Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 200-1
సంపుటము: 2-514
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
నీవు సర్వగుణసంపన్నుఁడవు నే నొక దుర్గుణిని
మానవు నన్నొక యెదురుచేసుకొని మనసుచూడనేలా అయ్యా
॥పల్లవి॥
యేలినవాఁడవు నీవు ఇటు నేఁ గొలిచినవాఁడ
పోలింపఁగ నీవే దేవుఁడవు భువి నే నొకజీవుఁడను
పాలించేవాఁడవు నీవు బ్రదికేవాఁడను నేను
తాలిమి నన్నొక సరిచేసుక ననుఁ దప్పులెంచనేలా అయ్యా
॥నీవు॥
అంతర్యామివి నీవు అంగమాత్రమే నేను
చింతింపఁగ నీవే స్వతంత్రుఁడవు జిగి నేఁ బరతంత్రుఁడను
ఇంత నీవే దయఁగలవాఁడవు యెప్పుడు నే నిర్దయుఁడను
చెంతల నన్నొక మొనసేసుక నాచేఁత లెంచనేలా అయ్యా
॥నీవు॥
శ్రీవేంకటేశ్వరుఁడవు నీవు సేవకుఁడను ఇటు నేను
అవలనీవల దాతవు నీవు యాచకుఁడను నేను
నీవే కావఁగఁ గర్తవు నేనే శరణాగతుఁడను
కైవశమగు నను ప్రతివెట్టుక నాకథలు యెంచనేలా అయ్యా
॥నీవు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము