అధ్యాత్మ సంకీర్తన
రేకు: 19-1
సంపుటము: 1-113
రేకు: 19-1
సంపుటము: 1-113
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎన్నాళ్ళదాఁకఁ దా నిట్టె వుండుట బుద్ధి కన్న పోవుట పూర్వకర్మశేషం[1] | ॥ఎన్నాళ్ళ॥ |
కలకాలమెల్ల దుఃఖమె కాఁగఁ బ్రాణికిని వలదా సుఖము గొంతవడియైనను కలుషబుద్ధులఁ [2]బ్రజ్ఞగల దింతయును మంటఁ గలసిపోవుటే పూర్వకర్మశేషం | ॥ఎన్నాళ్ళ॥ |
జాలి తొల్లియుఁ బడ్డ జాలె నేఁడునుఁ గాక మేలు వొద్దా యేమిటినైనాను[3] తాలిమి లోహరిఁ దలఁచక యెఱుకెల్ల గాలిఁ బోవుట పూర్వకర్మశేషం | ॥ఎన్నాళ్ళ॥ |
తరగని నరకబాధయు నేఁడును గాక దరి చేరవలదా యింతటనైనను తిరువేంకటాద్రిపై దేవునిఁ గొలువక [4]గరివడే(?) భవమెల్ల కర్మశేషం | ॥ఎన్నాళ్ళ॥ |
[1] నిడురేకు 88 - అంతటను ‘కర్మశేషము’ అనియే. కాని యిది లయవిరుద్ధముగాఁ దోఁచెడిని.
[2] ‘బ్రగ్ఞ’ రేకు.
[3] ‘నైనను’ పూ.ము.పా.
[4] గరివడు = మోటువారుట కావచ్చు.