Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 212-6
సంపుటము: 3-72
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
వెఱ్ఱి మానుప రెవ్వరు వేఁదురు నాయంత విడువదు(ను?)
ముఱ్ఱఁబాలలోఁ బుట్టిన ముంచిన వెఱ్ఱెయ్యా
॥పల్లవి॥
జగములు రక్షించఁ బాల్పడి సర్వేశ్వరుఁడే వుండఁగ
అగణితుఁ డాతనిశక్తి యల్పముగాఁ దెలిసి
జిగి నా సంసారరక్షణ సేసెదనంచునుఁ దిరిగెద
నగుఁబాట్ల యల్పుఁడ నే నావెఱ్ఱిదేయయ్యా
॥వెఱ్ఱి॥
అంతర్యామై దేవుఁడు అటు సుఖదుఃఖము లొసఁగఁగ
అంతయు మనుజులు సేసేరని నేఁ దిరిగితిని
బంతినే నావంటి జీవులబడిఁ దిరిగాడుచుఁ గర్మపు-
దొంతులఁ జిక్కిననా వెఱ్ఱితోడనే యిదేయయ్యా
॥వెఱ్ఱి॥
శ్రీవేంకటపతి యెదుటనే చేకొని వరము లొసఁగఁగ
దావతిపడి యితరుల నేఁ దగులుచు నడిగితిని
యీ వేళనే నా గురుఁడును యీ దైవము నిటు చూఁపఁగ
తోవెరిఁగిటు నే బతికితి తొల్లెల్ల వెఱ్ఱినయ్యా
॥వెఱ్ఱి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము