అధ్యాత్మ సంకీర్తన
రేకు: 18-6
సంపుటము: 1-112
రేకు: 18-6
సంపుటము: 1-112
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఏమి గల దిందు నెంత గాలంబైన[1] పామరపు భోగ మాపదవంటి దరయ | ॥ఏమి॥ |
కొండవంటిది యాస, గోడ [2]వంటిది తగులు బెండువంటిది లోని పెద్దతనము పుండువంటిది మేను, పోలించినను మేడి- పండువంటిది సరసభావ మింతయును | ॥ఏమి॥ |
కంచువంటిది మనసు, కలిమిగల దింతయును మంచువంటిది, రతి భ్రమతవంటిది మించువంటిది రూపు, మేలింతయును ముట్టు- పెంచువంటిది, దీనిప్రియ మేమి బ్రాఁతి | ॥ఏమి॥ |
ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింత పాఁకువంటిది కర్మబంధమెల్ల యేఁకటను దిరువేంకటేశుఁ దలచిన [3]కోర్కి కాఁక(?) సౌఖ్యములున్న గనివంటి దరయ | ॥ఏమి॥ |
[1] నిడురేకు 48- లమువడిన.
[2] నిడురేకు 48- గొడవ.
[3] కోర్కికాక = కోరికవలన గలిగిన తాపము అని అర్థము కావచ్చు. ‘కాఁగు’ ధాతువునకు కృదంతరూపము కావచ్చు.