అధ్యాత్మ సంకీర్తన
రేకు: 201-6
సంపుటము: 3-6
రేకు: 201-6
సంపుటము: 3-6
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| వెఱ్ఱివాఁడ వెఱ్ఱివాఁడ వినియుఁ గనియుఁ మరి వెఱ్ఱి దెలిసి రోఁకలి వేరె చుట్టేఁ గాక | ॥పల్లవి॥ |
| పుట్టించిన వాడవట పూచి నన్నుఁ బెంచలేవా కట్టఁగడ నమ్మని నాకడమే కాక వొట్టి నాలో నుందువట వొగిఁ బాపము నాకేది గట్టిగాఁ బుణ్యము వేరే కట్టుకొనేఁ గాక | ॥వెఱ్ఱి॥ |
| యేడనైనా నీవే యట యెదుట నుండఁగలేవా వేడ(డె?) వెట్టి యేడనై నా వెదకేఁ గాక ఆడినదెల్లా నీవట అందులోఁ దప్పులన్నవా వీడు పడ్డ తలఁపుతో వెరచేఁ గాక | ॥వెఱ్ఱి॥ |
| భావించితే మెత్తువట పరము నీ వియ్యలేవా నీవాఁడననని నా నేరమే కాక శ్రీవేంకటేశుఁడ నేను చేరి నీకు శరణంటి దేవుఁడవై కావఁగా నే దిద్దుకొనేఁ గాక | ॥వెఱ్ఱి॥ |


