అధ్యాత్మ సంకీర్తన
రేకు: 206-6
సంపుటము: 3-36
రేకు: 206-6
సంపుటము: 3-36
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| పట్టరో వీదులఁ బరువులు వెట్టి పుట్టుగులతో హరి పొలసీ వీఁడే | ॥పల్లవి॥ |
| వేవేలు నేరాలు వెదకేటి దేవుఁడు ఆవులఁ గాచీ నలవాఁడే పోవుగ బ్రాహ్మలఁ బుట్టించు దేవుఁడు సోవల యశోదసుతుఁడట వీఁడే | ॥పట్ట॥ |
| ఘనయజ్ఞములకుఁ గర్తగు దేవుఁడు కినిసి వెన్న దొంగిలె వీఁడే మునుల చి త్తముల మూలపుదేవుఁడు యెనసీ గొల్లెతల యింటింట వీఁడే | ॥పట్ట॥ |
| నుడిగి నారదుఁడు నుతించు దేవుఁడు బడి రోలఁ గట్టువడె వీఁడే వుడినోని వరము లొసఁగెడు దేవుఁడు కడఁగిన శ్రీవేంకటగిరి వీఁడే | ॥పట్ట॥ |


