మెడం దులసికామాలల్‌, కయిన్‌ బుష్పహా
రములున్‌, మాధ్వవితంతుయౌగపదసారాసారశోభల్తగున్‌.
మ. నిజమో కల్లయొ నే నెరుంగను నరుల్‌ నిందింత్రు నిచ్చల్‌ నియో
గిజనశ్రేణినిఁ గుక్కగుంపనుచు, నగ్గిం త్రెప్డు మాధ్వద్విజ
ప్రజలన్‌ గాకు లటంచు, వైదికులరాబందుల్‌గదాయంచు, బే
రజమాడం దొరకొండ్రు దీని కొకమేరం గారణం బుండెడిన్‌.
వైష్ణవులు
సీ. గండభేరుండంచు గల ధోవతీకట్టు కొమరైన పట్టెనామములబొట్టు
కడుఁబెద్దముడికిఁ జొప్పడెడి సందెఁడుజుట్టు నితరుల కెఱుకగా నీనిగుట్టు
సామాన్యులకును దుస్సాధ్యంబయినబెట్టు ద్రవిడభాషాప్రబంధములఱట్టు
కఱ్ఱతోఁ దోలినఁ గాని పాఱనితట్టు తట్టంపు తెఱచాటు తళియపట్టు
గీ. అట్టులిట్టుల ననరానియట్టి యట్టులెట్టు లే దమ్మిపేశిలో నెట్టునెట్టు
గట్టిగాఁ దెల్గుదేశంబు బట్టినట్టి వీరవెష్ణవులను దొట్టు వారుమట్టు.
ఉ. ఆసరసోక్తి, యామృదుత, యాగురుభావము, నాప్రసన్నతా
భ్యాసము, నాముఖోద్యత విభాసము, నచ్యుతదాసదాసవ
ద్దాసవరేణ్యదాసభటదాస తదీయకథానదాసవి
న్యాసనితాంతనైచ్యనటనాభినయంబును, వైష్ణవార్థముల్‌.
చ. తళతళ నెఱ్ఱఁబాఱ నిరతంబును దోమిన తామ్రపాత్రముల్‌
మిలమిల నున్నగా నలికి మెత్తిన యత్తిరుమాళిగల్‌, కడున్‌
బెళబెళనాఱ దండెముల వ్రేలగవైచిన ధౌతవస్త్రముల్‌
భళిభళి వైష్ణవోత్తములపాలిటి భాగ్యము లేమి చెప్పుదున్‌.
సీ. చీటికిమాటికి శ్రీమతే రామానుజాయ నమో యంచుఁ జదువుసొగసు
నిరుపమభక్తిచేఁ బెరుమాళ్ళనుఫిరాట్టు దిరువడిఘల్‌ గొల్చి యెఱఁగుసొగసు
సారెసారెకుఁ దిరువారాధనంబులఁ దిరువాయిమొడి నోటఁ దెలుపుసొగసు
జ్ఞానులఁ గని యడియే నడియేను దాసోహ మ్మనుచుఁ బల్కుఁ నట్టిసొగసు
గీ. పరఁగఁ బన్నిద్దరాళ్వార్లఁ బరమభక్తి మించి తిరుమంత్ర మొనర సాయించుసొగసుఁ
బొగడుచో వేయినోళ్ళకు మిగులుగొంత వైష్ణవబ్రాహ్మణులదె దైవప్రపత్తి
సీ. తిరుమణి తిరుచూర్ణ తిరుణాళ్ళు తిరుమంత్ర తిరుమాళిగయుఁ దిరుక్కరియమధులు
తిరువీధి తిరుగలు తిరునామములు తిరువారాధనము తిరువాయి మొడియు
తిరువధ్యయనమును తిరుమంగ యాళ్వారు తిరువేళికయు మఱి తిరువడిఘళు
తిరుపతి తిరుమల తిరువీనములు తిరుప్పణ్నేరములు తిరుప్పావు మఱియు
గీ. తిరవలిక్కేణి తిరువటూ ర్తిరువనందపురమును దిరువళ్ళూరును తిరుతుళసియు
తిరు తిరు తిరు త్తిరు తిరుతిరుతిరు దిరుగు వైష్ణవ పరిభాష తెఱవు మఱుఁగు.
ఉ. ధారుణిమీఁదఁ గాల్ళొరయఁ దట్టుపయిన్‌ దగఁ గూరుచుండి వి
స్తారపుమోపుగట్టి మడిసంచులు ముందిడి, వెన్క దిండి సం
బారపుమూట పెట్టి యెడఁ బాయనిదాసుఁడు దోల శిష్యసం
చారముకై ప్రయాణమగు స్వామిని త్రోవనె చూఁడగావలెన్‌.
సీ. భుంభుం భురూంభురూం భుంభు మ్మటంచును బూరగొమ్ములవారు ముందు నడువ
ఢంఢం డడండడం ఢంఢ మ్మటంచును ఢంకాలవా రొకవంక నడువ
ఖణ్నీల్ఖిణీల్ఖిణీల్‌ ఖణ్నీలటంచును గిలకకఱ్ఱలవారు కెలన నడువ
గుళుగుళుగ్గుళుగుళు గ్గుళుగు ళ్ళటంచును గురుసంస్తుతులవార లొరసి నడువ
గీ. రంజితములైన ముత్యాల పింజరీల పైడియడ్డల బంగారు పల్లకీల
చెలఁగి తిరువీధి వేంచేపుఁ జేసికొనుచు వచ్చు జియ్యలవారు శ్రీవైష్ణవులను.
సీ. పల్లకీపై నెక్కిబహుజనంబులు గొల్వ బూర లూదుచువచ్చువార లొకరు
బడుగు గుఱ్ఱంబులపై నెక్కి కావటి వానిఁ బెట్టుక వచ్చువార లొకరు
సాలుఁజుట్టుక కుండలాలు వ్రేలఁగఁ బాదచారులై చనుదెంచువార లొకరు
తలలు మాపుక ఛత్రధారులై యక్షయపాత్రఁ బుచ్చుకవచ్చు వార లొకరు
గీ. అవని శ్రీరంగమున వేంకటాచలమున యాత్ర లొనరించువారల నాశ్రయించి
తీరి కూర్చుండి గడియించు వార లొకరు బహువిధంబులు వైష్ణవ వర్తనములు.
ఉ. దోసమువచ్చునంచు మదిఁ దోఁచెడినందునకేమి సేయుదున్‌
జేసినపాప మెప్పుడునుఁ జెప్పినఁ బోవును వైష్ణవుం డుప
న్యాసము జేసెనా? విడువ కాఱునెలల్‌ వినువారిమంగళా
శాసనశక్తి యెట్టిదొకొ? చప్పునఁ దీరును లౌకికార్థముల్‌.
చ. వినుమని చెప్పఁజూనితిని వింతకు, న న్నెవరై నఁచెప్పవో
యని పలికించిరా! యనృతమాడఁగఁగారణమేమి? మాట దాఁ
చను జలికోఁతమందుసుమి సంసరణ వ్రణపూర్ణశాంతికిన్‌
ఘనుడగు వైష్ణవోత్తము ముఖమ్మునఁ బొందుమహోపదేశముల్‌.
చ. చెవిఁ బడరాదు సాంబ శశిశేఖర శూలధరాది నామముల్‌
సవనము లెందుఁగాన మిఁక స్నానము లాగళముల్‌ ప్రచారమా
వివిధము సంధ్య సంగ్రహము వెల్లువ లద్భుతకైతవాత్మసం
స్తవములు వైష్ణవోత్తముల తత్త్వములం గొనియాడశక్యమే.
ఉ. కోపము వచ్చునేమొ మదిఁ గొంచెము నాకు భయంబుదోచెడిన్‌
దాపములెల్లఁదీర్చుటకు ఁదాపమె హేతువటండ్రు మంచిదే
పాపము వైష్ణవోత్తములు పల్కినదే నిజ మెట్టులంటిరా
వ్యాపకమైన వజ్రమును వజ్రమె వ్రయ్యలు సేయఁజాలెడిన్‌.
శా. ప్రీతిన్‌ శిష్యునకున్‌ సమాశ్రయణ మర్థి న్జేయుచో బాహువుల్‌
భీతిన్‌గంపిలఁజేసినన్‌విడువ రుర్విన్‌ వైష్ణవుల్‌నిర్దయుల్‌
"తాతాచార్యులవారి ముద్ర బుజముల్‌ తప్పించుకోఁగోరి కావుల్‌
లూఁతంబాఱిన వీఁపుదప్ప" దనుఁబూర్వోక్తి ప్రకారంబునన్‌.
ఉ. రచ్చలలోన నన్నుఁ బలు రవ్వల బెట్టిన నేమి వారికిన్‌
నచ్చిననేమి, కాక మఱి నచ్చకయుండిన నేమి చెప్పెదన్‌
పిచ్చియొ?వెఱ్ఱియో?నిజము, బేర్మిని వైష్ణవుఁ డెంతకాంచనం
బిచ్చిన నంతమోక్ష మను నీయకయుండిన ముక్తి లేదనున్‌.
చ. తిరుమణి విష్ణుఁడుండు సిరి దేటపడన్‌ దిరుచూర్ణమందు సు
స్థిరముగ నుండు వైష్ణవుని దివ్యముఖంబున నిద్దఱున్‌ సదా
తరలక యుండ్రిఁకన్‌ దులసిఁ దామరనట్లనె యుండ్రటంచుఁబ
ల్కిరి హరు లెందఱో సిరు లి కెందఱొ తద్ధరు లెందఱో ధరన్‌.
ఉ. గారవ మొప్ప శిష్యులకుఁ గమ్మని తియ్యని మంచిమంచి ప
ణ్నేరము లారగింపుడని నెయ్యమునం దయచేసి కొంచుసాల్‌
వారిబదేంటి దీకొఱఁత లాగరు, లాగుటఁ జెప్పునప్పుడా
చారులవారిఁ జెప్పవలె స్మార్తులఁగీర్తుల నట్టుఁబెట్టుఁడీ.
సీ. చల్దినైవేద్యముల్‌ చాటుననేగాని గ్రామదేవతఁ గొల్వ రాదటండ్రు
వఱుగుపచ్చడి దింట మఱుఁగుమాటేకాని గోంగూర దఱికి రాఁగూడదండ్రు
పుళిహోర సాదమాకలి దీరుటకెగాని యేకాదశినిఁ దిండి హేయమండ్రు
ఆత్మసంస్తుతులవి యాచారమేకాని దురభిమానము చాల దూష్యమండ్రు
గీ. ఘనపటాటోప మెల్ల లౌక్యంబెగాని దంభసంరంభములు సేయఁ దగదటండ్రు
చెట్టలకుఁ గొంత యుపపత్తిఁ జెప్పుచుండ్రు వైష్ణవాచారస్వామ్యయ్యవార్లుగారు.
ఉ. చుంగులువార ధోవతులు సొంపుగఁగట్టిన యుత్తరీయముల్‌
కంగులుదీర నంసములు గ్రమ్ముకవ్రేలఁగఁ జల్దిసాదముల్‌
ఠంగునఁగొట్టి కోవెలకొ ఠాయులఁ గొందఱుమంది వైష్ణవుల్‌
పొంగళిబుట్ట లెత్తికొని పోవుదు రిండ్లకు వీధివెంబడిన్‌.
చ. తెలియదు నాకుఁ బూర్ణముగ ధీరులు వైష్ణవు లేమి సేతురో
చలనము గానరాదు, తెఱచాటునఁ జేతు రదేమిటంటిమా
తళియ యటండ్రు కొంచెము నిదానముగా నొకయింతవింటిమా
గళుకుగళుక్కుమన్గటుకు గట్కుగుటుక్కుగుటుక్కుగుట్కుమన్‌.
శా. బారుంబూరుగ నారగింతురు వడప్పణ్నేరముల్‌ పూర్ణ ప
ణ్నేరంబు ల్పుళిహోర తైరువడ పణ్నేరంబు దధ్యోదనం
బారంగర్యమధుల్కొళంబు పురితొ హ్యాతైరుమోరున్మహో
దారస్వైరవిహారవైభవు లుదాత్తప్రాభవుల్‌ వైష్ణవుల్‌
ఉ. కాఁకరకాయ కట్టొకటి కై నిడిపోయెడికాపు జూచి "చీ
యేకడఁగజ్జికాయ లివి యేటి"కనన్‌ విని "మంచికూర యౌఁ
గాకరకాయలం" డనుచుఁ గాపు వచింపఁగ "నట్లనా, యవుం
గాకిటుఁజూపు" మన్న విని కాపు సమర్పణ సేయగా దిరు
ప్పాకముఁజేసి సాపడిరి వైష్ణవు లొక్కరు తొల్లి మెల్లనన్‌.
ఉ. వైష్ణవునామముల్‌ గని నవాబొకఁ డోర్వక నాక వానిక్రో
థోష్ణము నార్ప నాతడొక యుక్తిని బన్నెఁ దురుష్కభూమిరా
డ్జిష్ణుతకంచు నాభిపరిషి క్తము దిద్దుట గాన కాతఁ డా
యుష్ణకరాత్మజాలయము నొయ్యనఁబోయె నటండ్రుగ్రక్కునన్‌.
చ. చెఱువునకేగెడున్‌ జలము చెంబును బూనఁడు, లేశమాత్రము
న్మఱుఁగు జరూరులేదు, తను మానవు లెవ్వరు చూచినన్‌ సరే
వెఱువఁడు, బాహ్యగామి యగు వేళను, సాపడునప్పు డొప్పుగ
న్దెఱమరుఁగడ్డముంచకను తీరదు వైష్ణవభూసురాళికిన్‌.
చ. దిటముగ లోనగోచియిడి తెల్లనిధోవతి గూడకట్టుగాఁ
బటుగతిఁగట్టి జుట్టుముడి, బల్హొయలై వెనుపట్టెమూయఁగా
స్ఫుటముగ నూర్థ్వపుండ్రములు శోభిల దవ్వుల నవ్వుకొంచుని
వ్వటముగఁ గన్నులార్చుచును వైష్ణవమాణవకుండు వచ్చెడిన్‌.
ఉ. పూచినతంగెడుల్‌ కరిగి పోసినబొమ్మలు నిల్చి ధాత్రిపైఁ
దోచిన క్రొమ్మెఱుంగు లమితోజ్జ్వలరాజకిరీటకోటిపైఁ
దాచినపద్మరాగములు దర్ప కుదార లసత్పటంబుపై
వైచినచిత్రరేఖ లల వైష్ణవసుందరు లేమి చెప్పుదున్‌.
తరు. తిన్ననిసన్నని తిరుచూర్ణ రేఖ తీరుగా సౌరుగా దిద్దినమోము
మిన్నఁగా నున్నఁగా మెఱుఁగార దువ్వి మేలుగా వీలుగా మెలచినకొప్పు
చిన్నారి పొన్నారి చెమరెత్తుచున్న సిరుగుల్కు నెఱిఁదళ్కు చెక్కుటద్దములు
వన్నెతో చిన్నెతో వరుని మెప్పించు వాసిగా దాసిగా వైష్ణవయువతి.
ఉ. సారణిమీటుఁ గిన్నెరల సాటిగ సన్నని గొంతు లెత్తి శృం
గారముమీఱ రాగములు గాసరిగాఁబెరుమాళ్ళసన్నిధిన్‌
హారతు లిచ్చువేళల యొయారము వైష్ణవపమ్మవారలం
గారలదేసుమీ మధుర గానము తమ్మిళిపేశి దోడ్పడన్‌.
చ. కలదుసుమీ యొకింతయుపకార మనాథలపట్ల మేటితెం
గళి కుడివడ్హలం దదియుఁ గానము స్మార్తులతోటిపాటె యెం
దులకిటులంటి రంచు మదిఁ దోఁచెడి మీకును శంక దీర్చెదన్‌
నెలనెలకున్‌ వితంతువుల నెత్తులు మంగలి ముట్టకుండుటన్‌.
చ. "ఎడపక సానియి ల్మఱిగి యిల్లనఁ డద్దిర" యంచుఁ దండ్రియ
ప్పడఁతుక యింటఁగన్మొరగి బాలకుఁజూడఁబిపాస దానిపా
వడ బయికెత్తి లోనిమిడి పాలునుగూడునుసాపడంగ "నా
బుడుతడు వైష్ణవంబు నిలుపున్సరిగా" నని మెచ్చి వానికై
వడుల గణింప కేగెనఁట వైష్ణవుఁ డొక్కఁడు తొల్లివింటిరే.
శైవులు
సీ. భస్మత్రిపుండ్రముల్‌ ఫాలదేశంబున నడునెత్తిమెడమీఁదఁ గడతలందు
కనుఁగ్రేవలను వీఁపునను బుజంబులయందు మ్రోచేతులందు ఱొమ్మునను బొజ్జ
మణిబంధములఁ గటి మండలంబున వ్రేళ్ళఁ బ్రక్కల మోకాళ్ళఁ బిక్కలందు
సీలమండలనుఁ బాదాలపై నడుగుల వ్రేళ్ళ మొదళ్ళను గోళ్ళయందు
గీ. నిచ్చటచ్చట ననరాక నెల్లయెడలఁ దనువు నిండఁగఁ దెగఁబూసి తమ్ముఁజూచి
యదరిపడి బ్రహ్మరాక్షసుల్‌ బెదఱిపాఱ శైవభూసురు లాంధ్రదేశమునఁ గలరు.
సీ. తలయు గడ్డము మీసములు గోళ్ళుఁ జంకలు దండిగాఁబెంచి గొందఱు చరింత్రు
మణిగెఁడు రుద్రాక్షమాలికల్‌ మెడయందుఁ దలయందుఁ దాల్చి కొందఱు చరింత్రు
పులి వెంబడించినప్పుడు గూడ భవినీడ దరియ రా దనుచుఁ గొందఱు చరింత్రు
ఎట్టియాపదనైనఁ బట్టినట్టి వ్రతంబుఁ దప్పరా దనుచుఁ గొందఱు చరింత్రు
గీ. బ్రాహ్మణులతోడి పొత్తును భక్తిమీఁది వలపు నీరెండు నెన్నఁడు దలఁపునందు
మఱవఁగా రాదటంచుఁ గొందఱు చరింత్రు శైవభూసురు లాంధ్రదేశంబునందు.
సీ. పంచాక్షరీమంత్ర పఠనగోప్యమె కాని యధ్యయనంబు లంతంతమాత్ర
మాగ మోక్తంబుల నాచరించుటె కాని వేదోక్త మదియొక్క వీసముండు
నట్టిల్లు నిండఁగాఁ బట్టు పెట్టుటెకాని కర్మధర్మములెవ్వి కానరావు
తుదకు నూఱైన వత్తులు గాల్చుటేకాని యౌపాసనములు మాటాడరాదు
గీ. ధనము వెచ్చించి రాత్రిభోజనము లిడుచు జనులు గొనియాడఁగా గణార్చనలెకాని
యజ్ఞ యాగాదికముల పే రైన వినరు శైవు లేమందు నాంధ్రదేశంబునందు.
చ. పరశివునం దమందదృఢభక్తి, యనారతనిందితక్రియా
చరణమున న్విరక్తి, మధుసారము లొల్కుమృదూక్తి దేవతా
ధ్వరకరణాగమప్రచురతంత్రవిశంకటశక్తి, తుందగ
హ్వరపరిపూర్ణ భుక్తి, యహహా యివి శైవుల నైజసంపదల్‌.
చ. మనుదినమున్‌ ప్రసాదనియమంబును నిత్యమహేశ్వరార్చనం
బును నిరతంబు బిల్వదళపూజ సదాధృతభవ్యలింగలాం
ఛనమును సర్వదా పటుపిశాచవితానవిపాటనక్రియా
చణమగు భూతిధారణము శైవులు మాన్యులుగారె ధారుణిన్‌.
ఉ. కట్టలు కట్టలే కరుచు గావలెఁ బత్తిరి, మ్రుగ్గుపిండులా
బుట్టలె బుట్టలే తఱిగి పోవలె, మెత్తని దూదివత్తులా
తుట్టెలు తుట్టెలే చమురుతో వెలుఁగన్వలె, నౌ ప్రసాదమా
తట్టలు తట్టలే కొసలు దట్టగ విస్తరి నిండఁగా వలెన్‌
పట్టులు పట్టులౌర యయవారలకు న్శివపూజవేళలన్‌.
సీ. నూఱువత్తులవారు పేరు చెందనివారు వేయివత్తులవారు విడియుచోట
వేయివత్తులవారు వెనుకఁబట్టినవారు లక్షవత్తులవారు డాయుచోట
లక్షవత్తులవారు లావుదూలినవారు కోటువత్తులవారు గూడుచోట
కోటివత్తులవారు కొఱకుమాలినవారు భూరివత్తులవారు చేరుచోట
గీ. విత్తమునకే ముదాత్తవిద్వత్త కేమి చిత్తసత్తల కేమి ధీమత్తకేమి
వత్తులే బత్తులకును మహత్తు లెన్న దేవసములైన శైవభూదేవులందు.
ఉ. కాయము భూతిభూషితము కర్మము తీక్ష్ణము దుర్గమంబు న
త్యాయతి నంతరంగగుణ మద్భుతమైనశిలన్‌ గరుంగఁగాఁ
జేయుజగత్తమంబు పసఁజించు మహామహిమంబు భానులె
క్కాయను గంటిరే నివురు గప్పిననిప్పులు శైవభూసురుల్‌.
మ. తమకున్‌ వృద్ధవితంతుమండలము వేదాంతార్థసారోపదే
శములన్‌ శిష్యగణంబులై కొలువఁగా, సత్తంచుఁ జిత్తంచు భూ
తములంచు న్మఱియింద్రియమ్ములనుచున్‌ దత్తంచుఁ ద్వమ్మంచసి
క్రమమంచుం బరమాత్మయంచు గురురాట్కారుణ్యమంచుం దవై
వమమంచుం బహుధా వచింతురు వహవ్వా? వృద్ధశైవాగ్రణుల్‌.
ఉ. తత్త్వవిదుల్‌ శివద్విజులు దారు వచింతురు వారి కెప్డు ప్రే
తత్త్వము లేదుగాన తనుదాహము గూడదటంచు; బాగుదే
వత్వమునందు వారలకు వచ్చునధోగతు లాసమాధివా
సత్వమునన్‌ గతం బెఱుఁగఁ జాలవిరుద్ధముగాఁ గనంబడున్‌.
ఉ. తల్లికి భారమా? శిశువు, తామరతూటికి పువ్వు భారమా?
విల్లొకభారమా? కడిఁదివీరున, కొంటెకు గూను భారమా?
వల్లికి భారమా? ఫలము, బఱ్రెకుఁ గొమ్ములు భారమా, నుతుల్‌
చెల్లును లింగధారులకు లింగఁపుగాయలు భారమా? మహిన్‌.
శా. భూతప్రేతపిశాచ రాక్షసగణంబుల్‌ శాకినీఢాకినీ
వ్రాతంబు ల్భయకంపమంది తొలగన్‌ హ్రాంహ్రీంపటోస్వాహయం
చాతంకంబులుమాని మంత్రమహిమవ్యాప్తిన్‌ గ్రహగ్రస్తలం
బ్రీతిన్‌ దందనలాడఁజేతురు గ్రహావేశంబులన్‌ శాంకరుల్‌.
ఉ. లింగము వోయినంబ్రతుకు లేదనిశైవులు లింగరక్షణన్‌
భంగములేక సేయుదురు ప్రాగ్భవసంచితపాపశక్తిమై
లింగముపోయినం దెలియ లే రది మానవులంచుఁ గొందఱా
లింగముపోయినం బదులు లింగము దాల్తురు భక్తిమీఱఁగన్‌.
ఉ. మర్త్యత లింగధారణము మాత్రనపోవు నమర్త్యభావమే
కీర్త్యము శైవవిప్రతతికిన్‌, బ్రతు కందఱితోడిపాటె, యా
మర్త్యతకేమి యర్థమొ యమర్త్యతకేమొ యెఱుంగమాదటన్‌
మర్త్యత మంటపాలగు నమర్త్యత గంటిరె మంటిపాలగున్‌.
చ. వడివడిగా హరీ యనిన వారక మూతురు గర్ణరంధ్రముల్‌
తొడరి హరా యటన్నఁదమితోఁదమమేనులు దామెఱుంగ రా
గుడితలకట్టు భేదమునకున్‌ రసభేదము నొందునట్టి దె
క్కడిపని శైవభూసురశిఖామణులందునఁదక్క లాఁతులన్‌.
ఉ. కొందఱి భూతకోటిఁబురి కొల్పుదునం చదలించి లోఁగొనుం
గొందఱియింట నౌకరయి కొల్చి మతు ల్కరఁగించి యిష్టుఁడౌ
నందిన జుట్టుఁ బట్టుకొను నందక యుండినఁ గాళ్ళువట్టు న
స్పందవిచారశీలుఁడగు శైవమహీసురశేఖరుం డిలన్‌.
చ. అడవి నెడారిదారిఁ జనునప్పుడు శైవమహానుభావుఁ జో
రుఁడొకఁడువెంబడించినఁబరుంగిడఁ గాలికొలందిఁజొచ్చియీ
మిడిమిడి దొంగపోటులకు మిక్కిలియయ్యెను లింగపోటటం
చడుగిడనేఱ కీశ్వరహరాశివశంకరయంచుఁ గూయిడెన్‌.
శా. అయ్యా శైవులఁ బిల్చుచో జనులు పేరయ్యయ్యవారండ్రుపే
రయ్యండ్రొక్కరు పేరయండ్రొరులు పేరారాధ్యుఁడండ్రొక్కరా
యయ్యన్‌ బేరయ లింగమం డ్రొకళు లొయ్యం బేరలింగంబటం
డ్రయ్యైవేళల వారువారు సమయోక్తానేకనామంబులన్‌.
ఉ. చర్యలు నామము ల్దెలుపు శైవులు వైష్ణవు లంచు నెప్పుడున్‌
ధార్యము లింగ మొక్కరికిఁ దప్తము లన్యుల; కెన్నలింగయా
చార్యుడు రంగలింగమును శైవులు వైష్ణవులందు నామసాం
కర్యమునొందుఁ బూరుషులు గానఁగరారు మతంబుకట్టడిన్‌.
చ. మొగముగ భూతి రేఖలవి మూడుఁగణంతల రెండు దీర్చి వా
సిగఁ బలుజందెపోగులను జేర్చిన నున్నని లక్కలింగకా
య గనఁబడుం గనంబడ దొయారముగం జరలింగ మందు రీ
జగమున లింగధారిమత శాబకుఁ డాడు నియోగిబాలుతోన్‌.
సీ. సూత్రంబునకు లింగసూత్రంబు సహకారి పొసఁగుఁ కుంకుమకు విభూతి తోడు
కరకంకణముల సంగాతముల్‌ దోరముల్‌ ధూపగంధము గంధలేప సఖము
అవతంసభూషా సహాయంబు తొగఱేకు రహిఁ బదంబులకుఁ బారాణి నేస్తి
కొనచెవి బొగడల కనుఁగు మారెడుపత్రి గోళ్ళకుఁ గాదిలి గోరిఁటాకు
గీ. భక్తిమహిమకు నఱచూవు ప్రాపుసుమ్ము శాంతభావంబు మందహాసంబు ప్రియము
ఉక్తి మృదుతకు శివనామ ముపపదంబు వాసిగను లింగధారమ్మవారలకును.
సీ. వేఁగుజామున లేచి వీధిగుమ్మముఁ జిమ్మి యిల్లూడ్చి యావెన్కఁ బళ్ళు దోమి
గోమయంబునుఁ దెచ్చి గీము నున్నఁగ నల్కి కలయంపి వాకిళ్ళఁ గలయఁజల్లి
చిన్నెవన్నెల మ్రుగ్గు చిగురుబారలఁ దీర్చి మడిబట్ట లుతికి ప్రొయ్‌ పిడకల నిడి
రాఁజేసి మడిగట్టి రాజాన్నములు వండి భక్తిమీఱఁగ బిండి పట్టుఁ బెట్టి
గీ. వత్తిజోతులు మారేడు పత్తిరియును తుమ్మిపూవులు చమురు కుందులు విభూతి
పండ్లు పతిశివపూజ కేర్పాటుఁ జేసి వాసిగను లింగధారయ్య వారి నారి.
సీ. తుట్టెగట్టినపిండి తట్టలో దొకయింత మ్రుగ్గుపట్టులఁ బెట్టు ముగుద యోర్తు
బూజువట్టిన ప్రాఁత బూదిగడ్డలు కొన్ని లింగలేపము సేయు లేమ యోర్తు
వఱుగుగా నెండి ప్రాఁ బడిన మారెడుపత్రి శివపూజ కొనఁగూర్చు చేడె యోర్తు
ఏడాది కొక్కతూరే చేసి డాఁచిన వత్తులు వెలిఁగించు వనిత యోర్తు
గీ. ఉడికియుడకనిమెదుకు నీ ళ్లోడుపప్పు కాఁగికాఁగనిచారును గరిటెనంటి
తొలఁగిజాఱని కట్టావి పులుసుఁగూర పతికి వడ్డించు శైవరూపవతి యోర్తు.
చ. వలపులు లెస్స, కూడని వివాదలు లేశము గానరావు, కా
వలసినయంత భక్తిగల వారయినన్‌ భయమే కొఱంత భ
ర్తలయెడ లింగధారివనితాతతి, కయ్యది వారిపుణ్యమో,
చెలువలదోషమో, తలఁప స్వీకృతలింగ శిలామహత్త్వమో.
శా. చారుంగూరలు పప్పులుంబులుసు పచ్చళ్ళప్పడాల్‌ దప్పళా
లూరుంగాయలు మెంతిమజ్జిగలు పాలుంబాయసాన్నంబులుం
గారెల్‌బూరెలు బొబ్బటు ల్దినఁగ పక్కాబంట్లు శైవుల్‌ స్వచే
ష్టారూఢంబగు కాఁకకుం బసవగడ్డల్‌ దొడ్డమందుండఁగన్‌.
చ. కుడువఁడు భక్ష్యభోజ్యములు గోరసనీరముఖద్రవంబు లా
నడు మెడబంగరుంగొలుసునం దగిలించిన లింగకాయలో
విడిసిన లింగమూర్తికి నివేదన సేయక శైవభూసురుం
డడవి నొకండు నెండను బ్రయాణము సేసెడివేళనేనియున్‌.
చ. పశువుమతంబు శైవమది, పాముమతం బది వైష్ణవంబు, క
ర్కశములు గావు మాధ్వ మది గట్టిగఁగోతిమతం బదెట్లునాన్‌
బసవఁడు, భాష్యకారులును, మధ్వుఁడు; నందియు, శేషుడంజనీ
శిశువును మానవత్వమును జెంది జనించినవారు కావునన్‌.
కరణ కమ్మలు
మ. మత మేదో తెలియంగరాదు కల దా మాధ్వాళితోఁ బొత్తు, సం
తతమున్‌ లౌకికవృత్తిజీవనము, పెద్దల్‌ వామనాచార్యునం
చితసిద్ధాంతము వారి దందురు; మఱాసిద్ధాంత మే చందమో,
మతి నూహింపఁగ లేరుపో? కరణకమ్మల్‌ తెల్గుదేశంబునన్‌.
సీ. నూఱూళ్ళ కొకయింటి వారైనఁ గనరారు దొరకిరా యరుదుగాఁ బురములందు
నమరదు పడుచు పెండ్లాడఁదలంచిన దొరకెనా యొకసంచి దులపవలయు
వెతకియైనను వారి మతముఁ జెప్పఁగలేము దొరకెనా సిద్ధాంత మెఱుకపడదు
పరమవైదికమును బట్టిచూచినలేదు దొరకెనా ముదుసలి త్రొక్కులందు
గీ. అన్నదమ్ములవారలు గన్నవారి నడుమ వచ్చినవెనుక నొక్కెడనె యుంట
దొరకెనా యొక్కరిద్ద ఱుందురు జగాన విలువగలవారు కరణకమ్మ లనువారు.
చ. నడవడులన్ని యోగిసరి, నామమునందును లౌక్యమాధ్వుకై
వడి, మడిమంట్రలందుఁదుల వైదికుతో, నిఁక వైష్ణవంబుచొ
ప్పడుసముదాత్తభాగవత భక్తిని, యుక్తి గొఱంతలేదు నల్‌
గడలఁ బొసంగెడిన్‌ గరణకమ్మకుఁ గుమ్మకులిమ్మతమ్ములన్‌.
సీ. గుణము మంచిది కాని గుట్టు కొంచెంబైన కరణకమ్మలకు జగానఁ గాన
త్యాగభోగమెకాని ధనసంగ్రహము చాలఁ గరణకమ్మలకు జగానఁ గాన
మాటబింకమెకాని మనసు నొప్పించుట కరుణకమ్మలకు జగానఁ గాన
పేరుదొడ్డదిగాని బెట్టు విస్తారంబు కరణకమ్మలకు జగానఁ గాన
గీ. లౌకికములైన వ్యవహార లాంఛనముల వేషభాషల క్షాత్రంబు వెలయుఁగాని
బ్రాహ్మణాచారహాని యే పట్టులందుఁ గరణకమ్మలలోన జగానఁ గాన.
సీ. కొమరైన జలతారు కోకగట్టునుగాని గోచిగొప్పది పైఁటకొంగు కురుచ
రాణించు మేల్పట్టు రవిక దొడగుఁగాని జేబుపెద్దది దండచేయి పొట్టి
ముంజేతికంకణంబులు పసందే కాని కడ్డీలు లావు లో దొడ్డి బిగువు
నాణెంపుబంగారు నత్తుఁ బెట్టును గాని గాటు పల్లము రాతికట్టు మెఱక
గీ. స్మార్తులందు నియోగుల మాధ్వులందు యాజ్ఞవల్క్యులయందు లౌక్యప్రవరులఁ
గరణకమ్మల నీనాఁటికాలమందు వఱలు వగలాఁడిపడుచు పువ్వారుఁబోఁడి.
యాజ్ఞవల్క్యులు
మ. కుడువంజొచ్చును బ్రాహ్మణార్థములఁ బెక్కుల్రాజకీయార్థముల్‌
నడువంజొచ్చును యాజ్ఞవల్క్యుఁడు ధరన్నానోచ్చనీచంబులం
దెడ లేక న్నటియించుఁగాలము కొలందింబోవు, నేయెండ కా
గొడుగుంబట్టు ధనార్జనంబునకు నెగ్గున్‌ మ్రొగ్గు తగ్గేమనున్‌.
గోలకొండ వ్యాపారులు
ఉ. పేరున రావుపంతు లని పెట్టకమానరు, వైష్ణవంబు వి
స్తారము, వైదికంబు గలదా? యని రోసినఁ, గొంతజిక్కు సం
సారముగుట్టువారలదె, 'సాధువు లెందును గోలకొండ వ్యా
పారులు లౌక్యవృత్తులన' పారులు, కారులు పల్క రెప్పుడున్‌.
సీ. శుచిదేఱిన యొడళ్ళు సొగసైన కుచ్చెళ్ళు చిట్టాడుమీగాళ్లు జుట్టుముళ్ళు
తమ్మెట్లరవఱాళ్ళు తమలంపుఁ బసనోళ్ళు రంగురుమా ళ్ళుంగరాలవ్రేళ్ళు
రావుపంతులు పేళ్ళు రవరవచప్పుళ్ళు రాతిరియుఁ బగళ్ళు వ్రాయుగీళ్ళు
బంగారుమొలత్రాళ్ళు పైజారుజోళ్ళు వైష్ణవుచేతినీ ళ్ళఱచాటుమళ్లు
గీ. చక్రపొంగళ్ళు సాపాట్లు సగముపాళ్ళు పెళ్ళినడవళ్ళు వేయాఱు పెట్టుబళ్ళు
నిత్యమును గామ్యములు సొమ్ము నిజము గోలకొండ వ్యాపారులం దాంధ్రమండలమున.
సీ. ఎలమిఁ జీపురువట్టి యిల్లూడ్చునపుడైన పోనీరు తలజుట్టు పూలమెఱుఁగు
అసదుగా జలకంబులాడు వేళలనైన పోనీరు నునుగప్పు నూనెమఱుఁగు
మడిగట్టి వంటకా ల్కడతేర్చునపుడైన పోనీరు తొడగుకడానిమెఱుఁగు
నాయకాలింగనోన్నత సౌఖ్యమందైన పోనీరు కొంతైన మేనుమెఱుఁగు
గీ. తనులతా చారుతాశుచితా విభూషణాంచితాంగవిలాసతావాత్తి నతుల
మతుల సుకృతులఁ గృతచమత్కృతుల గోలకొండవ్యాపారసతులఁ బేర్కొనఁగఁ జనదె.
ద్రావిడులు
ఉ. ద్రావిడవైదికోత్తముల ధర్మములన్నియు దేశ్యతుల్యముల్‌
గా వొకకొన్ని భేదములు గానఁగవచ్చు శివాక్షమాలికల్‌
లావు, సదా వహింత్రు నవలాల్‌ కుడిపైఁటలు, కచ్చకట్టులా
లేవు, వివాహశుల్కములు లెస్సలు, సాములు దేశ యాత్రలం
బ్రోవిడుసొమ్ము లంగనల పూర్వభవార్జితపుణ్యలబ్ధముల్‌.
వివాహములు
ఉ. చెప్పకయున్న దోషమగుఁ జెప్పినగోపములేమి సేయుదున్‌
జెప్పకతప్ప దీ వయిపు సీమల బ్రాహ్మణకోటిఁ గన్యకల్‌
గొప్పగిరాకి పెద్దపడి గుండున నల్బదిసేర వెండికిన్‌
జప్పుడు లేక దూఁగు నది చాలకయున్న మఱొక్క సేరగున్‌.
ఉ. చెప్పినకార్యమే మెవరు చేతురు నాపలు కాలకించి, వెం
కప్పకు డెబ్బ దేండ్లు నరసమ్మకు నెన్మిది యేడు లీడుగాఁ
జొప్పడెనంచు నాంధ్రపదసూరులు తప్పక పొంతనంబులన్‌
జెప్పుదు రెంతతప్పుపని చీ! ముసిలిం బసికాయ మెచ్చునే?
ఉ. అప్పుడె పెండ్లి వచ్చె మన యమ్మికినంచును దల్లి దండ్రి య
న్నప్పలుఁజెప్పఁగా వినుచు నాయికఁదోయిలమబ్బెఁ జక్కిలాల్‌
పప్పులు పాయసా లరిసె పప్పులుకుప్పలు తెప్ప లప్పరో
యెప్పుడె చెప్పుచెప్పుమని యీడ్తురుపయ్యెదకొంగుఁబట్టికీల్‌
గొప్పునకొప్పులై కురులు గూడనియీడున నాంధ్రబాలికల్‌.
ఉ. చేతురు కయ్యము ల్గడుసుచెయ్వుల వియ్యపురాండ్రు; చాలునీ
కూఁతురిసారెలో నిడిన కోక యిదోపదిరెండుమూళ్ళు; నీ
కూతుఁరిసారె నేను గనుఁ గొంటినిగా పదిమూళ్లెలేదుగా
నీతులు లాఁతికిం దెలుప నేర్తు వటంచును మూతిద్రిప్పుచున్‌.
అత్తకోడండ్రు
చ. తెలిపెడి నత్త, కోడలికి దివ్వెలదివ్వెలదివ్వెలంటుదున్‌
దల; శనివారమాపయినిఁ దా బుధవారమునాఁడు నంటుదున్‌
దలవినుఁడమ్మకూఁతులకు; తథ్యముచెప్పుడుఁతల్లులార! యం
చలవడినీళ్ళరేవుకడ నమ్మలు నక్కలు గూడియుండఁగన్‌.
చ. అడిగినఁబొట్టనిండునటు లన్నమువెట్టనియత్తతోఁడఁ దా
వడివడి నంబటేరదుగొ వచ్చెడి!నత్త, యనంగఁగోడలా!
బుడబుడ లేల పొమ్ము కొలబుర్రను జూడుము నాదుచేతిలోఁ
దడఁబడదెప్పుడంచు నుడి దప్పక కోడలి కత్త సెప్పెడిన్‌.
చ. అలుకున బిచ్చగానిఁగని యందదు పొమ్మని కోడలన్న, వాఁ
డలుఁగుచుఁ బోవఁద్రోవఁగని యత్తిటు రమ్మనిపిల్వ, వాఁడురా
నిలువకపొమ్ము లేదనిన నీ కిదియేమని వాఁడనన్‌; సరే
కలదన లేదనన్‌ దనది కావలెఁ గోడలిప్రేష్యమేమనున్‌.
ఉ. "కోడల! వీఁపుదోము "మని కోరినయత్తనుజూచి "యత్త! చే
యాడదు కాలుపై కెగయు" నన్న "నయో, మును నేను మీఁదితో
లూడఁగఁగాళ్ళతో నదిమి హుమ్మనితోమితి నత్తవీపు, నే
డీడకువచ్చె దానిఫలమే కుడుపుంగద కోడలా" యనున్‌.
చ. చనువునఁ గోతినెత్తి నొక చక్కనిఱాయిడి యత్తవారికుం
డన వినివ్రక్కలై ధరఁబడన్‌ విడుఁ; బుట్టినయింటివారికుం
డన విని మెల్ల మెల్లన నపాయము సేయక డించు నట్లుగా
గొనకొను నత్తగారికిని గోడలికిం గల యానుకూల్యముల్‌.
పండుగలు
సంక్రాంతి
చ. నిరుపమలీల బాలికలు నిశ్చలభక్తిని యుక్తిసంకురా
తిరినెలఁ బేడగొబ్బిలులు దీర్తురు వాకిళులందు మ్రుగ్గులన్‌
బొరిబొరి బొమ్మల న్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలో
బరువడి నారఁగించెదరు పచ్చడిబెల్లము పుల్గ మిచ్చలన్‌.
అట్లతద్దె
చ. బడిబడి నట్లతద్దెయను పండుగ వచ్చిన సంతసిల్లుచున్‌
వడిఁ దెలవాఱుచుక్క బొడువం గని లేచి సమస్తబాలికల్‌
మడినిది పొట్లకాయపరమాన్నము నన్నము మెక్కి యాటలన్‌
బడిమఱునాఁట నుయ్యెలలపైఁ దగనూఁగుట జూడనొప్పదే.
దీపావళి
చ. చిటపట టుప్పుటప్పనెడి సీమ టపాకుల పెట్టె లెన్ని యు
ద్భటముగ ఢమ్ముఢుమ్మను టపాకులవెన్ని, మతాబులెన్ని పి
క్కటిలెడి ఝిల్లులెన్ని, మఱి కాకరపూవతులెన్ని గాల్తురో
దిటముగఁదెల్ప నాతరమె దివ్వలపండుగ రేయి నర్భకుల్‌.
వినాయకచవితి
చ. తొలుదినమే వినాయక చతుర్థికి ముందర రాల్‌ పలేరుగా
యలు గడియించి పండుగ మహాగణనాథుని మంచిమంచి పూ
వులఁ బలుపత్రులం గఱికిఁ బూజలు చేసుక ప్రొద్దుగ్రుంకగా
నల పొరుగిండ్ల ఁజల్లుకొను చాడికఁజెందుదు రర్భకావళుల్‌.
సంవత్సరాది
సీ. అలవణ నింబపుష్పామ్లరసాలశలాటుఖండములు తొల్తఁ గబళించి
ఇష్టమృష్టాన్నముల్‌ తుష్టిగా భుజియించి విప్రోత్తముఁడు గ్రామవీధిఁ జేరి
పదిమంది రయితుల గుదిగూర్చి కూర్చుండి క్రొత్తపంచాంగంబు నెత్తి చదివి
ఆదాయములను వ్యయంబులు సెప్పి కందాయంబులకు వేళ యాయె ననిన
గీ. దుడ్డు నిండుగ నిచ్చిన దొడ్డవారి
కన్ని కందాయములు పూర్ణ మనుచు జెప్పు
దుడ్డు దుగ్గాని లేదన్న గొడ్డుఁబోతు
కన్ని కందాయముల శూన్య మనుచుఁ జెప్పు
నౌర బాపన సంవత్సరాదినాఁడు
నానావిధేతర విషయములు
పొడుము
సీ. పాటిపొగాకు బై పయి మడ్డిగల బారు దళసరికొమ్మముక్కలు గ్రహించి
నడిమీనె దివిచి చొప్పడఁ గణకణలాడు మేలైననిప్పులమీఁదఁ గాచి
మంటికోసను నల్పి మంచికఱ్ఱను నూఱి తడియొత్తి సున్న మింత తగవైచి
నేర్పుతోఁ గమ్మని నేయి కొంచెము పోసి పొలుపైనవన్నె రాఁ బొడుముజేసి
గీ. వెండిపొన్మూతఁ గొలుసు బొబ్బిలి పసందు సోగమారెడు బుఱ్ఱఁబోసుకొని రొండి
నిడి తలంచిన కించిత్తు పొడి గ్రహించి బుఱ్ఱుమనఁ బీల్చు బాపని ముక్కె ముక్కు.
ఇతర విషయములు
చ. నలుగురు పట్టుపట్టుమన నాపలు కెవ్వరు విండ్రు, గట్టిగాఁ
దెలిపినఁగోపగింతురును ధీతిలకంబులు, దాని కేమిలే
యళుకనువిప్రజీవనము యాచ్నయటండ్రు గృషిం ద్యజింతు రిం
తలు గలవా? యటంచు సరి నాఁడులవారలు నవ్వునట్లుగన్‌.
శా. స్మార్తుల్‌ దూఱిరి మధ్వభూసురుని గర్మభ్రష్టు డంచు న్వెసన్‌
స్మార్తుల్‌ మాధ్వులు దూఱి రోడకను ముమ్మాఱు వ్రతభ్రష్టుగా
భర్తీ వైష్ణవవిప్రునందు నుభయ భ్రష్టత్వమం డ్రిద్దఱున్‌
ధూర్త్వత్వంబున విష్ణువాసరమునందుం దద్దినం బబ్బినన్‌
ఉ. తిండికి బత్తెమిండు నెల దీరిన దింకొకయిద్దు మప్పుగా
నిం డది తీరులోన జమ యిత్తు నటంచును గంప దుల్పఁగాఁ
బండిన పంటలోన సగబాలు హరించును పాలివాఁడు బా
పండొనరించు సేద్యమున బా గొకజుట్టు నతండు నిల్చుటే
చ. మలుమలులంచు వచ్చినవి మంచివి గావవి, యేమొకాని యా
ర్నెలలకుఁ జిన్గు చీయొడలు నిండిన దట్టపు తాటిపాక చా
వులు మనునొకపుష్కరము పూచిమడంతను గట్టి చాకికిన్‌
నెలకొకసారిగా నుదుక నిండని యందురు వృద్ధభూసురుల్‌
ఉ. తిండ్లరబాలు మజ్జిగలు తేటతుషారపు నీళ్ళు పప్పులే
దిండ్లొకచెంపఁగప్పెగసి యెండయు వానయుఁ దూలిపోదు, రెం
డేండ్లకు నైదుసారు లుతికించిన బట్టలు, నేమి సెప్పుదున్‌
బెండ్లముమీఁద నింటిపయిఁ బెత్తనముంచినవాని సౌఖ్యముల్‌.
తెలుఁగునాడు
బ్రాహ్మణ ప్రశంస సంపూర్ణము.
AndhraBharati AMdhra bhArati - telugu kAvyamulu - telugunADu - dAsu SrIrAmulu - Dasu Shreeramulu - Dasu Sriramulu - telugunadu Telugunadu ( telugu andhra telugu literature )