Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 213-5
సంపుటము: 3-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కలకాల మిట్లాయఁ గాఁపుర మెల్లా
అల దైవమెందున్నాఁడో ఆలకించఁడుగా
॥పల్లవి॥
తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
తనకుఁ జింత పుట్టితే దైవము దూరు
మనుజుని గుణమెల్లా మాపుదాఁకా నిట్లానె
ఘనదైవ మెందున్నాఁడో కరుణఁ జూడఁడుగా
॥కల॥
విరివిఁ బాపాలు సేసేవేళ నాదాయము లెంచు
నరకమఁది పుణ్యము నాఁడు వెదకు
తిరమైన జీవుని తెలివెలా నీ లాగె
ధర దైవమెందున్నాఁడో దయఁ జూడఁడుగా
॥కల॥
వేళతో నిద్దిరింపుచు విరక్తునివలె నుండు
మేలుకొన్నవేళ నన్ని మెడఁ బూనును
యీలీల దేహిగుణము యెంచి శ్రీవేంకటేశుఁడు
యేలీ(లే?) దైవమెందున్నాఁడో యిట్టే మన్నించఁడుగా
॥కల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము