అధ్యాత్మ సంకీర్తన
రేకు: 215-1
సంపుటము: 3-85
రేకు: 215-1
సంపుటము: 3-85
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| ఎన్నఁడు మానవు యీ దుర్గుణములు యేది అవుషదము యిందుకును కన్నులఁ జూచుచుఁ జెవుల వినుచు నేఁ గనియు వినియునిదె కష్టుఁడనయ్యా నేను | ॥పల్లవి॥ |
| హృదయము లోపల దేవుఁడుండఁగా నెఱఁగక భ్రమయుచుఁ గన్నచోటనే వెదకియుఁ గానక అనుమానించేటి వేఁదురనయ్యా నేను చెదరిన జననము దుఃఖరూపమని చెప్పగ విని యది సుఖమని కోరుచు మది దీపము వట్టుక నూతఁబడిన మత్తునివలెనయ్యా నేను | ॥ఎన్నఁ॥ |
| పరమగురువులదె భక్తిమార్గమిటు ప్రాణులకెల్లనుఁ బెట్టి వుండఁగా విరసపు టింద్రియమార్గములఁ దిరుగు వీరిడినయ్యా నేను దరి చేర్పఁగ హరినామము గలిగియు దైన్యము నొందితి సంసారములో పరుసము చేతఁబట్టుక తిరిసేటి భ్రాంతునివలెనయ్యా నేను | ॥ఎన్నఁ॥ |
| శ్రీవేంకటపతి యెదుట నుండఁగా సేవింపఁగ సంసారములోపల దావతిఁ బొరలుచు వేపరుచుండేటి తగని జడుడనయ్యా నేను కైవశమై యీ దేవుఁడే యిటు ననుఁ గరుణింపుచు రక్షింపుచునుండఁగ పూవునుఁ బరిమళమును వలనే నే పొదలుచునుండెదనయ్యా నేను | ॥ఎన్నఁ॥ |


