Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 201-5
సంపుటము: 3-5
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
దాసోహమను బుద్ధిఁ దలచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు
॥పల్లవి॥
హరిచక్రము దూషించే యట్టివారే యసురలు
అరయఁ దామే దైవమన్నవారు నసురలే
ధర నరకాసురుడు తానె దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు
॥దాసో॥
పురుషోత్తముని పూజ పొంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు
॥దాసో॥
సురలును మునులును శుకాది యోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు
॥దాసో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము