అధ్యాత్మ సంకీర్తన
రేకు: 199-3
సంపుటము: 2-510
రేకు: 199-3
సంపుటము: 2-510
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎన్నఁడు గలుగు మరి యీభాగ్యము సన్నిధాయ నితనికి శరణనరే | ॥పల్లవి॥ |
| అదె చంద్రుఁ డుదయించె నచ్యుతుఁడు జనియించె అదనఁ గంసునిజన్మ మస్తమించెను పొదలిరి దివిజులు పొలిసిరి రాక్షసులు సదర మీ శిశువుకు శరణనరే | ॥ఎన్నఁ॥ |
| పాండవకులము హెచ్చె బాలకృష్ణుఁడిదె వచ్చె చండి దుర్యోధనుమూఁక జల్లన విచ్చె దండి గోకులము నిండె ద్రౌపది తపము వండె చండ్రప్రతాపున కిట్టె శరణనరే | ॥ఎన్నఁ॥ |
| రేపల్లె పుణ్యము సేసె శ్రీవేంకటేశుఁడు డాసె గోపికల మనసుల కొఱత వాసె కోపుల ధర్మము దక్కె గోవర్ధనగిరి నిక్కె చాపలమేఁటి కితని శరణనరే | ॥ఎన్నఁ॥ |


