Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 205-1
సంపుటము: 3-25
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఆతఁడే సకలము అని భావింపుచు
నీతితో నడవక నిలుకడ యేది
॥పల్లవి॥
యెందునుఁ జూచిన యీశ్వరుఁ డుండఁగ
విందుల మనసుకు వెలితేది
సందడించే హరిచైతన్య మిదివో
కందువలిఁక వెదకఁగ నేది
॥అతఁ॥
అంతరాత్ముఁడై హరి పొడచూపఁగ
పంతపు కర్మపు భయమేది
సంతత మాతఁడే స్వతంత్రుఁ డిదివో
కొంతగొంత మరి కోరెడి దేది
॥అతఁ॥
శ్రీవేంకటపతి జీవుని నేలఁగ
యీవల సందేహ మిఁక నేది
భావం బీతఁడు ప్రపంచ మీతఁడు
వేవేలుగ మరి వెదకెడి దేది
॥అతఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము