అధ్యాత్మ సంకీర్తన
రేకు: 205-3
సంపుటము: 3-27
రేకు: 205-3
సంపుటము: 3-27
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఇచ్చలోఁ గోరేవల్లా ఇచ్చే ధనము అచ్చుతనామమె పో అధికపు ధనము | ॥పల్లవి॥ |
| నారదాదులు వొగడే నాలుకపయి ధనము సారపు వేదములలో చాటే ధనము కూరిమి మునులు దాఁచుకొన్నట్టి ధనము నారాయణ నామమిదే నమ్మినట్టి ధనము | ॥ఇచ్చ॥ |
| పరమపదవికి సంబళ మైన ధనము యిరవై భక్తులకెల్లా నింటి ధనము పరగ నంతరంగాన పాఁతినట్టి ధనము హరినామ మిదియ పో అరచేతి ధనము | ॥ఇచ్చ॥ |
| పొంచి శివుఁడు కాశిలో బోధించే ధనము ముంచిన ఆచార్యుల మూలధనము పంచి శ్రీవేంకటపతి పాలించే ధనము నించి విష్ణునామ మదే నిత్యమైన ధనము | ॥ఇచ్చ॥ |


