Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 199-5
సంపుటము: 2-512
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
నీ చేతఁలోవారము నీ వారము
యేచి నీకే చేత మొక్కే మిదియే మా వ్రతము
॥పల్లవి॥
ఇన్నిటాఁ బూర్ణుఁడవు నీ వెరఁగని యర్థమేది
విన్నపము నేఁ జేసే విధమేది
మన్నించిన నీమన్ననే మహిమలో మాబ్రదుకెల్ల
వున్నతి మీదాసిననే దొక్కటే మావ్రతము
॥నీచే॥
ఘనదేవుఁడవు నీకుఁ గడమలు మరియేవి
గొనకొని నే నిన్నుఁ గొసరేదేమి
పొనుగక యేలితివి పుట్టిన మాపుట్టుగెల్ల
ననిచి నిన్ను నమ్మిన నమ్మికే మావ్రతము
॥నీచే॥
శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తగించనిది యేది
భావించి నేఁ బొందని భాగ్య మేది
యేవల మాపరభారా లింతయు నీకెక్కినది
ఆవటించి నే నీశరణన్నదే మావ్రతము
॥నీచే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము