Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 204-4
సంపుటము: 3-22
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
ఇతర చింత లిఁక నేమిటికి
అతఁడే గతియై అరసేటివాఁడు
॥పల్లవి॥
కర్మమూలమే కాయము నిజ-
ధర్మమూలమే తన యాత్మ
అర్మిలి రెంటికి హరియొకఁడే
మర్మ మీతఁడే మనిపేటివాఁడు
॥ఇత॥
బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుఁడే
సహజపుఁ గర్తై జరపేటివాఁడు
॥ఇత॥
అతిదుఃఖకరము లాసలు
సతత సుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకఁడిన్నిటఁ బాలించువాఁడు
॥ఇత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము