అధ్యాత్మ సంకీర్తన
రేకు: 17-4
సంపుటము: 1-104
రేకు: 17-4
సంపుటము: 1-104
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎట్టుచేసినఁ జేసె నేమి సేయఁగవచ్చు చుట్టపు విరోధంబు సూనాస్త్రుచెలిమి | ॥ఎట్టు॥ |
| ఒడలిలోపలి రోగ మొనరఁ బరితాపంబు కడుపులోపలి పుండు కడలేని యాస తడిపాఁత మెడగోఁత తలఁపు విషయాసక్తి గుడిమీఁది తరువు ఆలకులము (ఆలుగులము?) ప్రాణులకు | ॥ఎట్టు॥ |
| నీడలోపల [1]యెండ నెలకొన్న బంధంబు గోడపై సున్నంబు కొదలేని యెఱుక పాడూరిలో బ్రదుకు పాపకర్మపు బుద్ధి తాడుపై తపసు తమ ధనము ప్రాణులకు | ॥ఎట్టు॥ |
| మంటఁ జేసిన బొమ్మ మనికి సంసారంబు రెంటికినిగాని వీరిడి కొలువు బ్రదుకు యింటివేలుపు వేంకటేశుఁ గొలువక పరుల వెంటఁ దిరుగుట వోడ [2]విడిచి [3]వదరిడుట | ॥ఎట్టు॥ |
[1] ‘యండ’ రేకు.
[2] ‘నిడిచి’ రేకు.
[3] వదరు = సొరకాయ.


