Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 202-2
సంపుటము: 3-8
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
పుట్టినట్టె వున్నవాఁడ పోలేదు రాలేదు
ఇట్టె నీ దాసుఁడ నైతి యెంగిలెల్లఁ బాసె
॥పల్లవి॥
వెలినున్న జగమెల్ల విష్ణుఁడ నీ మహిమే
అలరి నాలోన నీవే అంతరాత్మవు
తెలిసి నేనున్నచోటే దివ్యవైకుంఠము
వెలలేని నరకముల వెరపెల్లఁ దీరె
॥పుట్టి॥
తనువుతో నుండేది నీ తలఁచిన తలఁపేనా
మనుపు సంసారము నీమాయ చేతిదే
పనులనా కర్మము నీ పంచినట్టి పనుపే
మనసు లోపలి యనుమానమెల్లఁ బాసె
॥పుట్టి॥
తెరమరుగు దినాలు దేవుఁడ నీ కల్పితమే
సొరిది యీ సురలెల్ల చుట్టాలే నాకు
నిరతి శ్రీవేంకటేశ నీమరఁగు చొచ్చి నేఁడు
గురుని యానతిచేతఁ గొంకులెల్లా బాసె
॥పుట్టి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము