అధ్యాత్మ సంకీర్తన
రేకు: 17-2
సంపుటము: 1-102
రేకు: 17-2
సంపుటము: 1-102
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఏది తుద దీనికేది మొదలు పాదుకొను హరి మాయఁ బరగు జీవునికి | ॥ఏది॥ |
ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు యెన్ని వేదనలు మరి యెన్ని దుఃఖములు యెన్ని పరితాపంబు లెన్ని దలపోఁతలు యెన్ని చూచిన మరియు నెన్నైనఁ గలవు | ॥ఏది॥ |
యెన్ని కొలువులు దనకు నెన్ని యనుచరణలు యెన్ని యాసలు మరియు నెన్ని మోహములు యెన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివి ఇన్నియునుఁ దలఁప మరి యెన్నైనఁ గలవు | ॥ఏది॥ |
యెన్నిటికిఁ జింతించు నెన్నిటికి [1]హర్షించు నెన్నిటికి నాసించు నెన్నిటికిఁ దిరుగు యిన్నియును దిరువేంకటేశు లీలలు గాఁగ నెన్ని చూచినను దా నెవ్వఁడును గాఁడు | ॥ఏది॥ |
[1] ‘హరుషించు’ రేకు.