Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 207-5
సంపుటము: 3-41
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టన హరినే నమ్మ నేరనయితిఁగా
॥పల్లవి॥
దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నట్టే ముదిసె
వూహల నా భోగ మెల్లా వొళ్లఁబ ట్టేనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిన నీరాయఁగా
॥ఎట్టు॥
మనసు నాదని నమ్మి మదిమది నే పెంచితి-
ననుఁగుఁ బంచేంద్రియములందుఁ గూడెనా (ను?)
యెనసి ప్రాణ వాయువులివి సొమ్మని నమ్మితి
మొనసి లోను వెలినై ముక్కువాత నున్నవి
॥ఎట్టు॥
ఇందుకొరకె నేను ఇన్నాళ్లు పాటుపడితి
ముందు వెనకెంచక నే మూఢుఁడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరుఁడంతటా నుండి నా-
చందము చూచి కావఁగ జన్మమే యీడేరె
॥ఎట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము