Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 203-2
సంపుటము: 3-14
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
ఇంతేపో వారివారి హీనాధికములెల్ల
పంతాన తా మేపాటి భాగ్యము నాపాటే
॥పల్లవి॥
అందరిలో దేవుఁడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదురింతే
చెంది వీచే గాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టి కొలుచుండి పొల్లు కడఁబడును
॥ఇంతే॥
పుట్టు గందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లుఁ గొందరై వీఁగుదురింతే
చుట్టి వరిగురుమతో జొన్నగింజ సరిదూఁగు
తెట్టెలై మేలొకటికి తీలొకటి కాయ
॥ఇంతే॥
కోరి శ్రీవేంకటపతి కుక్షిలోనే లోకములు
ఆరయఁ గిందెడుమీఁదెడై వున్నవింతే
యీరీతి నితని దాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు
॥ఇంతే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము