అధ్యాత్మ సంకీర్తన
రేకు: 211-5
సంపుటము: 3-65
రేకు: 211-5
సంపుటము: 3-65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఏ దెస మోక్షము లేదు యెవ్వరికి ననేరు మీ- వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసేరా | ॥పల్లవి॥ |
| అంతా బ్రహ్మమైతే నాతుమా వొక్కటియైతే చింతింప గురుఁడు లేఁడు శిష్యుడూ లేఁడు బంతినే ముక్తుఁడూ లేఁడు బద్ధుఁడూ లేఁడిట్లయితే వంతుల సత్కర్మమెల్ల వఱతపాలాయఁబో | ॥ఏదె॥ |
| యిహమెల్లాఁ గల్లనేరు యేఁటికిఁ బుట్టినవారు సహజమే యిదనేరు చావనేఁటికి మహి మీకు బోధించిన మహాత్ము శంకరాచార్యుఁ- డహరహ మేమైయున్నా నాతనికేది గతి (?) | ॥ఏదె॥ |
| కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమిది యిందుఁ జిక్కి బ్రహ్మమునకీ ఘోరమేలా అందిన శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డొక్కఁడింతే మందలించి కొలువరు మంటికా మీ జ్ఞానము | ॥ఏదె॥ |


