Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 203-6
సంపుటము: 3-18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
అందాఁకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీ సొమ్ము గనక అదియుఁ దీరుతువు
॥పల్లవి॥
నీదాసుఁడన నేటి నిజబుద్ధి గలిగితే
ఆ దెస నప్పుడే పుణ్యుఁడాయ నతఁడు
వేద(దు?)తో నొక్కొక్కవేళ వెలుతులు గలిగితే
నీదయవెట్టి వెనక నీవే తీరుతువు
॥అందాఁ॥
తొలుత నీ శరణము దొరకుటొకటే కాని
చెలఁగి యా జీవునికిఁ జేటు లేదు
కలఁగి నడుమంత్రాన గతిదప్ప నడచిన
నెలకొని వంకలొత్త నీవే నేరుతువు
॥అందాఁ॥
నీవల్లఁ గొరత లేదు నీ పేరు నొడిగితే
శ్రీవేంకటేశ యిటె చేరి కాతువు
భావించలేకుండఁగాను భారము నీ దంటేఁ జాలు
నీవారి రక్షించ నీవే దిక్కౌదువు
॥అందాఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము