Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 214-2
సంపుటము: 3-80
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ధి
యివ్వల విచారించవే ఇందిరారమణా
॥పల్లవి॥
వెంటఁబెట్టి కామక్రోధవితతులు చుట్టి నన్ను
తొంటి మీ సేవకు నన్ను దూరము సేసె
కంటకపుటింద్రియాలు కడు హితశత్రులై
అంటిన మోక్షముత్రోవ నంటకుండాఁ జేసెను
॥ఎవ్వ॥
తిప్పితిప్పి నాయాసలు తెగి వైష్ణవధర్మానఁ
దెప్పలఁ దేలకుండాను తీదీపు సేసె
వొప్పగు సంసారమిది వున్నతి నాచార్యసేవ
చొప్పు మాపి పుణ్యానకుఁ జొరకుండాఁ జేసెను
॥ఎవ్వ॥
మచ్చరపు దేహమిది మనసిట్టే పండనీక
తచ్చి యజ్ఞానమునకుఁ దావుసేసె
ఇచ్చల శ్రీవేంకటేశ ఇంతలో నన్ను నేలఁగ
నిచ్చలు నీకృపే నన్ను నిర్మలము సేసెను
॥ఎవ్వ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము