అధ్యాత్మ సంకీర్తన
రేకు: 209-6
సంపుటము: 3-54
రేకు: 209-6
సంపుటము: 3-54
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| వట్టిమోపు మోయనేల వడిఁ ములుగఁగనేల పట్టిన నేమముతోడ బ్రదుకఁగ వలదా | ॥పల్లవి॥ |
| తల్లిదండ్రి గలవారు తమ లేములెఱఁగక చెల్లపిళ్లలై యాటలఁ జెందినయట్టు వుల్లములో హరి నమ్మి వుండిన ప్రపన్నులెల్ల పల్లదాన నిర్భరులై బ్రతుకఁగ వలదా | ॥వట్టి॥ |
| మగఁడు గల సతులు మంచి ముత్తైదువలై యెగువ నితరమార్గా లెరఁగనట్టు నగుతా లక్ష్మీపతి నమ్మిన ప్రపన్నులెల్ల పగటుఁ గర్మము మాని బ్రదుకఁగ వలదా | ॥వట్టి॥ |
| యేలికె నమ్మినబం టేరికిఁ బ్రియము చెప్ప- కోలిఁ బతివాకిలి గాచుండినయట్టు తాలిమి శ్రీవేంకటేశు దాసులైన ప్రపన్నులు పాలించినాతని నమ్మి బ్రతుకఁగ వలదా | ॥వట్టి॥ |


