అధ్యాత్మ సంకీర్తన
రేకు: 201-1
సంపుటము: 3-1
రేకు: 201-1
సంపుటము: 3-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల కట్టు నా కర్మములెల్ల గాలిఁ బోవుఁ గాక | ॥పల్లవి॥ |
| యెలమిఁ జక్రాయుధున కెదురా దానవులు తొలఁగ కెందుచొచ్చినఁ దుండించుఁ గాక ఇల గరుడధ్వజు పై నెక్కునా విషములు కలఁగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక | ॥ఇట్టి॥ |
| గోవర్ధనధరునిపై కొలుపునా మాయలు వేవేలు దునుకలై విరుగుఁగాక కేవలుఁ డచ్యుతునొద్దఁ గీడు చూపఁగలవా కావరమై తాఁ దానె గాలిఁ బోవుఁ గాక | ॥ఇట్టి॥ |
| వీరనారసింహునకు వెరపులు గలవా దూరాన గగ్గులకాడై తొలఁగుఁ గాక కోరి యీ శ్రీవేంకటేశుఁ గొలిచితి మిదివో కారుకొన్న పగలెల్ల గాలిఁ బోవుఁ గాక | ॥ఇట్టి॥ |


