అధ్యాత్మ సంకీర్తన
రేకు: 18-3
సంపుటము: 1-109
రేకు: 18-3
సంపుటము: 1-109
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
[1]పుడమి నిందరి బట్టె భూతము కడుఁ-[2] బొడవైన నల్లని భూతము | ॥పుడమి॥ |
కినిసి వోడ మింగెడి భూతము పునుక వీఁపు పెద్ద భూతము కనలి కలియు చీఁకటి భూతము పొనుగు సోమపు మోము భూతము | ॥పుడమి॥ |
చేటకాళ్ళ మించిన భూతము పోటుదారల పెద్ద భూతము గాఁటపు జడల బింకపు భూతము జూటరి నల్లముసుఁగు భూతము | ॥పుడమి॥ |
కెలసి బిత్తలే తిరిగేటి భూతము పొలుపుదాంట్ల పెద్ద భూతము బలుపు వేంకటగిరిపయి భూతము పులుగుమీఁది మహాభూతము | ॥పుడమి॥ |
[1] ఇందు దశావతారసమన్వయము కలదు.
[2] నిడురేకు 50- వాఁడె.