అధ్యాత్మ సంకీర్తన
రేకు: 208-6
సంపుటము: 3-48
రేకు: 208-6
సంపుటము: 3-48
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
| నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది పూని నా వల్లనే కీర్తిఁ బొందేవు నీవు | ॥పల్లవి॥ |
| అతిమూఢులలోన నగ్రేసరుఁడ నేను ప్రతిలేని ఘనగర్వపర్వతమను తతిఁ బంచేంద్రియముల ధనవంతుఁడను నేను వెతకి నావంటివాని విడువఁగఁ జెల్లునా | ॥నేనొ॥ |
| మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాఁడ నేను యిహమునఁ గర్మ వహికెక్కితి నేను బహుయోనికూపసంపదఁ దేలేవాఁడ నేను వహించుక నావంటివానిఁ దేనోపేవా | ॥నేనొ॥ |
| భావించి నావంటి నీచుఁ బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడునెంతురు భువి నావల్ల నీకుఁ బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు శ్రీవేంకటేశుఁడ యింత చేరెఁ జుమ్మీ మేలు | ॥నేనొ॥ |


