అధ్యాత్మ సంకీర్తన
రేకు: 199-6
సంపుటము: 2-513
రేకు: 199-6
సంపుటము: 2-513
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| కనియుండి భ్రమసితిఁ గట్టా నేను యెనలేక గురియైతి నిట్టే నేను | ॥పల్లవి॥ |
| తోలునెముకలు గట్టి దొరనంటా మురిసేను అలుబిడ్డల మరఁగు ఆహా నేను గాలి యాటించుకొని కాలములు గడపేను వోలిఁ బుణ్యపాపమందు వోహో నేను | ॥కని॥ |
| మంటివంక బదుకుతా మదియించి మురిసేను ఇంటిముంగిటనే వుండి యీహీ నేను వొంటివాఁడనై వుండి వూరఁగలవెల్లాఁ గోరే వొంటిన యాసల తోడ నూహూ నేను | ॥కని॥ |
| నూలికోకఁ గట్టువడి నున్ననై నే మురిసేను యీలాగు నాబదుకెల్ల యేహే నేను పాలించి శ్రీవేంకటాద్రిపతి నాకుఁ గలుగఁగ ఆలరినై గెలిచితి హైహై నేను | ॥కని॥ |


