అధ్యాత్మ సంకీర్తన
రేకు: 17-6
సంపుటము: 1-106
రేకు: 17-6
సంపుటము: 1-106
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ జిక్కి జీవుఁడు [1]మోక్షసిరిఁ జెందలేఁడు | ॥ఎక్కడి॥ |
| ఒడలు మాంసపూర మొక పూఁటయిన మీఁదు గడుగకున్నఁ గొరగాదు కడలేని మలమూత్రగర్హిత[2] మిది, లోను గడుగరాదు యెంత గడిగినఁ బోదు | ॥ఎక్కడి॥ |
| అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ గలసిన పెనుగాలి గనము మెలుపులేని చిచ్చు మీఁద[3]మిక్కిలిఁ గొంత నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు | ॥ఎక్కడి॥ |
| తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద- కరుఁడు జీవునకు రక్షకుఁడు కరుణించి యొకవేళఁ గాచినఁ గాని మేను చొరక మానెడు బుద్ధి చోఁక దెవ్వరికి | ॥ఎక్కడి॥ |
[1] ఇది విరుద్ధసమాసము. ఇట్టి చిల్లరదోషముల ఈ వాఙ్మయమున పట్టింపు లేదు.
[2] ‘గరిహిత’ రేకు.
[3] ‘మీఁదు’ కావచ్చు.


