Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 17-5
సంపుటము: 1-105
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
తలఁపు కామాతురత్వము మీఁద నలవడిన
నిల నెట్టివారైన నేలాగు గారు
॥తలఁపు॥
ఓలి నిరువురు సతుల నాలింగనము సేయ
లోలుఁ డటుగాన నాలుగు చేతులాయ
వేలసంఖ్యలు సతుల వేడుకల రమియింపఁ
బాలుపడెఁ గాన రూపములు పెక్కాయ
॥తలఁపు॥
పొలయలుక కూటముల భోగి దా నటుగాన
మలసి యొక్కొకవేళ మారుమొగమాయ
లలితలావణ్యలీలావిగ్రహముగాన
కొలఁది వెట్టఁగరాని గోళ్ళు నిడుపాయ
॥తలఁపు॥
చిరభోగసౌఖ్యములఁ జెంద ననుభవి గాన
తిరువేంకటాచలాధీశ్వరుండాయ
పరగ సంసారసంపదకు బద్ధుఁడు గాన
అరుదుగా సకలాంతరాత్మకుండాయ
॥తలఁపు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము