Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 18-2
సంపుటము: 1-108
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
నా పాలి ఘననిధానమవు నీవే నన్ను
నీ పాల నిడుకొంటి నీవే నీవే
॥నా పాలి॥
ఒలిసి నన్నేలే దేవుఁడవు నీవే, యెందుఁ
దొలగని నిజబంధుఁడవు నీవే
పలుసుఖమిచ్చే సంపదవు నీవే, యిట్టే
వెలయ నిన్నియును నీవే నీవే
॥నా పాలి॥
పొదిగి పాయని యాప్తుఁడవు నీవే, నాకు
నదనఁ దోడగు దేహమవు నీవే
మదము వాపెడి నా మతియు నీవే, నాకు
వెదక నన్నియును నీవే నీవే
॥నా పాలి॥
యింకా లోకములకు నెప్పుడు[1] నీవే, యీ
పంకజభవాదిదేవపతివి నీవే
అంకలి వాపఁగ నంతకు నీవే, తిరు-
వేంకటేశ్వరుఁడవు నీవే నీవే
॥నా పాలి॥

[1] నిడురేకు 50- నెక్కుడు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము