అధ్యాత్మ సంకీర్తన
రేకు: 18-4
సంపుటము: 1-110
రేకు: 18-4
సంపుటము: 1-110
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చాలదా మా జన్మము నీ పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగె | ॥చాలదా॥ |
| కమలాసనాదులు గానని నీపై మమకారము సేయ మార్గము గలిగె అమరేంద్రాదుల కందరాని నీ కొమరైన నామము కొనియాడఁ గలిగె | ॥చాలదా॥ |
| సనకాదులును గానఁజాలని నిన్నుఁ తనివోవ మతిలోనఁ దలపోయఁ గలిగె ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న నిను సంతతమును వర్ణింపఁగలిగె | ॥చాలదా॥ |
| పరమమై [1]భవ్యమై పరిగిన నీ యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీ ధరమీఁదఁ బలుమారు దరిసింపఁ గలిగె | ॥చాలదా॥ |
[1] ‘దివ్యమై’ అని పూ.ము.పా.


