అధ్యాత్మ సంకీర్తన
రేకు: 210-1
సంపుటము: 3-55
రేకు: 210-1
సంపుటము: 3-55
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| నీ యాధీనములింతే నిఖిలప్రపంచమును మాయాకృతము నీవు మానుమంటే మానదా | ॥పల్లవి॥ |
| నీకు నరుహంబైన నిండిన యీ మనసు కాకువిషయాల పాలుగా నరుహమా చేకొని నీవు పెరరేఁచిన యీ చైతన్యము పైకొని అకర్మముల పాలు సేయఁదగునా | ॥నీయా॥ |
| అంచల నీ వంతర్యామివైన యీ దేహము పంచేంద్రియముల కొప్పన సేతురా యెంచఁగ నీకుక్షిలోన నెత్తిన యీ జన్మము కొంచెపు భోగములకు గురి సేయవలెనా | ॥నీయా॥ |
| శ్రీవేంకటేశ నీకుఁ జిక్కిన యీ దాస్యము యీవల సంసారమున కియ్యవలెనా దేవుఁడవు నీవేయని తెలిపితివిదే మాకు జీవులము మమ్మునిఁక చిమ్మిరేఁచ నేఁటికి | ॥నీయా॥ |


